కలల్ని భగ్నం చేసిన కాలం

2020 Year Ending Story By Mallepally Laxmaiah - Sakshi

కొత్త కోణం

అబ్దుల్‌ కలాం మన పిల్లలందరినీ కలలు కనమన్నారు. మనం కూడా మన పిల్లలకు అదే నేర్పించాం. కానీ మనం కలలు కంటూనే ఉన్నాం. కానీ మన ప్రభుత్వాలు మన దేశాన్ని కలకాలం కలల్లోనే ఉండేలా చేశాయి. మన పిల్లల స్వప్నాలు సత్యాలు కాలేదు. కానీ మనకు ఈ కరోనా ఒక మేల్కొలుపునిచ్చింది. ప్రభు త్వాల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేసింది. అయితే కరోనా ఇచ్చిన అనుభవమే రేపటి సమాజ మార్పునకు ఒక హెచ్చరిక కావాలి. మనం వీడ్కోలు పలుకు తున్న 2020 సంవత్సరం తెచ్చిన ఉపద్రవం మనకు అత్యంత కఠినమైన అనుభవాలను మిగిల్చింది. 2020ని సంతోషంగా సాగనంపడమంటే, మన పాలకుల పట్ల మనకున్న భ్రమలను తొలగించి, వాస్తవాలను కళ్ళకు కట్టిన చేదు అనుభవాలు పునరావృతం కాకుండా మేల్కోగలగడమే. ఇదే మనకొక కనువిప్పు.

‘‘కరోనా మహమ్మారి విలయతాండవం చేసిన 2020 ప్రపంచ ప్రజలందరినీ, ప్రత్యే కించి భారతదేశ వాసులందరినీ అభద్రతకు, అశాంతికి గురిచేసింది. అసమానతలను, అగాధాలను సృష్టించింది. ఇటీవల సంవత్సరాలలో వచ్చిన ఉపద్రవాలన్నింటికన్నా కరోనా కల్లోలం మానవాళిని అన్ని రంగాల్లో వెనక్కు నెట్టింది’’అని 2020 సంవత్సరాన్ని సమీక్షిస్తూ, ప్రపంచ బ్యాంకు ఆర్థిక వేత్తలు విశ్లేషించారు. కరోనా సృష్టించిన సంక్షోభం వల్ల కోట్లాది మంది పేదరికంలోకి దిగజారిపోనున్నారు. చాలా దశాబ్దాల తర్వాత పేదరికంపై జరుగు తున్న పోరాటాన్ని ఈ కరోనా వెనక్కు నెట్టివేసింది. గతం కన్నా అధికంగా ప్రజలు పేదరికంలోకి దిగజారిపోతున్నారు. ప్రపంచంలోని చాలా దేశాలలోని ప్రజలు రోజుకు కేవలం 100 రూపాయలకు మించని ఆదాయంతో గడ్డుపరిస్థితుల నెదుర్కోబోతున్నారు. ఇది భవిష్యత్‌ చిత్రం. ప్రపంచబ్యాంకు నిపుణులు అనేక అంశాలపై సవివరమైన అధ్యయనాలను చేసి, ఎన్నో వివరాలను వెల్లడించారు. ప్రపంచంతో పాటు, భారతదేశంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు సృష్టించిన అసమానతలను కరోనా రెట్టింపు చేసింది. 

ఈ కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా అదనంగా మరో 8 కోట్ల 80 లక్షల మంది ప్రజలు పేదరికంలోకి జారిపోతున్నారు, ఇందులో అత్యధికంగా భారతదేశంతో సహా దక్షిణాసియా దేశాల ప్రజలున్నట్టు అధ్య యనాలు వెల్లడించాయి. అసంఘటిత రంగం, ప్రత్యేకించి నిర్మాణ రంగం, ఉత్పత్తి రంగాల నుంచి ఎక్కువ మంది ఉపాధి కోల్పోను న్నారని ‘‘పావర్టీ అండ్‌ షేర్డ్‌ ప్రాస్పరిటీ రిపోర్టు’’ వెల్లడించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇటువంటి సంక్షోభం తలెత్తలేదని, ఆరోగ్య రంగంలో బయటపడిన బలహీనతలు, మరణాలు ప్రపంచ వ్యాప్త ఆర్థిక సంక్షోభం విశ్వవ్యాప్తంగా ఉన్న మానవాళిని అతలా కుతలం చేశాయని, ‘‘గ్లోబల్‌ ఎకనమిక్‌ ప్రాస్‌పెక్ట్‌’’ నివేదిక తెలియజేసింది. 

