రెక్కల గుర్రానికి కీలెరిగి వాతపెట్టాలి

Mallepally Laxmaiah Article On Pegasus Spyware - Sakshi

కొత్త కోణం

పెగసస్‌ వైరస్‌... కోవిడ్‌ కన్నా ప్రమాదకరం. కేంద్రప్రభుత్వం పెగసస్‌ వైరస్‌ను వాడి, వ్యక్తి స్వేచ్ఛను ఎందుకు హరించివేస్తోంది? ఆర్థిక రంగంలో కొనసాగుతున్న కుట్రలను ప్రతిఘటిస్తున్న ప్రజలెవరైనా భారత ప్రభుత్వాలకు శత్రువులే. అందుకే వాళ్ళ మీదకు పెగసస్‌ రెక్కల గుర్రాన్ని వదులుతున్నారు. ఈ విషయాలపై రాస్తున్న, మాట్లాడుతున్న రచయితలను, జర్నలిస్టులను, సామాజిక కార్యకర్తలను, రాజకీయ నాయకులను రెక్కల గుర్రానికి అప్పజెబుతున్నారు. పెగసస్‌ రెక్కల గుర్రం... రోగం మాత్రమే. రోగానికి మూలం ఈ దేశ సామాజిక, ఆర్థిక అసమానతలు, వివక్ష, దోపిడీ. అంబేడ్కర్‌ చెప్పినట్టు... రాజకీయ ప్రజాస్వామ్యానికి రక్షణగా నిలవాలంటే ఆర్థిక, సామాజిక రంగాల్లో ప్రజాస్వామ్యం కోసం కూడా పోరాడాల్సి ఉంటుంది.‘‘జనవరి, 26, 1950 నుంచి మనం ఒక వైరుధ్యాల జీవితంలోకి అడుగిడబోతున్నాం. రాజకీయాల్లో సమానత్వాన్ని, ఆర్థిక, సామాజిక రంగాల్లో అసమానత్వాన్నీ కలిగి ఉన్నాం. ఒక మనిషికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒక విలువ ద్వారా రాజకీయాల్లో ప్రజాస్వామ్యం ఉంది. కానీ ఆర్థిక, సామాజిక రంగాల్లో ఇంకా అసమానతలు కొనసాగుతున్నాయి. ఇవి ఇలాగే కొనసాగితే రాజకీయ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుంది’’ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగ సభ చివరి రోజైన నవంబర్, 25, 1949న చేసిన ప్రసంగంలోని కీలకమైన అంశం ఇది. 

డెబ్భై ఏళ్ళ క్రితం అంబేడ్కర్‌ చేసిన ఈ వ్యాఖ్యలను తిరిగి మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. పెగసస్‌ వైరస్‌ ద్వారా కొన్ని వందల మంది ప్రముఖుల ఫోన్‌లను నిఘాలో పెట్టినట్టు రుజువైంది. నిజానికి ఇది కోవిడ్‌ కన్నా ప్రమాదకరం. నూటికి నూరుపాళ్ళూ ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. అయితే ఎందుకు ఈ ప్రభుత్వం పెగసస్‌ వైరస్‌ను వాడి వ్యక్తి స్వేచ్ఛను హరించివేస్తోంది? ఇది కేవలం రాజకీయ ప్రజాస్వామ్యానికి సంబంధించినది మాత్రమే కాదు. ఈ దేశంలో కొనసాగుతున్న ఆర్థిక గుత్తాధిపత్యం, సామాజిక వివక్షలు, అణచివేతలు రోజురోజుకీ వికృత రూపం దాల్చుతున్నాయి. గత కొన్ని వేల ఏళ్ళ నుంచి ప్రజల మధ్య అసమానతలు, వివక్షను పెంచి పోషిస్తోన్న కుల వ్యవస్థను కీర్తించే ప్రయత్నం జరుగుతున్నది. కుల వ్యవస్థ పునాది కలిగిన హిందూ మతం ప్రాముఖ్యతను చాటి చెప్పడానికి కావాల్సిన ప్రచారం ముమ్మరమైంది. అంతేకాకుండా, ఇతర మతాలు, సాంప్రదాయాలు ప్రజావ్యతిరేకమైనవనే అభిప్రాయం కూడా బలంగా ముందుకు తెస్తున్నారు. అంటే సామాజిక అసమానతలను నిర్మూలించే వైపు కాకుండా, రోజురోజుకీ మరింత పెంచే విధంగా ప్రయాణం సాగుతోంది. అలాగే, ఆర్థికంగా కొన్ని కులాలు, వర్గాలు మాత్రమే బలపడేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. అంటే దీనికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ప్రభుత్వం దృష్టిలో శత్రువులుగానే ఉన్నారు. దీంతో ఎవరినైనా తన శక్తితో ఎగరేసుకుపోగలిగే అస్త్రంగా రెక్కల గుర్రం పెగసస్‌ను ప్రయోగించారు.
ఇక రెండో అంశం తాము చేస్తున్న అక్రమ నిఘాను సమర్థించుకోవడానికి ఒక శత్రువును ఎప్పటికప్పుడు సృష్టించడం. అది టెర్రరిజం కావచ్చు. తీవ్రవాదం కావచ్చు, అతివాదం కావచ్చు, ఇతర హింసాత్మక బూచీలేవైనా కావచ్చు. వాటిని బూచీగా చూపి తమ పబ్బం గడుపుకోవడానికి తమ రాజకీయ శత్రువులను అందులోకి లాగడం. పెగసస్‌ను ప్రవేశపెట్టక ముందే ఇంకా కొన్ని నియంతృత్వ పోకడలను మన ముందుకు తెచ్చిందీ ప్రభుత్వం. అది, పాలనా రంగంలో ఉన్న ప్రజాస్వామ్య విధానాలను పూర్తిగా విస్మరించడం. అదేవిధంగా న్యాయవ్యవస్థలను నిర్వీర్యం చేయడం. దీంతో ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వ్యవస్థలను దాదాపు స్తంభింపచేయడం జరిగింది. జరుగుతోంది.

