వట్టి శుష్క వాగ్దానాల బడ్జెట్‌

Chattisgarh Cm Bhupesh Baghel Slams Union Budget 2022 - Sakshi

నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అనే రెండు ఉపద్రవాలను దేశం ఎదుర్కొంటోంది. ఉపాధి అవకాశాలను పెంచి ద్రవ్యోల్బణ సూచిని తగ్గించడానికి ఆర్థిక మంత్రి ప్రాధాన్యత ఇస్తారని భావించారు. అయితే బడ్జెట్‌లో కేటాయించిన నిధులు పేదలను, కార్మికులను, వలస కూలీలను వంచించాయనే చెప్పాలి. రైతులకు స్వావలంబనతో కూడిన సంక్షేమ చర్యలు చేపట్టడానికి కనీస నిధులను కూడా బడ్జెట్‌లో కేటాయించలేదు. ఇక వ్యవసాయాన్ని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామన్నది వట్టి మాటే.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర పాలకులు దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను మరోసారి చిదిమివేశారు. ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2022–23 కేంద్ర బడ్జెట్‌ పూర్తిగా దిశారహితం గానూ, పేదలకు, రైతులకు వ్యతిరేకం గానూ రూపొందింది. ఇది ఆర్థికరంగంలో బీజేపీ పాలకుల వైఫల్యంపై శ్వేతపత్రం మాత్రమే. గత కొన్నేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపయిందంటూ కేంద్రప్రభుత్వం ఊదరగొడు తోంది. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రైతుల పెరిగిన ఆదాయంపై ఒక్క మాటంటే ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. ఇక కేంద్ర ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్న 100 విశ్వనగరాల పురోగతి మాట ఏమిటి?

బడ్జెట్‌లో చూపించిన కేటాయింపులు కొత్త సీసాలో పోసిన పాత సారా తప్ప మరేమీ కాదంటే అది అసందర్భ వ్యాఖ్య కాదు. కరోనా మహమ్మారి ద్వారా కలిగిన నష్టాలను పూరించ డానికి సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు సహాయాన్ని అందిస్తున్నట్లు ఘనంగా ప్రకటించు కుంది. కానీ, దీనికి ప్రత్యామ్నాయంగా 2023 మార్చి వరకు చిన్న కార్పొరేషన్లకు అత్యవసర రుణ పరపతి హామీ పథకాన్ని (ఈసీఎల్‌జీఎస్‌) పొడిగిస్తున్నట్లు ఆర్థికమంత్రి పేర్కొన్నారు. అయితే ద్రవ్య సమస్యల్లో ఇప్పటికే కూరుకు పోయిన చిన్న సంస్థలు క్రెడిట్‌ స్కోర్‌ని మెయిన్‌టెయిన్‌ చేసే స్థితిలో లేవన్న ఇంగితజ్ఞానం ప్రదర్శించడంలోనూ భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడు నిజంగా చేయవలసింది ఏమిటంటే చిన్న తరహా సంస్థలను ప్రోత్స హించడమే.

స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయ రంగం వాటా 14 నుంచి 15 శాతంగా ఉంటోంది. ఈ తరుణంలో రైతుల ఆదాయాన్ని పెంచగలిగితే అది దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్టర్‌ డోస్‌గా పనిచేస్తుంది. వ్యవసాయ పనుల్లో విస్తృతంగా పాల్గొం టున్న రైతులు తమ రాబడికి హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. కానీ కనీస మద్దతు ధర పథకాన్ని చట్టబద్ధం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ఒక్క పదం కూడా తాజా బడ్జెట్‌ ప్రతిపాదనలో కనిపించదు. గ్రామీణ భారతావనికి ఘోరమైన అన్యాయం చేయడంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండమైన విజయం సాధించింది. రైతులకు స్వావలంబనతో కూడిన సంక్షేమ చర్యలు చేపట్టడానికి కనీస నిధులను కూడా ఈ తాజా కేంద్ర బడ్జెట్‌లో కేటాయిం చలేదు. ఇక వ్యవసాయాన్ని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామన్నది వట్టి మాటే మరి.

గంగానది పొడవునా రసాయన రహిత స్వచ్ఛ వ్యవ సాయాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కానీ ఛత్తీస్‌గఢ్‌తో సహా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే దీనికి పూను కున్నాయి. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను రైతుల ఖాతాలకు బదలాయించాలని నిర్ణయించింది.. ఇది ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్నదానికి కొనసాగింపు మాత్ర మేనని చెప్పాలి. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఇప్పటికే కనీస మద్దతు ధరను రైతుల ఖాతాకు నేరుగా బదిలీ చేస్తోంది. 

ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు దగ్గరి దారి ఏమిటంటే ప్రత్యక్ష నగదు బదిలీని అమలుపర్చటమే! ఈవిధంగానే కరోనా మహమ్మారి కాలం పొడవునా ఆర్థిక మాంద్యం నుంచి చత్తీస్‌గఢ్‌ తన్ను తాను కాపాడుకోగలిగింది. కేంద్రప్రభుత్వం కిసాన్‌ సమ్మాన్‌ నిధిని విస్తరిస్తున్నట్లు చెబుతూ వచ్చింది కానీ బడ్జెట్‌లో దీని ప్రస్తావన కూడా తేలేదు.
పసలేని వాగ్దానాలను చేయ డంలో నరేంద్ర మోదీ నేతృత్వం లోని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రాటుదేలి పోయింది. ఆర్థికమంత్రి తన బడ్జెట్‌ ప్రసం గంలో ఏడు చోదక శక్తుల గురించి మాట్లాడారు. అవేమిటంటే – రోడ్లు, రైల్వే, విమానాశ్రయాలు, ఓడరేవులు, ప్రజా రవాణా, జల మార్గాలు, నిర్మాణ రంగం. వీటితో ఆర్థికవ్యవస్థను ముంద డుగు వేయించవచ్చని మంత్రి పేర్కొన్నారు. కానీ వీటికి సరిపడా నిధుల కేటాయింపు బడ్జెట్‌లో కనిపించలేదు. ఎంత వెచ్చిస్తారనే సంఖ్యలనూ పేర్కొనలేదు. గతంలోని కొన్ని బడ్జెట్లను మనం పరిశీలించినట్లయితే, పెద్ద పెద్ద బులెటిన్లను ప్రకటించారు. సమర్థ మౌలిక వసతుల మిషన్, జాతీయ వ్యాప్తంగా డిజిటల్‌ వెల్‌ బీయింగ్‌ మిషన్‌ వంటివి వీటిలో కొన్ని. కానీ క్షేత్రస్థాయిలో వాటి అమలు మాత్రం ఊహించినంత పరిమాణంలో లేదు. పోతే, ప్రధాని గతిశక్తి పథకం మార్గంలో మౌలిక వసతులపై వ్యయాన్ని పెంచుతారా అంటే అదీ స్పష్టం కావడం లేదు.

ప్రస్తుతం నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అనే రెండు ఉప ద్రవాలను మన దేశం ఎదుర్కొంటోంది. ఉపాధి అవకా శాలను పెంచి ద్రవ్యోల్బణ సూచిని తగ్గించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రాధాన్యం ఇస్తారని భావించారు. అయితే బడ్జెట్‌లో కేటా యించిన నిధులు భారత ప్రజలను ప్రత్యేకించి పేదలను, కార్మికులను, వలస కూలీలను, మహమ్మారి కాలంలో పూర్తిగా మూతపడిన ఆర్థిక సంస్థలను వంచించాయనే చెప్పాల్సి ఉంటుంది. ఇక ‘పనికి ఆహార పథకా’నికి నిధుల కేటాయింపును పెంచలేదు. ఎప్పటిలాగే ఇది ఎన్నికల సంవత్సరంలో మాత్రమే పట్టించుకునే అంశంగా ఉండిపోయింది. దీంతో అసలే కరోనా దెబ్బతో జీవితాలు అతలాకుతలమైన పేదప్రజలపై పిడుగు పాటు తప్పదు.

ఆత్మనిర్భర్‌ భారత్‌ను సాధించడానికి వస్తూత్పత్తితో లింక్‌ చేసిన ప్రోత్సాహక పథకం ద్వారా, కొత్తగా 60 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ఆర్థికమంత్రి పేర్కొన్నారు కానీ దీనికి సంబంధించిన గణాంకాలు కానీ, ఎలా ఉద్యోగాలను çసృష్టిస్తా రన్న ఎరుక కానీ బడ్జెట్‌లో కనిపించలేదు. కేంద్రప్రభుత్వం ఉపాధి కల్పనపై ఎలాంటి నమూనా ఇవ్వనందున నిరు ద్యోగితకు వ్యతిరేకంగా రోడ్లమీదికి వస్తున్న లక్షలాది మంది యువతకు ఇది పూర్తిగా నిరాశపరిచే అంశమే అవుతుంది. నిరుద్యోగ పరిస్థితులతో ఎలా వ్యవహరించాలనే విషయమై కేంద్రం మా ఛత్తీస్‌గఢ్‌ నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మా రాష్ట్ర నిరుద్యోగితా రేటు దేశ సగటు నిరుద్యోగ రేటు కన్నా తక్కువగా ఉందని నివేదికలు ఇప్పటికే తేటతెల్లం చేశాయి కూడా!

ఆర్థిక వ్యవస్థను నిధుల లేమి తీవ్రంగా ప్రభావితం చేస్తోంది కాబట్టే కొనుగోలుదారుకు సాధికారత కల్పించాలని కేంద్రం కోరుకుంటోంది. కానీ ఈ భావన కూడా ఇప్పుడు డిమాండ్‌ లేని సరకుగా మారిపోయింది. ప్రభుత్వం ఏమి చేస్తోందో అంతుబట్టడం లేదు. వేళ్లమీద లెక్కబెట్టగల కార్పొ రేట్లకు సంపద ధారపోయడం కంటే కేంద్ర ప్రభుత్వాధికారులు అధిక జనాభా చేతుల్లోకి డబ్బు వచ్చిపడేలా ప్రత్యామ్నాయ లక్ష్యాలను ఇకనైనా రూపొందించుకోవాలి. కానీ ఇక్కడ కూడా ప్రభుత్వం ప్రజలకు ద్రోహం చేసిందనే చెప్పాలి. కంపెనీలపై పన్నును 18 నుంచి 15 శాతానికి తగ్గించారు కానీ అదే సమ యంలో ఆదాయ పన్ను విభాగంలో వేతన జీవులకు ఎలాంటి ఊరటనూ అందించలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే తాజా కేంద్ర బడ్జెట్‌ ఒక దిశా దశా లేని శుష్క వాగ్దానాల బడ్జెట్‌. మధ్య తరగతికి మొండిచెయ్యి చూపిన బడ్జెట్‌. అంతకుమించి నిరు పేదల మాడు పగలగొట్టిన బడ్జెట్‌! 


భూపేశ్‌ బఘేల్‌ ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి –కాంగ్రెస్‌ నాయకుడు 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top