ఆల్‌ ఉమెన్‌ టీమ్‌ ఆకాశమే హద్దు

Women empowerment is essential to make India self-reliant and developed nation - Sakshi

స్వావలంబన

ఆటో మొబైల్‌ రంగంలో మహిళలు పని చేయడం గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. వాటిని కాలదన్ని ఈ రంగంలో అద్భుత విజయాలు సాధించిన మహిళలు ఎందరో ఉన్నారు.
హర్షించదగిన, ఆహ్వానించదగిన పరిణామం ఏమిటంటే ఆటో మొబైల్‌ రంగంలోని దిగ్గజ సంస్థలు స్త్రీ సాధికారత, స్వావలంబనకు పెద్ద పీట వేస్తున్నాయి.
తాజాగా టాటా మోటార్స్‌ అమృత్‌సర్‌లో ‘ఆల్‌–ఉమెన్‌ కార్‌ షోరూమ్‌’ను ప్రారంభించింది...

మహిళా స్వావలంబన లక్ష్యంగా టాటా మోటర్స్‌ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ‘ఆల్‌–ఉమెన్‌ కార్‌ షోరూమ్‌’ ప్రారంభించింది. సెక్యూరిటీ గార్డ్‌ నుంచి జనరల్‌ మేనేజర్‌ వరకు అందరూ మహిళలే. సేల్స్, మార్కెటింగ్, కారు ఫిట్టింగ్, వాషింగ్, మేనేజింగ్‌... ఇలా రకరకాల విభాగాల్లో ఇరవైమంది మహిళలు ఉన్నారు.

‘ఇరవైమందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది తేలిగ్గా జరగలేదు. కష్టపడాల్సి వచ్చింది. మహిళలు ఒక బృందంగా ఒకేచోట పనిచేయడం వల్ల అభిప్రాయాలు పంచుకోవచ్చు. ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవచ్చు. స్వావలంబనను బలోపేతం చేయవచ్చు. నేటి తరం మహిళలు ఇతరులపై ఆధారపడడం కంటే స్వతంత్రంగా ఎదగడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. వృత్తిపరమైన బాధ్యతల్లో మంచి విజయాలు సాధిస్తున్నారు’ అంటోంది షోరూమ్‌ జనరల్‌ మేనేజర్‌ లవ్లీసింగ్‌.

ఆటోమొబైల్‌ రంగంలో లవ్లీసింగ్‌కు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. సేల్స్‌ బృందంలో సభ్యురాలిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించింది లవ్లీసింగ్‌. ఆ రోజుల్లో నగరం మొత్తంలో ఆటో మొబైల్‌ రంగానికి సంబంధించి సేల్స్‌ విభాగంలో పనిచేసిన ఏకైక మహిళ లవ్లీ. ‘సేల్స్‌ విభాగంలో పనిచేస్తున్నాను’ అంటే ఆశ్చర్యంగా చూసేవారు.కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి ‘టీచర్‌ జాబ్‌ చేసుకోవచ్చు కదా’ అని సలహా ఇచ్చేవారు. అయితే అవేమీ తనను ముందుకెళ్లకుండా అడ్డుకోలేకపోయాయి. ‘సేల్స్‌ విభాగంలో పనిచేస్తే పదిమంది పలురకాలుగా అనుకుంటారు’ అనే భయం ఉంది. ఎన్నో అపోహలు ఉన్నాయి. ‘ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావు? అంతమంది మగవాళ్ల మధ్య ఎలా పనిచేస్తున్నావు...’ ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ముందుకు వచ్చేవి. వాటిని పట్టించుకొని ఉంటే సేల్స్‌ విభాగంలో పనిచేసిన వారం రోజుల్లోనే ఉద్యోగాన్ని వదిలి ఇంట్లో కూర్చునేదాన్ని అంటుంది లవ్లీసింగ్‌.

‘ఆటోమొబైల్‌ రంగంలో పనిచేయాలనే ఆసక్తి నాలో మొదట ఉండేది కాదు. దీనికి కారణం... పురుషులు మాత్రమే ఆ రంగంలో ఉంటారు అనుకోవడం. అయితే ఆటోమొబైల్‌ రంగంలో కూడా పురుషులతో సమానంగా మహిళలు తమను తాము నిరూపించుకుంటున్నారు. ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. వారే నాకు స్ఫూర్తి. ఇరవైమంది సభ్యులు ఉన్న బృందంలో చేరడంతో అప్పటివరకు ఉన్న కాస్తో కూస్తో భయాలు పోయాయి. ఎంతో ధైర్యం వచ్చింది. ఉద్యోగంలో చేరినట్లుగా లేదు చిన్న విశ్వవిద్యాలయంలో చేరినట్లుగా ఉంది. ఇక్కడి అనుభవాలే మాకు గొప్ప పాఠాలు’ అంటుంది మార్కెటింగ్‌ విభాగంలో పనిచేస్తున్న సీమ.

27 సంవత్సరాల గుర్మీత్‌ ఆటో మొబైల్‌ రంగంలోకి రావాలనుకోవడానికి ముందు– ‘అంత తేలికైన విషయం కాదు. కార్లు–హెవీ డ్యూటీ ట్రక్స్‌ అసెంబ్లింగ్‌లో మగవాళ్లతో పోటీపడడం కష్టం. ఇండస్ట్రీలో మొదలైన కొత్త డిజిటల్‌ ట్రెండ్‌ను త్వరగా అందుకోవడం ఇంకా కష్టం’లాంటి మాటలు ఎన్నో వినిపించాయి. అయితే అలాంటి మాటలేవీ తనను ఇండస్ట్రీకి రాకుండా అడ్డుకోలేకపోయాయి. ఎంజీ మోటర్స్‌ గత సంవత్సరం గుజరాత్‌లోని వడోదర ప్లాంట్‌లో ‘ఆల్‌–ఉమెన్‌ టీమ్‌’ను మొదలుపెట్టింది. ‘ప్రయోగాలకు, వైవిధ్యానికి ప్రాధాన్యత ఇచ్చే బ్రాండ్‌ ఎంజీ. ఆల్‌–ఉమెన్‌ టీమ్‌ అనేది మహిళలు కష్టపడే తత్వానికి, అంకితభావానికి మేము ఇచ్చే గౌరవం’ అంటున్నాడు ఎంజీ మోటర్‌ ఇండియా ఎండీ రాజీవ్‌ చాబ. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అని పాడుకోనక్కర్లేకుండానే ఆటోమొబైల్‌ రంగంలో మహిళలకు మేలు చేసే మంచికాలం వచ్చింది. దిగ్గజ సంస్థలు ‘ఆల్‌–ఉమెన్‌ టీమ్‌’లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top