కరోనా వల్ల సమాజంలో ఉన్న అసమానతలు, అభద్రత, అశాంతి ముసుగు తొలగించుకొని బయటకొచ్చాయి. మానవాళి ప్రాణ రక్షణకు మాస్క్‌లు అందించిన కరోనా, పాలకులు వేసుకున్న అభివృద్ధి ముసుగుని నిలువునా తొలగించివేసింది. ఇదే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక సర్వేలు రుజువు చేశాయి. ముఖ్యంగా ఈ సంక్షోభం వల్ల ప్రజలు ఉపాధినీ, ఉద్యోగాలనూ కోల్పోయి అభద్రతలోకి వెళ్ళిపోయారు. ప్రాణాలు ఉంటాయో పోతాయో అనే భయంతో అశాంతికి గురయ్యారు. ఆయా రంగాల్లో ఉన్న వ్యత్యాసాలు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్తుని అగమ్యగోచరంలోకి నెట్టివేశాయి. ఆ పరిస్థితులను తట్టుకోలేక ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వలస కార్మికులు ఉపాధిని కోల్పోయారు. చాలా దేశాలు వలస కార్మికుల విదేశీ మారకద్రవ్యం మీద ఆధారపడి ఉన్నారు. కొన్ని కోట్ల కుటుంబాలు తమ వాళ్ళు పంపి స్తున్న డబ్బుతో జీవితాలను వెళ్లదీస్తున్నారు.

కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. 2021 చివరి వరకు విదేశాల నుంచి వచ్చే ఆదాయంలో దాదాపు 14 శాతం తగ్గిపోనున్నది. ఆధునిక చరిత్రలో ఇటువంటిది ఇదే మొదలు. స్వస్థలాలకు వెళ్ళిన వారు ఎక్కువ మంది తిరిగి తాము ప నిచేసే దేశాలకు వెళ్ళే స్థితి లేదని తెలుస్తున్నది. దీంతో పేదరికం మరింత పెరిగే ప్రమాదం ఉన్నది. దీనితో గతంలోలాగా ఆహారం, ఆరోగ్య భద్రత కష్టమవుతుందని వలస కార్మికులు ఆందోళన చెందు తున్నారు. దీంతోపాటు, చాలా కంపెనీలు గతంలో లాగా ఎక్కువ మంది కార్మికులను నియమించుకోవడానికి సిద్ధంగా లేవు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఏర్పడింది. అంతే కాకుండా భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని, మనుషులమీద ఆధారపడకుండా, సాంకేతిక సహకారంతో కంపెనీలను ఆధునీకరించి కార్మికులను తగ్గించుకోవాలని కంపెనీలు ఆలోచిస్తున్నాయి.

భారతదేశంలో దాదాపు 14 కోట్ల మంది వలస కార్మికులున్నారు. వీళ్ళు రాష్ట్రాలను దాటి వెళ్లేవారు. అంటే అంతర్‌రాష్ట్ర కార్మికులు. వీళ్ళంతా తమ పల్లెల్లో పనులు లేక పొరుగు రాష్ట్రాలకు ప్రత్యేకించి వలసలు వెళ్ళి దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు. ఇటువంటి పరిస్థితులు గతంలో ఉన్నప్పటికీ కరోనా వల్ల వలస కార్మికుల దీన గాథలు ప్రపంచానికి తెలియవచ్చింది. ఒకరకంగా ఈ దేశం దౌర్భా గ్యస్థితిని బయటపెట్టింది. మరొక సమస్య నేరుగా కరోనాతో ముడి పడి ఉన్న ఆరోగ్యరంగం. మన ఆరోగ్య రంగం ఎదుర్కొంటోన్న అనేక అవరోధాలను కరోనా బహిర్గతం చేసింది. కరోనా వల్ల భయానకమైన స్థితిని ప్రజలే స్వయంగా అనుభవించారు. కానీ ప్రభుత్వాలు చేసింది నామమాత్రమే. ఉపన్యాసాలకు మాత్రమే పరిమితమైన వీరివల్ల ఒరిగిందేమీ లేదు. ప్రభుత్వాలు వైద్యం మీద పెడుతున్న ఖర్చుకన్నా ప్రజలు చేస్తున్న ఖర్చు అనేక రెట్లు అధికం. ఒక అంచనా ప్రకారం, ప్రపంచంలో ప్రజలు వైద్యం కోసం చేస్తున్న ఖర్చు దాదాపు 38 లక్షల కోట్లు. భారతదేశం వాటా ఇందులో చాలా ఎక్కువే.

ప్రతి సంవత్సరం ఆరోగ్య సమస్యల వల్ల 90 కోట్ల మంది తీవ్రమైన ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని, 9 కోట్ల మంది పేదరికంలోకి దిగజారిపోతున్నారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. కరోనా సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న కుటుం బాలు సామాజిక వెలివేతకు గురవడం మాత్రమే కాకుండా, లక్షల రూపాయల అప్పుల్లో కూరుకుపోయారు. ప్రైవేట్‌ ఆసుపత్రులు ప్రజ లను నిలువుదోపిడీ చేస్తుంటే, ప్రభుత్వాలన్నీ ప్రేక్షక పాత్ర వహించాయి. ప్రభుత్వాలకు దూరదృష్టి లేకపోవడం వల్ల ఇటువంటి దుష్పరిణామాలు సంభవించాయి. మన దేశంలో పదివేల మంది జనాభాకు కేవలం 8 బెడ్లు, పదివేల మంది జనాభాకు 8 మంది డాక్టర్లు ఉన్నారు. దీనితోపాటు, 80 మందికి ఎటువంటి ఆరోగ్యభీమా లేదు. గతంతో పోలిస్తే ప్రభుత్వ ఆసుపత్రులలో ఇచ్చే మందులు చాలా తగ్గిపోయాయి. ఈ పరిస్థితులు కరోనా సమయంలో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. 

అదే సమయంలో లాక్‌డౌన్‌ తొలగించిన తర్వాత ప్రారంభించిన చదువులు మనదేశంలో ఉన్న అసమానతలను బయటపెట్టాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య, పేదలు, ధనికుల మధ్య, మైదాన ప్రాంతాలు, అటవీప్రాంతాల మధ్య ఉన్న తేడాలు మరోసారి తేట తెల్లమయ్యాయి. అంతేకాకుండా సమాజంలో వివక్షకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థినీ విద్యార్థులు కూడా ఆన్‌లైన్‌ క్లాసులకు దూరమవుతున్నారు. ఈ విషయాలపై ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోన్న ఒక సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం, 56.01 శాతం విద్యార్థినీ, విద్యా ర్థులకు స్మార్ట్‌ ఫోన్‌లు లేవని తేల్చారు. అంటే దాదాపు సగానికిపైగా విద్యార్థులు ఈ సంవత్సరం చదువులకు దూరమైనట్టే. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న విద్యార్థులకు చాలా ప్రాంతాల్లో సరిౖయెన నెట్‌వర్క్‌ లేనందువల్ల చదువుల్లో అంతరాయం కలిగిందని ఆ సర్వే తెలిపింది. మరికొన్ని సందర్భాల్లో ఆన్‌లైన్‌ క్లాసులు విన్నప్పటికీ సరిగ్గా అర్థం కావడం లేదని ఆ సర్వే తేల్చి చెప్పింది. 

మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం లాంటి వాళ్ళ విజన్‌–2020 పేరుతో మార్గదర్శకాలను తయారుచేశారు. అబ్దుల్‌ కలాం మన పిల్లలందరినీ కలలు కనమన్నారు. మనం కూడా మన పిల్లలకు అదే నేర్పించాం. కానీ మనం కలలు కంటూనే ఉన్నాం. కానీ మన ప్రభు త్వాలు మన దేశాన్ని కలకాలం కలల్లోనే ఉండేలా చేశాయి. మన పిల్లల స్వప్నాలు సత్యాలు కాలేదు. కానీ మనకు ఈ కరోనా ఒక మేల్కొ లుపునిచ్చింది. ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేసింది. అయితే కరోనా ఇచ్చిన అనుభవమే రేపటి సమాజ మార్పుకు ఒక హెచ్చరిక కావాలి. మనం వీడ్కోలు పలుకుతున్న 2020 సంవత్సరం తెచ్చిన ఉపద్రవం మనకు జీవితంలో అత్యంత కఠినమైన అనుభవాలను మిగిల్చింది. 2020ని సంతోషంగా సాగనంపడమంటే, మన పాలకుల పట్ల మనకున్న భ్రమలను తొలగించి, వాస్తవాలను కళ్ళకు కట్టిన చేదు అనుభవాలు పునరావృతం కాకుండా మేల్కోగలగడమే. ప్రజలను మభ్యపెట్టి, మాయజేసే విధానాల పట్ల అప్రమత్తంగా ఉండడమే. ఉపాధి, ఉద్యోగ, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వాలు తమ బాధ్యతను మరిచిన సత్యాన్ని చెంపఛెళ్ళుమనింపిచేలా కొట్టిన ఘనత 2020కే దక్కింది. ఇదే మనకొక కనువిప్పు. ప్రభుత్వాల విషయంలో ప్రజ లకూ, ప్రజల పట్ల వ్యవహరించే తీరులో పాలకులకూ ఇదొక హెచ్చరిక కావాలి.

మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 81063 22077 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top