పండించినవారికే తిండికి కొరతా!? | Sakshi
Sakshi News home page

పండించినవారికే తిండికి కొరతా!?

Published Fri, Aug 12 2022 12:33 AM

Farmers Situation Not Good in India - Sakshi

స్వాతంత్య్రం రాక ముందు నుంచి భారత వ్యవసాయం అత్యున్నత పద్ధతులతో కూడినదే. స్వతంత్ర భారతావనిలో గత ఏడున్నర దశాబ్దాల్లో అనేక సవాళ్ళను ఎదుర్కొని, గణనీయ పురోగతి సాధించిన మన వ్యవసాయం కరోనా కాలంలోనూ వృద్ధిరేటు కొనసాగించింది. అయితే, వ్యవసాయానికి కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులు తగ్గడం మొదలు పాశ్చాత్య దేశాల్లో రైతులు సైతం వ్యతిరేకిస్తున్న పారిశ్రామిక వ్యవసాయ విధానాలపై మొగ్గు దాకా అనేక సమస్యలూ ఉన్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మార్పులతో రైతు సైతం ఆహారం కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఆకలి బారిన పడుతున్న కుటుంబాలు పెరుగుతున్నాయి. విధాన లోపాలతో ఇతర దేశాలపై ఆధారపడే దశకు ఈ 75వ స్వాతంత్య్ర సంవత్సరంలో మనం చేరుకోవడం బాధాకరం.

భారత వ్యవసాయం గత 75 ఏళ్ళలో అనేక ఒడుదొడుకులను అధిగమించి, విజయాలు సాధించింది. కరోనాలో ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలూ కుదేలైనా, భారత వ్యవసాయం వృద్ధిరేటును కొనసాగించడం మన రైతుల నిబ్బరానికీ, నిబద్ధతకూ సంకేతం. అంచనాలకు భిన్నంగా వ్యవసాయ రంగం పురోగతి సాధించింది. ఈ ప్రగతి ప్రజాస్వామ్య వ్యవస్థలోనే సాధ్యం. మెల్లిగా అయినా మేలు చేసే విధానం, దిశా రూపుదిద్దుకోవడమనేది ఆలోచనలు, ప్రయోజనాల మధ్య సంఘర్షణ ద్వారా వస్తుంది. మనకూ అలాగే వచ్చింది. అయితే, వ్యవసాయ రంగ ఫలితాలలో స్థిరత్వం సాధించాలంటే, సుస్థిర విధానాలు అత్యవసరం.

► మిగతా రంగాలతో పోలిస్తే, స్వాతంత్య్రం రాక ముందు నుంచి భారత వ్యవసాయం అత్యున్నత పద్ధతులతో కూడినదని విదేశీయులు ఆనాడే ఒప్పుకున్నారు. వ్యవసాయ అభివృద్ధి కోసం 1928లో వేసిన రాయల్‌ కమిషన్‌ తన భారీ నివేదికలో ఈ విషయం స్పష్టంగా పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం అప్పటి 66 రాష్ట్రాలలో (ఇప్పటి పూర్తి దేశం కాదు) 80 మిలియన్‌ ఎకరాలలో వరి పండిస్తుండగా, 1950–51 నాటికి వరి విస్తీర్ణం 76.13 మిలియన్‌ ఎకరాలు. అదే 2020–21 నాటికి వరి విస్తీర్ణం 111.37 మిలియన్‌ ఎకరాలు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇతర పంటల్లోనూ స్వాతంత్రానికి పూర్వం మన వ్యవసాయ రంగం బాగుండేది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు అనేక రెట్లు దేశ జనాభా పెరిగింది. అనేక కోణాలలో చూస్తే దేశ వ్యవసాయ రంగ పరిస్థితి ఇప్పుడే బాగాలేదు. 1987లో పత్తి రైతులతో మొదలైన ఆత్మహత్యల పరంపర ప్రస్తుతం అన్ని ప్రాంతాలలో, అన్ని పంటల రైతులకూ విస్తరించింది. వ్యవసాయంలో ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఉత్పత్తి పరిమాణం కొత్త భూములలోకి వ్యవసాయ విస్తరణ ద్వారా సాధ్యమైంది. ఆదివాసీలు, ఇంకా ఇతర సామాజిక వర్గాలు కొత్తగా వ్యవసాయంలోకి అడుగుపెట్టడం అందులో ఒకటి. చెరువులు, కుంటలను పూడ్చడం వల్ల, అడవుల్లోకి వ్యాప్తి వల్ల ఈ విస్తరణ జరిగింది. 

