నరుడి బతుకు నటన... ఈశ్వరుడి తలపు ఘటన

SP Balasubrahmanyam As A Dubbing Artist In Film Industry - Sakshi

బాలూ ఇళయరాజాల స్నేహం ఈశ్వరుడి తలపు అనిపిస్తుంది. తమిళనాడులోని మారుమూల పల్లె నుంచి దర్శకుడు భారతీరాజా పూనికతో చెన్నై చేరుకున్న ఇళయరాజా అతని ఇద్దరు సోదరులు మొదట బాలూ ట్రూప్‌లోనే చేరారు. ఇళయరాజా బాలు  దగ్గర గిటార్‌ వాయించేవారు. ఆ తర్వాత ఇళయరాజా ‘అన్నక్కిళి’తో సంగీత దర్శకుడుగా మారారు. బాలు–ఇళయరాజాల స్నేహం దాదాపు నలభై ఏళ్ల నాటిది. వారిరువురూ కలిసి గొప్ప పాటలు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఇచ్చారు. ‘నా ట్యూన్‌ వల్ల నువ్వు గొప్పవాడివయ్యావ్‌’ అని ఇళయరాజా అంటే ‘నీ ట్యూన్‌ను నేను పాడటం వల్లే నువ్వు పెద్దవాడివయ్యావ్‌’ అని బాలు సరదాగా అనుకునేవారు. బాలు–ఇళయరాజా కాంబినేషన్‌లో వందల పాటలు సంగీత ప్రియులకు స్ట్రెస్‌ బస్టర్స్‌గా మారాయి.

‘ఇలాగే ఇలాగే సరాగమారితే’ (వయసు పిలిచింది), ‘పరువమా చిలిపి పరుగు తీయకు’ (మౌనగీతం), ‘ఈ లోకం అతి పచ్చన’ (వసంత కోకిల), సుమం ప్రతి సుమం సుమం (మహర్షి), కీరవాణి (అన్వేషణ), ఉరకలై గోదావరి (అభిలాష), ఈనాడే ఏదో అయ్యింది (ప్రేమ), ఆమని పాడవే హాయిగా (గీతాంజలి) ఎన్ని చెప్పినా మరొకటి మిగిలిపోయే పాట ఉంటుంది. ఇళయరాజా కోసం బాలు గొంతుకు స్ట్రయిన్‌ ఇస్తూ  గీతాంజలిలో ‘నందికొండ వాగుల్లోనా’ పాడారు. ఆయనే మళ్లీ ‘ఇంద్రుడు చంద్రుడు’ కోసం ‘నచ్చిన ఫుడ్డు’ పాటకు గొంతు పోయేలా పాడి ఇబ్బంది పడ్డారు. అయినా ఇళయరాజా కోసం ఇదంతా ప్రేమగా చేసేవారు. ఇళయరాజా కంపోజ్‌ చేసిన ‘సాగర సంగమం’ పాటలు బాలూకు గొప్ప పేరు తెచ్చి పెట్టాయి. అందులోని ‘తకిట తధిమి తకిట తధిమి తందానా’ పాట సంగీతాభిమానులకు ఎంతో ఇష్టమైనది. వీరి మధ్యే కాకుండా వీరి కుటుంబాల మధ్య కూడా స్నేహం ఉంది. 

ఇళయరాజా సోదరుడు గంగై అమరన్‌ ప్రేమ విషయంలో అమ్మాయి వాళ్ల ఇంట్లో మాట్లాడింది బాలూనే. యస్పీబీ కుమారుడు యస్పీ చరణ్‌ నిర్మించే సినిమాలకు రాజా తనయుడు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తుంటారు. రాజా మేనల్లుళ్లు వెంకట్‌ ప్రభు (దర్శకుడు), ప్రేమ్‌జీ అమరన్‌ (నటుడు–సంగీతదర్శకుడు) కూడా యస్పీ చరణ్‌తో తరచూ సినిమాలు చేస్తారు. ఇలాంటి అనుబంధంలో మనస్పర్థలు లేవా? అంటే ఉన్నాయి. ‘నా పాటలను నా అనుమతి లేకుండా వేదికల మీద పాడొద్దు. పాడితే రాయల్టీ చెల్లించాలి’ అని ఒక సందర్భంలో కోప్పడ్డా కొద్ది రోజులకే ఇద్దరూ కలిసిపోయారు. బాలు అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరిన వెంటనే ‘త్వరగా తిరిగిరా బాలూ’ అంటూ చెమర్చిన కళ్లతో ఓ వీడియో పంచుకున్నారు ఇళయరాజా. 

