స్త్రీ స్వాతంత్య్రానికి మగాళ్లు ఓకే అనాలా?

Special Story About Gunjan Saxena Movie In Family - Sakshi

దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. స్త్రీకి స్వాతంత్య్రం వచ్చిందా? కలలు కనడానికి. కెరీర్‌ను నిర్మించుకోవడానికి. పంజరాలను బద్దలు కొట్టడానికి. స్వేచ్ఛాభావనలు వికసించడానికి. నిరోధాల బెదురు లేకుండా జీవించడానికి. వీటన్నింటి కోసం మగాళ్ల అనుమతికి ఎదురుచూస్తూ ఉండాలా? మగాళ్ల పర్మిషన్‌ కావాలా? అక్కర్లేదు అని చెప్పే స్ఫూర్తిదాతలు చాలామంది ఉన్నారు. గుంజన్‌ సక్సెనా అలాంటి స్ఫూర్తిదాత. ఆమెపై వచ్చిన సినిమా ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్త్రీలకు అందిన కానుక.

‘అన్నయ్యా... పెద్దయ్యాక నేను పైలెట్‌ అవుతా’ ‘పైలెట్‌ అవుతావా? ఇదిగో ఈ గిన్నె పట్టుకో. నువ్వు చేయాల్సిన పని కూర వడ్డించమంటారా? పప్పు వడ్డించమంటారా అని అడగడమే. ముందు అది నేర్చుకో’ చిన్నప్పటి నుంచి తెలుసో తెలియకో మగపిల్లల బుర్రల్లో ఎక్కించే భావజాలం ఇది. పెద్దయ్యాక ఇది మగభావజాలం అవుతుంది. సమాజ భావజాలం అవుతుంది. చివరకు దేశభావజాలంగా మారి స్త్రీలపై పెత్తనం చలాయిస్తుంది. ఆడపిల్లలు విమానం ఎగరేయకూడదా? రైట్‌బ్రదర్స్‌ విమానాన్ని పూర్తిస్థాయిలో కనిపెట్టినప్పుడు దాని యోక్‌ (కంట్రోల్‌ వీల్‌) కేవలం పురుషులను ఉద్దేశించే తయారు చేసి ఉంటారా? పదేళ్ల బాలికగా గుంజన్‌ సక్సెనా పెద్దయ్యి పైలెట్‌ అవ్వాలి అనుకున్నప్పుడు సోదరుడు ప్రదర్శించిన హేళనను తండ్రి ఖండిస్తాడు. ‘విమానాన్ని స్త్రీ ఎగరేసినా పురుషుడు ఎగరేసినా ఎగరేసేవారిని పైలెట్‌ అనే అంటారు. విమానానికి ఈ వ్యత్యాసం లేనప్పుడు మనమెందుకు వ్యత్యాసం పాటించడం?’ అంటాడు. నిజజీవితంలో గుంజన్‌ సక్సెనా కథకు, సినిమాలో గుంజన్‌ సక్సెనా కథకు ఇక్కడి నుంచే మొదలు.
నిజం కథ
గుంజన్‌ సక్సెనా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయిట్‌ లెఫ్టినెంట్‌గా విశేష సేవలందించిన తొలి మహిళా పైలెట్‌లలో ఒకరు. లక్నోకు చెందిన గుంజన్‌ ఢిల్లీలో చదువుకుంది. 1994లో తొలిసారి మహిళా ట్రైనీస్‌కు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ప్రవేశం కల్పించినప్పుడు 25 మంది బ్యాచ్‌లో ఒకరిగా ఎంపికైంది. ట్రయినింగ్‌ పూర్తయ్యాక ఉధమ్‌పూర్‌ (జమ్ము–కాశ్మీర్‌) ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌కు తదుపరి శిక్షణకు వస్తుంది. అక్కడ ఆమెకు అంతవరకూ అలవాటై ఉన్న పురుషావరణ ధోరణిలో అడ్జెస్ట్‌ అవడానికి టైమ్‌ పడుతుంది. నిజం చెప్పాలంటే అంతవరకూ అక్కడకు రాని మహిళలను ఎలా అర్థం చేసుకోవాలో వారితో ఎలా వ్యవహరించాలో పురుష ఆఫీసర్లకు తెలియదు.

చివరకు గుంజన్‌ సక్సెనా విశేష ప్రతిభ కనబరిచి ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ అవుతుంది. 1999లో వచ్చిన కార్గిల్‌ వార్‌ ఆమె సామర్థ్యానికి ఒక సవాల్‌. యుద్ధంలో గాయపడిన, మృతి చెందిన సైనికులను హెలికాప్టర్‌ ద్వారా తెచ్చే బాధ్యత గుంజన్‌ది. ఇది ప్రమాదకరం. ముష్కరులు హెలికాప్టర్‌ను పేల్చేయొచ్చు కూడా. కాని కార్గిల్‌వార్‌ జరిగిన 2 నెలల 3 వారాల్లో గుంజన్‌ లెక్కకు మించిన ఆపరేషన్స్‌లో పాల్గొని దాదాపు 900 మందికి పైగా సైనికులను తిరిగి బేస్‌కు చేర్చింది. అందుకే ఆమె ‘కార్గిల్‌ గర్ల్‌’ అయ్యింది. కార్గిల్‌ వార్‌లో పని చేసిన ఏకైక మహిళ ఆమె. 2004లో పదవీవిరమణ చేసింది.

సినిమా కథ
గుంజన్‌ సక్సెనా జీవితం ఆధారంగా తీసిన సినిమా కొత్త ఆలోచనలు చేసే స్త్రీలకు పురుష కేంద్రక సమాజంలో ఎదురయ్యే అవరోధాలను గాఢంగా చర్చించింది. స్త్రీలను పురుష సమాజం రెండు విధాలుగా అడ్డుకుంటుంది. ఒకటి ప్రొటెక్టివ్‌ కన్సర్న్‌తో. రెండు చులకనభావంతో. ఈ సినిమాలో గుంజన్‌ సోదరుడు ‘నీకేమైనా అయితే? నీకెందుకు ఇదంతా? నువ్వు డేంజర్‌లో పడతావ్‌?’ లాంటి ‘ప్రేమకట్టడి’తో నిరోధించడానికి చూస్తాడు. ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ‘నువ్వు బలహీనురాలివి. ఇక్కడ దుర్బలులకు చోటు లేదు. అసలిది స్త్రీలు చేయాల్సిన పని కాదు’ అని చులకన భావంతో నిరోధిస్తారు.

అయితే మగవాళ్లలో కూడా మంచి మగవాళ్లు ఉంటారు. గుంజన్‌ సక్సెనాకు తండ్రి మద్దతు చాలా ఉంటుంది. ఆమెకు అతడు ప్రతిక్షణం సపోర్ట్‌ చేస్తాడు. ‘కష్టాన్ని నమ్ముకున్నవారికి విజయం ద్రోహం చేయదు’ అంటాడతను. ఎయిర్‌ఫోర్స్‌ను అర్ధంతరంగా వదిలిపెట్టి ‘పెళ్లి చేసుకొని సెటిలవుతాను’ అని గుంజన్‌ అన్నప్పుడు ‘సమాజమంతా స్త్రీని వంటగదికి సెటిల్‌ చేయాలని చూస్తోంది. నువ్వు కూడా వారిలో చేరతావా?’ అని కర్తవ్యాన్ని ప్రేరేపిస్తాడు. ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో కూడా ఒక సీనియర్‌ ఆఫీసర్‌ ఆమెకు మద్దతుగా నిలుస్తాడు. ఆమెకు తర్ఫీదు ఇస్తాడు. ఎగిరే చిరుతలా తీర్చిదిద్దుతాడు.
నకిలీ మగతనం
స్త్రీని గౌరవించడం, స్త్రీని పై అధికారిగా స్వీకరించడం, స్త్రీకి సెల్యూట్‌ చేయడం వల్ల మగవారి తలపాగలు ఊడి కిందపడవు... దాని వల్ల వారి మగతనానికి ఏమీ ఢోకా రాదు అని ఈ సినిమా స్టేట్‌మెంట్‌ ఇస్తుంది. ‘నన్ను మీరంతా ఎందుకు నిరోధిస్తున్నారో నాకు తెలుసు. నేను ఆఫీసర్‌ అయితే సెల్యూట్‌ చేయాల్సి వస్తుందని మీ భయం. చేస్తే ఏమవుతుంది? అలా చేస్తే పోయే మగతనం నకిలీ మగతనం’ అని గుంజన్‌ ఒకచోట అంటుంది. బండి మీద ఒంటరిగా వెళ్లే యువతులను చున్నీ లాగి కిందపడేసే ఈ రోజుల్లో కూడా స్త్రీలను గౌరవించడం, స్త్రీ ఆకాంక్షలకు విలువ ఇవ్వాలని చెప్పడం పదే పదే చేయాల్సి వస్తుంది.

అందుకు గుంజన్‌ సక్సెనా కూడా ఒక సమర్థమైన సినిమా రూపం. గుంజన్‌గా జాన్హీ్వ కపూర్‌ ప్రశంసాత్మకంగా చేసింది. స్త్రీలకు ఎవరూ స్వాతంత్య్రం ఇవ్వాల్సిన పని లేరు. అది వారి హక్కు. అందరిలాగే వారు తమ స్వేచ్ఛా స్వాంతత్య్రాలను పొందగలరు. నిభాయించుకోగలరు. పురుషులు చేయాల్సింది అందుకు నిరోధంగా నిలబడకపోవడం. జెండా వందనానికి అందరం తల ఎత్తుతాం. స్త్రీలు కూడా స్వేచ్ఛగా తల ఎత్తే సకల సాంఘిక, సామాజిక, కౌటుంబిక ఆవరణాలలోకి ఈ దేశం పయనించాలని ఈ స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఆశిద్దాం. 
‘గుంజన్‌ సక్సెనా’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. – సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top