ఆకాశవాణి... యూఎస్‌ కేంద్రం!

Sakshi Special Story on dubbing artist and Actress Udayagiri Rajeswari

ఆకాశవాణి శ్రోతలకు ఆమె గొంతు సుపరిచితం.   తొలితరం తెలుగు టీవీ ప్రేక్షకులకు ఆమె నటన చిరపరిచితం.   ఇరవయ్యేళ్ల కిందట తెలుగు చిత్ర కథానాయికల గళం ఆమె. పేరు... ఉదయగిరి రాజేశ్వరి. ఇప్పుడు... యూఎస్‌లో తెలుగు వాణి ఆమె. యూఎస్‌ తెలుగు రంగస్థల నిర్మాత. ప్రాక్‌– పశ్చిమ తెలుగుకు సాంస్కృతిక వారధి.

‘‘నాకు స్టేజి ముందున్న జ్ఞాపకం లేదు. ఎప్పుడూ స్టేజి మీదనే ఉండేదాన్ని. అమ్మ రచయిత. ఆమె రాసిన నాటకాలు ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యేవి. అలా నాకు చిన్నప్పుడే రేడియోతో పరిచయం ఏర్పడింది. స్కూల్‌ ప్రోగ్రామ్స్‌లో కూడా తప్పకుండా పాల్గొనేలా చూసేది అమ్మ’’ అంటూ తన ఎదుగుదలలో తల్లి అత్తలూరి విజయలక్ష్మి పాత్రను గుర్తు చేసుకున్నారు ఉదయగిరి రాజేశ్వరి.

‘‘రేడియోలో నా ఎంట్రీ కూడా అమ్మ నాటకంతోనే. ఆ నాటకం కోసం ఆడిషన్స్‌ జరిగినప్పుడు నేను ‘బి’ గ్రేడ్‌ ఆర్టిస్టుగా ఎంపికయ్యాను. ఆ తర్వాత ‘ఏ’ గ్రేడ్‌కి ప్రమోట్‌ అయ్యాను. అమ్మ ఎప్పుడూ ‘నాకు కొద్దిగా స్టేజ్‌ ఫియర్‌. అందుకే నిన్ను స్టేజ్‌ మీదనే పెంచాను’ అంటుండేది. బాల్యంలో సరైన ఎక్స్‌పోజర్‌ లేకపోతే ఆ భయం ఎప్పటికీ వదలదేమోనని ఆందోళన ఆమెకి. అందుకే నన్ను ఊహ తెలిసేటప్పటికే స్టేజి మీద నిలబెట్టింది.

రేడియో తర్వాత టీవీకి కూడా పరిచయం చేసింది. జెమినీ టీవీలో ‘బిజినెస్‌ ట్రాక్స్, యువర్స్‌ లవింగ్‌లీ వంటి కార్యక్రమాలకు యాంకరింగ్‌ చేశాను. స్వచ్ఛమైన తెలుగు, మంచి డిక్షన్‌ ఉండడంతో ప్రముఖులతో పరిచయ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా రాణించగలిగాను. మొదట్లో నాకు ఆన్‌ స్క్రీన్‌ మీద పెద్దగా ఆసక్తి లేదు. కానీ అమ్మ సరదా కొద్దీ యాంకరింగ్‌ చేశాను. ప్రముఖుల పరిచయాల్లో భాగంగా యండమూరి వీరేంద్రనాథ్‌గారిని ఇంటర్వ్యూ చేశాను.

అప్పుడాయన సీరియల్స్‌లో చేయమని అడగడంతో కొద్దిపాటి సందిగ్ధతతోనే ‘ప్రియురాలు పిలిచె’లో నటించాను. శాంతి నివాసం, ఎడారి కోయిలలో కూడా మంచి పాత్రలే వచ్చాయి. స్టేజ్‌ మీద పెర్ఫార్మెన్స్‌ ఇస్తే అది ఎలా ఉందనేది ప్రేక్షకులు చెప్తారు. కెమెరా ముందు ప్రోగ్రామ్‌ చేసిన తర్వాత అది ప్రసారం అయ్యేటప్పుడు ఇంట్లో టీవీ ముందు కూర్చుని చూడడం చాలా థ్రిల్లింగ్‌గా ఉండేది.

మా ఇంట్లో అందరిదీ ఒక్కటే ఫార్ములా. ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ ఎన్నింటిలో చురుగ్గా ఉన్నా సరే... చదువును నిర్లక్ష్యం చేయకూడదు. అందుకేనేమో నాకు చదువు మీద ఫోకస్‌ తగ్గకుండా అమ్మ చాలా జాగ్రత్త పడింది. అయితే నాకు ఆన్‌ స్క్రీన్‌ ఆసక్తి పెరిగే సమయంలో అమ్మ మాట మీద కొంతకాలం నటనకు దూరంగా ఉండి చదువుకే పరిమితమయ్యాను.

ఎంసీఏ తర్వాత వెబ్‌స్మార్ట్‌లో ఉద్యోగంతో కొత్త జీవితం మొదలైంది. చదువుకుంటూ కూడా సినిమాల్లో డబ్బింగ్‌ చెప్పడం మాత్రం వదల్లేదు. ఇడియట్, శివమణి, ఏ ఫిల్మ్‌ బై అరవింద్‌ వంటి సినిమాల్లో హీరోయిన్‌ పాత్రలకు డబ్బింగ్‌ చెప్పాను.

పెళ్లి, పాపకు తల్లి కావడం, సింగపూర్‌లో ఉద్యోగం, అక్కడి నుంచి 2005లో యూఎస్‌కి... అక్కడ బాబు పుట్టడం, ఉద్యోగం– కుటుంబాన్ని బాలెన్స్‌ చేసుకోవడం అనే ఒక రొటీన్‌ చక్రంలో కొంతకాలం గడిచిపోయింది. అయితే అంత బిజీలో కూడా నాకు కొంత వెలితిగా అనిపించేది. రేడియో నాటకాలు, టీవీ షోలు, సినిమా డబ్బింగ్‌ల మధ్య జీవించిన ప్రాణం కదా మరి’’ అన్నారామె నవ్వుతూ.
 
అమ్మ చెప్పింది
అమెరికాలో రాజేశ్వరి నివసిస్తున్న డాలస్‌లో కూడా తెలుగు రేడియో ఉందని, వీలయితే ప్రోగ్రామ్స్‌ చేయమని తల్లి సూచించడంతో ఆమెలోని కళాకారిణి ఉత్సాహంతో ఉరకలు వేసింది. ఆమె సాహిత్యకాంక్ష ఆకాశంలో రెక్కలు విచ్చుకుంది. అలా 2006లో అమెరికా ఆకాశవాణితో గళాన్ని సవరించుకున్నారు రాజేశ్వరి. వారాంతాల్లో ప్రోగ్రామ్‌లు చేయడంతో అమెరికాకు చక్కటి తెలుగు భాషను వినిపించారు.

ఆటా, తానా వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా అక్కడ మన భాష, సంస్కృతులకు జీవం పోస్తున్నారు. ప్రస్తుతం ఆమె సొంతంగా ‘రేడియో సురభి’ అనే ఎఫ్‌ఎమ్‌ రేడియోను రోజుకు ఇరవై నాలుగ్గంటల కార్యక్రమాలతో నిర్వహిస్తున్నారు. ‘సరసిజ’ పేరుతో నాటకసంస్థను కూడా ప్రారంభించారామె. ‘‘విజయా వారి మిస్సమ్మ సినిమాను నాటకంగా ప్రదర్శించిన నా ప్రయోగం విజయవంతమైంది.

సినిమాను స్టేజ్‌ మీద నాటకంగా ప్రదర్శించడం ప్రపంచంలో అదే మొదలు. అలాగే అమ్మ రాసిన ద్రౌపది అంతః సంఘర్షణ నాటకంలో ద్రౌపది పాత్ర పోషించాను. ‘అనగనగా ఒక రాజకుమారి, పురూరవ నాటకాలు కూడా అంతే ప్రజాదరణ పొందాయి. యూఎస్‌లో భారతీయ నాటకరంగం అనగానే మన వాళ్లందరికీ హిందీ నాటకాలే గుర్తుకు వసాయి. తెలుగుకు పెద్ద ఆదరణ ఉండదనే అపోహ ఉండేది.

మనం చక్కగా ప్రదర్శిస్తే ఆదరణ ఎందుకు ఉండదు... అని చాలెంజ్‌గా తీసుకుని చేశాను. ప్రతి సన్నివేశానికి ముందు ఆడియోలో ఇంగ్లిష్‌లో నెరేషన్‌ చెప్పి ప్రదర్శించడం ద్వారా ఇతర భాషల వాళ్లు కూడా మన నాటకాన్ని ఆదరించారు. అలా నేను న్యూయార్క్‌లో ‘ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఫెస్టివల్‌’లో తెలుగు నాటకాన్ని ప్రదర్శించాను’’ అని తన కళాప్రస్థానాన్ని వివరించారామె.
 
 హైదరాబాద్‌లోని సారస్వత పరిషత్‌లో బుధవారం (20–7–2022) నాడు ‘లేఖిని– వంశీ’ సంయుక్తాధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉదయగిరి రాజేశ్వరికి ‘సురభి జమునారాయలు– వంశీ రంగస్థల పురస్కారం, లేఖిని ఆత్మీయ పురస్కార ప్రదానం జరిగింది. ఆ సందర్భంగా సాక్షితో ముచ్చటించారామె. ‘‘మాడపాటి హనుమంతరావు గరల్స్‌ హైస్కూల్‌ నాకు మంచి తెలుగు భాషను నేర్పింది. చక్కటి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసింది’’ అంటూ తన ఎదుగుదలలో తాను చదువుకున్న స్కూల్‌ ప్రాధాన్యతను గుర్తు చేసుకున్నారు రాజేశ్వరి.

రెండు గంటలు ఎవరూ కదల్లేదు
యూఎస్‌... అన్ని ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు కలిసి నివసిస్తున్న ప్రదేశం. అక్కడ అందరూ వాళ్ల వాళ్ల సంస్కృతిని పరిరక్షించుకుంటూ యూఎస్‌వాసులుగా కొనసాగుతుంటారు. మనవాళ్లు మాత్రమే త్వరగా మన సంస్కృతిని వదిలేస్తున్నారనిపించింది. నాకు చేతవచ్చినది ఏదో ఒకటి చేయాలని కూడా అనిపించింది. నాటకం మీద నాకున్న అభిలాషకు అది చక్కటి వేదిక అయింది. మొదట్లో స్టేజ్‌ షోకి ఎవరూ రారేమోననే భయంతో మిస్సమ్మ నాటకాన్ని ఫ్రీ షో వేశాం. ఏడువందల సీటింగ్‌ కెపాసిటీ ఉన్న ఆడిటోరియం నిండిపోయింది. రెండు గంటల సేపు కదలకుండా చూశారు. పురూరవ నాటకాన్ని పిక్టోరియల్‌గా చిత్రీకరించి అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేయడం కూడా ఓ ప్రయోగమే. మన నాటకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను.
– ఉదయగిరి రాజేశ్వరి, రంగస్థల కళాకారిణి

– వాకా మంజులారెడ్డి
ఫొటోలు : నోముల రాజేశ్‌ రెడ్డి
.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top