విత్తన హక్కులలో... రైతు విజయం

Historic Win for Farmer Seed Rights: India Revokes Patent For PepsiCo Lays Potatoes - Sakshi

ప్రపంచం మొత్తంలో ఒక్క మన దేశ రైతులకు మాత్రమే విత్తనాలకు సంబంధించి విశిష్ట హక్కులు ఉన్నాయి. రైతులకు మేధోసంపత్తి హక్కు కల్పించడం కోసం మన పార్లమెంటు ప్రత్యేక చట్టం చేసి 20 ఏళ్లయ్యింది. విత్తనాలను ఇచ్చి పుచ్చుకోవడానికి సంబంధించి భారతీయ రైతులకున్న విశిష్ట హక్కుల చరిత్రలో మైలురాయి వంటి ఓ తీర్పు ఇటీవల వెలు వడింది. ఓ బహుళ జాతి కంపెనీకి చెంప పెట్టులాంటి తీర్పు ఇది.  

వేప, పసుపు, బాస్మతి బియ్యంపై అనాదిగా మన దేశానికి ఉన్న మేధో సంపత్తి హక్కుల తస్కరణకు గతంలో వివిధ కంపెనీల ఆధ్వ ర్యంలో ప్రయత్నాలు జరిగాయి. వాటిని ప్రపంచ మేధో సంపత్తి హక్కుల సంస్థలో డా. వందనా శివ వంటి ఉద్యమకారిణులు సమర్థ వంతంగా తిప్పికొట్టిన ఘన చరిత్ర మనకుంది. ఈ నేపథ్యంలో చట్టబద్ధ రైతాంగ విత్తన హక్కుల పరిరక్షణ కృషిలో తాజా తీర్పు గుజరాత్‌ రైతులకు సంబంధించిందే కానీ.. దేశంలో రైతులందరికీ గొప్ప విజయం అనటంలో సందేహం లేదు.

గుజరాత్‌ రైతులపై పెప్సీ కేసులు
గుజరాత్‌ బంగాళదుంప రైతులకు వ్యతిరేకంగా మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘన కేసులు పెట్టిన బహుళ జాతి కంపెనీ పెప్సికో ఇండియా హోల్డింగ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బంగాళదుంప వంగడంపై పెప్సికో కంపెనీకి గతంలో ఇచ్చిన మేధో సంపత్తి హక్కులను కేంద్ర వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న ‘పంట వంగడాల పరిరక్షణ మరియు రైతుల హక్కుల ప్రాధికార సంస్థ (పి.పి.వి. అండ్‌ ఎఫ్‌.ఆర్‌.ఎ.)’ ఇటీవల రద్దు చేయటంతో రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇరవయ్యేళ్ల క్రితం పంట వంగడాల పరిరక్షణ మరియు రైతుల హక్కుల చట్టం–2001 ప్రకారం పి.పి.వి. అండ్‌ ఎఫ్‌.ఆర్‌.ఎ. ఏర్పాటైంది. (చదవండి: రైతాంగ సమస్యలే రాజకీయ ఎజెండా)

విత్తన శాస్త్రవేత్తలు/ కంపెనీలు రూపొందించే కొత్త వంగడాలతో పాటు.. రైతులు సంప్రదాయ విజ్ఞానంతో రూపొందించే కొత్త వంగడాలకు కూడా ఈ చట్టం మేధో సంపత్తి హక్కులను కల్పిస్తూ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తుంది. ఇలా ధ్రువీకరణ పొందిన కంపెనీల వంగడాలను సాగు చేసే రైతులు తమ పంట దిగుబడులను విత్తనాల కోసం వాడుకోవటంతోపాటు.. ఇతరులకు విక్రయించుకోవ టానికి కూడా ఈ చట్టం రైతులకు విశిష్ట హక్కును కల్పిస్తోంది. ప్రత్యే కంగా బ్రాండ్‌ పేరు ముద్రించిన సంచుల్లో పోసి విక్రయించకూడదు. అయితే, భారతీయ రైతులకున్న ఈ విశిష్ట హక్కును కాలరాసిన పెప్సికో కంపెనీకి  చెంపపెట్టు లాంటి తీర్పును పి.పి.వి. అండ్‌ ఎఫ్‌.ఆర్‌.ఎ. వెలు వరించింది. లేస్‌ చిప్స్‌ తయారీకి వాడే ప్రత్యేక బంగాళదుంప వంగ డానికి గతంలో ఈ కంపెనీకి ఇచ్చిన మేధాహక్కుల ధ్రువీకరణను రద్దు చేస్తూ ఈ తీర్పు వెలువడింది. పి.పి.వి. అండ్‌ ఎఫ్‌.ఆర్‌.ఎ. ఏర్పాటైన తర్వాత ఇలా ఒక వంగడంపై ధ్రువీకరణను రద్దు చేయటం ఇదే మొదటి సారి కావటంతో జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ, వాణిజ్య వర్గాల్లో తీవ్ర సంచలనం రేగింది. (చదవండి: అన్నదాత హక్కు గెలిచినట్లే...!)

