సాహసోపేత సంబురం | San Fermín Festival held from 6 to 14 July in Pamplona | Sakshi
Sakshi News home page

సాహసోపేత సంబురం

Jul 5 2026 3:16 AM | Updated on Jul 5 2026 3:16 AM

San Fermín Festival held from 6 to 14 July in Pamplona

ప్రపంచంలోనే అతిపెద్ద పండుగగా పేరొందిన ‘శాన్‌ ఫెర్మిన్‌ ఫెస్టివల్‌’ వేడుకలకు స్పెయిన్‌లోని పాంప్లోనా నగరం సిద్ధమైంది. జూలై 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రాకెట్‌ లాంచింగ్‌తో ప్రారంభమయ్యే ఈ సంబరాలు, జూలై 14వ తేదీ, అర్ధరాత్రి క్యాండిల్‌ లైట్‌లో సాగే ‘పో బ్రే డి మి’ గీతాలాపనతో ముగుస్తాయి. జూలై మాసంలో ప్రతి ఏటా తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకలను కళ్లారా చూసేందుకు, ఇందులో భాగస్వాములయ్యేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. వారు దైవంగా నమ్మే ‘శాన్‌ ఫెర్మిన్‌ డి అమియన్స్’ జ్ఞాపకార్థం ఈ వేడుకలను నిర్వహిస్తారు. 

స్థానికంగా ‘శాన్‌ ఫెర్మినెస్‌’ అని పిలుచుకునే ఈ పండుగ 12వ శతాబ్దంలో మతపరమైన ఆచారాలు, పశువుల సంతలు, బుల్‌ఫైటింగ్‌ కలయికగా ప్రారంభమైంది. మొదట్లో ఈ వేడుకలు, ఊరేగింపులు సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ మాసాల్లో జరిగేవి. అయితే, వాతావరణం అనుకూలించకపోవడం వల్ల 1591లో నగర అధికారులు, చర్చి పెద్దలు కలిసి ఈ ఉత్సవాలను జూలై 7వ తేదీకి మార్చారు.

ఒక ప్రత్యేక రాకెట్‌ను లాంచ్‌ చేయడం ద్వారా జూలై 6వ తేదీన ఈ ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. నగరం మొత్తం రంగురంగుల అలంకరణలతో, కోలాహలంగా మారుతుంది. ఊరేగింపులు తీస్తారు. సెయింట్‌ ఫెర్మిన్‌ పవిత్ర విగ్రహాన్ని పాంప్లోనా వీ«థుల్లో ఊరేగిస్తారు. పిల్లా పెద్దా ఈ వేడుకల్లో ఎంతో ఎంజాయ్‌ చేస్తారు. చారిత్రక, పౌరాణిక పాత్రలను ప్రతిబింబించే భారీ ఆకారాలు, పెద్ద తలలు ఉన్న వింత బొమ్మలు నగర వీథుల్లో ఊరేగుతూ ప్రజలను అలరిస్తాయి. లైవ్‌ మ్యూజిక్‌ ఈ ఉత్సవాలకు మరింత ఊపునిస్తుంది. నగరంలోని ప్రధాన కూడళ్లలో స్థానిక, అంతర్జాతీయ కళాకారులతో సంగీత కచేరీలు, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. ఈ దృశ్యాలన్నింటినీ నగరం అంతటా ఏర్పాటు చేసిన జంబో స్క్రీన్‌లపై ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 

ఈ పండుగలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం ‘రన్నింగ్‌ ఆఫ్‌ ది బుల్స్‌’. ప్రతిరోజూ ఉదయం ఈ పందాన్ని నిర్వహిస్తారు. ఇందులో వందలాది మంది సాహసికులు ప్రాణాలకు తెగించి కోపంతో ఊగిపోయే ఎద్దులతో పాటు పరుగెడతారు. భయం, వేగం, సంప్రదాయం కలగలిసిన ఈ దృశ్యం వీక్షకులకు ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. 
తొమ్మిది రోజుల పాటు సాగే ఈ వేడుకలకు జూలై 14 అర్ధరాత్రి వేళ ‘పోబ్రే డి మి’ అనే ముగింపు వేడుకతో తెరపడుతుంది. ప్లాజా కన్సిస్టోరియల్‌ వద్ద వేలాది మంది ప్రజలు వెలిగించిన కొవ్వొత్తులను చేతపట్టుకుని, పండుగ ముగిసిపోతున్నందుకు బాధపడుతూ, అదే సమయంలో వచ్చే ఏడాది సంబరాల కోసం ఉత్సాహం చూపిస్తూ ఈ సాంప్రదాయ గీతాన్ని ఆలపిస్తారు. 

స్పెయిన్ లోని ‘నవారే’ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన ఈ పండుగను ఒక ప్రపంచ స్థాయి అద్భుతంగా మార్చిన ఘనత మాత్రం ప్రసిద్ధ అమెరికన్‌ రచయిత ఎర్నెస్ట్‌ హెమింగ్వేకే దక్కుతుంది. ఆయన 1923లో ఈ పండుగను స్వయంగా సందర్శించి, ఆ అనుభవాలతో 1926లో ‘ది సన్‌ ఆల్సో రైజెస్‌’ నవల రాశారు. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహస ప్రియులను, పర్యాటకులను పాంప్లోనా నగరం వైపు ఆకర్షించేలా చేసింది. ఈ ఉత్సవాలకు ఉన్న ప్రపంచ స్థాయి క్రేజ్‌ని గుర్తించిన స్పెయిన్‌ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, దీనిని ‘అంతర్జాతీయ పర్యాటక ప్రాధాన్యం కలిగిన పండుగ’గా ప్రకటించింది.

సెయింట్‌ ఫెర్మిన్‌ ఎవరంటే? 
చారిత్రక ఆధారాల ప్రకారం, సెయింట్‌ ఫెర్మిన్‌ మూడో శతాబ్దానికి చెందిన రోమన్‌ పౌరుడు. పాంప్లోనా నగరంలో జన్మించిన ఆయన, ఆ నగరానికి మొదటి బిషప్‌గా సేవలందించారు. ఆ తర్వాత ఫ్రాన్స్లోని అమియెన్స్లో అమరవీరుడయ్యారు.

∙ రమా జంబుల 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement