మనం మారితేనే మనుగడ

Dileep Reddy Article On Natural Disasters - Sakshi

సమకాలీనం

పాట్నాలో ఉప ముఖ్యమంత్రి కుటుంబాన్ని రబ్బరు పడవలో సురక్షిత ప్రాంతానికి తరలించిన స్థితి! నెల కింద కురిసిన భారీ వర్షం ముంబాయిని ముంచెత్తినపుడు పక్కనే మరాఠ్వాడాలో కరువు విలయతాండవం చేసింది. చైన్నైలో ఓ యేడు వరదలు ముంచెత్తితే మరో ఏడాది నీటి ఎద్దడి. హైదరాబాద్‌లో ఈసారి సగటు వర్షపాతం ఎక్కువ నమోదైనా, భూగర్భ జలమట్టాలు పెరక్కపోగా దాదాపు మరో మీటరు అడుక్కు పోయాయి. ఈ విపరీతాలన్నీ ‘వాతావరణ మార్పు’ కాక మరేంటి? ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే, తట్టుకునే సామర్థ్యాల్ని పెంచుకోవాలి. ప్రమాదస్థాయిని గ్రహించి ప్రభుత్వాలు–పౌరసమాజం వ్యూహాత్మకంగా జరిపే సమిష్టి కృషితోనే నగరజీవికిక మనుగడ!

‘పాట్నాతో సహా ఉత్తర బీహార్‌లో రాగల 48 గంటల్లో భారీ వర్ష సూచన’ అని వాతావరణ విభాగం హెచ్చరించి 24 గంటలయినా ప్రభుత్వ ఉన్న తాదికారులు, స్థానిక పాలకులు కొత్తగా చేపట్టిన సహాయక చర్యలేమీ లేవు. ఇప్పటికే అక్కడ కురుస్తున్న వర్ష బీభత్సమలా ఉంది. పాట్నా నగరంలోనూ వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీధులన్నీ కాలువలయ్యాయి. డజన్‌కు పైగా పెద్ద కాలనీల్లో మోకాళ్ల నుంచి నడుము లోతుకు నీరు ప్రవహిస్తోంది. నగరంలో విద్యుత్తు లేదు. ఉన్న జనరేటర్లన్నీ నీట మునిగి పనిచేయట్లేదు. నీటి అడుగున రోడ్డుపై ఎక్కడ మ్యాన్‌హోల్‌ నోరు తెరచి ఉందో...? ఎక్కడ లోతైన గుంత నీరు కమ్మి ఉందో....? తెలియదు. ఎలా నడవడం! జాతీయ పత్రికలన్నీ ఇదే రిపోర్టు చేశాయి. ఈ పరిస్థితి ఒక్క పాట్నాది కాదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల దుస్థితీ ఇదే! మొన్న చెన్నై, నిన్న ముంబాయ్, నేడు పాట్నా, రేపు..... ఏదో నగరం, తప్పదీ విపత్తు ఎదుర్కొవడం! ఎంతకాలమీ దురవస్థ? ఎవరి దగ్గరా సమాధానం లేదు.

ఎందుకంటే, ఈ సవాళ్లను ఎదుర్కోగల కార్యాచరణ ప్రణాళిక ఎవరూ రూపొందించలేదు గనుక! భూతాపోన్నతి ఫలితంగా వస్తున్న ‘వాతావరణ మార్పు’ విపరిణామాల్ని తట్టుకొని, ఎదుర్కొనే పథక రచనకు ప్రభుత్వాలు పూనుకోవట్లేదు. ఇక విపత్తుల్ని ధీటుగా ఎదుర్కొనే ఆచరణ అగమ్య గోచరమే! గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువై, పౌర సదుపాయాలు కొరవడి పట్టణాలు, నగరాలవైపు ప్రజలు పరుగు తీస్తున్న క్రమంలో నగరీకరణ అతి వేగంగా జరిగిపోతోంది. సరైన పథకం, ప్రణాళికల్లేని పట్టణ–నగరీకరణ కొత్త సవాళ్లను విసురుతోంది. అసాధారణ జనాభా–అరకొర సదుపాయాలకు తోడు ప్రకృతి వైపరీత్యాలు... వెరసి మహానగరాలు మురికి కూపాలవుతున్నాయి. నగరవాసుల జీవితాలు దుర్భరమౌతున్నాయి. వాతావరణ మార్పు దుష్పరిణామాల్లో భాగంగా ముంచుకొచ్చే అతివృష్టి–అనావృష్టి వంటి సవాళ్లు ఇప్పటికే ముంబాయి, చెన్నై నగర వాసులకు నమూనా రుచి చూపించాయి. మున్ముందు ఈ సమస్యలు మరింత జఠిలం కానున్నాయనడానికి పాట్నా సరికొత్త ఉదాహరణ మాత్రమే!

ఆలోచనలు మారితేనే....
కాలం చెల్లిన ఆలోచనలు, విధానాలతో పాలకులు నెట్టుకొస్తున్నారు. భారీ వర్షాలు, వరదలు రాగానే హడావుడి చేస్తారు. పట్టణ ప్రణా ళిక–నీటి నిర్వహణ... అంటూ ఏవేవో ప్రకటనలు చేస్తారు. రోజులు గడిచాక అంతా మరచిపోతారు. మన నగర–పట్టణ ప్రణా ళికాధికారులు, ఇంజనీర్లు ఇంకా 70లు 80ల నాటి ఆలోచనా విధానంతోనే సాగుతున్నారు. అసలు సివిల్‌ ఇంజనీరింగ్‌ సిలబస్‌ పుస్తకాల్నే సమూలంగా మార్చాలి. పర్యావరణ సమస్యలు, ప్రకృతి విపత్తుల నుంచి నగరాలను కాపాడే వ్యవస్థలు–విధానాలే ప్రస్తుతం మనకు లేవు. మారే పరిస్థితులకు అనుగుణంగా చేపట్టాల్సిన అత్య వసరాలు, ప్రత్యామ్నాయాల అమలులో చొరవే కాదు చిత్తశుద్దీ కొరవడుతోంది. చట్టాల్లోనూ సమూల మార్పులు రావాలి. పౌరుల బాధ్యతను నిర్దేశించే నిబంధనలిపుడు పెద్దగా లేవు. సంస్థలుగా, సమూహాలుగా పౌరసమాజం నిర్వహించాల్సిన కర్తవ్యాలు ఎక్కడా అమలు కావు. నిఘా, నియంత్రణా వ్యవస్థల్లో అవినీతి తారస్థాయిలో ఉంది. అక్రమ కట్టడాలకు అంతే లేదు! నిబంధనల్ని పాటించడం కన్నా నిఘా–నియంత్రణ వ్యవస్థలకు లంచమిచ్చి పబ్బం గడపడం తేలిక, చౌక కావడంతో పౌరులు అటే మొగ్గుతున్నారు. ఫలితంగా చట్టాలు, నిబంధనల అమలు గాల్లో దీపమే! 4 నుంచి 8 (సగటున 6)సెంటీమీటర్లు మించి వర్షం కురిస్తే తట్టుకోలేని స్థితి మన మహానగరాలది. వలసల ఒత్తిడి తగ్గించడానికి మహానగరాలకు అన్ని వైపులా 30, 40 కిలోమీటర్ల దూరంలో శాటిలైట్‌ టౌన్‌షిప్‌లను అభివృద్ధి పరచాలన్న ప్రతిపాదన సవ్యంగా అమలు కావడం లేదు. ఇప్పుడు హైదరాబాద్‌కు లభించిన అవుటర్‌ రింగ్‌రోడ్డు, రేపు రాబోయే రీజనల్‌ రింగ్‌రొడ్డు వంటి మౌలిక సదుపాయాల పరిపుష్టి దృష్ట్యా అలాంటి టౌన్‌షిప్‌లుంటే ఇవ్వాళ నగరంపై ఒత్తిడి తగ్గేది.

అందరి పరిస్థితీ అధ్వాన్నమే!
ఇది ఒక హైదరాబాద్‌ సమస్యే కాదు. ముంబాయి, చెన్నై, బెంగ ళూరు, కలకత్తా, ఢిల్లీ... ఎవరి పరిస్థితీ బాగోలేదు. ఒకరిది వరద మునక, ఇంకొకరిది నీటి ఎద్దడి, మరొకరిది ఉష్ణతాపం, వేరొకరిది మురికి కూపం, మరొకరిది వాయు కాలుష్యం  ... ఇలా అందరూ ఏదో రూపంలో సమస్యల్ని ఎదుర్కొంటున్న వారే! ప్రకృతి వైపరీ త్యాల్ని తట్టుకునే పరిస్థితులు ఎవరికీ లేవు. ముఖ్యంగా ‘వాతావరణ మార్పు’ వల్ల కురుస్తున్న అసాధారణ వర్షాలు నగరాలను వరదతో ముంచెత్తుతున్నాయి. పాట్నా చూడండి, ఉప ముఖ్యమంత్రి కుటుంబాన్ని రబ్బరు పడవలో సురక్షిత ప్రాంతానికి తరలించిన స్థితి! ఇలా ఎంతమందికి రక్షణ కల్పించగలరు? మొలలోతు నీటిలోనే ఇంకా కొట్టుమిట్టాడుతున్న సామాన్యుల పరిస్థితి ఏంటి? చెన్నైలో 2015 వరదల తర్వాత అధ్యయనం జరిపిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. నగరంలో చెరువులు, కుంటలు, నదీ తీరాల దురాక్రమణ, అక్రమ కట్టడాల వల్లే ఈ సమస్య ముదిరినట్టు పేర్కొంది. అడ్డదిడ్డమైన టౌన్‌ ప్లానింగ్‌ కూడా కారణమంది. 1975 తర్వాత ముంబాయి వరద విపత్తుపై పలు కమిటీలు ఏర్పడి, ఎన్నో అధ్యయనాలు జరిపాయి. ఐఐటీ ముంబాయి వారిచ్చిన దానితో సహా ఎన్నో నివేదికలొచ్చాయి. ప్లానింగ్‌ లోపాలతో పాటు అక్రమ కట్టడాలు, ప్లాస్టిక్‌–ఇతర వ్యర్థాల డంప్‌ ముంపులకు కారణమని పేర్కొన్నాయి. అక్రమ కట్టడాలకు తోడు డ్రయినేజీ వ్యవస్థను ఆధు నీకరించకపోవడం బెంగళూరులో ముంపు ప్రమాదాలకు ముఖ్య కారణమని ‘ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్, బెంగళూరు’ తన నివేదికలో చెప్పింది. ప్రణాళికలేని పట్టణాభివృద్దే ‘గౌహతి’ ముంపు కారణమని ‘అస్సాం రాష్ట్ర విపత్తుల ప్రాధికార సంస్థ’ నివేదించింది. ఇలా ఎక్కడికక్కడ పలు నివేదికలు, సిఫారసులున్నాయి. వాటి అమలే శూన్యం!

