అయితే... రైతులు ధనవంతులు కాకూడదా?

Farmers Protest Against Farm Acts - Sakshi

సందర్భం

దేశ రాజధాని ఢిల్లీని చుట్టుముట్టిన రైతుల ఆందోళన 16 రోజులు పైబడింది. కేంద్రం ఆమోదించిన 3 వ్యవసాయ బిల్లులనూ, విద్యుత్‌ చట్టాన్నీ రద్దు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర పెద్దలకూ, రైతులకూ ఈ విషయమై రెండు దఫాల చర్చలు జరిగాయి. చట్టాల రద్దు మినహా మరి దేనికీ ఒప్పుకోమంటూ రైతులు దృఢంగా నిల బడటంతో చర్చలు ఫలించలేదు. కాగా, ఇక్కడ ఒక ప్రధాన ప్రశ్న. ఈ అంశంలో మీడియా పాత్ర ఏమిటి? దీనికి సంబంధించి రైతులు, ప్రజానీకంలోని పెద్ద వర్గం ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు. స్థూలంగా కోటిమందికి పైగా రైతులు పాల్గొంటున్నారని చెబుతున్న ఈ ఆందోళనకు తగిన కవరేజీ ఉందా? ఉదాహరణకు ఒక ఆంగ్ల భాషా వాణిజ్య పత్రిక ప్రకారం ఈ ఆందోళనలో ప్రధాన భాగస్వాములు పంజాబ్‌ రైతులే. కాకుంటే హరియాణా రైతులు. వీరు ఇతర రాష్ట్రాల రైతుల కంటే ‘సుసంపన్నం’గా ఉన్నారట. వీరు ప్రభుత్వాల చేత అతిగా గారాబం చేయబడు తున్నారంటూ ఆ పత్రిక నిందించింది. అందుకే వారు చిన్న విషయాలకు కూడా నిరసనలకు దిగుతున్నారంటూ సెలవిచ్చింది. 

రైతు వ్యతిరేక, ఉదారవాద సంస్కరణల అనుకూల ఈ నిందారోపణల వెనుక ఉన్న సత్యం ఏమిటి? కొంచెం పాత గణాంకాలే అయినా 2013లో దేశంలోని వివిధ రైతు కుటుం బాల సగటు నెలసరి ఆదాయాలను చూద్దాం. అది పంజాబ్‌లో 18,059 రూపాయలు. హరియాణాలో  14,434 రూపాయలు. కాగా పేద రాష్ట్రాలైన బిహార్‌ రైతు కుటుంబ నెలసరి ఆదాయం రూ. 3,558. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇది రూ. 4,701. జార్ఖండ్‌లో రూ. 4,721. ఉత్తరాఖండ్‌లో రూ. 4,923. ఇక పశ్చిమ బెంగాల్‌లో రూ. 3,980. అంటే దేశం లోని పేద రాష్ట్రాల రైతు కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం 5,000 లోపే. దేశవ్యాప్తంగా ఈ సగటు రూ. 6,426. అయితే, 2018– 2019 అంచనాల ప్రకారం ఇది 10,329 రూపాయలు. ఇక్కడ గమనించవలసింది ఇది రైతు కుటుంబాల తాలూకు మొత్తం ఆదాయం. సాధారణ అంచనా ప్రకారం కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉన్నట్లుగా లెక్కిస్తారు. అత్యధిక చిన్న, సన్నకారు, మధ్య తరహా రైతు కుటుంబాల్లో దాదాపు ఇంట్లోని వారంతా తమ బతుకుదెరువైన సాగుబడిలో పాలుపంచుకుంటారు.

మరో పక్కన ఈ పరిస్థితిని, నగర ప్రాంతాల కార్మికుల, ఉద్యోగుల పరిస్థితితో పోల్చి చూద్దాం. ‘2019 వేతన చట్టం’ ప్రకారం దేశవ్యాప్తంగా కనీస వేతనం రోజువారీగా 178 రూపాయలు ఉండాలి. ఇది తలసరి సగటు అనే విషయం మరువరాదు. కుటుంబంలో ఇద్దరు పనిచేస్తే దొరికేది రోజుకు 356 రూపాయలు. ఇది నెలకు రూ. 10,700 మేరకు ఆదాయంగా ఉంటుంది. అయితే, కనీస వేతనంగా 178 రూపాయలని నిర్ణయించడానికి వ్యతిరేకంగా బలమైన వాద నలు ఉన్నాయి. నిజానికి కార్మిక మంత్రిత్వశాఖ తాలూకు అత్యున్నత ప్యానల్‌ సిఫార్సు ప్రకారమే ఈ కనీస వేతనం రోజుకు తలకు 375 రూపాయలు ఉండాలి. మరో పక్కన ఏడవ కేంద్ర వేతన సంఘం మేరకు న్యాయబద్ధమైన రోజువారీ వేతనం కనీసం రూ. 700 ఉండాలి. ఈ చివరి సూచన ప్రకారమే చూసినా నగర ప్రాంతాల్లో కుటుంబం లోని ఒక్కరు పని చేసినా నెలవారీ ఆ కుటుంబానికి 21,000 రూపాయల మేర ఆదాయం ఉండాలి. పరిస్థితి ఇలావుండగా పంజాబ్, హరియాణా రైతుల ఆదాయాలను, దుర్భర దారిద్య్రంలో వున్న రాష్ట్రాల ఆదాయాలతో పోల్చి ఈ రెండు రాష్ట్రాల రైతులు గారాబం చేయబడ్డారంటూ విమర్శించడం పరిహాసాస్పదం. వాస్తవానికి, దేశంలోని అన్ని రాష్ట్రాల రైతాంగానికి కనీస స్థాయిలో కావాల్సింది పంజాబ్, హరియాణా రైతుల తాలూకు ఆదాయస్థాయి.  రాను రాను, వ్యవసాయంలో వాడే ఉత్పాదకాల వ్యయం పెరిగిపోతోంది.