హీరో ఎవరైనా గొంతు బాలూదే(డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా బాలు)
ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంను డబ్బింగ్‌ ఆర్టిస్టుగా మార్చింది సంగీత దర్శకుడు చక్రవర్తి. ఆ రోజుల్లో చక్రవర్తి చాలా సినిమాలకు డబ్బింగ్‌ చెప్పేవారు. ‘మన్మథలీల’ (1976)లో కమలహాసన్‌కు డబ్బింగ్‌ చెబుతూ అందులోని ఒక బ్రాహ్మణుడి పాత్రకు బాలు గొంతు సూట్‌ అవుతుందని చెప్పించారు. ఆ తర్వాత ‘కల్యాణ రాముడు’ (1979) సినిమా నుంచి కమల్‌ హాసన్‌కు బాలు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా మారారు. దాదాపు తెలుగులో డబ్‌ అయిన అన్ని కమల్‌ సినిమాలకు బాలు డబ్బింగ్‌ చెప్పారు. వసంత కోకిల, నాయకుడు, డాన్స్‌మాస్టర్, గుణ, మైకేల్‌ మదన్‌కామరాజు, విచిత్రసోదరులు... ఇవన్నీ ముఖ్యమైనవి. ‘దశావతారం’లో పది కమల్‌ పాత్రలకు పది విధాలుగా కేవలం రెండున్నర రోజుల్లో డబ్బింగ్‌ ముగించారు బాలు. హీరో నరేశ్‌ ‘నాలుగు స్తంభాలాట’కు, హీరో జగపతిబాబు ‘అడవిలో అభిమన్యుడు’ సినిమాకు బాలు డబ్బింగ్‌ చెప్పారు.

కె.భాగ్యరాజాకు కూడా బాలు గొంతు బాగా సూట్‌ అయ్యేది. కె.భాగ్యరాజా తెలుగులో డబ్బింగ్‌ చేసిన ‘డార్లింగ్‌ డార్లింగ్‌’, ‘అమ్మాయిలు ప్రేమించండి’, ‘చిన్నరాజా’, ‘నేనూ మీవాడినే’ వంటి సినిమాలకు బాలు డబ్బింగ్‌ చెప్పి భాగ్యరాజాను తెలుగువారికి దగ్గర చేశారు. తమిళ నటుడు విసు నటించిన తెలుగు సినిమాలు ‘ఆడదే ఆధారం’, ‘ఇల్లు–ఇల్లాలు–పిల్లలు’ సినిమాల్లో విసుకు డబ్బింగ్‌ చెప్పారు. ‘రుద్రవీణ’లో జెమినీ గణేశన్‌కు చెప్పిన డబ్బింగ్‌ చాలా ప్రతిభావంతమైనది. ‘అన్నమయ్య’లో సుమన్‌ శ్రీవేంకటేశ్వర స్వామి పాత్ర ధరిస్తే బాలూయే డబ్బింగ్‌ చెప్పి ఆయనకు పేరు రావడానికి కారకులయ్యారు. బాలు తమిళంలో నాగార్జునకి, రజనీకాంత్‌కి, బాలకృష్ణకి డబ్బింగ్‌ చెప్పారు. అన్నింటికి మించి అటెన్‌బరో ‘గాంధీ’ చిత్రం తెలుగులో డబ్‌ అయినప్పుడు గాంధీ పాత్రకు ఎంతో అద్భుతంగా డబ్బింగ్‌ చెప్పారు బాలు. అందులో రకరకాల వయసుల్లో ఉన్న గాంధీకి రకరకాల ధ్వని స్వభావంతో చెప్పే తీరు ఔత్సాహికులకు పాఠం లాంటిది. దేశంలోని పది మంది గొప్ప డబ్బింగ్‌ ఆర్టిస్టులను లెక్కిస్తే వారిలో బాలు తప్పక వస్తారు. 

చూడు పిన్నమ్మా పాడు పిల్లోడు(మిమిక్రీ ఆర్టిస్ట్‌ బాలు)
బాలు గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్‌. ఆర్టిస్ట్‌ను బట్టి, ఆర్టిస్ట్‌ బాడీ లాంగ్వేజ్‌ను బట్టి పాడి తాను పాడినట్టుగా కాకుండా పాత్ర పాడినట్టుగా అనిపించగలరు. దాసరి తీసిన ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ (1977)లో నటుడు మాడా ‘పేడి’ పాత్ర ధరిస్తే ఆ పాట కోసం బాలూ ‘చూడు పిన్నమ్మా పాడు పిల్లోడు’ పాడారు. ఆ పాట బాలూకు, మాడాకు చిరకాల కీర్తి తెచ్చి పెట్టింది. మాడాకు జీవితకాలం ఆ పాత్రే భుక్తి కల్పించిందని చెప్పవచ్చు. గతంలో కిశోర్‌ కుమార్‌ ‘హాఫ్‌టికెట్‌’ సినిమా కోసం స్త్రీ,పురుష గొంతుల్లో పాడారు. బాలు కూడా అలా గొంతు మార్చి తన ప్రతిభ చాటుకున్నారు. రాజేంద్రప్రసాద్‌ తీసిన ‘మేడమ్‌’ సినిమా కోసం స్త్రీ వేషంలో ఉన్న రాజేంద్రప్రసాద్‌ పాటను స్త్రీ గొంతుతో బాలు పాడారు. ఇలా మేల్‌ సింగర్‌ పూర్తి స్త్రీ గొంతుతో పూర్తి పాట పాడటం ఒక రికార్డ్‌.

