ఇట్లు... రేవతి

Revathi Sakshi Interview about Itlu Amma Movie

శక్తి ఎక్కడో లేదు.. మనలోనే ఉంది.. తెలుసుకోవాలంతే... శాశ్వత ఆనందం.. అశాశ్వత ఆనందం... తేడా తెలుసుకోవాలంతే... ఎప్పుడు మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి?.. తెలుసుకోవాలంతే... పిల్లలను ఏ వయసు వరకూ గైడ్‌ చేయాలి.. ఆ విషయాన్ని తెలుసుకోవాలంతే... వెండితెరపై గుర్తుండిపోయే పాత్రల్లో అలరిస్తున్న రేవతి ‘ఇట్లు.. రేవతి’ అంటూ మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా చెప్పారు. ఆమె టైటిల్‌ రోల్‌లో ‘అంకురం’ ఫేమ్‌ ఉమామహేశ్వరరావు దర్శకత్వం వహించిన ‘ఇట్లు అమ్మ’ చిత్రం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సందర్భంగా రేవతితో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ.

► కథలు ఎంచుకునే విషయంలో మీరు మొదటి నుంచి సెలెక్టివ్‌గా ఉంటారు. ‘ఇట్లు అమ్మ’ అంగీకరించడానికి కారణమేంటి?
రేవతి: నటిగా 30 ఏళ్లు దాటిన తర్వాత మంచి పాత్రలు రావడం చాలా తక్కువ అవుతుంది. నిజానికి నేను బాగా కనెక్ట్‌ అయ్యే పాత్రలు చాలా తక్కువ వస్తున్నాయి. ‘ఇట్లు అమ్మ’ స్క్రిప్ట్‌ వినగానే కనెక్ట్‌ అయ్యాను. అందుకే వెంటనే చేయాలని నిర్ణయించుకున్నాను. సి.ఉమామహేశ్వరావు డైరెక్షన్‌లో నేను ‘అంకురం’ (1992) సినిమా చేశాను.. మంచి దర్శకుడు. ఆయన ‘ఇట్లు అమ్మ’ కథ’ చెప్పగానే ఎగ్జయిట్‌ అయ్యాను.

► ‘ఇట్లు అమ్మ’లో కొడుకుని వెతికే సింగిల్‌ మదర్‌ పాత్రలో కనిపించారు. సినిమాలో ‘సింగిల్‌ మదర్‌’ గెలుస్తుంది. కానీ జీవితంలో సింగిల్‌ మదర్‌ గెలిచే అవకాశం ప్రస్తుత సమాజం ఇస్తుందంటారా?
సమాజమంటే మనమే కదా. ఓ మంచి సమాజాన్ని ఏర్పరచాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది. ఇదే విషయాన్ని ‘ఇట్లు అమ్మ’లో చెప్పాం. ‘ఇట్లు అమ్మ’ ఒక అమ్మ, ఒక స్త్రీ కథ మాత్రమే కాదు. నిజానికి మనం, మన ఇల్లు, మన కుటుంబం, స్నేహితులు, మనమందరం అని మాత్రమే ఆలోచిస్తాం. దీన్ని దాటి చూడం. ఏం జరుగుతున్నా పెద్దగా పట్టించుకోం. ఏదైనా జరిగితే మాట్లాడుకుని వదిలేస్తాం తప్పితే మన వంతుగా ఏం చేయాలో ఆలోచించం. ‘ఇట్లు అమ్మ’ లో నేను చేసిన రోల్‌ కూడా ఇదే. బాల సరస్వతి (‘ఇట్లు అమ్మ’లో రేవతి చేసిన పాత్ర) సాధారణ గృహిణి. నా ఇల్లు, నా కుటుంబం అనుకుంటుందామె. కానీ తన జీవితంలో ఎదురయ్యే సందర్భాలు తనని, తన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చాయి? తను ఎలా మారింది? అన్నది కథ. ఇంకా బాల సరస్వతి చాలా తెలివైనది. దైవభక్తి చాలా ఎక్కువ. నేనస్సలు కాదు.

