గాంధీ స్ఫూర్తికి సాగు చట్టాలు విరుద్ధం

Biggest Farmers Protest In 20Th Decade - Sakshi

రెండో మాట

కారుచీకటిలో కాంతిరేఖలా దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా రైతు– వ్యవసాయ కార్మికులు సమష్టిగా ఒక్క శక్తిగా కదలబారడం 20వ శతాబ్దం తొలి జాతీయోద్యమ రోజుల తర్వాత బహుశా ఇదే మొదటి ఉదాహరణ! పంజాబ్, హరియాణా, రాజస్తాన్‌ రైతాంగం, వ్యవసాయ కార్మికుల సారథ్యంలో– ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించిన రైతు ఉద్యమం అనేక రాష్ట్రాల రైతాంగ, కార్మిక ప్రజాబాహుళ్యాన్ని కదిలించి, కేంద్రం రూపొందించిన మూడు రైతాంగ వ్యతిరేక సాగు చట్టాలను ప్రతిఘటించేట్లు చేసింది! పచ్చి నిజమేమంటే ఏ బిహార్‌‡ నీలిమందు రైతులను బ్రిటిష్‌ సామ్రాజ్య ప్రభుత్వ దమనకాండ నుంచి, దాస్యం నుంచి గాంధీ బయటపడేశాడో.. ఆ మహాత్ముడి శాంతిని భగ్నం చేసే చట్టాలను తిరిగి ఈనాటి కేంద్ర పాలకులు తలెత్తుకోవడం!

రైతాంగ, వ్యవసాయ కార్మికుల ప్రయోజ నాలను రక్షించడంలో కేంద్ర, రాష్ట్రాల పాల కులు మూడు కొత్త వ్యవసాయ బిల్లులను రుద్దడంలో భారత రాజ్యాంగ చట్ట నిబంధనలను ఉల్లంఘించారు. ఈ క్రమంలో పాలకులు రాజ్యాంగం శాసిస్తున్న కేంద్ర, రాష్ట్రాలు విధిగా పాటించాల్సిన ఉమ్మడి జాబితాను ఉల్లంఘించారు. తద్వారా రాజ్యాంగ చట్టం ఫెడరల్‌ (సమాఖ్య) స్వభావంపైనే దాడికి తలబడ్డారు. ఇందువల్ల ప్రత్యక్షంగా నష్టపోయే రైతులతో ఎలాంటి చర్చలు జరపకుండానే బిల్లులు తెచ్చారు. చివరికి ఈ బిల్లులపై పార్లమెంటులో వ్యతిరేకత అభ్యంతరాలు వచ్చినా వాటిని వినిపించుకోలేదు. కనీసం బిల్లులపై చర్చించేందుకు కూడా వ్యవధిని ఇవ్వకుండా నల్లేరు మీద బండిని నడిపించినట్టు తోసేశారు. అలాగే, రాజ్యసభలో ఈ బిల్లులపై ఓటింగ్‌ను కోరితే దాన్నీ నిరాకరిం చారు పాలకులు. ఈ గందరగోళం మధ్య మూజువాణి ఓటుతో బిల్లులు  ఆమోదం పొందినట్లు రాజ్యసభ చైర్మన్‌ చెప్పారు. కోవిడ్‌ ముమ్మరంగా ఉన్న సమయంలో బిల్లులపై నిరసన తెల్పడానికి ప్రజలు తెగబడి వీధుల్లోకి వచ్చి నిరసన తెలపలేరన్న భరోసాతో ఆ బిల్లుల్ని ఆమోదిం పజేసుకున్నారు. – కేంద్ర, రాష్ట్రాల సర్వీసులలో పనిచేసిన 78 మంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల సంయుక్త ప్రకటన

రైతాంగ, వ్యవసాయ కార్మిక సంఘాలు, సంస్థలూ ఏకవాక్యతతో పలు రాష్ట్రాల నుంచి బయల్దేరి ఢిల్లీ సరిహద్దులలో, ఢిల్లీని ముట్టడించే కూతవేటు దూరంలోనే భారీఎత్తున సమీకరణ జరిగి గత 18 రోజు లకు పైగా భీకరమైన స్థాయిలో ఆందోళన కొనసాగిస్తున్న సమయం ఇది. అసలు భూమికోసం, భుక్తికోసం దేశంలో నేడు జరుగుతున్న పోరు.. దేశ పాలకులు ఎంచుకున్న ‘అభివృద్ధి నమూనా’నే తీవ్ర చర్చ లోకి లాగిందని మరచి పోరాదు! ఎందుకంటే మనదేశంలో భూమిలేని వ్యవసాయ కార్మికులు, సాగుచేసుకోవడానికి ఇంత కొండ్ర కూడా లేని నిరుపేద రైతుల సంఖ్యే–భూములున్న రైతుల సంఖ్య కన్నా ఎక్కువని గుర్తుంచుకోవాలి. వ్యవసాయంపై రూపొందించే విధానంలోగాని, వ్యవసాయానికి సంబంధించిన విధాన చర్యలలోగానీ ప్రధానంగా భూమిలేని వ్యవసాయ కార్మికులు, భూమిలేని రైతుల ప్రస్తావన  మృగ్యమవుతూ వస్తోంది. దేశంలోకి కాంగ్రెస్, బీజేపీ పాలకులు ప్రవేశ పెట్టిన.. దేశ ప్రయోజనాలకు, రైతాంగ, వ్యవసాయ కార్మిక మౌలిక ప్రయోజనాలకు విరుద్ధమైన ప్రపంచబ్యాంకు ప్రజా వ్యతిరేక సంస్క రణలలో అసలు ‘కల్మషం’ అంతా కేంద్రీకరించి ఉంది.

ఈ దుస్థితిలో, కారుచీకటిలో కాంతిరేఖలా దేశవ్యాప్తంగా మొట్ట మొదటిసారిగా రైతు– వ్యవసాయ కార్మికులు సమష్టిగా దేశవ్యాప్తంగా ఒక్క శక్తిగా కదలబారడం 20వ శతాబ్దం తొలి జాతీయోద్యమ రోజుల తర్వాత బహుశా ఇదే మొదటి ఉదాహరణ! ఇందుకు చరిత్రలో తొలి ఉదాహరణగా గాంధీజీ చంపారన్‌ రైతాంగ సత్యాగ్రహాన్ని ఉదహరిం చుకోవచ్చు! ఆ పిమ్మట దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తలెత్తుతూ వచ్చిన ‘పునప్రా’, బెంగాల్, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఫ్యూడల్, భూస్వామ్య దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన రైతుల వ్యవసాయ కార్మికోద్యమాలు, రైతాంగ సత్యాగ్రహోద్యమాలు, రైతాంగ తిరుగుబాట్లను తెలుగునాట, పల్నాటిసీమలో ‘ పుల్లరి’ కోసం సామాన్య ప్రజలు కన్నెగంటి హనుమంతు నడిపిన మహోద్యమం పేద రైతాంగ, ప్రయోజనాలకోసం త్యాగాలతో నిర్వహించిన ఉద్య మాలు, మహోద్యమాలేనని మరువరాదు! ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్ర రైతు ఉద్యమ నాయకులు ఈ కొసన ఉన్న శ్రీకాకుళం నుంచి ఆ కొసన ఉన్న మద్రాసు వరకు 1,500 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా వెళ్లి రైతాంగ ప్రజల బాధల గురించి సమర్పించిన వినతి పత్రమూ ఈ ఉద్యమాలలో అంతర్భాగమే! వీటన్నింటి సమా హారంగానే నేడు పంజాబ్, హరియాణా, రాజస్తాన్‌ రైతాంగం, వ్యవ సాయ కార్మికుల సారథ్యంలో– ఢిల్లీ సరిహద్దుల్లో  బైఠాయించి అనేక రాష్ట్రాల రైతాంగ, కార్మిక ప్రజాబాహుళ్యాన్ని కదిలించి మూడు రైతాంగ వ్యతిరేక చట్టాలను ప్రతిఘటించేట్లు చేసింది! 

