నలుపు తగ్గేదెలా..? | Sakshi Little Stars: Nevi In Children Implications For Melanoma Diagnosis | Sakshi
Sakshi News home page

నలుపు తగ్గేదెలా..?

Nov 12 2024 10:51 AM | Updated on Nov 12 2024 10:51 AM

Sakshi Little Stars: Nevi In Children Implications For Melanoma Diagnosis

చిన్నారుల ఒంటిమీద, ముఖం మీద పుట్టుమచ్చల్లాంటి నల్లమచ్చలు కనిపిస్తుండటం మామూలే. అయితే కొందరు చిన్నారుల్లో ఇవి చాలా ఎక్కువ సంఖ్యలో వస్తుంటాయి. ఈ కండిషన్‌ను ‘నీవస్‌’ అంటారు. ఇలా నల్లమచ్చలు ఎక్కువగా వచ్చే ఈ కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘మల్టిపుల్‌ నీవస్‌’ అని పేర్కొంటారు.  

చర్మంలోని రంగునిచ్చే మెలనోసైట్స్‌ అనే కణాలే పుట్టుమచ్చలకూ, ఇలా ఎక్కువ సంఖ్యలో వచ్చే ‘నీవస్‌’ అని పిలిచే మచ్చలకు కారణం. ఈ మచ్చలు శరీరంలో ఎక్కడైనా రావచ్చు. ఈ లక్షణమున్న కొందరిలో ఇవి అరచేతుల్లో, అరికాళ్లలో, ఆఖరుకు గోళ్లమీద కూడా కూడా కనిపిస్తుంటాయి. కుటుంబ చరిత్రలో ఇలాంటి మచ్చలు రావడంతోపాటు సూర్యకాంతికి చాలా ఎక్కువగా  ఎక్స్‌పోజ్‌ కావడం వంటి అంశాలు ఇవి వచ్చేందుకు కారణమవుతాయి.

రకాలు ...
ఈ మచ్చలను ప్రధానంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది హానికరం కాని సాధారణ ‘బినైన్‌’ మచ్చలు. రెండోది హానికరంగా మారే ‘మెలిగ్నెంట్‌’ మచ్చ. అయితే ఈ మెలిగ్నెంట్‌ అన్నది చాలా చాలా అరుదు. బినైన్‌ నీవస్‌ పెరుగుతున్నప్పుడు ఒకసారి పరీక్షించి, ఆ తర్వాత అది మెలిగ్నెంట్‌ కాదని నిర్ధారణ చేసుకుని ఆ తర్వాత నిశ్చింతగా ఉండాలి. ఈ మచ్చల్లో కొన్ని పుట్టుకతోనే రావచ్చు. మధ్యలో వచ్చే మచ్చలు  10 నుంచి 30 ఏళ్ల మధ్య కాలంలో  రావచ్చు. 

బినైన్‌ మచ్చల విషయానికి వస్తే... చాలామంది పిల్లల్లో కనిపించే పుట్టుమచ్చల్లో... హానికరం కాని నీవస్‌ వాటివల్ల ఎలాంటి ప్రమాదమూ  లేదని తెలిశాక నిశ్చింతగా ఉండవచ్చు. క్యాన్సర్‌గా మారే అవకాశం కూడా చాలా తక్కువ. అయితే... కొన్ని నీవస్‌లు క్యాన్సర్‌ లక్షణాలను సంతరించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటివి ఉన్నవారు క్రమం తప్పకుండా డర్మటాలజిస్ట్‌లతో ఫాలో అప్‌లో ఉండటం మంచిది. 

కొన్ని సందర్భాల్లో నీవాయిడ్‌ బేసల్‌ సెల్‌ కార్సినోమా అనే కండిషన్‌ కూడా రావచ్చు. ఇది పుట్టుకనుంచి ఉండటంతోపాటు, యుక్తవయస్సు వారిలోనూ కనిపిస్తుంది. వారికి మచ్చలతోపాటు జన్యుపరమైన అబ్‌నార్మాలిటీస్‌నూ డాక్టర్లు చూస్తుంటారు. ఇలాంటి పిల్లల్లో ముఖ ఆకృతి, పళ్లు, చేతులు, మెదడుకు సంబంధించిన లో΄ాలు కూడా కనిపించేందుకు ఆస్కారం ఉంది. ఇవన్నీ చాలా అరుదైన కండిషన్స్‌.

మచ్చలు ఉన్నప్పుడు గమనించాల్సిన ఏ, బీ, సీ, డీలు...
అది ఎలాంటి నల్లమచ్చ లేదా నీవస్‌ అయినా... ఏ, బీ, సీ, డీ అన్న నాలుగు అంశాల్ని పిల్లల తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. ఇక్కడ ఏ– అంటే ఎసిమెట్రీ... అంటే పుట్టుమచ్చ సౌష్టవం లో ఏదైనా మార్పు కనిపిస్తుంటుందేమో అని గమనించడం, బీ– అంటే బార్డర్‌... అంటే పుట్టుమచ్చ అంచుల్లో ఏదైనా మార్పు ఉందా లేక అది ఉబ్బెత్తుగా మారుతోందా అని చూడటం, సీ– అంటే కలర్‌... అంటే పుట్టుమచ్చ రంగులో ఏదైనా మార్పు కనిపిస్తోందేమో గమనిస్తుండటం, చివరగా... డీ– అంటే డయామీటర్‌... అంటే మచ్చ తాలూకు వ్యాసం పెరుగుతోందా అని పరిశీలిస్తూ ఉండటం... ఈ నాలుగు మార్పుల్లో ఏది కనిపించినా తక్షణం డర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి.

నివారణ ఇలా... 
పిల్లల్లో నల్లమచ్చల నివారణకు... చిన్నారులను మరీ ఎర్రటి ఎండకు ఎక్కువగా ఎక్స్‌పోజ్‌ కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. చిన్నారుల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు అది హానికారక అల్ట్రావయొలెట్‌ కిరణాలకు ఎక్స్‌పోజ్‌ కాకుండా చూసుకోవాలి. చిన్నపిల్లల్ని బయటకు తీసుకెళ్లేప్పుడు, వారికి కూడా 30 ఎస్‌పీఎఫ్‌ ఉన్న సన్‌ స్క్రీన్‌ లోషన్స్‌ రాయాలి.

చికిత్స...
ఇక కొన్ని నల్లమచ్చలు హానికరం కాని నీవస్‌ మచ్చలే అయినప్పటికీ కొన్ని అవి చిన్నారుల లుక్స్‌కు కాస్మటిక్‌గా ఇబ్బంది కలిగిస్తుంటే... నిపుణులు వాటిని షేవ్‌ ఎక్సెషన్‌ థెరపీ వంటి ప్రక్రియల ద్వారా తొలగించడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ అవి ప్రమాదకరమైన మచ్చలైతే... సంబంధిత నిపుణుల చేత వాటికి అవసరమైన చికిత్సలు అందించాలి. 

డా. స్వప్నప్రియ, సీనియర్‌ డర్మటాలజిస్‌ 

(చదవండి: ఎక్కువసేపు నిద్రా? ఆందోళన వద్దు...)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement