ఇప్పటి యుద్ధం ఎప్పుడో మొదలైంది..!

Abhijeet Bhattacharya Special Article On Russia Ukraine War - Sakshi

విశ్లేషణ

ఒక్కోసారి ఎవరు బాధితులు, ఎవరు పీడకులు అని తేల్చడం పరీక్షే. ఎందుకంటే నిర్వచనాలకు ఏకాభిప్రాయం కుదరదు. ఒకరికి ఉగ్రవాదం అనిపించేది, ఇంకొకరికి అణచివేత వ్యతిరేక పోరాటం. ఒకటైతే స్పష్టం. పాశ్చాత్య దేశాలు రష్యాను ఒంటరిని చేశాయి. వాటికీ, రష్యాకూ మధ్య పరస్పర విశ్వాసం ఎప్పుడూ లేకపోవడం గమనార్హం. జార్జియాను నాటోలో చేర్చుకోవడం కోసం ఏర్పరిచిన ‘నాటో జార్జియా కమిషన్‌’, అనంతరం ‘నాటో ఉక్రెయిన్‌ కమిషన్‌’ సహా ఇంకా ఎన్నో కారణాలు రష్యాను గాయపడేట్టు చేశాయి. అందుకే రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిందేమీ కాదు. దశాబ్దాలుగా రగులుతున్న అసహనం యుద్ధం స్థాయికి చేరాలంటే కాలం పండాలి. కారణం ఏమైనా దీని నష్టాన్ని అనుభవిస్తున్నది యావత్‌ ప్రపంచం.

అవినీతి, ఉగ్రవాదం, ‘వరల్డ్‌ ఆర్డర్‌’... ఈ మూడు అంశాల గురించి ఏ అంతర్జాతీయ వేదికపై చర్చ జరిగినా వాటికి ఖచ్చితమైన నిర్వచనం ఇవ్వడం, ఆయా అంశాలపై ఏకాభిప్రాయం ఏర్పడటం దాదాపు అసాధ్యం. ఎందు కంటే... ఈ మూడు పదాల విషయంలో ఒక్కో దేశం నిర్వచనం, అభిప్రాయం వేర్వేరుగానే కాదు, పరస్పర వ్యతిరేకంగానూ ఉండేం దుకు అవకాశాలు చాలా ఎక్కువ. ఒకరికి ఉగ్రవాదం అనిపించేది, ఇంకొకరికి అణచివేతకు వ్యతిరేకంగా జరిపే పోరాటం కావచ్చు. అలాగే మరికొందరికి ఉగ్రవాది కాస్తా స్వాతంత్య్ర సమరయోధుడు అవుతాడు. వరల్డ్‌ ఆర్డర్‌ విషయానికి వస్తే.. దీనికి హద్దులే లేవు. అందుకే మెజారిటీ కలిగిన దేశాల ఆర్థిక, మిలిటరీ శక్తులకు బాధితు లమయ్యామని ఏదైనా దేశం భావిస్తే అదో జోక్‌ మాత్రమే అవుతుంది. అందుకే... యూరప్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఈ వరల్డ్‌ ఆర్డర్‌ ఏమిటన్న అంశంపై కొంచెం లోతుగా పరిశీలించా ల్సిన అవసరం ఏర్పడుతోంది. 

గడచిన 200 ఏళ్ల ప్రపంచ చరిత్రను ఒకసారి తిరగేస్తే... దేశాల మధ్య ఎన్నో చిత్ర, విచిత్రమైన భాగస్వామ్యాలు ఏర్పడినట్లూ, దౌత్య చర్చలు జరిగినట్లూ సులువుగానే అర్థమవుతుంది. బలమున్న వాడిదే బర్రె అన్నట్లు వీటన్నింటిలోనూ శక్తిమంతమైన వారే ఆధిపత్యాన్ని చలాయించారనీ, వరల్డ్‌ ఆర్డర్‌ను నిర్ణయించారనీ తెలుస్తుంది. అయిన ప్పటికీ గత రెండు శతాబ్దాల్లో ఎన్నో వరుస యుద్ధాలు జరిగాయి. వీటి పర్యవసానం 1919లో లీగ్‌ ఆఫ్‌ నేషన్స్‌ ఏర్పాటు! ఆ తరువాత 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపన! ఈ రెండింటి వెనుక ఉన్నది విజయాలను చేజిక్కించుకున్నప్పటికీ యుద్ధాలతో చితికిపోయిన పాశ్చాత్య దేశాలే. కనీసం అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల వరకూ యుద్ధం లేని ప్రపంచాన్ని ఏర్పరచడం వీటి లక్ష్యం. సంపదను సృష్టిం చడంతోపాటు అందులో సింహభాగం తమవద్దే ఉండేలా చూసేం దుకూ పాశ్చాత్య దేశాలు ఈ కొత్త వరల్డ్‌ ఆర్డర్‌ ద్వారా లక్ష్యించాయి. 

రష్యా, ఉక్రెయిన్ల మధ్య మాత్రమే కాకుండా... పశ్చిమ దేశాల కారణంగానే ఆ ప్రాంతాల్లోనే పదే పదే యుద్ధాలు చెలరేగుతూండటం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే 20వ శతాబ్దం సాక్షిగా ఈ పాశ్చాత్య యుద్ధకాంక్షలో అనవసరంగా పశ్చిమేతర దేశాలు చిక్కుకు పోతున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అన్నింటికీ కొరత ఏర్పడు తోంది. వాణిజ్యం, ఆహారం, ఆర్థికం, ఇంధనం వంటి అనేక రంగాల్లో వ్యాపారం అస్తవ్యస్తమవుతోంది. పాశ్చత్య దేశాలు గడచిన 30 ఏళ్లుగా ప్రపంచీకరణ, ఇంటర్‌ కనెక్టివిటీలకు అవసరానికి మించిన ప్రాధాన్యం కల్పించాయి. ప్రతి దేశం సుస్థిరత సాధన కోసం తన ఇరుగు పొరుగు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల ఆధారంగా పనిచేస్తుంది కానీ వరల్డ్‌ ఆర్డర్‌ ప్రకారం కాదన్న వాస్తవాన్ని పాశ్చాత్య దేశాలు మరచి పోయాయి. ఇంకోలా చెప్పాలంటే అంతర్జాతీయ దౌత్యానికి ద్వైపాక్షిక సంబంధాలే మూలం. లేదంటే వేర్వేరు దేశాల్లో తమ దేశ దౌత్య వేత్తలను నియమించుకోవడం వెనుక తర్కం ఏమిటి చెప్పండి? మొత్తమ్మీద చూస్తే దౌత్యం, సంప్రదాయాలు, బహు పాక్షిక ఒప్పం దాలు అన్నింటినీ కూడా అంతర్జాతీయ సంబంధాలను దృఢపరుచు కునేందుకూ... ఏకాభిప్రాయం, అంగీకారాల ద్వారా దౌత్యాన్ని సాధిం చేందుకూ ఉపయుక్తమైన అంశాలుగానే చూడాలి. 

రష్యా–ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కారణంగా ఇప్పుడు అనేకానేక బహుపాక్షిక ఒప్పందాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఒప్పందాలన్నింటికీ... పాశ్చాత్యదేశాల భద్రతకు మధ్య స్పష్టమైన సంబంధం కూడా ఉంది. అదే సమయంలో వీరందరికీ ఉమ్మడి శత్రువు కూడా దెబ్బతిన్న రష్యానే కావడం గమనార్హం. అంటే... ఈ ఏడాది ఫిబ్రవరి 2022 నుంచి అమెరికా, రష్యాలు మరింత ప్రబల మైన బద్ధ శత్రువులుగా మారిపోయాయి అనుకుంటే ‘బైలాటరల్‌ కన్సల్టేటివ్‌ కమిషన్‌’ (బీసీసీ) పరిస్థితి ఏమిటి? అణ్వాయుధాలు మరింత తగ్గించేందుకూ, పరిమితులు విధించుకునే చర్యలు చేపట్టేం దుకూ 2010లో ఈ బీసీసీ ఏర్పడింది. తాజా యుద్ధం నేపథ్యంలో 1992లో ఏర్పాటై– డెన్మార్క్, ఎస్తోనియా, యూరోపియన్‌ యూని యన్, ఫిన్లాండ్, జర్మనీ, ఐస్‌లాండ్, లాత్వియా, లిథువేనియా, నార్వే, పోలండ్, స్వీడన్‌లతోపాటు రష్యా కూడా భాగమైన ‘కౌన్సిల్‌ ఆఫ్‌ ద బాల్టిక్‌ సీ స్టేట్స్‌’ (సీబీఎస్‌ఎస్‌)లో ఇప్పుడు రష్యా ఎలా ఇమడ గలదు? పన్నెండు దేశాలతో ఏర్పాటై బాల్టిక్‌ సముద్ర ప్రాంత దేశాల మధ్య సహకారం కోసం కృషి చేయాల్సిన సీబీఎస్‌ఎస్‌లో 11 దేశాలు ఇప్పుడు రష్యాకు వ్యతిరేకం! 

ఇంకో విషయం. తెలిసో తెలియకో పాశ్చాత్య దేశాలిప్పుడు యూరప్‌లో ఓ దీర్ఘకాలిక ఘర్షణకు బీజం వేశాయని స్పష్టమవుతోంది. విల్నియస్‌ (లిథువేనియా రాజధాని) సరిహద్దు నుంచి వ్లాడివోస్టోక్‌ (రష్యా నగరం) వరకూ ఉండే భారీ తూర్పు దేశం (రష్యా)తో అవి ఎలాగూ సంబంధాలను మెరుగుపరచుకోలేకపోయాయి. పాశ్చాత్య దేశాలకూ, రష్యాకూ మధ్య పరస్పర విశ్వాసం ఎప్పుడూ లేకపోవడం ఇక్కడ ఇంకోసారి చెప్పుకోవాలి. ఈ పరిస్థితుల కారణంగానే 1994లో మెడిటిరేనియన్‌ డైలాగ్‌ ఒకటి ఏర్పాటైంది. నాటో సభ్యదేశాలకూ, అల్జీరియా, ఈజిప్ట్, ఇజ్రాయిల్, జోర్డాన్, మారిటానియా, మొరాకో, ట్యునీసియా వంటి మధ్యదరా దేశాల మధ్య రాజకీయ చర్చలకు వేదికగా మారిన ఈ మెడిటరేనియన్‌ డైలాగ్‌ దూకుడు కారణంగా నాటో 2008లోనే ‘నాటో జార్జియా కమిషన్‌’ ఏర్పరిచి రష్యాను చికాకు పరిచేందుకు ప్రయత్నించింది. జార్జియా లక్ష్యమైన నాటోలో చేరడం కోసం రాజకీయ సంప్రదింపులు ఏర్పరుస్తూ వాస్తవిక సహకారాన్ని అందించడం కోసం ఇది ఉద్దేశించినది.

అలాగే 2008లోనే యూరోపియన్‌ యూనియన్‌ నేతృత్వంలో రీజినల్‌ కో ఆపరేషన్‌ కౌన్సిల్‌ ఒకటి ఏర్పాటైంది. ఆగ్నేయ యూరప్‌ దేశాల మధ్య సహకారం కోసం ఈ సంస్థ ఏర్పాటు కాగా...  పొరుగునే ఉన్న రష్యా ఇందులో భాగం కాలేకపోయింది. బోలెడన్ని అనుమా నాలు రేకెత్తించే అంశమిది. పునరాలోచన చేస్తే.. ప్రస్తుత పరిస్థితులకు బీజం ఇక్కడే పడిందేమో అనిపిస్తుంది. పాశ్చాత్య దేశాల సమర్థనతో ఏర్పాటైన అనేకానేక నెట్‌వర్క్‌లలో ఇప్పుడు కొట్టొచ్చినట్లు కనిపించేది ‘నాటో ఉక్రెయిన్‌ కమిషన్‌’. 1997లో రాజకీయ, భద్రతాపరమైన అంశాలపై సంప్రదింపుల కోసం ఇది ఏర్పాటైంది. ఘర్షణ నివారణ పరిష్కారాలు, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధం, ఆయుధ టెక్నాలజీలు, ఇత రాల బదలాయింపులు కూడా ఈ కమిషన్‌ లక్ష్యాలే. ఉక్రెయిన్, నాటో సభ్యదేశాలన్నీ ఇందులో భాగం వహించాయి. సోవియట్‌ యూని యన్‌ విచ్ఛిన్నమైన ఆరేళ్లకు ఈ కమిషన్‌ ఏర్పాటు కావడాన్ని రష్యా నిశ్శబ్దంగా, తన గర్వాన్ని దాచుకుని మరీ వీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కమిషన్‌ ఏర్పాటు కాస్తా ఉక్రెయిన్‌ లోపలికి నాటోను తీసుకొచ్చినట్లు అయ్యింది.

ఏతావాతా... ఈనాటి రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిందేమీ కాదు. దశాబ్దాలుగా రగులుతున్న అసంతృప్తి, అసహనం వంటివి యుద్ధం స్థాయికి చేరాలంటే కాలం పండాలి మరి! మూడు నెలలకుపైగా యుద్ధం కార్చిచ్చులా దహిస్తూంటే... జనవరిలో భారత్‌లో మాట్లాడుతూ జర్మన్‌ నావికాదళాధిపతి కే–అచిమ్‌ షోన్‌బాక్‌ చేసిన వ్యాఖ్య ఒకటి గుర్తుకు వస్తోంది. ‘‘నేరుగా చూస్తే పుతిన్‌కు గౌరవం ఇవ్వాల్సిందే. దీనికి పెద్దగా ఖర్చేమీ కాదు. ఒకరకంగా చూస్తే ఉచితం కూడా. అతడు కోరుతున్న గౌరవాన్ని ఇవ్వడం సులువు కూడా’’ అని ఆయన వ్యాఖ్యానించారు. జనరల్‌ అచిమ్‌ షోన్‌బాక్‌ భవి ష్యత్తును ముందే ఊహించారా? లేక పాశ్చాత్య దేశాలకు వాతపెట్టి, రష్యా చెవి పిండిన పోప్‌ కరెక్టా? ఒక్కటైతే వాస్తవం. ఈ పరస్పర విధ్వంస రచన ఎప్పుడు ఆగుతుందో? మానవాళి నశించిపోవడం వెంటనే ఆగుతుందో లేక వాయిదా పడుతుందో కాలమే చెప్పాలి.


వ్యాసకర్త రాజకీయాంశాల వ్యాఖ్యాత, రచయిత
అభిజిత్‌ భట్టాచార్య
(‘ది ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top