Richard Branson: నువ్వు గ్రేట్‌ మమ్మీ! 

Richard Branson Emotional Tribute To His Late Mother Eve - Sakshi

అంతరిక్ష పుత్రుడు

రిచర్డ్‌ బ్రాన్సన్‌ ఆదివారం అంతరిక్షంలోకి వెళ్లి రావడానికి ముందు తల్లికి ఒక ఉత్తరం రాశారు. ఈ ఏడాది జనవరిలోనే ఆమె తన 96 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ‘నువ్వు గ్రేట్‌ మమ్మీ. నీ చిన్నతనంలో అబ్బాయిలా డ్రెస్‌ చేసుకుని గ్లైడర్‌ లెసన్స్‌ నేర్చుకున్నావు. రెండో ప్రపంచ యుద్ధ చరిత్రలో గ్రేట్‌ బ్రిటన్‌తో పాటు యోధురాలిగా నీ పేరూ ఉంది. ఆంట్రప్రెన్యూర్‌ అనే మాట పుట్టక ముందే నువ్వు ఆంట్రప్రెన్యూర్‌ అయ్యావు.. ‘ అంటూ ఒక ఉద్వేగభరితమైన, స్ఫూర్తిదాయక లేఖను బ్రాన్సన్‌ రాశారు. ‘ధైర్యవంతులే ఏదైనా సాధిస్తారు.. జాగ్రత్తపరులు కాదు అని కూడా అందులో ఆయన తన తల్లిని కొనియాడారు. 

గొప్ప ప్రారంభం ఏదైనా భయభక్తులతో, భక్తిశ్రద్ధలతో కూడి ఉంటుంది. ‘భగవంతుడా నీదే భారం’ అని ముకుళిత హస్తాలు ఆశీస్సులను వేడుకుంటాయి. శాస్త్రవేత్తలైనా అంతే! దైవాన్ని కాకుంటే, వాళ్లకు స్ఫూర్తిని ఇచ్చిన మనిషినైనా గుర్తుచేసుకుని కార్యోన్ముఖులౌతారు. యూఎస్‌లో ఉంటున్న బ్రిటన్‌ కోటీశ్వరుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌ జూలై 11న ఆదివారం అంతరిక్షంలోకి వెళ్లే ముందు తన తల్లిని స్మరించుకున్నారు. ఆమెకొక లేఖను రాశారు. ఈవ్‌ బ్రాన్సన్‌ ఆమె పేరు. ఈ ఏడాది జనవరిలో కన్నుమూశారు. రిచర్డ్, మన తెలుగమ్మాయి శిరీషతో పాటు మరో నలుగురు వ్యోమగాములను రోదసీలోకి మోసుకెళ్లిన ‘వి.ఎం.ఎస్‌. ఈవ్‌’ వ్యోమనౌకలోని ‘ఈవ్‌’ అనే మాట రిచర్డ్‌ తన తల్లిపేరు లోంచి తీసుకున్నదే. వి.ఎం.ఎస్‌. అంటే ‘వర్జిన్‌ మదర్‌ షిప్‌’.

పదిహేడేళ్ల క్రితం యూఎస్‌లో రిచర్డ్‌ స్థాపించిన బ్రిటిష్‌–అమెరికన్‌ స్పేస్‌ ఫ్లయిట్‌ కంపెనీ వర్జిన్‌ గెలాక్టిక్‌ విజయవంతంగా రోదసీలోకి పంపిన ఈ తొలి మానవ సహిత వ్యోమ నౌక ఆ ఆరుగురు అంతరిక్ష ప్రయాణికులను అదే రోజు క్షేమంగా భూమి మీదకు తీసుకొచ్చింది. కిందికి దిగీ దిగగానే రిచర్డ్‌ పట్టలేని ఆనందంతో తన సహ వ్యోమగామి శిరీషను భుజాల మీదకు ఎక్కించుకున్నారు. భూమి నుంచి 88 కి.మీ. ఎత్తులో ఆయన్ని ఆ భార రహిత స్థితిలో కనీసం నాలుగు నిముషాలు ఊయలలాడించిన ఒడి మాత్రం అతడి తల్లి ఈవ్‌ బ్రాన్సన్‌ ఇచ్చి వెళ్లిన ఉత్తేజమే . ‘అమ్మా.. దీవించు’ అని స్పేస్‌లోకి ఎగరడానికి ముందు రిచర్డ్‌ రాసిన లేఖను అతడి మాతృమూర్తి ఆత్మ చదివే ఉంటుందని ఆయన భావించి ఉంటారనేందుకు ఒక సంకేతంగా కూడా శిరీషను ఆయన ఎత్తుకోవడాన్ని చూడవచ్చు. 
∙∙ 
తల్లికి రాసిన ఉత్తరంలో ‘అమ్మా నువ్వెప్పటికీ ఒక సాహసివి’ అని ఆమెను గుర్తు చేసుకున్నారు రిచర్డ్‌. తను చేయబోతున్న సాహసానికి ఆశీర్వచనాలను కోరారు. ఈవ్‌కు 26 ఏళ్ల వయసులో రిచర్డ్‌ జన్మించాడు. ముగ్గురు సంతానంలో తనే పెద్దవాడు. తర్వాత ఇద్దరు ఆడపిల్లలు. ఈవ్‌ తన పదిహేనవ యేటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ‘ఉమెన్స్‌ రాయల్‌ నేవల్‌ సర్వీస్‌’లో పని చేశారు. అమ్మాయిల సైనిక బృందానికి నాయకత్వం వహించారు!

ఇంకా చిన్న వయసులో అబ్బాయిల డ్రెస్‌ వేసుకుని గ్లైడింగ్‌ శిక్షణ తీసుకున్నారు. ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే బ్యాలే డాన్సర్‌గా పశ్చిమ జర్మనీలో పర్యటించారు. తిరిగొచ్చాక బ్రిటిష్‌ ఎయర్‌లైన్స్‌లో హోస్టెస్‌ అయ్యారు. ఇరవై ఐదో ఏట వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక రియల్‌ ఎస్టేస్‌ బిజినెస్‌ చేపట్టారు. మిలటరీ ఆఫీసర్‌గా, ప్రొబేషన్‌ అధికారిగా కూడా పని చేశారు. నవలలు, పిల్లల పుస్తకాలు రాశారు.

తల్లి అలసటన్నదే లేకుండా అనుక్షనం ఉత్తేజంగా ఏదో ఒక పని చేస్తుండటం రిచర్డ్‌ బ్రాన్సన్‌కి ఆశ్చర్యంగా ఉండేది. అతడు యువకుడు అయ్యేనాటికి బ్రిటన్‌లో పెద్ద ఆంట్రప్రెన్యూర్‌గా, గొప్ప పరోపకారిగా, బాలల సంక్షేమ సారథిగా ఆమె పేరు పొందారు. తల్లిని చూశాకే రిచర్డ్‌ తనొక ప్రయోగాల సాహసిగా మారాలనుకున్నాడు. ఆమె నుంచి స్ఫూర్తి పొంది అతడు సాధించిన తొలి విజయమే మొన్నటి వ్యోమయానం.

ఈవ్, రిచర్డ్‌ల మధ్య అనుబంధం ప్రత్యేకమైనది. రిచర్డ్‌ తను ఎదుగుతున్న దశలో తల్లిని చూసి నేర్చుకున్నవే కాదు, తల్లి ఎదుగుతున్నప్పుడు ఆమె చిన్ననాటి విశేషాలు కూడా అతడిని సాహసి అయిన బిజినెస్‌ మాగ్నెట్‌గా మార్చాయి. తల్లికి రాసిన ‘ఆశీర్వచనాలను కోరే’ ఆ ఉత్తరంలో అవన్నీ గుర్తు చేసుకున్నారు రిచర్డ్‌. ‘ధైర్యవంతులే ఏదైనా సాధిస్తారు. జాగ్రత్తపరులు కాదు’ అని తన తల్లి ధైర్యాన్ని మహిళావనికి ఒక ఆదర్శంగా కీర్తించారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top