ప్రజాస్వామ్యం నుంచి అనుచర గణానికి! | Guest Column Special Story Written By Papani Nagaraju | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యం నుంచి అనుచర గణానికి!

Jun 29 2026 8:06 AM | Updated on Jun 29 2026 8:06 AM

Guest Column Special Story Written By Papani Nagaraju

ప్రశ్నించే పౌరులు... అనుసరించే జనసమూహంగా మారుతున్న నేటి సామాజిక పరిణామం ఆందోళనకరం. నేటి భారత రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే కేవలం ఎన్నికల ఫలితాలను చూడటం సరిపోదు. అసలు మార్పు అధికార కేంద్రీకరణలో మాత్రమే లేదు; సమాజపు ఆలోచనా నిర్మాణంలో ఉంది. ఒకప్పుడు అధికారాన్ని ప్రశ్నించే ప్రజాస్వామిక సంస్కృతి కొంతవరకు కనిపించేది. ఇప్పుడు మాత్రం ‘ఏం అడగాలి?’, ‘ఏం అడగకూడదు?’ అన్న అప్రకటిత నియమాలే సమాజాన్ని నియంత్రిస్తున్నాయి. ఇది అత్యంత ప్రమాదకర సంకేతం.

దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సంక్షోభం, విద్య–వైద్య రంగాల అసమానతలు, కుల హింస వంటి అనేక సమస్యలు ముదురుతున్నప్పటికీ, ప్రజా చర్చల కేంద్రంలో అవి కనిపించడం తగ్గుతోంది. వాటి స్థానంలో యోగా దినోత్సవాలు, భారీ సాంస్కృతిక ప్రదర్శనలు, జాతీయ గర్వ నినాదాలు ముందుకు వస్తున్నాయి. యోగ సాధనపై ఎలాంటి అభ్యంతరం ఉండనవసరం లేదు. కానీ ప్రశ్న యోగాపై కాదు. యోగాను ఎవరు, ఎలా, ఏ రాజకీయ సందర్భంలో వినియోగిస్తున్నారు అన్నదే ముఖ్యం. ప్రజా సమస్యలపై చర్చ తగ్గిపోతూ, ప్రతీకల చుట్టూ సమాజం తిరుగు తుంటే దానిని విమర్శనాత్మకంగా పరిశీలించాల్సిందే.

ఈ పరిస్థితి యాదృచ్ఛికంగా రాలేదు. దీని వెనుక దీర్ఘకాలిక భావజాల విస్తరణ ఉంది. పాలక వర్గాలు తమ భావజాల సంబంధాలను విద్య, మీడియా, మత–సాంస్కృతిక వేదికలు, ప్రచార యంత్రాంగం ద్వారా విస్తృతం చేశాయి. ఫలితంగా రాజకీయ ఆధిపత్యం క్రమంగా భావజాల ఆధిపత్యంగా మారింది. అధికా రాన్ని నిలబెట్టేది కేవలం రాజ్య యంత్రాంగం కాదు; సమాజంలో ‘ఇదే సహజం’, ‘ఇదే దేశహితం’ అనే అంగీకార వాతావరణాన్ని నిర్మించడమే.

భయం నుంచి పుట్టే అనుచరత్వం ఒకటì , నమ్మకం నుంచి పుట్టే అనుచరత్వం మరొకటి. ఇప్పుడు రెండూ కలిసి పనిచేస్తున్నాయి. రాజ్యం అణచివేత భయాన్ని సృష్టిస్తే, భావజాల యంత్రాంగం నమ్మకాన్ని తయారుచేస్తోంది. ఈ రెండు శక్తులూ కలిసి పౌరుడిని అనుచరుడిగా మారుస్తున్నాయి.

ఇక్కడే పౌర సమాజం, ప్రజాస్వామ్యవాదులు, సామ్యవాద శక్తులు, దళిత, బీసీ, ఎస్టీ ఉద్యమాల వైఫల్యం స్పష్టమవుతోంది. ఒకప్పుడు సామాజిక న్యాయం, కుల ఆధిపత్యం, వర్గ అసమాన తలు, హక్కుల రాజకీయాలపై ప్రత్యామ్నాయ చర్చను నిర్మించిన ఈ శక్తులు ఇప్పుడు విభజితంగా, రక్షణాత్మకంగా కనిపిస్తున్నాయి. వీరి వైఫల్యం కేవలం సంస్థాగత బలహీనత కాదు, ప్రత్యామ్నాయ భావజాలాన్ని సమాజంలో విస్తరించడంలో వచ్చిన పరాజయం.

నేటి ప్రధాన సవాలు కేవలం ప్రభుత్వ మార్పు కాదు. భావ జాల ఆధిపత్యాన్ని సవాలు చేసే ప్రత్యామ్నాయ సామాజిక–రాజ కీయ చైతన్యాన్ని నిర్మించడం. పౌర సమాజం, ప్రజాస్వామ్య వాదులు, దళిత–బీసీ–ఎస్టీ శక్తులు, వామపక్ష ఉద్యమాలు తమ వైఫ ల్యాన్ని నిజాయితీగా సమీక్షించి కొత్త ప్రజా చైతన్యాన్ని నిర్మించా ల్సిన అవసరం ఉంది. ప్రశ్న చనిపోయిన చోట ప్రజాస్వామ్యం కూడా క్రమంగా చనిపోతుంది. – పాపని నాగరాజు, సామాజిక కార్యకర్త

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement