
న్యూస్ మేకర్
‘ఓట్ల చోరీ’ అనేది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో... పూనమ్ అగర్వాల్ పేరు ప్రస్తావనకు వస్తోంది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన పూనమ్ అగర్వాల్ గత కొన్ని సంవత్సరాలుగా ఓటింగ్ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకల గురించి గొంతెత్తుతోంది. ‘ఎన్నికల ప్రక్రియలో నిజాయితీ, పారదర్శకత ఉండాలి’ అంటున్న పూనమ్ అగర్వాల్ ‘ఇండియా ఇంక్‌డ్: ఎలక్షన్స్ ఇన్ ది వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ’ పేరుతో పుస్తకం రాసింది....
మూడు దశాబ్దాలుగా ఎలక్షన్ కమిషన్‌కు సంబంధించిన వార్తలు రాస్తున్న ఒక జర్నలిస్ట్‌తో ఇటీవల పూనమ్ అగర్వాల్ మాట్లాడినప్పుడు ఆమె నోటి నుంచి వినిపించిన మాట...
‘ఆ రోజుల్లో ఆఫీసులలోకి వెళ్లి అధికారులతో మాట్లాడడం, సమాచారం తీసుకోవడం చాలా సులభంగా ఉండేది. ఇప్పుడు చాలా కష్టమైపోయింది’ ఆ జర్నలిస్ట్ మాట పూనమ్ అగర్వాల్‌ను అంతగా ఆశ్చర్యపరచకపోయి ఉండవచ్చు. ఎందుకంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా పూనమ్ ఎంతోకాలంగా మన దేశ ఎన్నికల ప్రక్రియ... అందులో జరుగుతున్న అవకతవకలపై ప్రత్యేక దృష్టిసారించింది.
జర్నలిజంలో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న పూనమ్ మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ వరకు ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియలో జరిగిన అవకతవకలను వెలికితీసింది. ఈ అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘం మౌనాన్ని విమర్శించింది. పారదర్శకత లేకపోవడాన్ని గురించి ప్రశ్నించింది. పూనమ్ అగర్వాల్ తాజా పుస్తకం ‘ఇండియా ఇంక్‌డ్–ఎలక్షన్స్ ఇన్ ది వరల్డ్స్ లార్జెస్ట్ డెమొక్రసీ’ విస్తృత చర్చకు దారితీసింది.
‘జర్నలిస్ట్‌గా నా అనుభవాలు, ప్రయాణానికి ఈ పుస్తకం అద్దం పడుతుంది. విస్తృత సబ్జెక్ట్ అయిన ఎన్నికల ప్రక్రియపై సమాచారాన్ని అందించడం మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఈ సబ్జెక్ట్‌పై రాయడం అంత సులువైన విషయం ఏమీ కాదు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన విషయాలతో పాటు నా వ్యక్తిగత విషయాలను కూడా ఈ పుస్తకంలో రాశాను. ఎలక్టోరల్ బాండ్స్, ఎలక్షన్ కమిషన్‌పై ఓటర్లకు ఉన్న భ్రమ...ఈ పుస్తకం రాయడానికి ప్రధాన కారణాలు’ అని ‘ఇండియా ఇంక్‌డ్’ పుస్తకం గురించి చెప్పింది పూనమ్.
‘ఇండియా ఇంక్‌డ్’ పుస్తకం కోసం పూనమ్ ఎంతో కసరత్తు చేసింది. మారుమూల పల్లెలో జరిగే ఎన్నికల ప్రక్రియ నుంచి మొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సేన్ ఆధ్వరంలో జరిగిన ఎన్నికల వరకు ఎన్నో విషయాలను అధ్యయనం చేసింది. ఆనాటి ఎన్నికల ప్రక్రియను జాగ్రత్తగా ΄్లాన్ చేసిన సుకుమార్ సేన్ దూరదృష్టి గురించి, ఆయన రూపొందించిన విధానాలను ఇప్పటికీ ఎన్నికల కమిషన్ అనుసరించడం గురించి తన పుస్తకంలో ప్రస్తావించింది పూనమ్. అకాడమిక్‌గా కాకుండా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సమస్త విషయాలను సామాన్య పాఠకులకు కూడా సులభంగా అర్థమయ్యేలా రీతిలో రాయడంలో పూనమ్ అగర్వాల్ నేర్పరి.
ఔట్‌స్టాండింగ్
ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం విభాగంలో రామ్‌నాథ్ గోయెంకా అవార్డ్, సీఎన్‌ఎన్ యంగ్ జర్నలిస్ట్ అవార్డ్, ఔట్‌స్టాండింగ్ ఒరిజినల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం విభాగంలో బీబీసి న్యూస్ అవార్డ్‌లాంటివి అందుకుంది పూనమ్ అగర్వాల్. లోన్ యాప్ స్కామ్‌పై పూనమ్ చేసిన ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ ‘ది ట్రాప్: ఇండియాస్ డెడ్లీయెస్ట్ స్కామ్’కు ఎంతో పేరు వచ్చింది. లండన్‌లోని ప్రతిష్ఠాత్మకమైన ‘సెంటర్ ఫర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం’లో గావిన్ మెక్‌ఫెడియన్ స్మారక ఉపన్యాసం ఇచ్చింది పూనమ్ అగర్వాల్.
మరిన్ని పుస్తకాలు
మన ఎన్నికల ప్రక్రియ గురించి కొన్ని పుస్తకాలు వచ్చాయి. ‘పారదర్శకంగా, నిజాయితీగా జరిగే ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యానికి వెన్నెముక’ అనేది భావితరాలు అర్థం చేసుకోవడానికి నా పుస్తకం ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. ‘ఇది విలువైన పుస్తకం’ అనుకున్నప్పుడు పాఠకులు తాము చదవడమే కాదు తాము చదివిన విషయాలను ఇతరులతో పంచుకుంటారు. పుస్తక రచనకు సంబంధించి నా అభిప్రాయం విషయానికి వస్తే...అందుకు ఎంతో ఓపిక కావాలి. మనం సేకరించిన సమాచారంలోని నిజానిజాల గురించి లోతుగా తెలుసుకోవాలి. పుస్తకం రాయాలనుకున్నప్పుడు మన ఎన్నికల కమిషన్ గురించి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో నాకు తగినంత సమాచారం లభించలేదు. దీంతో ఎంతో మంది నిపుణులతో మాట్లాడాను. భవిష్యత్‌లో కూడా మరెన్నో పుస్తకాలు రాయాలనుకుంటున్నాను.
– పూనమ్ అగర్వాల్