అల్లు రామలింగయ్య కోసం బాలు పాడిన ‘ముత్యాలు వస్తావా’ పాట పెద్ద  హిట్‌. ‘మనుషులంతా ఒక్కటే’ (1976) కోసం అల్లు రామలింగయ్య, రమాప్రభల మీద చిత్రీకరించిన పాట సినిమా హిట్‌ కావడానికి ఒక కారణమైంది. కొంచెం ముక్కుతో పాడి అచ్చు అల్లు పాడినట్టే అనిపించారు బాలు. కామెడీ నటులకు బాలు పాడిన పాటలు కూడా హిట్‌ అయ్యాయి. రాజబాబుకు ‘తాతా–మనవడు’ కోసం ‘సోమా మంగళ బుధ’ పాడారు బాలు. పద్మనాభంకు బాలు  పాడిన ‘ఆకలయ్యి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్లు’ (దేశోద్ధారకులు–1973) కూడా పెద్ద హిట్టే. ‘ప్రతిఘటన’ (1985) సినిమాలో సుత్తి వేలుకు బాలూ పాడిన ‘తందనాన భళ తందనాన’ ఆ సమయంలో ఒక ఉద్వేగగీతంగా నిలిచింది. శుభలేఖ సుధాకర్‌కు ‘రెండు జళ్ల సీత’ కోసం బాలు పాడిన ‘కొబ్బరినీళ్ల జలకాలాడి’ ఇప్పటికీ ఒక వినోద గీతమే. కామెడీ స్టార్‌ అలీకి పాడిన ‘చినుకు చినుకు అందెలలో’ (శుభలగ్నం) పెద్ద హిట్‌. బాలుఅనే శంఖంలో ఎన్నో తీర్థాలు. రాగాలు. రసాలు. అందులో హాస్యరసం కూడా తరించింది. 

సుశీలమ్మ – బాలు
బాలసుబ్రహ్మణ్యం విజయంలో ఆయన వాటా ఎంత ఉందో ఆయనతో పాటు గొంతు కలిపిన సుశీలమ్మ వాటా కూడా అంత ఉంది. బాలూ కంటే ఎంతో సీనియర్‌ అయినప్పటికీ సుశీలమ్మ బాలూను ప్రోత్సహించారు. బాలు అంత హుషారుగా తనను తాను ఉత్సాహపరుచుకుని యుగళగీతాలు ఆలపించారు. వీరిద్దరి హిట్స్‌ లెక్కబెట్టే కొలది వస్తూనే ఉంటాయి. ‘మానసవీణ మధుగీతం’ (పంతులమ్మ), ‘ఝుమ్మందినాదం సయ్యంది పాదం’ (సిరిసిరిమువ్వ), ‘ఇది పున్నమి వెన్నెల రేయి’ (ప్రేమ లేఖలు), ‘మావిచిగురు తినగానే’ (సీతామాలక్ష్మి), ‘గోరంత దీపం కొండంత వెలుగు’ (గోరంత దీపం), ‘శ్రీరస్తు శుభమస్తు’ (పెళ్లిపుస్తకం) లాంటి అద్భుతమైన పాటలు ఉన్నాయి. కమర్షియల్‌ సినిమాల జోరు పెరిగి మాస్‌ సాంగ్స్‌ కావాలని నిర్మాతలు పట్టుబట్టినప్పుడు, దర్శకులు కోరినప్పుడు సుశీల బాలూతో కలిసి అలాంటి మాస్‌ సాంగ్స్‌ పాడారు.

ముఖ్యంగా చక్రవర్తి ఆమెను ఒప్పించి బాలూతోటి ‘గుగ్గుగుగ్గు గుడిసుంది’ (డ్రైవర్‌ రాముడు) పాడించారు. అలాగే వీళ్లద్దరూ ‘వేటగాడు’లో ‘పుట్టింటోళ్లు తరిమేశారు’ పాడారు. అక్కినేనికి బాలు  పాడిన డ్యూయెట్స్‌లో ఎన్నో హుషారైనవి సుశీల పాడారు. వాటిలో ‘ఒక లైలా కోసం’ (రాముడు కాదు కృష్ణుడు), ‘కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్న’ (ప్రేమాభిషేకం), ‘తొంగి తొంగి చూడమాకు చందమామా’ (శ్రీరంగ నీతులు)..లాంటివి ఎన్నో ఉన్నాయి. కృష్ణకు ‘ఇదిగో తెల్ల చీర’ (ఊరికి మొనగాడు), శోభన్‌బాబుకు ‘వెల్లువచ్చి గోదారమ్మ’ (దేవత), చిరంజీవికి ‘గోరింట పూసింది’ (ఖైదీ) హిట్‌ పాటలకు లెక్క లేదు. సుశీల పాడిన ‘పాలకడలిపై శేషతల్పమున’ పాటను పాడి చిన్నప్పుడు పాటల పోటీలో ప్రైజులు తెచ్చుకున్నానని బాలు  చాలాసార్లు చెప్పుకున్నారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top