పేద–మధ్యతరగతికే పెనుశాపం
నగరాలు, పట్టణాలు... ఇలా విపత్తుతో ఏవి నీట మునిగినా ఎక్కువ నష్టపోయేది పేద–మధ్యతరగతివారే! ఇళ్లు జలమయం. వండిన వంట, ధాన్యంతో సహా సరుకు నిరుపయోగమౌతోంది. ఉన్నపళంగా ఉపాధి పోతుంది. రవాణా దుర్బరం. మనుగడ కష్టమౌతుంది. ప్రస్తుత సీజన్లో బీహార్లో 40 మంది చనిపోతే, ఉత్తరప్రదేశ్‌లో సెప్టెంబరు 26–30 మధ్యలో 110 మంది దుర్మరణం పాలయ్యారు. దాదాపు అంతా అల్పాదాయవర్గాల వారే! దేశంలోని నగరాలు, పట్టణాల్లో పాతిక నుంచి యాబై శాతం జనాభా పేద, అల్పాదాయ వర్గాలే! వాతావరణ మార్పుల మూలంగా రానున్న కాలంలో ఎక్కువ నష్టపోయది వీరేనని అధ్యయనాలు చెబుతున్నాయి. భూతాపోన్నతి వల్ల ఆహారోత్పత్తి తగ్గడం, కొత్త జబ్బులు పెరగటం, వరద–కరువు వంటి పరస్పర విరుద్ధ వైపరీత్యాలు... వీటన్నిటి ప్రత్యక్ష ప్రభావం పేదలపైనే అన్నది నివేదికల సారం! మరో 50 ఏళ్లలో భారత జనాభా 160 కోట్లకు చేరనుందనేదొక అంచనా! అప్పుడు దాదాపు 70 కోట్ల మంది నగరాల్లో నివసిస్తారు. ముంచుకొస్తున్న ‘వాతావరణ మార్పు’ల విపరిణామాలను తట్టుకునే, ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని మన నగరాలు సంతరించుకోకుంటే జీవనం దుర్బరమే! వాతావరణ మార్పు దుష్ప్రభావం వల్ల పేద, ఎదుగుతున్న (మూడో ప్రపంచ) దేశాలకు జరిగే నష్టమే ఎక్కువని అమెరికా ‘జాతీయ శాస్త్ర అధ్యయనాల సంస్థ’ (ఎన్‌ఏఎస్‌) నివేదిక చెబుతోంది.

ఇది వాతావరణ మార్పుల దెబ్బే!
పాలకులు ఇంకా సందేహిస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో సమస్య మరింత తీవ్రమవడానికి వాతావరణ మార్పే కారణమంటే వారు నమ్మట్లేదు. బీహార్లో 25 ఏళ్ల తర్వాత ఇంతటి వర్షపాతం (10 శాతం ఎక్కువ) నమోదైంది. నెల కింద కురిసిన భారీ వర్షం ముంబాయిని ముంచెత్తినపుడు పక్కనే మరాఠ్వాడాలో కరువు విలయతాండవం చేసింది. చైన్నైలో ఓ యేడు వరదలు ముంచెత్తితే మరో ఏడాది నీటి ఎద్దడి. హైదరాబాద్‌లో ఈ సారి సగటు వర్షపాతం ఎక్కువ నమోదైనా, భూగర్భ జలమట్టాలు పెరక్కపోగా దాదాపు మరో మీటరు అడుక్కుపోయాయి. ఈ విపరీతాలన్నీ ‘వాతావరణ మార్పు’ కాక మరేంటి? వాటినెదుర్కొనే, తట్టుకునే సామర్థ్యాల్ని పెం చుకోవాలి. కేంద్ర, రాష్ట్ర, స్థానిక పాలనా సంస్థలు సమన్వయంతో పనిచేయాలి. నగరాల్లో  అక్రమ కట్టడాల్ని అడ్డుకోవాలి. పచ్చదనం పెంచాలి. జల, వాయు కాలుష్యాల్ని అరికట్టి పర్యావరణ పరిరక్షణకు పూనుకోవాలి. ప్రమాదస్థాయిని గ్రహించి ప్రభుత్వాలు, పౌర సమా జం వ్యూహాత్మకంగా జరిపే సమిష్ఠి కృషితోనే నగరజీవికిక మనుగడ!


దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top