షడ్రుచుల సంగమం..! | Ugadi Celebration Organized by Sakshi on March 19 | Sakshi
Sakshi News home page

షడ్రుచుల సంగమం..! సాక్షి ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

Mar 20 2026 10:23 AM | Updated on Mar 20 2026 10:54 AM

Ugadi Celebration Organized by Sakshi on March 19

తెలుగు సంవత్సరాది వెలుగులు విరజిమ్మింది. ఆహ్లాదభరిత వేదికపై ఆత్మీయ ఆహ్వానం అందుకుంది. మూసాపేట రెయిన్‌ బో విస్టాస్‌ రాక్‌ గార్డెన్‌ ఫేజ్‌–2లో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం ‘ఉగాది’ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. అధునాతన నగరంలో అచ్చమైన పల్లె వాతావరణాన్ని తలపించేలా సంప్రదాయ దుస్తులతో రెయిన్‌బో వాసులు పాల్గొనడం, షడ్రుచులతో తయారు చేసిన ఉగాది పచ్చడిని ఆస్వాదించడం కనువిందు చేసింది. 

లలితా, విష్ణు సహస్ర నామ పారాయణలతో మొదలైన ఈ వేడుకలు జ్యోతి ప్రజ్వలన, పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉగాది పచ్చడి ప్రసాదం, బొబ్బట్లు, పులిహోరాల పంపిణీతో పూర్తయ్యాయి. లలితా విష్ణు సహస్ర నామ పారాయణంతో పాటు భక్తి గీతాలాపనతో ఉగాది వేడుక ప్రారభమైంది. 

సుమారు 450 మంది లలితా విష్ణు సహస్ర నామ పారాయణం చేయడంతో పాటు, శ్లోకాలను ఆలపించి ఆధ్యాత్మిక పరిమళాలు అందించారు. గ్రూపు కో–ఆర్డినేటర్‌ వాణి ఆధ్వర్యంలో సహస్ర నామ పారాయణం జరిగింది. 
తెలుగులో ఆడిపాడిన చిన్నారులు.. 

ఆధునిక, కార్పొరేట్‌ పాఠశాలల్లో చదువుకునే చిన్నారులకు తెలుగు రుచిని చూపిస్తూ తెలుగుదనం ఉట్టిపడేలా స్వచ్ఛమైన తెలుగులో ‘లేవండిరా ముందుగా ఈ రోజే ఉగాది పండుగ’ అంటూ ఆలపించిన పాట అహూతులను అలరించింది. రామలక్ష్మి ఆమె విద్యార్థుల బృందం ఆలపించిన పాట అతిథులను ఆకట్టుకుంది. పాటలోనే ఉగాది విశిష్టత తెలిపే విధంగా చక్కగా ఉందని అతిథులు ప్రశంసించారు.

పరాభవం నుంచి ప్రాభవంలోకి.. 
ముఖ్య అతిథి, శృంగేరి శారదా పీఠం ఆస్థాన పౌరాణికులు డాక్టర్‌ బాచంపల్లి సంతోష్‌ కుమార్‌ శాస్త్రి పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ధర్మమార్గంలో నడిచే వారికి ప్రాభవం అని, అధర్మంలో నడిచే వారికి పరాభవమని, పరాభవం నుంచి ప్రాభవంలోకి రావటమే పరాభవ నామ సంవత్సరమని వివరించారు. మనల్ని అనుగ్రహించి ఆధ్యాతి్మకతకు, సత్య మార్గాన్ని చూపించే సంవత్సరమే పరాభవ నామ సంవత్సరమన్నారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రీల్స్‌ వదిలిపెట్టి రియాలిటీలోకి రావాలని తెలిపేదే పరాభవం అని అన్నారు. 

ఈ సంవత్సరం శుభాలు ఎక్కువగా జరుగుతాయని, మిగిలిన ప్రపంచంలో యుద్ధ భయం ఉంటుంది కానీ, భారత దేశానికి  ఉండదన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని, పశు, వృక్ష సంపద పెరుగుతుందని వివరించారు. పాలకుల్లో చికాకులు పెరుగుతాయి, వ్యాపారస్తులకు బాగుంటుంది. కొత్త పెట్టుబడి పెట్టవద్దని సూచించారు. అప్పులు చేసి భూములు కొనుగోలు చేయవద్దని, బంగారం, వెండి, రత్నాలు కొనుగోలు చేసే బదులు, కరెన్సీ నోట్లు ఇంట్లో ఉంటేనే మంచిదన్నారు. 

ఆర్థిక క్రమశిక్షణ ఉన్నవారికి పరాభవం ఉండబోదన్నారు. ఈ సీజన్‌లో 50 డిగ్రీలకుపైగా వేడి పెరుగుతుందని, అగ్ని ప్రమాదాలు, రోగాలు, కల్తీ ఎక్కువగా జరుగుతాయన్నారు. ఈ సంవత్సరంలో అధిక జ్యేష్ట మాసంతో కలిపి మొత్తం 13 నెలలు ఉంటాయన్నారు. పంచాంగం అంటే విజ్ఞాన భాండాగారం, కొందరు చేసిన తప్పులకు జ్యోతిష్కులను నిందించవచ్చు కానీ, శా్రస్తాన్ని అపహాస్యం చేయవద్దని సూచించారు. ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలన్నారు.  

అనంతరం సాహితీవేత్త ప్రముఖ తెలుగు ప్రొఫెసర్‌ డాక్టర్‌ పాతూరి నాగరాజు సంవత్సర పురుషోపాసన అనే అంశంపై ప్రసంగించారు. ప్రకృతిలో వచ్చే మార్పు, ప్రకృతితో కలిసి జరుపుకునేదే ఉగాది అని పేర్కొన్నారు. కాలచక్రాన్ని అనుసరించాలని సూచించారు. ఉగాది పండుగ, సంవత్సర పురుషోపాసన గురించి క్లుప్తంగా వివరించారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో రెయిన్‌ బో విస్టాస్‌ రాక్‌గార్డెన్‌ అధ్యక్షులు టీఎస్‌ రెడ్డి, ఉపాధ్యక్షులు కృపాకర్‌రెడ్డి, తదితర మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యులు, అపార్ట్‌మెంట్‌ వాసులు పాల్గొన్నారు.

అమోఘం.. రుచుల మిశ్రమం..
ఈ వేడుకల్లో షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడిని కుండలలో తయారు చేశారు. అపార్ట్‌ మెంట్‌ వాసులు వాణి, జ్యోతి, నిర్మల, అపర్ణ, మాళవిక ఉగాది పచ్చడిని తయారు చేసి అందరికీ పంపిణీ చేశారు. దీంతో పాటు బొబ్బట్లు, పులిహోర ప్రసాదంగా అందజేశారు. 

తీపి, కారం, పులుపు, ఉప్పు, చేదు, వగరు ఉన్నట్లుగానే కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు అన్నీ కలిస్తేనే పరిపూర్ణ జీవితం అవుతుందని ఉగాది పచ్చడి పరమార్థాన్ని మననం చేసుకున్నారు. పిజ్జాలు, బర్గర్ల మధ్య నివసించే నగరవాసులకు షడ్రుచుల పచ్చడి, బొబ్బట్లు సిసలైన రుచులను పంచాయి.  

(చదవండి: 'ఉగాది' అంతరార్ధం? ఆ కారణంగానే ఈ పండుగ జరుపుకుంటున్నామా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement