మనమే రాస్తున్న మరణ శాసనం

Dileep Reddy Article On Climate Change Report Relesed By Ipcc - Sakshi

సమకాలీనం

భవిష్యత్‌ తరాల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుత తరాలు ప్రకృతి వనరులను సమర్థంగా వినియోగించుకున్నప్పుడే అది సుస్థిరాభివృద్ధి అవుతుంది. కానీ అలా చేస్తున్నామా? భూతాపోన్నతిని అనుకున్నట్టుగా రెండు డిగ్రీల లోపు నియంత్రించకపోతే, మూడో వంతు జీవరాశి అంతమయ్యే ప్రమాదముంది. ఐక్యరాజ్యసమితి ‘పర్యావరణ మార్పు’పై ఏర్పరచిన అంతర్‌ ప్రభుత్వాల బృందం (ఐపీసీసీ) నివేదిక కూడా ఇదే నిజాన్ని మరోమారు నొక్కి చెప్పింది. అయినా మన ప్రభుత్వాలు నిష్క్రియాపరత్వం వీడటం లేదు. ఈ నివేదిక సిఫారసుల్ని పాటించే సంకల్పం తీసుకోవడానికి ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ కొత్త సమీకృత హరిత అజెండాతో ముందుకు రావాలి. ప్రతి పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇది అజెండా కావాలి.

పరిశోధన పత్రాలు పనికిరావు... అధ్యయన నివేదికలు ఆలోచనకు ఆనవు... శాస్త్రవేత్తల హెచ్చరికలు నెత్తికెక్కవు... మరెప్పుడు మేల్కొనేది? ఇంకెప్పుడు ముంచుకొస్తున్న పర్యావరణ ముప్పు నుంచి మనల్ని మనం కాపాడు కునేది? ఇది ఇప్పుడు భారత పౌరసమాజం ముందున్న కోటి రూకల ప్రశ్న. సరైన సమయంలో తగు రీతిన స్పందించని నిష్క్రియాపర త్వమే సమస్యను మరింత జటిలం చేస్తోందని పలు అధ్యయన నివేది కలు తరచూ చెబుతున్నాయి! అసలు సమస్యకు పెరుగుతున్న భూతా పోన్నతి మూల కారణమైతే, ఎన్నో హెచ్చరికల తర్వాత కూడా కద లని మన ప్రభుత్వాల వైఖరే సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. ఐక్యరాజ్యసమితి ‘పర్యావరణ మార్పు’పై ఏర్పరచిన అంతర్‌ ప్రభు త్వాల బృందం (ఐపీసీసీ) నివేదిక కూడా ఇదే నిజాన్ని మరోమారు నొక్కి చెప్పింది. 

ఐపీసీసీ ఆరో అంచనా నివేదికలో భాగంగా ‘వర్కింగ్‌ గ్రూప్‌’ ఇచ్చిన 2022 తాజా (రెండో భాగం) నివేదిక ఎన్నో హెచ్చరికలు చేస్తోంది. గత సంవత్సరం విడుదల చేసిన నివేదిక (తొలి భాగం) లోనే, అంచనాలకు మించిన వేగంతో వాతావరణ సంక్షోభం ముంచుకువస్తోందని హెచ్చరించిన ఈ బృందం, ప్రమాదం మరింత బహుముఖీనంగా ఉందని తాజా నివేదికలో గణాంకాలతో సహా వివరించింది. భూగ్రహం మొత్తానికి సంబంధించిన సమస్యను నివేదికలో పేర్కొన్నా... ఆసియా ఖండానికి సంబంధించి, ముఖ్యంగా భారత్‌కు వర్తించే హెచ్చరికలు ఈ నివేదికలో తీవ్రంగా ఉన్నాయి. అయినా దీనికి సంబంధించిన కీలక చర్చ ఎక్కడా జరగటం లేదు. 

భారత్‌కే హెచ్చు ప్రమాదం
హిమాలయాల దిగువన, మూడు సముద్రాల మధ్యనున్న ద్వీప కల్పమవడంతో వాతావరణ మార్పు ప్రతికూల ప్రభావం భారత్‌పైన ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమౌతోంది. హెచ్చు తేమ, వేడి వల్ల తలెత్తే దుష్పరిణామాలు (వెట్‌ బల్బ్‌ సిండ్రోమ్‌), నగర, పట్టణ ప్రాంతాల్లో తీవ్రంగా ఉంటాయని తాజా నివేదిక నిర్దిష్టంగా పేర్కొంది. అహ్మదా బాద్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించినప్పటికీ హైదరాబాద్‌తో సహా చాలా మెట్రో నగరాలదీ ఇదే దుఃస్థితి! ఫలితంగా వడదెబ్బ మరణాలు మితిమీరతాయి. మిగతా సముద్రాల కన్నా హిందూ మహాసముద్రం వేగంగా వేడెక్కుతోందని ఐపీసీసీ ఆరో నివేదిక తొలిభాగంలోనే పేర్కొన్నారు. దాంతో సముద్ర గాలులు పెరిగి, దక్షిణాసియా దేశాల్లో ముఖ్యంగా భారత్‌లో తుపాన్లు, వర్షాలు, వరదలు, కరవులు సాధా రణం కన్నా ఎక్కువవుతాయని నివేదించారు. నివేదిక తొలి భాగం ప్రధానంగా ‘వాతావరణ మార్పు’ తాలూకు శాస్త్ర, సాంకేతిక, సామా జికార్థికాంశాలతో ఉంది. రెండో భాగం ముఖ్యంగా ‘వాతావరణ మార్పు ప్రభావాలు, సర్దుబాటు (అడాప్టేషన్‌), ప్రమాద ఆస్కారం’ కోణంలో విషయాలను నివేదించింది. వచ్చే ఏప్రిల్‌లో రానున్న మూడో భాగం ఏ రకమైన దిద్దుబాటు (మిటిగేషన్‌) చర్యలు అవసర మౌతాయో స్పష్టం చేస్తుంది. దీంతో, ఐపీసీసీ ఆరో అంచనా నివేదిక పూర్తవుతుంది. 

భూతాపోన్నతి వల్ల పుడమి ధ్రువాల్లోనే కాకుండా మన హిమాలయాల్లో ఉన్న మంచు అసాధారణంగా కరిగి కింద ఉండే భూభాగాల్లోనూ, నదుల పైనా ఒత్తిడి పెరుగుతుంది. అముదర్య (మధ్యాసియా నది), సింధు, గంగ, బ్రహ్మపుత్ర నదీ లోయ ప్రాంతాల్లో వరదలు పెరిగి తీవ్ర ప్రతికూల పరిణామాలుంటాయని నివేదిక చెబుతోంది. ‘వెట్‌ బల్బ్‌ టెంపరేచర్‌’ (అంటే, గాలిలో తేమ శాతం అసాధారణంగా పెరిగినపుడు 30 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత కూడా తీవ్రంగా ఉంటుంది; 30–35 డిగ్రీల మధ్య వేడి అత్యంత ప్రమాదకారి) ఇప్పటికే 30 డిగ్రీలను దాటుతున్నట్టు నివేదిక చెబు తోంది. మనది స్థూలంగా వ్యవసాయాధారిత జీవనం, ఆర్థిక వ్యవస్థ అయినందున వాతావరణ ప్రతికూల పరిస్థితులు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయనేది నివేదిక సారాంశం. సాధారణ జీవనంతో పాటు వ్యవసాయం, ఆహారోత్పత్తి, పంపిణీ వంటివి తీవ్రంగా ప్రభావితం అవుతాయి. ఐపీసీసీ ఛైర్మన్‌ హీసంగ్‌ లీ చెప్పినట్టు ‘నష్ట నివారణ, దిద్దుబాటు, సర్దుబాటు చర్యల తర్వాత కూడా 300 నుంచి 350 కోట్ల మంది విశ్వజనుల జీవితాలపై ప్రతికూల ప్రభావం ఉండేటప్పుడు... స్థానికంగా ఎక్కడికక్కడ ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం చేసే నష్టం మరింత అపారం’ అన్నది కఠోరసత్యం!

‘కోడ్‌ రెడ్‌’ కన్నా తీవ్రం
విశ్వవ్యాప్తంగా వచ్చే రెండు దశాబ్దాలు తీవ్రమైన వాతావరణ ప్రతికూల పరిస్థితుల్ని జీవరాశి ఎదుర్కోవాల్సి వస్తుందని ఐపీసీసీ నివేదిక చెబుతోంది. ఆరో అంచనా నివేదిక తొలిభాగంలోనే, ఇది మానవాళికి తీవ్రమైన ‘కోడ్‌ రెడ్‌’ ప్రమాదమని హెచ్చరించిన అధ్య యన బృందం, పరిస్థితులు మరింత తీవ్రంగా ఉండబోతున్నాయని తాజా నివేదికలో చెప్పింది. ప్రపంచ స్థాయిలో సత్వర నివారణ, దిద్దుబాటు, సర్దుబాటు చర్యలు చేపట్టకపోతే ‘జీవయోగ్య, నిలకడైన భవితను పరిరక్షించుకునే అవకాశాన్ని మనం చేజేతులా జారవిడుచు కున్న వారమవుతాం’ అని హెచ్చరిస్తోంది. ప్రధానంగా అరడజను అంశాల్లో పరిస్థితులు విషమించే ఆస్కారాన్ని నొక్కి చెప్పింది.

1. మితిమీరిన కర్బన ఉద్గారాల వల్ల భూతాపోన్నతి పెరిగి జీవన పరిస్థితులు సంక్లిష్టమౌతాయి. వెట్‌ బల్బ్‌ సిండ్రోమ్‌తో, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలు దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొం టాయి. అసాధారణ సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటాయి.

2. పెరిగే తుపాన్లు, అతి వర్షాలు, వరదలు, కరవులు వంటి అతివృష్టి, అనా వృష్టి పరిణామాల కారణంగా ఆహారోత్పత్తి రమారమి తగ్గిపోతుంది. 2050 నాటికి భారత్‌లో 40 శాతం జనాభా నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. తిండి గింజలు ఖరీదై పెద్ద సంఖ్యలో పేదలు తిండి కోసం అల్లాడుతారు. పిల్లల ఎదుగుదలపై పౌష్టికాహార లోపం ప్రతికూల ప్రభావం చూపుతుంది. 3. భూతాపోన్నతి వల్ల ధ్రువాల మంచు కరిగి, సముద్ర జల మట్టాలు 44–76 సెం.మీ. పెరగటం వల్ల దీవులు, తీర నగరాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటాయి. ప్యారిస్‌లో చేసిన ప్రతిజ్ఞలకు ప్రపంచ దేశాలు కట్టుబడ్డా ఈ దుఃస్థితి తప్పదు. ఉద్గారాల్ని ఇంకా వేగంగా నియంత్రించగలిగితే... సముద్ర జల మట్టాల పెరుగుదలను 28–55 సెం.మీ. మేర నిలువరించవచ్చు. తీరనగరాల మునక, నగరాల్లో వరద సంక్షోభం, భూక్షయం, తీరాలు ఉప్పుగా మారి వ్యవసాయ అయోగ్యత వంటి వాటిని కొంతలో కొంత అదుపు చేయొచ్చు, 4. అతి వేడి, వడగాలులు, అసాధారణ వాతా వరణ పరిస్థితుల వల్ల జబ్బులు పెరిగి అనారోగ్యం తాండవిస్తుంది. శ్వాస, రక్తప్రసరణ, చర్మ సంబంధ రోగాలతో పాటు మధుమేహం వంటివి అధికమౌతాయి. 5. సీసీ (క్లైమేట్‌ ఛేంజ్‌)తో విద్యుత్తు వంటి ఇంధన వినియోగంలో అసాధారణ మార్పులు వస్తాయి. 6. అటవీ, సముద్ర తదితర అన్ని రకాల జీవావరణాలు (ఎకోసిస్టమ్స్‌) దెబ్బతిని జీవవైవిధ్యం అంతరిస్తుంది. భూతాపోన్నతిని అనుకున్నట్టు 2 డిగ్రీల కన్నా లోపు నియంత్రించకపోతే, మూడో వంతు జీవరాశి అంత మయ్యే ప్రమాదముంది.

సానుకూల మార్పే నిర్ణాయక శక్తి
అభివృద్ధి నిర్వచనంతో పాటు సమకాలీన రాజకీయాల దశ, దిశ మారాల్సిన అవసరం ఎంతో ఉంది. ఐరాస నిర్వచించినట్టు సుస్థిరా భివృద్ధి అంటే, ‘భవిష్యత్తరాల ప్రయోజనాల్నీ పరిగణనలోకి తీసు కొని, వాటిని పరిరక్షిస్తూ... ప్రస్తుత తరాలు తమ అవసరాల్ని తీర్చు కునేలా ప్రకృతి వనరుల్ని సమర్థంగా వినియోగించుకోవడం’. ఐపీసీసీ వంటి ముఖ్యనివేదికల సిఫారసుల్ని పాటించే సంకల్పం తీసుకోవ డానికి ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ కొత్త సమీకృత హరిత అజెండాతో రావాలి. ప్రతి పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇది అజెండా కావాలి. సంబంధిత వర్గాలన్నీ సత్వరం నడుం కడితే తప్ప జీవరాశి మనుగడకు భరోసా లేదు. ఇదే మనందరి తక్షణ కర్తవ్యం.

వ్యాసకర్త: దిలీప్‌ రెడ్డి 
సీనియర్‌ పాత్రికేయులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top