నేను ఉండలేను

Seattle City Police Chief Carmen Best Resign For Her Job - Sakshi

సియాటెల్‌ పోలిస్‌ చీఫ్‌ కార్మెన్‌ది పెద్ద వయసేమీ కాదు. కనీసం రిటైర్‌ అయ్యే వయసు కూడా కాదు. యూఎస్‌ పోలిస్‌ డిపార్ట్‌మెంట్‌లో 63 ఏళ్ల వరకు, ఫిట్‌గా ఉంటే ఆ పైన కూడా ఉద్యోగంలో వుండొచ్చు. కార్మెన్‌ వయసు 55. ఇంకా ఎనిమిదేళ్ల సర్వీస్‌ ఉండగానే ఆమె తన రిటైర్మెంట్‌కు బుధవారం నాడు నోటీసు ఇచ్చేశారు. పేరు, పొజిషన్‌ ఉన్న పోలిస్‌ ఆఫీసర్‌ రాజీనామా (హుందాగా ఆమె ‘రిటైర్మెంట్‌’ అని ఆ లేఖలో రాశారు) చేశారంటే తగిన కారణమే ఉంటుంది. సిటీ కౌన్సిల్‌ వాళ్లు ఈ ఏడాది కేటాయించిన 409 మిలియన్‌ డాలర్ల సియాటెల్‌ పోలిస్‌ శాఖ బడ్జెట్‌లో ఆకస్మాత్తుగా 3.5 మిలియన్‌ డాలర్ల కోత విధించారు! అది ఆమెకు ఆగ్రహం కలిగించింది. తగ్గించింది పెద్ద మొత్తంగా కనిపించక పోయినా, అసలు ‘తగ్గించడం’ అనేదే డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం లాంటిదని, అంటే.. అదొక నేరం వంటిదని కార్మెన్‌ తన రాజీనామా పత్రంతో నిరసన వ్యక్తం చేశారు. ‘వాళ్లు తగ్గించింది బడ్జెట్‌ను కాదు. పోలిస్‌ డిపార్ట్‌మెంట్‌ కాన్ఫిడెన్స్‌ని’ అంటున్నారు కార్మెన్‌. ఇప్పుడామె చేత తన ‘పదవీ విరమణ రాజీనామా’ నోటీసును వెనక్కు తీయించడానికి పైస్థాయిలో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ ఏడాది మే 25న జరిగిన జార్జి ఫ్లాయిడ్‌ హత్యోదంతం తర్వాత అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో పోలీసుల ప్రవర్తనా నియమావళి కఠినతరం అయింది. పోలీసులకు ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలూ తగ్గిపోయాయి. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top