► భారతీయ వ్యవసాయం 1960లలో, ఆ తరువాత సంవత్సరాలలో తీవ్రమైన మార్పులకు గురైంది. మూడో పంచవర్ష ప్రణాళికకు ముందు ప్రారంభమైన ఈ మార్పులు నాలుగో పంచవర్ష ప్రణాళికలో ప్రబలంగా ఉన్నాయి. ఇందిరాగాంధీ భారత ప్రధానిగా ఉన్నప్పుడు ముఖ్యమైన నిర్ణయాలతో తయారైన పూర్తి ప్రణాళిక – నాలుగో పంచవర్ష ప్రణాళిక. నాలుగో పంచవర్ష ప్రణాళికలో కనీస ధర హామీ ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం ఆహార ధాన్యాలకు మద్దతు ధరల విధానాన్ని 1964లో దేశవ్యాప్తంగా తెచ్చారు. ఆ దశాబ్దిలో అనేక ప్రభుత్వసంస్థలు ఏర్పాటయ్యాయి. వ్యవసాయ ఉత్పత్తి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వ నిధులు జారీ అయ్యాయి. ఆ ప్రణాళికలో పొందుపరచిన నిర్ణయాలు హరిత విప్లవం వైపు పయనించడానికి మార్గం సుగమం చేశాయి. తద్వారా హైబ్రిడ్‌ విత్తనాలు, రసాయనాల ప్రవేశం సులభమైంది. 2003 నుంచి ప్రైవేటు విత్తన కంపెనీల జోరు, జన్యుమార్పిడి పత్తి వితనాలకు అనుమతితో... విత్తనాలపై రైతులకున్న జ్ఞానం, పట్టు పోయాయి. విత్తనాల ఖర్చు తడిసి మోపెడవుతోంది. 20 ఏళ్ళలో ప్రైవేటు విత్తన కంపెనీలు రూ. 35 వేల కోట్ల వ్యాపార విస్తృతిని అందుకుంటే... విత్తనాల ఖర్చు, నాణ్యత లేని విత్తనాలు, సబ్సిడీ ఎత్తివేత, విత్తనాలే దొరకని పరిస్థితి వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి రైతు చేరుకున్నాడు. 

► బ్యాంకుల జాతీయీకరణ భారతదేశంలో భారీ ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆవిష్కరించింది. ఈ చర్య వల్ల గ్రామీణ ప్రాంతాలకు సంస్థాగత పరపతిని మెరుగుపరచడానికి సహాయపడింది. రైతులకు పంట రుణాలు ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడింది. దేశంలో ఆహార ఉత్పత్తి కొన్నేళ్ళుగా ఒక ఉచ్చదశకు చేరుకుంది. ఇంతకంటే ఎక్కువ ఆహార ఉత్పత్తి, రసాయన ఆధారిత వ్యవసాయం నుంచి సాధ్యపడదు. ఏటా ఆర్థిక సర్వేలలో వ్యవసాయం గురించి ప్రస్తావించినా, చిన్న రైతుల సమస్యలు పట్టించుకోకుండా, పెద్ద కమతాలు, కార్పొరేట్‌ వ్యవసాయం ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదివరకు కూడా ఆర్థికవేత్తలు మన దేశంలో వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాల సంఖ్య తగ్గించాలని చెబుతూనే ఉన్నారు. కోట్లాది కుటుంబాల సంప్రదాయ జీవనోపాధిని ఒక తరంలో మారిస్తే వచ్చే పరిణామాలు ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటాయి. కుటుంబ జీవన ప్రమాణాలు తగ్గి, సామాజిక సమస్యలూ పెరుగుతాయి. గమనిస్తే– వ్యవసాయానికి కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులు తగ్గుతున్నాయి.  

► హరిత విప్లవ సూత్రాలతో ఏక పంట పద్ధతి పెరిగింది. అయినా శాస్త్రవేత్తలు, అధికారులు ఉత్పత్తి పెంచాలనే, ప్రతి ఎకరా దిగుబడి పెంచాలనే లక్ష్యం విడనాడడం లేదు. రెండవ హరిత విప్లవంతో జన్యుమార్పిడి విత్తనాలు, కొత్త రకం రసాయనాలు, ఆధునిక పరికరాలు ఉపయోగించి పంట దిగుబడులు పెంచాలనే భావంతో ప్రభుత్వ విధానాలు రూపు దిద్దుకుంటున్నాయి. కానీ, ఇలాంటి పద్ధతుల వల్ల ఉత్పత్తి ఖర్చుతో పాటు, నిల్వలూ పెరుగుతాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పందాలు భారత వ్యవసాయంపై, స్వాతంత్య్రంపై ఒత్తిడి పెంచుతున్నాయి. వ్యవసాయంలో స్వావలంబన కూడా తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ళ క్రిందట 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని వాగ్దానం చేసినా కార్యరూపం దాల్చలేదు. 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి, వ్యవసాయ ఒప్పందం జరిగిన దరిమిలా, కేంద్ర ప్రభుత్వ విధానాల దిశ పూర్తిగా పక్కదారి పట్టింది. భారత దేశ ప్రయోజనాలు, చిన్న రైతుల సంక్షేమం, ప్రకృతి అనుకూల ఆహార ఉత్పత్తి లాంటి అంశాలపై విధానకర్తల దృష్టి తగ్గింది. బడా కంపెనీలకు అనుకూలమైన విధానాలే కనబడుతున్నాయి. 

► ఆధునిక వ్యవసాయంలో మార్కెట్‌కు అనుగుణంగా వాణిజ్య పంటలు లేదా ఆహారేతర పంటల వైపు మొగ్గు పెరుగుతోంది. ఏక పంట విధానం, వాణిజ్య పంటల ఉత్పత్తి పెరుగుతోంది. ఆహార ఉత్పత్తి తగ్గుతోంది. ఆహార వైవిధ్యం కూడా తగ్గుతోంది. దేశంలో 600 పంటలు పండుతున్నా, క్రమంగా 20 పంటల విస్తీర్ణం 80 శాతం ఆక్రమించడంతో, గ్రామీణ ప్రాంతాలలో నిత్యావసర ఆహారం దొరకని పరిస్థితి. చాలా గ్రామాల్లో ప్రతి ఆహార వస్తువూ కొనుక్కునే దుఃస్థితి. ఆధునిక ఉత్పత్తి వ్యవస్థ ఫలితంగా కష్టించినా ఆహారం దొరకని పరిస్థితిలో ప్రస్తుత ఆహార వ్యవస్థ చేరింది. ఇంకొక వైపు ఆహారం ఉత్పత్తి అవుతున్నా, కొనుగోలుదారులు లేక ఆహారం వృథా పెరుగుతోంది. ఇది మరో సమాంతర పరిణామం. కేంద్ర వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 2017లో 30 శాతం ఎక్కువ ఆహారం ఉత్పత్తి అయింది. అవసరమైన దాని కన్నా అధిక ఉత్పత్తి 1960 నుంచి ఉంది. అయినా ఇప్పటికీ ఆహార ఉత్పత్తి పెంచాలంటూ ప్రభుత్వం ఆధునిక వ్యవసాయం పేర ప్రకృతి వనరుల వినాశకార విధానాలను ప్రోత్సహిస్తోంది. 

