
విటమిన్ డి అనేది ఎంత ప్రాముఖ్యమైనదో తెలిసిందే. దీని లోపం వల్ల శక్తిస్థాయిలు క్షీణించి అలసటకు దారితీస్తుంది. రోగనిరోధకవ్యవస్థ పనితీరుకు కీలకమైనది ఇదే. అందువల్ల ఈ విటమిన్ లోపిస్తే అంటువ్యాధులు, అనారోగ్యాల బారినపడే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు పరిశోధనలు సైతం ఈ విటమిన్ లోపిస్తే..ఆందోళన, డిప్రెషన్‌తో సహా మానసిక రుగ్మతలకు దారితీసే ప్రమాదం ఉందని వెల్లడించాయి కూడా. అంత ప్రాముఖ్యత ఉన్న విటమిన్ డికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
ఇది కేవలం విటమిన్ మాత్రమే కాదు. కాల్షియం శోషణ, ఎముకల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న కాల్సిట్రియోల్ అనే హార్మోన్‌కు పూర్వగామిగా పిలుస్తారు.
ఎముకల బలానికి ప్రసిద్ధి చెందినప్పటికీ..ఇది కండరాల పనితీరు, రోగ నిరోధక శక్తి, మానసిక ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది.
ఈ విటమిన్ సూర్యరశ్మిలో పుష్కలంగా దొరుకుతుంది. సహజంగా సులభంగా పొందగలిగే విటమిన్ ఇది. అంతేకాదండోయ్ సూర్యకాంతి నుంచి వచ్చే యూవీబీ కిరణాలకు గురైనప్పుడు..శరీరం ఆటోమేటిగ్గా 'డి'ని ఉత్పత్తి చేస్తుందట. అందువల్ల ఆరోగ్యం కోసం బహిరంగ కార్యకలాపాలు తప్పనిసరి అని చెబుతున్నారు నిపుణులు.
అలాగే ఆహారంలో కూడా ఉంటుంది ఈ విటమిన్ డి. ముఖ్యంగా కొవ్వు చేపలు, గుడ్డు సొనలు, సూర్యరశ్మికి గురయ్యే పుట్టగొడుగులు, పాల ఉత్పత్తుల్లోనూ ఉంటుందట.
విచిత్రం ఏంటంటే ఇంతలా సమృద్ధిగా సూర్యరశ్మి భారత్‌లో ఉన్నప్పటికీ..ప్రతి ఐదు మంది భారతీయులలో ఒకరు విటమిన్ డీ లోపంతో బాధపడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.
2023 నివేదికల ప్రకారం..భారతదేశ జనాభాలో దాదాపు 76% మంది ఈ విటమిన్ లోపంతోనే బాధపడుతున్నారుట. అందులో పురుషులు 79% మంది కాగా, స్త్రీలు 75% కావడం గమనార్హం.
అలాగే 84% మంది పాతికేళ్ల వయస్సు కంటే తక్కువగా ఉన్న యువతే ఈ విటమిన్ లోపంతో బాధపడుతున్నట్లు నివేదిక పేర్కొంది.
ముఖ్యంగా వదోదర, సూరత్, జైపూర్, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఈ విటమిన్ లోపంతో బాధపడుతున్నవారి సంఖ్య ఎక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి.
(చదవండి: ఒర్రీ వెయిట్‌లాస్ సీక్రెట్: వాంతులు చేసుకుంటూ బరువు తగ్గడమా..?)