అసలేం జరిగిందంటే..
లేస్‌ చిప్స్‌ తయారీ కోసం ఉపయోగించేందుకు ఉద్దేశించిన ఎఫ్‌.ఎల్‌. 2027 అనే రకం బంగాళదుంప వంగడంపై పెప్సికో ఇండియా హోల్డింగ్‌ కంపెనీ ‘పంట వంగడాల పరిరక్షణ, రైతుల హక్కుల ప్రాధికార సంస్థ’లో 2016లో రిజిస్ట్రేషన్‌ చేయించి మేధో సంపత్తి హక్కులను పొందింది. గుజరాత్‌లో 12,000 మంది రైతులతో కొనుగోలు ఒప్పందం చేసుకొని ఎఫ్‌.ఎల్‌.2027 రకం బంగాళదుంపలను పెప్సికో కంపెనీ సాగు చేయించింది. అయితే, ఈ రైతుల వద్ద నుంచి ఈ రకం బంగాళదుంప విత్తనాలు పొంది అక్రమంగా సాగు చేయడం ద్వారా 9 మంది గుజరాత్‌ రైతులు మేధో సంపత్తి ఉల్లంఘనకు పాల్పడ్డారని పేర్కొంటూ 9 మంది గుజరాత్‌ రైతులపై కేసులు పెట్టింది. ఒక్కో రైతు నుంచి తమకు రూ. కోటి పరిహారం ఇప్పించాల్సిందిగా కూడా పెప్సికో కంపెనీ వ్యాజ్యంలో కోరింది. రైతులపై కేసులను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనోద్యమం పెల్లుబకటంతో కంపెనీ వెనక్కి తగ్గి, కేసులు ఉపసంహరించుకుంది. (చదవండి: ఈ సాగు చట్టాలు నిజంగానే మేలు చేయవా?)

కవిత దరఖాస్తు
‘పంట వంగడాల పరిరక్షణ, రైతుల హక్కుల చట్టం–2001’ మన దేశంలో రైతులకు రిజిస్టరైన విత్తనాలను విత్తుకోవటం, దాచుకోవటం, ఇతరులతో పంచుకోవటం, బ్రాండ్‌ ముద్ర వేయకుండా ఇతరులకు విక్రయించుకునే హక్కులను కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆ వంగ డంపై పెప్సికో కంపెనీకి మేధో సంపత్తి హక్కుల ధ్రువీకరణ ఇవ్వటం సమంజసం కాదని, ఆ ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రముఖ రైతు హక్కుల ఉద్యమకారిణి, కురుగంటి కవిత 2019 జూన్‌ 11న పి.పి.వి–ఎఫ్‌.ఆర్‌.ఎ.కు దరఖాస్తు చేశారు. 30 నెలల సుదీర్ఘ విచా రణ తర్వాత పెప్సికో కంపెనీకి ఎఫ్‌.ఎల్‌. 2027 బంగాళదుంప వంగ డంపై ఇచ్చిన మేధాహక్కుల ధ్రువీకరణను రద్దు చేస్తూ డిసెంబర్‌ 3న పి.పి.వి–ఎఫ్‌.ఆర్‌.ఎ. చైర్‌పర్సన్‌ కె.వి. ప్రభు తీర్పు ఇచ్చారు.

ప్రజాప్రయోజనాలకు విఘాతం
ధ్రువీకరణ కోసం కంపెనీ తప్పుడు సమాచారం ఇచ్చినందున, రిజి స్ట్రార్‌కు తగిన సమాచారాన్ని, పత్రాలను అందించనందున, పంట వంగ డాల పరిరక్షణ, రైతుల హక్కుల చట్టం –2001 (సెక్షన్‌ 34 హెచ్‌) ప్రకారం ‘ప్రజాప్రయోజనాల’కు విఘాతం కలుగుతున్నందున, ధ్రువీ కరణ పొందిన వ్యక్తికి తగిన యోగ్యత లేనందున మేధాహక్కుల ధ్రువీ కరణ పత్రాన్ని రద్దు చేస్తున్నట్లు పి.పి.వి–ఎఫ్‌.ఆర్‌.ఎ. చైర్‌పర్సన్‌ కె.వి. ప్రభు ప్రకటించారు. రద్దు కాకుండా ఉంటే 2031 జనవరి 31 వరకు పెప్సికోకు మే«ధా సంపత్తి హక్కులు కొనసాగేవి. రైతుల చట్టబద్ధమైన విత్తన హక్కులను, స్వేచ్ఛను తుంగలో తొక్కాలని ప్రయత్నించే విత్తన, ఆహార, పానీయాల వాణిజ్య సంస్థల ఆటలు సాగవని చెప్పడానికి ఈ తీర్పు ఒక హెచ్చరికగా నిలుస్తుంది. 

– పంతంగి రాంబాబు, సీనియర్‌ జర్నలిస్టు 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top