► అంటే... మీరు దేవుణ్ణి నమ్మరా?
నమ్మనని కాదు. బాల సరస్వతి నమ్మినంతగా నమ్మకం లేదు. అయితే ఒక శక్తి మనల్ని నడిపిస్తుందని నమ్ముతాను. నా వెనక ఓ శక్తి ఉందని నమ్ముతాను. ఏదైనా కష్టం వచ్చినప్పుడు కళ్లు మూసుకుని ప్రార్థన చేస్తాను. కానీ ప్రత్యేకంగా ఓ ప్రదేశానికి వెళ్లి పూజించడాన్ని నమ్మను. మా ఇంట్లో రోజువారి పనుల్లో దీపం వెలిగించడం కచ్చితంగా ఒకటి. దైవభక్తికి, ఆధ్యాత్మికతకు చాలా తేడా ఉంది. నేను ‘అహం బ్రహ్మాస్మి’ అనే సిద్ధాంతాన్ని నమ్ముతాను. శక్తంతా మనలోనే ఉందని గ్రహించాలి. మనం ఆ బలాన్ని ఉపయోగించుకోవాలి.

► మీ వెనక ఓ శక్తి ఉందన్నారు. ఆ శక్తి మీ జీవితాన్ని సాఫీగా సాగేలా చేస్తోందంటారా? మీకు సహాయపడిందంటారా?
మన వెనక ఉండే శక్తి కేవలం గైడ్‌ మాత్రమే. అది మనకు మంచి జీవితం, మంచి కెరీర్‌ ఇవ్వదు. శక్తి ఉంది కదా అని సైలెంట్‌గా కూర్చోకూడదు. మన కష్టం, మన శ్రమ మాత్రమే ఇస్తాయి. వెనకాల ఉండే ఫోర్స్‌ గైడ్‌ చేస్తుంది. ఆ గైడెన్స్‌ ఉందని నా నమ్మకం. ఇంకా నా గైడింగ్‌ ఫోర్స్‌ అంటే నా కుటుంబమే. అమ్మ, నాన్న, సిస్టర్‌ నా వెనక ఉన్నారు... నన్ను నడిపించారు... నడిపిస్తుంటారు. అలానే నిర్ణయాల విషయంలో ఇది సరైనదా? కాదా, తప్పా? ఒప్పా అనేది మాత్రం నాకు తెలిసిపోతుంది.

► సమాజంలో మ్యారీడ్‌ ఉమన్‌ జీవితానికి ఉండే భరోసా సింగిల్‌ మదర్‌కి ఉంటుందంటారా?
జీవితం ఎవ్వరికీ సాఫీగా ఉండదు. సమాజంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య... గొడవ ఉంటుంది. దాన్ని మనం ఎలా ఎదుర్కొంటాం అనేది ముఖ్యం. ఎదుర్కొనే క్రమంలో మనం నేర్చకున్న విషయాలను పిల్లలకు చెప్పి, ఎలా ఎదుర్కొనేలా తయారు చేస్తాం అనేది ముఖ్యం. లైఫ్‌లో ఏదీ సులువు కాదు. ప్రతి దాని వెనక ఏదో ఒక కష్టం ఉంటుంది.. సమస్య ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఓ యుద్ధం చేస్తూనే ఉంటారు.

► మీ నాన్న ఆర్మీ ఆఫీసర్‌. ఆయన నేర్పిన ధైర్యమే మిమ్మల్ని ధైర్యంగా నడిపిస్తుందని అనుకుంటున్నారా?
ఖచ్చితంగా.. మా అమ్మానాన్న నన్ను, నా సిస్టర్‌ని చాలా బాగా పెంచారు. అసలు లింగ వివక్ష అనేది ఉంటుందని నాకు 30 ఏళ్లు వచ్చాకే తెలిసింది. అప్పటివరకూ అమ్మాయిని ఒకలా చూస్తారు, అబ్బాయిని ఒకలా చూస్తారనే విషయమే నాకు తెలియదు. ఆర్మీలో అందర్నీ ఒకేలా చూశారు. దాంతో మాకు అబ్బాయి వేరు... అమ్మాయి వేరు అనే ఫీలింగ్‌ కలగలేదు.

