ఎకరం భూమి ఉందా? మేకలు, కోళ్లు, ముత్యాలు, పుట్టగొడుగులు.. ఇలా చేస్తే రోజుకు రూ. 1500 ఆదాయం.. ఇంకా..

Suryapet Couple Integrated Organic Farming Earn Approx 4 Lakh Per Acre - Sakshi

ప్రతి రోజూ రూ. 1,500 ఆదాయాన్నందించే సమీకృత సేద్యం

ఎకరంన్నరలో ఏకకాలంలో ఎన్నో పంటలు, మేకలు, కోళ్లు, ముత్యాలు, పుట్టగొడుగుల పెంపకం

ఏడాదికి రూ. 4 లక్షలకు పైగా నికరాదాయం

మార్గదర్శకంగా నిలుస్తున్న శేషు, లక్ష్మీప్రియ దంపతులు

ఏదో ఒక పంట సాగుపై ఆధారపడి జీవించే రైతు కుటుంబాలు ఆదాయపరంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతుంటాయి. ముఖ్యంగా, ఎకరం, రెండెకరాల భూమి మాత్రమే కలిగి ఉన్న చిన్న, సన్నకారు రైతు  కుటుంబాలు ఏక పంటల సాగుతో తగినంత ఆదాయం పొందలేక అప్పుల పాలవుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ దుస్థితి నుంచి రైతులు బయటపడాలంటే సమీకృత సేంద్రియ వ్యవసాయం ఒక్కటే మార్గం.

సమీకృత సేద్యం అంటే.. చిన్న కమతం నుంచి కూడా ఒకటికి నాలుగు విధాలుగా ఆదాయం వచ్చే విధంగా కృషి చెయ్యటం అన్నమాట. నిరంతర ఆదాయం వచ్చేలా సమీకృత సేంద్రియ సేద్యం చేపట్టి.. నిరంతరం ఆదాయం పొందే మార్గాలను ఆచరించి చూపుతున్నారు సూర్యాపేట జిల్లాకు చెందిన రైతు దంపతులు వాసికర్ల శేషుకుమార్, లక్ష్మీప్రియ. 

ఎమ్మే చదువుకొని
రెక్కల కష్టాన్ని నమ్ముకునే చిన్న, సన్నకారు రైతు దంపతులకు ఏడాది పొడవునా అనుదినం ఆదాయాన్ని అందించే విధంగా సమీకృత సేంద్రియ సేద్య పద్ధతులను విజయవంతంగా ఆచరించి చూపిస్తున్నారు వాసికర్ల శేషుకుమార్‌(53), లక్ష్మీప్రియ దంపతులు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన శేషుకుమార్‌(53) ఎమ్మే చదువుకొని గత 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు.

అభ్యుదయ భావాలు కలిగిన ఆయన 25 ఎకరాల్లో డ్రమ్‌సీడర్, వెద పద్ధతుల్లో వరి పండిస్తున్నారు. నాగార్జునసాగర్‌ కాల్వ పక్కనే పొలం ఉండటంతో సాగు నీటికి దిగులు లేదు. వరి సాగు నష్టదాయకంగా పరిణమిస్తున్న నేపథ్యంలో వరికి బదులుగా.. కాయకష్టం చేసే రైతు కుటుంబాలకు రోజూ ఆదాయాన్నిచ్చే సమీకృత సేంద్రియ వ్యవసాయ నమూనా వైపు ఏడాదిన్నర క్రితం దృష్టి సారించారు.

నాలుగు రకాలుగా నిరంతరం ఆదాయం పొందటమే
ఎకరంన్నర విస్తీర్ణంలో సమీకృత సేంద్రియ సేద్యం చేపట్టారు. ఈ క్షేత్రం ప్రదర్శన క్షేత్రంగా, రైతులకు శిక్షణా కేంద్రంగా మారింది. శేషు అనుసరిస్తున్న సమీకృత సేంద్రియ సేద్య నమూనా రైతులను ఆకర్షిస్తోంది.

కూరగాయలు, పశుగ్రాస పంటలతో పాటు దీర్ఘకాలిక పండ్ల చెట్లను పూర్తి సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. దీనితో పాటు.. మేకలు గొర్రెలు, నాటుకోళ్లు, పుట్టగొడుగులు, ముత్యాల పెంపకాన్ని చేపట్టి ఒకటికి నాలుగు రకాలుగా నిరంతరం ఆదాయం పొందటమే ఈ నమూనాలో ప్రత్యేకత.

5 వేల ఆల్‌చిప్పల్లో ముత్యాల సాగు
ఎకరంన్నరలో మొదట గొర్రెలు, మేకలు పెంచేందుకు ప్రత్యేకంగా ఎలివేటెడ్‌ షెడ్‌ను రూ. 5 లక్షల ఖర్చుతో నిర్మించారు. షెడ్‌ పైఅంతస్థులో మేకలు, గొర్రెలు పెరుగుతూ ఉంటే.. షెడ్‌ కింద కొంత భాగంలో నాటు కోళ్ళ పెంపకకానికి శ్రీకారం చుట్టారు.

షెడ్‌ కింద మిగతా భాగంలో ఒక డార్క్‌ రూమ్‌ను నిర్మించి పాల పుట్టగొడుగుల పెంపకానికి ఉపయోగిస్తున్నారు. 3 సిమెంటు ట్యాంకులు నిర్మించి స్థానికంగా సేకరించిన 5 వేల ఆల్‌చిప్పల్లో 3 నెలల క్రితం ముత్యాల సాగు ప్రారంభించారు. 

వంగ, టమాటో, మిర్చి, బోడ కాకర.. ఇంకా..
ఈ సమీకృత వ్యవసాయం క్షేత్రం చుట్టూ ప్రత్యేకంగా కంచె ఏర్పాటు చేశారు. చుట్టూతా కొబ్బరి, డ్రాగన్‌ఫ్రూట్‌ తదితర దీర్ఘకాలిక పండ్ల మొక్కలు నాటారు.  ప్లాస్టిక్‌ షీట్‌తో మల్చింగ్‌ చేసి.. బోడ కాకర, బీర, సొర, కాకర సాగు చేపట్టారు. వంగ, టమాటో, మిర్చి, బోడ కాకర, బీర, సొర, నేతి బీర, కాకర, పొట్ల, చిక్కుడు, మునగ, బంతి, గులాబీ తదితర రకాల పంటల సాగు చేపట్టారు.

పశువుల కోసం నేపియర్, దశరధ గడ్డి, మొక్కజొన్న గడ్డిని పెంచుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడా చోటు వృథా కాకుండా అధిక సాంద్రతలో అనేక పంటలు, పండ్ల మొక్కలు నాటారు. ఈ క్షేత్రంలో ఎలాంటి రసాయనాలను ఉపయోగించటం లేదు.

ఒకటికి నాలుగు దారుల్లో ఆదాయం పొందే సాగు పద్ధతిపై చిన్న, సన్నకారు రైతులు, మహిళలకు స్ఫూర్తినిస్తున్న శేషుకుమార్‌ దంపతులు ధన్యులు.  – మొలుగూరి గోపి, సాక్షి, నడిగూడెం, సూర్యాపేట జిల్లా

చిన్న రైతులు నిత్యం ఆదాయం పొందాలి
వరి పంట సాగులో పెట్టుబడులు బాగా పెరిగాయి. కూలీల కొరత ఇబ్బందిగా మారింది. దీంతో నిత్యం ఆదాయం పొందే విధంగా ఈ సమీకృత వ్యవసాయంపై ఆసక్తి కలిగింది. తక్కువ భూమిలో విభిన్న రకాల పంటల సాగు చేపట్టాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికతో ముందుకువెళ్తున్నాం.
– వాసికర్ల లక్ష్మీప్రియ, సమీకృత సేంద్రియ మహిళా రైతు, సిరిపురం, సూర్యాపేట జిల్లా 

సులువుగా సేంద్రియ పుట్టగొడుగుల పెంపకం
సమీకృత వ్యయసాయ క్షేత్రంలో షెడ్డులో సేంద్రియ పద్ధతుల్లో పాల పుట్టగొడుగుల పెంపకం చేపట్టారు. వరిగడ్డి ముక్కలను, మట్టిని ప్రత్యేక పద్ధతుల్లో శుద్ధి చేసి, పుట్టగొడుగుల పెంపకానికి పాలిథిన్‌ బ్యాగ్‌లను సిద్ధం చేస్తారు. ఈ ప్రక్రియ అంతా పరిశుద్ధమైన 27 డిగ్రీల వాతావరణంలో గాలి, వెల్తురు తగలని చీకటి గదిలో జరుగుతుంది.

బ్యాగ్‌లలో నింపిన గడ్డిపై మైసీలియం అనే శిలీంధ్రం అభివృద్ధి చెందిన తర్వాత బ్యాగ్‌లను మామూలు గదిలోకి మార్చుతారు. వారం తర్వాత నుంచి పుట్టగొడుగుల దిగుబడి వస్తుంది. వరిగడ్డి ముక్కలను స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ డ్రమ్స్‌ సహాయంతో ఆవిరి ద్వారా శుద్ధి చేసే ప్రత్యేక పద్ధతిని శేషు అనుసరిస్తున్నారు.

దీని వల్ల గడ్డి వెంటనే తడి ఆరిపోతుందన్నారు. ఈ విధంగా సేంద్రియ పద్ధతిలో పుట్టగొడుగుల పెంపకం సులభతరమైందని శేషు చెప్పారు. 

ముత్యాల సాగును ఒక్క రోజులో నేర్చుకోవచ్చు
ఎకరంన్నరలో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్న శేషుకుమార్‌ దంపతులు ప్రత్యేక షెడ్‌లో మూడు సిమెంటు ట్యాంకులను నిర్మించి ముత్యాల సాగు చేపట్టారు. దేవతా రూపాల్లో డిజైనర్‌ ముత్యాలైతే 14 నెలల్లో, ఎం.ఓ.పి. న్యూక్లియస్‌ల ద్వారా గుండ్రటి ముత్యాలైతే 18 నెలల్లో దిగుబడి వస్తుందన్నారు.

ఒక ఆల్‌చిప్పకు రెండు ముత్యాలు వస్తాయి. నాణ్యతను బట్టి ధర ఉంటుంది. సగటున ధర రూ. 150–200 ఉంటుంది. ఒక రోజు శిక్షణతో మహిళలు కూడా ముత్యాల సాగును నేర్చుకోవచ్చు. 

చిన్న రైతులకు దారి చూపాలని..
భూమి తక్కువగా ఉండే చిన్న, సన్నకారు రైతు దంపతులు ఏదో ఒకే పంట సాగుపై ఆధారపడితే తగినంత ఆదాయం రాదు. సమీకృత సేంద్రియ సాగు చేపడితే రోజువారీగా మంచి ఆదాయం పొందే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అందుకని, ఎకరంన్నర పొలంలో ఈ క్షేత్రాన్ని రూపొందించాం.

ఎకరంన్నర భూమిలో భార్య, భర్త స్వయంకృషి చేస్తే అన్ని ఖర్చులూ పోను రూ. 4 లక్షలకు పైగా నికరాదాయం వస్తోంది. ఈ సందేశం రైతులందరికీ తెలియజెప్పాలనేదే మా తపన. రోజుకు రూ.1,500 ఆదాయం వస్తున్నది. రెండు వేలకు పెంచాలనేది లక్ష్యం. ప్రతి రైతూ ముందుకు రావాలి. ప్రభుత్వం అవగాహన కల్పించాలి.
– వాసికర్ల శేషుకుమార్‌ (91824 06310), సమీకృత సేంద్రియ రైతు, సిరిపురం, సూర్యాపేట జిల్లా

చదవండి: నివాస ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాల్లో కూరగాయల సాగు.. నగరంలో కిచెన్‌ గార్డెనింగ్‌ ప్రయోజనాలివే!
70  ఎకరాలు 30 పంటలు.. హైదరాబాద్‌ నగరానికి ఏడాది పొడవునా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top