లక్షలమంది రైతులను కూడగట్టి 20వ శతాబ్దం తొలి దశాబ్దంలోనే గాంధీజీ  తొలిసారిగా ప్రారంభించిన ‘చంపారన్‌’ (బిహార్‌) రైతాంగ సత్యాగ్రహం, ఆ తర్వాత ఉద్యమాలన్నింటికి స్ఫూర్తిగా నిలిచిందని మరువరాదు! కానీ ఏ బిహార్‌ నీలిమందు రైతులను ౖబ్రిటిష్‌ సామ్రాజ్య ప్రభుత్వ దమనకాండ నుంచి, దాస్యం నుంచి ఏ గాం«ధీ బయటపడే శాడో ఆ మహాత్ముడి శాంతిని భగ్నం చేసే చట్టాలను తిరిగి ఈనాటి పాలకులు తలెత్తుకున్నారు. పైగా, దేశంలోని బుద్ధిజీవులంతా భారత పారిశ్రామిక వేత్తల జాతీయ సమాజ సదస్సులో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో.. భారత రైతాంగంకి ఆదాయం పెంచుకోవడానికి ఇప్పు డున్న మార్కెట్లుగాక ‘ప్రత్యామ్నాయ మార్కెట్లను చూపడానికే మూడు వ్యవసాయ చట్టాలను’ ప్రవేశపెట్టాల్సి వచ్చిందని.. వీటిద్వారా రైతాం గానికి ఆదాయాలు పెరుగుతాయని నమ్మింపజూశారు! పైగా రైతాంగ ‘సంక్షేమం కోసమే’ ఈ చట్టాలని ఉద్దేశించామని చెప్పారు. కానీ పాత, మధ్య దళారీలను ఎలా తొలగిస్తారో చెప్పకుండా ‘రైతాంగ ప్రయోజ నాల’ పేరిట బడా కార్పొరేట్‌ సంస్థలకు వ్యవసాయ ఉత్పత్తులను అప్పగించడం ద్వారా రైతుల పంటలకు కనీస మద్దతు ధరను ఎలా గ్యారంటీ ఇవ్వగలరో మోదీ భరోసా కల్పించలేకపోయారు.

అందుకే కనీస మద్దతు ధరకు గ్యారంటీ ఇస్తూ వ్యవసాయ చట్టా లలో లీగల్‌గా రక్షణ కల్పించి తీరాలని రైతాంగం కోరుతోంది. ఆ చట్టబద్ధ భద్రత మినహా లిఖిత పూర్వక హామీ ఏదైనా ఇస్తామన్నది మోదీ ప్రభృతుల వాదన! ఇక్కడే ఉంది అసలు ‘కిటుకు’ అంతా అని, ఆవులిస్తే పేగులు లెక్కించడంలో ఇన్నేళ్ల అనుభవం తర్వాత రైతాంగ ప్రజలకు తెలిసిపోయింది. కనుకనే పందొమ్మిది రోజుల సత్యా గ్రహాన్ని మరింతగా ఉధృతం చేయాల్సి వచ్చింది రైతాంగం. వారి దృఢ సంకల్పానికి గాంధీజీ సుదీర్ఘ ‘చంపారన్‌ రైతాంగ సత్యా గ్రహమే’ గీటురాయి అయింది. ఎందుకంటే ఆంగ్లో అమెరికన్‌ సామ్రా జ్యవాద పెట్టుబడులను ఇండియా లాంటి వర్ధమాన దేశాల మార్కెట్ల లోకి చొరబడేలా చేసి వాటి స్వతంత్ర ప్రతిపత్తిని నిర్వీర్యం చేసి ధనిక దేశాల ప్రయోజనాలు కాపాడడమే ప్రపంచ బ్యాంకు, గుత్త పెట్టుబడి వర్గాల టెక్నాలజీ గుట్టుమట్టులని మరచిపోరాదు. ఈ విషయాన్ని వరల్డ్‌బ్యాంకు దాని అనుబంధ సంస్థలలో కీలక బాధ్యతల్లో పనిచేసిన డేవిసన్‌ బుధూ, డాక్టర్‌ జోసెఫ్‌ స్టిగ్లిజ్‌లు ఒకటికి పదిసార్లు వర్ధమాన దేశాలకు పాఠంగా బోధించి హెచ్చరించారు. వీరిలో డేవిసన్‌ బుధూ  వరల్డ్‌ బ్యాంకు వర్ధమాన దేశాలలో తనకు అమలు జరపమని పురమా యించిన బాధ్యతల మూలంగా పేదప్రజల ప్రాణాలతో చెలగాట మాడి ‘నా చేతులు రక్తసిక్తమయ్యాయి. ఈ చేతుల్ని కడిగి పరిశుభ్రం చేసుకోవడానికి ఏ నదీ జలాలూ సరిపోవు’ అని బాహాటంగా ప్రక టించి బ్యాంకు కొలువును చాలించుకున్నాడు. ఇక బ్యాంక్‌ ప్రధాన ఆర్థికవేత్త  (స్టిగ్లిజ్‌) బ్యాంక్‌ పదవికి రాజీనామా చేసి, తప్పుకున్నాడు! 

