Bethavolu Village Should be Made As Mandal Centre: Varakumar Gundepangu - Sakshi
Sakshi News home page

Suryapet-Bethavolu: బేతవోలు గ్రామాన్ని మండల కేంద్రం చెయ్యాలి

Jul 26 2022 12:48 PM | Updated on Jul 26 2022 1:29 PM

Bethavolu Village Should be Made as Mandal Centre: Varakumar Gundepangu - Sakshi

బేతవోలు గ్రామం నేటి సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో గల మేజర్‌ గ్రామ పంచాయతీ.

బేతవోలు గ్రామం నేటి సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో గల మేజర్‌ గ్రామ పంచాయతీ. 2014లో సమగ్ర కుటుంబ సర్వేనాటికి 10,500 మంది జనాభా ఈ ఊళ్లో ఉందని తేలింది. ఏడాదికి రెండు సార్లు వరి సాగుచేస్తూ వివిధ ప్రాంతాలకు ధాన్యాన్ని ఎగుమతి చేయడంలో ప్రసిద్ధి చెందిన గ్రామం ఇది. ఈ గ్రామంలో వేల సంవత్సరాల క్రితం ఆదిమానవులు నివసించినట్లు ఆధారాలు ఉన్నాయి. 

మొదటి ప్రతాపరుద్రుడి (12వ శతాబ్దం) సామంత రాజు బేతిరెడ్డి పేరుమీదుగా అప్పట్లో బేతిప్రోలు అనే గ్రామం ఏర్పడింది. అదే నేటి బేతవోలుగా మారిందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. తెలంగాణ వచ్చాక ఈ గ్రామంలో ఉన్న ‘వీర్లదేవి చెర్వు’ (పెద్ద చెర్వు) ఏడవ తరగతి సాంఘిక  శాస్త్రంలో పాఠ్యాంశంగా నిలిచింది. బొమ్మగాని ధర్మభిక్షం, మల్లు స్వరాజ్యం, పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి వంటివారు ఈ గ్రామం సందర్శించి కల్లు వ్యతిరేక ఉద్యమం, నిజాం వ్యతిరేక సాయుధ పోరాటం చేశారు. అదేవిధంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ బేతవోలు చురుకుగా పాల్గొంది.

ఇంతటి ఘన చరిత్ర, భౌగోళిక అనుకూలతలు ఉన్న బేతవోలు గ్రామం నేటికీ మండల కేంద్రం కాలేకపోయింది. బేతవోలు కంటే భౌగోళికంగా, జనాభా పరంగా అతి చిన్న గ్రామాలు మండలాలుగా మారినప్పటికీ... ఈ గ్రామం మాత్రం ఇప్పటికీ మేజర్‌ గ్రామ పంచాయతీగానే మిగిలివుంది. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి  అయినప్పుడూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడూ బేతవోలు మండల కేంద్రం అవుతుందనే ప్రచారం జరిగింది కానీ కార్యరూపం దాల్చలేదు. ఇందుకు కారణం గ్రామానికి అనుసంధానంగా పట్టణ రహదారులు లేవని చెబుతున్నారు. కానీ బేతవోలు... మిర్యాలగూడెం నుండి కోదాడ నియోజకవర్గానికి మారిన తర్వాత బరాఖత్‌ గూడెం జాతీయ రహదారి నుండి రాయినగూడెం వరకు... మిర్యాలగూడ రహదారిని కలుపుతూ బీడీ రోడ్డు వేశారు. (క్లిక్‌: ఇది రైతుల పాలిట వరమా... శాపమా?)

బేతవోలు గ్రామానికి చుట్టుపక్కల కేవలం ఐదుకిలోమీటర్ల దూరంలోనే పది నుండి పదిహేను గ్రామాలు ఉన్నాయి. ఈ అనుకూలతలను చూపిస్తూ 2016–17లో గ్రామ ప్రజలు మండల కేంద్రంగా చేయాలని ధర్నాలు చేశారు. అధికార్లు, ఎమ్మేల్యేలకు మెమొరాండాలిచ్చారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వం ఇప్పటికైనా బేతవోలును మండల కేంద్రం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.  

– వరకుమార్‌ గుండెపంగు (‘మావూరు బేతవోలు’ నవలా రచయిత) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement