చీరకట్టుకు లక్ష రూపాయలు

Special Story About Dolly Jain - Sakshi

అభిరుచి

వినడానికి వింతగా ఉన్నా... ఇది నిజం. డాలీ చేత చీర కట్టించుకోవాలంటే కనీసం 35 వేల రూపాయల నుంచి లక్ష రూపాయలకు పైగా చెల్లించుకోవాల్సిందే. 15 ఏళ్ల క్రితం చీర కట్టుకోవడాన్ని కష్టంగా మొదలుపెట్టి దానినే అభిరుచిగా మార్చుకొని ఇప్పుడు రికార్డులు కొట్టేస్తున్న బెంగళూరు మహిళ డాలీ జైన్‌ గురించి తెలుసుకోవాల్సిందే! నేటి తరం అమ్మాయిలకు చీర కట్టుకోవడం అంటే పెద్ద కష్టం. నిన్నటి తరం అమ్మలు సౌకర్యం కోసం ఎప్పుడో కుర్తాలోకి మారిపోయారు. బెంగళూరుకు చెందిన డాలీ అనే మహిళ మాత్రం 15 ఏళ్లుగా వందల రకాల సై్టల్స్‌లో చీర కట్టడం అనే కాన్సెప్ట్‌ను సాధన చేస్తూనే ఉంది. ఆ కాన్సెప్ట్‌తోనే సక్సెస్‌నూ సాధిస్తోంది. 

బాలీవుడ్‌ తారలకు డాలీ కట్టు
సందర్భానికి తగ్గట్టు రకరకాల స్టైల్‌లో చీరలు ధరించడం కూడా ఒక నైపుణ్యం. ఈ నైపుణ్యమే ప్రత్యేకతగా కలిగిన డాలీ జైన్‌ బాలీవుడ్‌ నటిమణులతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తల సతీమణులకూ ఇష్టమైన సై్టలిస్ట్‌గా మారిపోయింది. డాలీ జైన్‌ ఖాతాదారులలో నీతా అంబానీ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు, సోనమ్‌ కపూర్‌లు, ప్రియాంకాచోప్రా, కరిష్మా కపూర్‌ వంటి ప్రముఖ బాలీవుడ్‌ నటీమణులకు కూడా డాలీ చీర కట్టింది. సబ్యసాచి ముఖర్జీ, మనీష్‌ మల్హోత్రా వంటి ప్రసిద్ధ డిజైనర్ల ఖాతాదారులకు డాలీ చీరలు కడుతుంది.

అత్తమామల ఒత్తిడి
పెళ్లికి ముందు డాలీ జీన్స్, టాప్స్‌ ధరించేది. పెళ్లయిన తర్వాత అత్తారింట్లో  చీరకట్టుకోవాల్సిందే అన్నారు. ఆ నిర్బంధంలో డాలీ చీర కట్టుకోవడం నేర్చుకుంది. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ – ‘మొదట్లో మా ఇంట్లో వాళ్ల మీద చాలా కోపంగా ఉండేది. కానీ, చీర కట్టుకోవడం నేర్చుకున్నాక దానిని స్టైల్‌గా మార్చుకోవాలనుకున్నాను. అప్పుడు విభిన్న రకాల చీరకట్టు పద్ధతులు నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఈ క్రెడిట్‌ అంతా మా అత్తమామలకే. పెళ్లి తర్వాత వాళ్లు జీన్స్, టాప్స్‌ వేసుకోవడం ఒప్పుకునుంటే ఎప్పటికీ చీరకట్టులో నైపుణ్యం సాధించేదాన్ని కాదు’ అని నవ్వుతూ చెబుతుంది డాలీ. 

రికార్డుల డ్రేపింగ్‌
ఒక చీరను 80 విధాలుగా కట్టిన నైపుణ్యంతో లిమ్కా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో డాలీ పేరు నమోదయ్యింది. రెండవసారి ఒక చీరను 325 విధాలుగా కట్టి తన రికార్డును తనే బద్దలు కొట్టింది. అంతేకాదు, ఒకటిన్నర సెకన్లలో చీరను కట్టి రికార్డు సృష్టించింది. 2015లో ‘స్ట్రాంగ్‌ వుమన్‌ ఆఫ్‌ ఆనర్‌‘ను కూడా అందుకుంది. మనలోని చిన్న ప్రతిభ కూడా విజయ తీరాలను చేరుస్తుంది. కష్టపడటం, అంకితభావంతో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం అనే పెట్టుబడి మాత్రమే మనం పెట్టాల్సింది అని డాలీ నిరూపిస్తోంది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top