ఇలాంటి పరిణామాల మధ్య భారత రైతాంగ ప్రజల పలు ఉత్ప త్తులకు, ప్రధానంగా ధాన్యం, గోధుమ పంటలకు కనీస ధరను, కనీస మార్కెటింగ్‌ సౌకర్యాలను గ్యారెంటీ చేస్తూ ప్రభుత్వం హామీ పడాలని, గ్రామీణ స్థానిక మార్కెట్లకు (మండీలు) ప్రైవేటు గుత్త వ్యాపార వర్గాల చేతుల్లో పెట్టరాదని, ప్రభుత్వ ఆహార సంస్థే నేరుగా రైతుల నుంచి ధాన్యోత్పత్తులను కొనుగోలు చేయాలని రైతులు కోరుకుంటు న్నారు. గాంధీజీ చంపారన్‌ రైతాంగ ఉద్యమం.. దాదాపు అదే కాలంలో స్వదేశీ మిల్లు యజమానుల దోపిడీకి వ్యతిరేకంగా అహ్మదా బాద్‌ కార్మికులు, కరువు రోజుల్లో  కూడా వృత్తి ద్వారా చేసే రెవెన్యూ వసూళ్లకు నిరసనగా జరిగిన ‘ఖేడా’ ప్రతిఘటనోద్యమాలకు దీటైన ఉద్యమంగా నేటి రైతు ఉద్యమాన్ని పరిగణించాలి! అందువల్ల మోదీ తమ మూడు రైతాంగ వ్యతిరేక చట్టాల ద్వారా ‘తొలగించాలని భావిం చుకున్న అడ్డంకులు’ తద్వారా బడా కార్పొరేట్‌ సంస్థలకు వ్యవసాయ రంగంపై ఆధిపత్యం కల్పించడానికి చేస్తున్న చట్టాల ద్వారా పెంచేవి లేదా పెంచాలని ఆశిస్తున్నవీ రైతాంగ ఆదాయాలు మాత్రం కావు. గుత్తేదారుల, వారి కంపెనీల ఆదాయాలు మాత్రమే! అందుకే ‘గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థ పెట్టుబడి వర్గాలకు ప్రధాన మైన వనరు. అందువల్లనే పారిశ్రామికవేత్తల లాభాలకు అడ్డుగోడలన్నిం టినీ తొలగించడానికే వ్యవసాయ సంస్కరణల’ని మోదీ కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు! అందుకే సెయింట్‌ అగస్తిన్‌ అని ఉంటాడు. ‘పాల కుడెవరో చెప్పండి, ఆ చట్టం ఎలా ఉంటుందో చెప్తా’ అన్నాడు! అందుకే కొందరు పాలకుల్ని గురించి లోకంలో ఒక సామెత స్థిరపడి ఉంటుంది. ‘చీకటి తన నల్ల దుప్పటిని అందరికీ సమంగా పంచాలని చూస్తుందట’! వెలుగు చీకట్లతో మానవులు కాపురం చేయక తప్పదు గానీ, ఎప్పటికప్పుడు చీకటిని వెడలుగొట్టుకుంటూనే ఉండాలి మరి! అదే నిత్య విమోచనకు అర్థం!! 

abkprasad2006@yahoo.co.in
ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top