సక్సెస్‌ బాటలో సహజ ఆర్గానిక్స్‌ | Sagubadi: success story of Sahaja Organics | Sakshi
Sakshi News home page

సక్సెస్‌ బాటలో సహజ ఆర్గానిక్స్‌

Mar 31 2026 12:20 AM | Updated on Mar 31 2026 12:38 AM

Sagubadi: success story of Sahaja Organics

1,024 మంది రైతులతో కూడిన ఆర్గానిక్‌ ఎఫ్‌పీఓ

రైతులకు 15–20% అదనపు ధరతో పాటు బోనస్‌ చెల్లింపు

ప్రధాని మోదీ ప్రశంసలు పొందిన ఆర్గానిక్‌ ఎఫ్‌పీఓ

దేశంలో సేంద్రియ వ్యవసాయానికి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలపై అధ్యయనం చెయ్యటానికి కేంద్ర ప్రభుత్వం డాక్టర్‌ కున్వర్‌జి భాయ్‌ జాధవ్‌ అధ్యక్షతన తొలి ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. దీని నివేదిక ఆధారంగానే ‘నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ ఆర్గానిక్‌ ప్రొడక్షన్‌’ (ఎన్‌పీఓపీ) పేరిట తొలి ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ వ్యవస్థ 2000 మార్చిలో అమల్లోకి వచ్చింది. 

సేంద్రియ వ్యవసాయం, సర్టిఫికేషన్‌ వ్యవహారాలను సమన్వయపరచడానికి ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ (ఎన్‌సీఓఎఫ్‌)’ 2004లో ప్రారంభమైంది. తదనంతరం ఈ సంస్థ పేరులో ‘నేచురల్‌’ అనే పదాన్ని చేర్చటం ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని కూడా కేంద్ర వ్యవసాయ శాఖ దీని పరిధిలోకి తెచ్చింది. అదే ఏడాది తొలి సేంద్రియ వ్యవసాయ విధానాన్ని 2004 మార్చి 24న అమల్లోకి తెచ్చిన ఘనత కర్ణాటక రాష్ట్రానికి దక్కింది. ఈ నేపథ్యంలో రూపుదిద్దుకున్న బెంగళూరుకు చెందిన సహజ ఆర్గానిక్స్‌ ఎఫ్‌పీఓ ప్రజల ఆదరణ పొందుతోంది.

130 ఉత్పత్తులు... రూ.28 కోట్ల టర్నోవర్‌
కర్ణాటకలో ఏర్పాటైన తొలి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ‘సహజ సమృద్ధ ఆర్గానిక్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌’. 16 ఏళ్ల క్రితం కంపెనీ చట్టం ప్రకారం బెంగళూరులో రిజిస్టరైన ఈ ఎఫ్‌పీఓ తన వాటాదారులైన 1,024 మంది సేంద్రియ రైతులకు అధిక నికరాదాయాన్ని అందిస్తోంది. దానితో పాటు, 15 రాష్ట్రాల్లోని సేంద్రియ రిటైల్‌ విక్రయదారులకు, వినియోగ­దారు­లకు నమ్మకమైన రసాయన అవశేషాల్లేని ఆహారోత్పత్తులను ‘సహజ ఆర్గానిక్స్‌’ బ్రాండ్‌తో చేరవేస్తోంది. 

130 పచారీ సామాన్లతో పాటు వంద రకాలకు పైగా కూరగాయలు, పండ్లను టోకుగా, రిటైల్‌గా విక్ర­యిస్తూ గత ఏడాది రూ.28 కోట్ల వార్షిక టర్నోవర్‌ సాధించింది. ప్రతిష్టాత్మక జైవిక్‌ ఇండియా ఫస్ట్‌ ప్రైజ్‌ సహా అనేక జాతీయ, అంత­ర్జాతీయ పురస్కారాలు గెల్చు­కుంది. అన్నిటికీ మించి, 2018 జూన్‌ 24న ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు పొందటం విశేషం.

రైతుకు 15–20% అదనపు ధర
సహజ ఆర్గానిక్స్‌ తన వాటాదారులైన రైతుల నుంచి, దేశవ్యాప్తంగా 25కు పైగా సేంద్రియ రైతు బృందాల నుంచి∙ఈ ఎఫ్‌పీఓ దేశీ వరి బియ్యం, పప్పులు, నూనె గింజలు, పండ్లు, బెల్లం, తేనె తదితరాలను సేకరిస్తుంది.  బెంగళూరు పరిసరాల్లోని 5 గ్రామాల్లో సేంద్రియ రైతుల నుంచి కూరగాయలు, పండ్లను సేకరిస్తుంది. రైతులకు, ప్రాసెసింగ్‌ యూనిట్, మిల్లులకు ఎన్‌పీఓపీ ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌తో పాటు ఐఎంఓ ఇంటర్నేషనల్‌ సర్టిఫికేషన్‌ తప్పనిసరి చేశారు. 

రైతులకు మార్కెట్‌ ధరపై 15–20% అదనపు ధర చెల్లిస్తున్నట్లు సహజ ఆర్గానిక్స్‌ ప్రతినిధి ప్రసాద్‌ బెంగళూరులోని ప్రాసెసింగ్‌ యూనిట్‌ను సందర్శించిన ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ప్రతి పంటకు బేస్‌ ధర ఉంటుంది. బహిరంగ మార్కెట్‌లో అంతకన్నా ధర పతనమైనా ఎఫ్‌పీఓ ఆ ధర చెల్లిస్తుందన్న మాట. ఉదా.. టొమాటో బేస్‌ ధర కిలోకు రూ. 10–12. ఎఫ్‌పీఓ ఖరారు చేసిన ముందస్తు ప్రణాళిక ప్రకారం.. రైతులు మిశ్రమ సేంద్రియ పంటలను నిర్దేశిత విస్తీర్ణంలో సాగు చేస్తారు. అవసరానికి మించి పండితే సాధారణ ధరలకే స్థానిక మార్కెట్లలో విక్రయిస్తారు. రైతులకు వారానికోసారి పైకం చెల్లిస్తున్నారు. ఎఫ్‌పీఓకి వచ్చిన లాభాల్లో నుంచి ఏడాదికి ఓసారి బోనస్‌ (విత్‌హెల్డ్‌ ప్రైస్‌) చెల్లిస్తున్నారు.

అంతర్జాతీయ ప్రమాణాల వల్లనే ప్రజల ఆదరణ
ఆరోగ్యకరమైన సేంద్రియ ఆహారోత్పత్తి ద్వారా వినియోగదారులకు, రైతులకు, మట్టికి, పర్యావరణానికి మేలు జరుగుతోంది. దీని ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రజలు మున్ముందు ఇంకా ఎక్కువగా గుర్తిస్తారు. బెంగళూరు, చెన్నై, కేరళ తదితర ప్రాంతాల్లో మా ఉత్పత్తులు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. మా వద్ద ఆర్గానిక్‌ ఉత్పత్తులను టోకుగా కొనుగోలు చేసి, ఎక్కడైనా రిటైల్‌గా విక్రయించుకునే వారి కోసం వైట్‌ ప్యాకింగ్‌తో లేదా వారి బ్రాండ్‌ కవర్‌తో ప్యాక్‌ చేసి ఇస్తున్నాం. నాణ్యత, విశ్వసనీయత, ట్రేసబిలిటీలకు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నాం. మా సేంద్రియ ఉత్పత్తులకు గత 16 ఏళ్లుగా ప్రజాదరణ పెరుగుతోంది.

– బి. సోమేశ్, సీఈవో, ఎండీ, సహజ సమృద్ధ ఆర్గానిక్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ, సిద్ధనపాల్య, బెంగళూరు 
somesh@sahajaorganics.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement