చిన్న వయసులోనే అని.. జుట్టు పీక్కుంటే ఏం లాభం, ఇవి తెలుసుకోండి! | Sakshi
Sakshi News home page

చిన్న వయసులోనే అని.. జుట్టు పీక్కుంటే ఏం లాభం, ఇవి తెలుసుకోండి!

Published Wed, Feb 7 2024 3:25 PM

why your hair is turning white check these common causes  - Sakshi

కాస్త వయసు మీద పడ్డాక అంటే దాదాపు 40-50 ఏళ్ల మధ్య  నల్లటి జుట్టు తెల్లగా మారడం సహజమే.  కానీ మారుతున్న జీవనశైలి ఇతర కారణలతో చిన్న వయస్సులోనే వైట్‌ హెయిర్‌ రావడంపెద్ద సమస్యగా మారుతోంది. దీనికి కారణాలేంటి? చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సాధారణంగా చిన్న వయసులోనే,అనుకున్నదానికంటే ముందుగానే జుట్టు మెరిసిపోవడం అనేది  జన్యుపరమైన సమస్యలతో పాటు  అంతర్లీన ఆరోగ్య సమస్యలతో కూడా ముడిపడి ఉంటుంది. హెయిర్ ఫోలికల్స్  కణాల ద్వారా తగినంత మెలనిన్‌ను ఉత్పత్తి చేయనప్పుడు,  జుట్టు రంగు మారిపోతుంది. ఇంకా ఒత్తిడి, హార్మోన్ల మార్పులు లేదా బొల్లి లాంటి చర్మ వ్యాధి  లాంటి  అనేక కారణాలు దీనికి  కారణమవుతాయంటున్నారు.  డెర్మటాలజిస్ట్‌లు

జన్యుపరమైన కారణం: తల్లిదండ్రులులేదా తాతల్లో ఇలానే చిన్న వయసులోనే జుట్టు తెలబడిపోయిందా? ఒక్కసారి పరిశీలించు కోండి. మన శరీరంలోని కొన్ని జన్యువులు మెలనిన్ ఉత్పత్తిని నియంత్రిస్తాయి. ఇది గ్రే హెయిర్‌కు దారితీస్తుంది.

ఒత్తిడి: శరీరంలో ఫ్రీ రాడికల్స్ ,యాంటీఆక్సిడెంట్ల మధ్య అసమతుల్యత ఉన్నప్పుడు ఆక్సిడేటివ్‌ ఒత్తిడి ఏర్పడుతుంది. కాలుష్యం,యూవీ రేడియేషన్ , అనారోగ్యకరమైన ఆహారం వంటి బాహ్య కారకాలుదీనికి కారణం. ఈ ఒత్తిడి జుట్టు రంగుకు కారణమైన మెలనోసైట్‌లను దెబ్బతీస్తుందని  వైద్యులు చెబుతున్నారు.

విటమిన్ లోపాలు: అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లోపం కూడా మరో ముఖ్య కారణం. ముఖ్యంగా విటమిన్ B12,ఐరన్‌,, రాగి, జింక్ తగినంతగా తీసుకోకపోవడం వల్ల జుట్టు తెల్లబడిపోతాయి. ఈ పోషకాలు మెలనిన్ ఉత్పత్తిలోనూ,  హెయిర్ ఫోలికల్స్ ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

హార్మోన్లు: శరీరంలో హార్మోన్ల మార్పులు, ముఖ్యంగా యుక్తవయస్సు, గర్భధారణ లేదా బహిష్టు సమయంలో జుట్టును ప్రభావితం చేసే అవకాశం ఉంది. మెలనోసైట్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (MSH) , కార్టిసాల్ వంటి హార్మోన్లలో హెచ్చుతగ్గులు తెల్ల జుట్టుకు దోహదం చేస్తాయి.

దీర్ఘకాలిక ఒత్తిడి: ఒత్తిడికి ఎక్కువ కాలం గురికావడం ఒత్తిడి హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తుంది, జుట్టు రంగును మాత్రమే కాదు వివిధ శారీరక విధులను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక లేదా అధిక స్థాయి ఒత్తిడి మెలనోసైట్‌లను ప్రభావితం చేస్తుంది. 

ధూమపానం: వివిధ ఆరోగ్య సమస్యలకారణమై, ఆరోగ్యాన్ని పాడు చేసే ధూమపానంవల్ల  శరీరంలోకి హానికరమైన టాక్సిన్స్‌ చేరతాయి. ఫలితంగా మెలనిన్ ఉత్పత్తితో సహా సహజ ప్రక్రియలకు అంతరాయం కలిగిస్తుంది.

బొల్లి: ఈ చర్మ వ్యాధి సోకిన వారిలో  రోగనిరోధక వ్యవస్థ వర్ణద్రవ్యం కణాలపై దాడి చేస్తుంది. ప్రధానంగా చర్మం,జుట్టు రంగును కూడా ప్రభావితం చేస్తుంది. 

థైరాయిడ్ : థైరాయిడ్  (హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం) ఉన్నవారిలో కూడా చిన్న వయసులోనే గ్రే హెయిర్‌ వచ్చే అవకాశః ఉంది.  రక్తహీనత ,కీమోథెరపీ, ఇతర కొన్ని మందుల వల్ల కూడా  చిన్న వయస్సులోనే తెల్ల జుట్టుకు దోహదం చేస్తుంది.

కెమికల్‌ ప్రొడక్ట్స్‌: రసాయనాలతోకూడిన బ్లీచ్ లేదా కలరింగ్ ఏజెంట్లను ఉపయోగించడం ,హెయిర్ ట్రీట్‌మెంట్స్‌ ఎక్కువైతే  హెయిర్ షాఫ్ట్ దెబ్బతింటుంది . మెలనోసైట్‌లను ప్రభావితం చేయవచ్చు. 

ఆటో ఇమ్యూన్ డిజార్డర్: రోగనిరోధక వ్యవస్థను ప్రభావితంచేసే ఆటోఇమ్యూన్ వ్యాధులు, లోపాలవల్ల కూడా తెల్లజుట్టు తొందరగా వచ్చేస్తుంది. అలోపేసియా అరేటా లాంటి డిజార్డర్‌ కారణంగా  జుట్టు విపరీతంగా  రాలిపోవడంతో పాటు  తెల్ల జుట్టు, ఇంకా  పిగ్మెంటేషన్‌లో మార్పులు వస్తాయి. 

కాలుష్యం: వాయు, ఇంధన కాలుష్యం లాంటి పర్యావరణ కాలుష్య కారకాలు జుట్టు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. ఈ కాలుష్య కారకాలు ఫ్రీ రాడికల్స్‌ను ఉత్పత్తి చేస్తాయి, ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ పెరిగిపోతుంది. ఫలితంగా చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తుంది.

నోట్‌:  ఈ కారణాల్లో  మీరు ఏ కేటగిరీలో ఉన్నారో, లోపాలేంటో గమనించండి. వీలైతే పరిష్కరించుకోండి.  దీంతో పాటు చక్కటి ఆహారం, నిద్ర, క్రమం తప్పని వ్యాయామం లాంటి నిబంధనలు పాటించండి. అదీ కానపుడు.. ఇపుడు గ్రే హెయిర్‌  కూడా ఒక ఫ్యాషనోయ్‌... అనుకుంటూ  ముందుకుసాగిపోండి జాలీగా..!

Advertisement
 
Advertisement
 
Advertisement