అంతేకాకుండా, మెజారిటీ వర్గాలను తమ వైపు నిలబెట్టుకోవడానికి అప్పటికే ప్రజల్లో ఉన్న వైరుధ్యాలను, ద్వేషాలను మరింత పెంచి పోషించడం, ఎటువంటి వ్యాఖ్యలకైనా వెనుకాడకపోవడం జరుగుతోంది. ఒక కులాన్ని, మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం సర్వసాధారణమైంది. దీంతో మెజారిటీ వర్గం ప్రజలను సంతోషపెట్టేం దుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడుతున్నారు. అంతేకాకుండా, కొన్ని జాతీయ చిహ్నాలను.. గాంధీ, నెహ్రూ లాంటి జాతీయ నాయకులను అభాసుపాలు చేయడానికి సంకోచించడం లేదు. కొన్ని వర్గాల ప్రజలపైన ముఖ్యంగా దళితులపైన, ముస్లింలపైనా దాడులు చేసి, వాటిని తామే మీడియాలో చిత్రీకరించి మరింత వికృతానందాన్ని పొందుతున్నారు. దీనివల్ల ఆ వర్గాలకు వ్యతిరేకంగా ఉన్న మెజారిటీ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నానికి పూనుకుంటున్నారు. 

దీనితో పాటు, ప్రస్తుతం భారత ప్రజల్లో ఉన్న సాంస్కృతిక వైవిధ్యానికి భిన్నంగా ఏకీకృత వ్యవస్థని ఏర్పాటు చేసుకునేందుకు తమ సొంత పౌరసత్వ విధానాన్ని ప్రవేశపెట్టడానికి పూనుకుంటున్నారు. వీటన్నింటి తోడ్పాటులో తాము ఊహిస్తున్న, ఆశిస్తున్న ఒక వివక్షాపూరితమైన తమదైన దేశాన్ని నిర్మించే లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పెగసస్‌ కూడా, పాక్షికంగా కొనసాగుతున్న రాజ కీయ ప్రజాస్వామ్య హక్కులను సైతం నిరాకరించే ప్రయత్నంలో భాగమే. అయితే పెగసస్‌  ఈ రోజే పుట్టుకొచ్చిన కొత్త దాడి కాదు. ఇది చివరిది కూడా కాదు. భారతీయ సమాజంలో వేళ్ళూనుకొని ఉన్న ఆర్థిక వైరుధ్యాలు, అసమానతలు, వివక్ష కొనసాగినంత కాలం ఈ దేశంలో ఉడుత ఊపులకు సైతం రాజకీయ ప్రజాస్వామ్యం చివురుటాకులా వణికిపోతూనే ఉంటుంది. అందుకే ఈ రోజు మరొక్కసారి, అంబేడ్కర్‌ సూచించిన నిజమైన ప్రజాస్వామ్యం వైపు సమాజాన్ని నడిపించకుండా ఈ చట్టాలు, నిఘా రెక్కల గుర్రాలు ప్రజల మీద ఎక్కి సవారీ చేస్తూనే ఉంటాయి. 