 పాత్రికేయుడు, వ్యవసాయ నిపుణుడు పి.సాయినా«థ్‌ ప్రకారం 1971లో ఒక క్వింటాల్‌ పత్తిని అమ్మితే 15 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేయగలిగేవాళ్లు. నేడు ఎన్ని క్వింటాళ్ల పత్తిని అమ్మితే 10 గ్రాముల బంగారాన్ని రైతు కొనగలడనేది ప్రశ్న. రాను రాను రైతాంగానికి లభించే ఆదాయాల స్థాయి పడిపోతోంది. దీన్ని నగర ప్రాంతాలకు అనుకూలంగానూ, గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకంగానూ ‘వాణిజ్య లావాదేవీల సమతుల్యత’ రోజురోజుకూ మొగ్గు తుండటంగా చెప్పవచ్చు. గ్రామీణ వ్యవసాయదారుల ఉత్పత్తుల ధరలు పడిపోతుండగా, నగర ప్రాంతాల పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు పెరగడం. ఈ పరిణామం సహజ సిద్ధంగా జరుగుతున్నది కాదు. స్థూలంగా ఆర్థిక సంస్కరణల పేరిట కార్పొరేట్, నగర ప్రాంతాల అనుకూల విధానం ఇది. దీని కారణంగానే, గ్రామీణ ఉత్పత్తుల ధరలను పెరగకుండా కృత్రిమంగా అదుపు చేస్తున్నారు. దీనంతటికీ కారణం గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరిగితే గనక, నగర ప్రాంతాలలో నిత్యావసరాల ధరలు హెచ్చుగా ఉంటాయి. ఇదంతా నగర ప్రాంతాలలో నిత్యావసరాల ధరలు ఒక పరిమితికి దాటకుండా అదుపు చేయటం ద్వారా, నగర ప్రాంతాలలోని మధ్య తరగతి వారు, కార్మికులు అధిక వేతనాల కోసం కార్పొరేట్లను డిమాండ్‌ చేయకుండా బుజ్జగించేందుకే. తద్వారా కార్పొరేట్లు తాము చెల్లించే వేతనాలను తక్కువగా ఉంచి, వారి లాభాలను పెంచుకోగలరు. ఇక రెండవ కారణం, గ్రామాల నుంచి నగరాలకు నిరంతరంగా కార్మికుల సరఫరాను హామీ చేయటం. వ్యవసాయం లాభసాటిగా ఉంటే ఇది జరగదు. ఇదే జరిగితే, నగరాల్లో కార్మికుల కొరత ఏర్పడి అధిక వేతనాల డిమాండుకు దారి తీస్తుంది. కాకు లను కొట్టి గద్దలకు వేసినట్లు గ్రామీణ రైతాంగాన్ని దెబ్బతీసి, నగర ప్రాంతాల కార్పొరేట్లకు అనుకూల విధా నాలను అనుసరించటం ఆర్థిక సంస్కరణల్లో ఒక భాగం. ఈ క్రమంలో నష్టపోయిన రైతాంగాన్ని వ్యవసాయం నుంచి వైదొలిగేలా చేసి ఆ స్థానంలో రక్తపాత రహితంగానే కార్పొ రేట్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఈ విధానాల తాలూకు రెండవ పార్శ్వం.

ఈ కారణాల చేతనే దేశవ్యాప్తంగా ఉన్నట్లే పంజాబ్, హరియాణా పిల్లల్లోనూ సరైన ఆహారం లేక శారీరక ఎదుగు దల తక్కువస్థాయిలో ఉంటోంది. గ్రామీణ ప్రాంతాలలో సగటున 50 శాతం మంది పిల్లలు తమ వయసుకు తగ్గ ఎత్తు లేరు. కానీ ఈ కార్పొరేట్‌ అనుకూల, సంస్కరణల అను కూల మీడియా కోవిడ్‌ సంక్షోభ కాలంలో ఒకవైపు సామా న్యుల ఆదాయాలు పడిపోతుండగా కొత్త బిలియనీర్లు పుట్టుకొస్తుంటే వేలెత్తి చూపలేదు. కానీ, కోట్లాదిమంది సాధారణ రైతులు పెనం మీద నుంచి తమను పొయ్యిలోకి పడేయవద్దని అడుగుతుంటే మాత్రం ఈ మీడియాకు కంపరంగా ఉంది.    
  

వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
డి. పాపారావు 
మొబైల్‌: 98661 79615  

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top