► గతంలో పొలం గట్ల వెంబడి, పంట వరుసల మధ్య పెరిగిన ఆకుకూరలు రైతులు, రైతు కూలీ కుటుంబాలు వండుకునేవారు. ఖర్చు లేకుండా, కొన్ని నెలలు దాదాపు 60–70 రకాల ఆకుకూరలు దొరికేవి. కోళ్ళ పెంపకం ద్వారా గుడ్లు అందరికీ అందుబాటులో ఉండేవి. కానీ గ్రామాలలో ఈ రోజు పాలు, మజ్జిగ, వెన్న, నెయ్యి  కనపడడం లేదు. ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉండేవి, ఇప్పుడు కొందరికే అధిక ధరకు లభ్యమవుతున్నాయి. అంతర్జాతీయ అధ్యయనాలు ఆకలి సమస్యను గుర్తించినా, సూచిస్తున్న పరిష్కారాలు ఆమోదయోగ్యంగా లేవు. ప్రభుత్వాల దృష్టి సైతం దీర్ఘకాలిక పరిష్కారాలపై లేదు. ఇప్పుడున్న దారిలోనే పరిష్కారం వెతుక్కునే ప్రయత్నం కనపడుతోందే కానీ సుస్థిర విధానాల అధ్యయనం లేదు. ఖర్చు పెంచుకుని, పర్యావరణ వనరులను ధ్వంసం చేసి, రైతులను రుణగ్రస్థులను చేసి, బహుజనులకు అందని రీతిలో ఆహార ధాన్యాలు నిల్వ చేసుకునే ఆహార వ్యవస్థను మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. 

► మత్స్యకారులు, ఇతర గ్రామీణ వృత్తిదారులు సైతం ప్రజలకు ఆహారం, పానీయాలు అందించే పరిస్థితి గతంలో ఉండేది. ప్రకృతి వినాశనంతో పాటు, పల్లెలలో ఉండే ఆహార వ్యవస్థ, దానిపై ఆధారపడ్డ వృత్తులను బలహీనపరిచిన ప్రభుత్వ విధానాలు బహుజనులు ఆహారానికి దూరమయ్యే పరిణామాలకు దోహదపడ్డాయి. ప్రకృతితో మమేకమైన వ్యవసాయం, గ్రామీణ వృత్తివ్యవస్థను పునరుద్ధరిస్తే, వైవిధ్యభరితమైన ఆహారం దొరుకుతుంది. కానీ, పాశ్చాత్య దేశాలలో గత 50 ఏళ్ళలో రూపుదిద్దుకున్న ఆహార వ్యవస్థ దిశగా అడుగులు వేయడానికి భారత దేశంలో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయి. అలాంటి ఆహార వ్యవస్థలో కొనుక్కుంటేనే ఆహారం దొరుకుతుంది. కొనుక్కోవాలి అంటే ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగాలంటే వనరులు ఉండాలి (విద్య, జ్ఞానం, సంపద, భూమి, నీళ్ళతో సహా). వనరులు అందరికీ కాక కొందరికే అందుబాటులో ఉండే మన సమాజంలో కొనుక్కుంటేనే ఆహారం అనే సూత్రం పని చెయ్యదు. ఏమైనా, మన వ్యవసాయం స్వతంత్ర పరిస్థితి నుంచి ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితికి ఈ 75వ స్వాతంత్య్ర సంవత్సరంలో చేరుకోవడం బాధాకరం. దాన్ని అందించే బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నా, ప్రజలు స్వతంత్రంగా తమ ఆహార అవసరాలు తామే తీర్చుకునే ఆహార వ్యవస్థ నిర్మాణం అవసరం. స్థానికంగా ఉత్పత్తి అయిన ఆహారం స్థానిక అవసరాలకు ముందు ఉపయోగపడాలి. సహజ ఆహారం దొరికే విధంగా చిట్టడవులు, ప్రకృతి వనాల విస్తీర్ణం పెరగాలి. 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు చేరుకోవాలంటే, ఆహార ఉత్పత్తి వ్యవస్థ మారాలి. ప్రభుత్వంపై, ప్రభుత్వం అందించే రేషన్‌ ఆహారంపై సామాన్యులు ఆధారపడని పరిస్థితి రావాలి.


-డాక్టర్‌ దొంతి నరసింహా రెడ్డి
వ్యాసకర్త విధాన విశ్లేషకులు, 9010205742 

Advertisement
 
Advertisement
 
Advertisement