అంబేడ్కర్‌ ప్రజాస్వామ్యం గురించి వివరించిన మాటలను మనం ఇక్కడ స్ఫురణకు తెచ్చుకోవాలి. ‘‘ప్రజాస్వామ్యం ఒక ప్రభుత్వ విధానం, పాలన నుంచి వచ్చేది కాదు. పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా అమలు జరిగేది సంపూర్ణ ప్రజాస్వామ్యం కాదు. సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఉన్న సంబంధాలు ప్రజాస్వామ్య విలువలకు అద్దంపడతాయి’’. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం అనే అంశాలు కీలకమైనవి. ఇందులో స్వేచ్ఛ, సమానత్వం అనే అంశాలు సోదరత్వం అనే భావన మీద ఆధారపడుతూ ఉంటాయనేది అంబేడ్కర్‌ అభిప్రాయం. ప్రజల మధ్య సోదరత్వం లేకుండా, స్వపర భేదాలు కొనసాగినంత కాలం సమానత్వం, స్వేచ్ఛ అనేవి కూడా సంపూర్ణంగా అమలు జరగవు. ఇదే ఈ రోజు భారతదేశ వాస్తవికత. సామాజికంగా కుల వ్యవస్థ బతికి ఉన్నంతకాలం రాజకీయంగా అమలులో ఉన్న సమానత్వం సరిౖయెన ఫలితాలను ఇవ్వదు. అందువల్లనే రాజకీయ పార్టీలు ప్రజల మధ్య ఉండే ఈ భేదాలను తమ అధికారం కోసం చాలా సమర్థవంతంగా వాడుకుంటున్నాయి. 

పైగా, ఇటీవల కాలంలో ఆర్థిక రంగంలో వస్తున్న మార్పులు, పెరుగుతున్న అసమానతలు సమాజాన్ని మరింత అగాధంలోకి నెట్టబోతున్నాయి. ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీలు కొన్ని కార్పొరేట్‌ కంపెనీల ఎదుగుదలకు తోడ్పతున్నాయి. వాటికోసం ప్రజల భూములను, సహజవనరులను ధారాదత్తం చేస్తున్నాయి. దీనిపై తిరుగుబాటు చేస్తున్న ప్రజలు సహజంగానే ప్రభుత్వాలకు దేశ ద్రోహులుగా కనపడతారు. ప్రస్తుత ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వాలు కూడా ఆర్థికాభివృద్ధి పేరుతో ప్రజలను నిరాశ్రయులను చేశాయి. అడవులను స్వాహా చేస్తోన్న కార్పొరేట్‌ కంపెనీలను, అందుకు కొమ్ముగాస్తోన్న ప్రభుత్వాలను ప్రతిఘటిస్తోన్న ఆదివాసులు, అడవి బిడ్డలు రాజద్రోహులవుతున్నారు. అకారణంగా సంవత్సరాల తరబడి జైళ్ళలో మగ్గుతున్నారు. 

వ్యవసాయాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు అప్పజెప్పడానికి చేసిన కుయత్నాల ఫలితమే సుదీర్ఘ రైతాంగ పోరాటానికి దారితీసిందన్నది ఓ కఠోర సత్యం. దేశాన్ని సుసంపన్నంగా నిలిపే సత్తా ఉన్న రైతన్న ప్రభుత్వాల కుట్రలకు గురికావాల్సిన దుఃస్థితి. అంటే ఆర్థిక రంగంలో కొనసాగుతున్న ఈ కుట్రలను ప్రతిఘటిస్తున్న ప్రజలెవరైనా భారత ప్రభుత్వాలకు శత్రువులే. అందుకే వాళ్ళ మీదికి పెగసస్‌ రెక్కల గుర్రాన్ని వదులుతున్నారు. ఈ విషయాలపై రాస్తున్న, మాట్లాడుతున్న రచయితలను, జర్నలిస్టులను, సామాజిక కార్యకర్తలను, రాజ కీయనేతలను రెక్కల గుర్రానికి అప్పజెప్పుతున్నారు. పెగసస్‌ రెక్కల గుర్రం రోగం మాత్రమే. రోగానికి మూలం ఈ దేశ సామాజిక, ఆర్థిక అసమానతలు, వివక్ష, దోపిడీ. పెగసస్‌ మీద నిరసన తెలుపుతున్న మనందరం అంబేడ్కర్‌ చెప్పినట్టు.. ఆర్థిక, సామాజిక రంగాల్లో ప్రజాస్వామ్యం కోసం కూడా పోరాడాల్సిందే తప్ప మరో మార్గం లేదు.


మల్లెపల్లి లక్ష్మయ్య  
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 81063 22077

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top