వీధిలో విజ్ఞాన వెలుగులు

Thirty Years Old Woman Sets Up Free Library In Rural Arunachal Pradesh - Sakshi

ఒక మంచిపుస్తకం చదివితే మంచి స్నేహితుడితో సంభాషించినట్టే అంటారు పెద్దలు. ఒక మంచిపుస్తకాన్ని పరిచయం చేస్తే మంచి స్నేహితుడిని పరిచయం చేసినట్టే అంటుంది గురుంగ్‌ మీనా. అరుణాచల్‌ ప్రదేశ్‌లో మొట్టమొదటి ‘వీధి గ్రంథాలయాన్ని’ ప్రారంభించి, యువతకు మంచిపుస్తకాలు చదివే అవకాశాన్ని ఇస్తుంది. ఎంతోమందిలో పఠనాసక్తిని పెంచుతోంది.  అరుణాచల్‌ప్రదేశ్‌లోని పాపమ్‌ పరే రాష్ట్రంలోని నిర్జులిలో మీనా లైబ్రరీని ప్రారంభించింది. మిజోరాం ‘మినీ వేసైడ్‌ లైబ్రరీ’ నుండి ఈ వీధి గ్రంథాలయ ఏర్పాటుకు ప్రేరణ పొందింది. పాఠకులకు ఇక్కడ కూర్చుని చదవడానికి కూడా ఏర్పాట్లు చేసింది. మీనా గురుంగ్‌ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ఆమె మాట్లాడుతూ–  ‘ఈ వీధి గ్రంథాలయం ఏర్పాటు చేసిన 10 రోజులకే పాఠకుల నుంచి మంచి స్పందన వస్తోంది. పదిరోజులుగా ఇక్కడ తాళాలు లేకుండానే లైబ్రరీ నడిచింది. కానీ, ఇక్కడ నుంచి ఒక్క పుస్తకాన్ని కూడా ఎవరూ దొంగిలించలేదు. ఒకవేళ ఈ పుస్తకాలు ఎవరైనా దొంగిలించినా నేను సంతోషంగా ఉంటాను. ఎందుకంటే ఎవరు దొంగిలించినా అవి వాళ్లు చదవడానికి ఉపయోగిస్తారు’ అని ఆనందంగా చెబుతుంది మీనా.

వయోజన విద్య..
గురుంగ్‌ మీనా బెంగళూరు నుండి ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసింది. మహిళలు, వితంతువుల మంచికోసం పనిచేయాలని ఆమె అభిలాష. అలాగే మీనా వయోజన విద్యను ప్రోత్సహిస్తుంది. బాల్యవివాహానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ వీధి లైబ్రరీ నుండి పుస్తకాలు ఎక్కువగా చదివేవారిలో మహిళలు, యువకులు. వీధి గ్రంథాలయం కింద బహిరంగ ప్రదేశంలో కూర్చోవడం టీనేజర్లు ఇష్టపడటం లేదు. అందుకని వారికి ఈ పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లడానికి, తిరిగి ఇవ్వడానికి ఒక రిజిస్టర్‌ను ఉపయోగిస్తుంది.

యువతలో ఆసక్తి..
ఆమె తన ప్రయత్నాల ద్వారా టీనేజర్లలో చదువు పట్ల మక్కువ పెంచుకోవాలనుకుంటుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ప్రతి చిన్న, పెద్దనగరాలలో ఇలాంటి లైబ్రరీలను తెరవాలని మీనా తపన పడుతోంది. ఆమె ప్రయత్నం చాలామందిలో మార్పు తీసుకువస్తోంది.  చాలామంది తమ ఇళ్లలో ఉన్న పుస్తకాలను ఈ వీధి లైబ్రరీలో ఉంచడానికి ఇస్తున్నారు. కొందరు పుస్తకాలను కొనడానికి  మీనాకు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ‘నా ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకుని, ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఇలాంటి వీధి గ్రంథాలయాన్ని ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను‘ అని మీనా చెబుతోంది. మంచిపని ఎవరైనా, ఎక్కడైనా చేయచ్చు. అది ఒక్కపుస్తకంతో కూడా మొదలుపెట్టవచ్చు అని నిరూపిస్తుంది మీనా. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top