► కరోనా లాక్‌డౌన్‌.. ప్రపంచం ఎటు వెళుతుందో అర్థం కాని పరిస్థితి.. ఒక అనిశ్చితి ఉందనేది చాలామంది ఫీలింగ్‌. మీరేం చెబుతారు?
నిజమే. ప్రస్తుతం మనందరం ఓ అయోమయ స్థితిలో ఉన్నాం. ఎటు వెళ్తున్నామో అర్థం కాని పరిస్థితి. ఈ కోవిడ్, లాక్‌డౌన్‌ మనందరినీ ఏది ముఖ్యమో ఆలోచించేలా చేసింది. కేవలం మనం మాత్రమే కాదు.. మన చుట్టూ ఉన్నవి కూడా మనం పట్టించుకోవాలి. అప్పుడే మన పిల్లలకు ఓ మంచి సమాజాన్ని ఏర్పాటు చేయగలం. వాళ్లకు డబ్బు, ఇల్లు కాదు మంచి విద్య, మంచి సమాజాన్ని, సురక్షితమైన వాతావరణాన్నీ ఇవ్వాలి. మన పిల్లలకు మనమిచ్చే గొప్ప సంపద అదే.

► పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని, సమాజాన్ని ఇవ్వాలన్నారు. ప్రస్తుతం మన సమాజం అమ్మాయిలకు సురక్షితంగా ఉందంటారా? చాలా దారుణాలు జరుగుతున్నాయి. వీటికి కారణమేమంటారు?
నాకు నిజంగా తెలియదు. కారణం ఇదీ అని విశ్లేషించగలిగి ఉంటే పరిష్కారం చెప్పేదాన్ని. ప్రస్తుతం అందరి అవసరాలు మారిపోయాయి. ఇప్పటివారి అవసరాలు మన ముందు తరాల వాళ్లకంటే మారిపోయాయి. మా అమ్మ వాళ్లు ఒకలా బతికారు. మేము ఒకలా. ఇప్పుడు మా పిల్లలు ఒకలా ఉన్నారు. ఆ అవసరాల కోసం మనం ఎంతలా తాపత్రయపడుతున్నాం? మనం ఎంత నైతిక భాధ్యతతో ఉంటున్నాం అనేది మారిపోయింది. ఇది తప్పు, ఇది ఒప్పు అనే ఫిలాసఫీ మారిపోయింది. ఒక జనరేషన్‌ నుంచి ఇంకో జనరేషన్‌కే ఇది బాగా మారిపోయింది. కాకపోతే ఒకప్పటి విధానాల్లో కొన్నింటిని తిరిగి తీసుకురావాలి. అది ఎలా తీసుకురావాలో నిజంగా తెలియదు. అయితే మన పిల్లలతో మనం మాట్లాడాలి. నిజమైన సంతోషమేంటి? శాశ్వత ఆనందమేంటి? అశాశ్వతం ఏంటి? అనే విషయాలను వాళ్లకు వివరించాలి.  
     
► మాకు ‘ప్రైవసీ’ కావాలని ఇప్పటి తరం అంటోంది. ఎక్కువ స్వాతంత్య్రం ఇచ్చినా ఇబ్బందే అంటారా? అసలు పిల్లల్ని ఏ వయసు వచ్చేవరకూ తల్లిదండ్రులు గైడ్‌ చేయాలి?
18ఏళ్ల వయసొచ్చే వరకే పిల్లల్ని మనం గైడ్‌ చేయాలి. ఆ తర్వాత వాళ్లను వాళ్లే గైడ్‌ చేసుకోవాలి. అలా వాళ్లను వాళ్లు గైడ్‌ చేసుకునే ధైర్యం, తెగువ అన్నీ మనమే ఇవ్వాలి. 20 ఏళ్ల తర్వాత కూడా పిల్లల్ని గైడ్‌ చేయడం అనేది నాన్సెన్స్‌ అంటాను నేను. వాళ్లు చిన్న చిన్న తప్పులు చేయాలి.. ఆ తప్పుల నుంచి నేర్చుకోవాలి. వాటిని సరిదిద్దుకోవడం తెలుసుకోవాలి. అలా చేయకూడదు అని ఆలోచించగలగాలి. అయితే 10–12 ఏళ్ల వయసులోనే ఈ ఫౌండేషన్‌ పడేలా చూసుకోవాలి. తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకు చాలా ప్రేమ, భద్రత ఇవ్వాలి. ఏదైనా సమస్య వచ్చిన వెంటనే వాళ్లు మనతో నిర్మొహమాటంగా, నిర్భయంగా పంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. 20 ఏళ్ల తర్వాత కూడా పిల్లల్ని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఏది చేయాలో ఏది చేయకూడదో చెప్పడం నాన్సెన్స్‌.

► ఓకే... మీ మాటలను బట్టి మీ అమ్మాయి మహీకి అన్నీ వివరంగా చెబుతారనిపిస్తోంది..
అవును. ప్రతి తల్లికీ బిడ్డల మీద ప్రేమ ఉన్నట్లుగానే నాకూ తనంటే చాలా ప్రేమ. ప్రేమతో పాటు సెక్యూర్డ్‌ ఫీలింగ్‌ని కలగజేస్తాను. మహీ తనంతట తాను నిలబడటానికి గైడ్‌ చేస్తూ ఉంటాను. తను ఇండిపెండెంట్‌ అమ్మాయి.

► మహీ ఏం చదువుతోంది?
థర్డ్‌ గ్రేడ్‌లో ఉంది.

► ఏ ఇండస్ట్రీలో అయినా స్త్రీలకు ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఆ ఇబ్బందులను బయటకు చెబితే ‘తప్పు తనదేనేమో’ అనేవాళ్లు ఉంటారు. మరి.. మీరు మీకు ఎదురైన ఇబ్బందులు చెప్పుకోవడానికి భయపడిన సందర్భాలున్నాయా?
అదృష్టవశాత్తు లేవు. మొదట్నుంచీ కూడా నాకు చాలా తక్కువ మాట్లాడటం అలవాటు. కానీ మాట్లాడే విషయాన్ని మాత్రం చాలా విజన్‌తో, అవగాహనతో మాట్లాడతాను. దాంతో అందరూ నా మాట వినేవారు. ఈ సందర్భంగా నేనొక విషయం చెబుతాను. ఎప్పుడు మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? అనే విషయాన్ని కూడా మనం పిల్లలకు నేర్పించాలి. అది చాలా ముఖ్యం.

► మంచి విజన్‌తో, అవగాహనతో మాట్లాడితే అందరూ వింటారని అన్నారు. మీలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వస్తే ప్రజలు మీ మాట వినే అవకాశం ఉంటుంది.. 1996 తర్వాత మళ్లీ మీరు రాజకీయాల్లోకి రాలేదేం?
అలా ఆలోచించే 1996 ఎన్నికల్లో నిల్చున్నాను కూడా. కానీ ప్రస్తుతం ఆలోచించడం లేదు. ఎందుకంటే పాలిటిక్స్‌ అనేది 24/7 జాబ్‌. ప్రస్తుతం నాకు ఓ పాప ఉంది. తనని చక్కగా పెంచాలి. మంచి సిటిజన్‌గా మార్చాలి. ఈ బాధ్యత పూర్తయ్యాక రాజకీయాల గురించి ఆలోచిస్తానేమో ఇప్పుడే చెప్పలేను.

► మీరు హీరోయిన్‌గా చేసే సమయంలో కథలు చాలా బావుండేవి. ఇప్పుడు అలాంటి కథలు ఉన్నాయంటారా?
కథలు ఉన్నాయి.. అయితే కథలు చెప్పే విధానంలో మార్పు వచ్చింది. కొన్ని మలయాళం, హిందీ సినిమాల్లో కథ చెప్పే విధానం అద్భుతంగా ఉంది. మంచి సినిమాలను మనందరం సపోర్ట్‌ చేయాలి. అప్పుడే మంచి సినిమాలు తీస్తారు.

► ఫైనల్లీ.. కొంత గ్యాప్‌ తర్వాత ‘ది లాప్ట్‌ హుర్రా’ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు... ఆ సినిమా గురించి?
చాలా సంవత్సరాల క్రితం చదివిన కథ ఇది. ఆ కథను మంచి స్క్రిప్ట్‌గా తయారు చేశాం. ఎలాంటి క్లిష్ట పరిస్థితులను అయినా నవ్వుతూ ఎదుర్కొనే ఓ తల్లి కథ ఇది. ఈ కథకు కాజోల్‌ సరిపోతారని ఆమెను తీసుకున్నాం.

►ప్రస్తుత సోషల్‌ మీడియా జనరేషన్‌లో మంచి విషయంలోనూ చెడు చూడటం కామన్‌ అయింది... ఈ విషయం గురించి ఏం చెబుతారు?
తరాలు మారుతుంటాయి. ఆ మార్పుతో మనం ముందుకు వెళ్లాలి. మంచి, చెడు అని చెప్పలేం. సోషల్‌ మీడియాలో విమర్శలు అంటున్నారు. అసలు ఆ విమర్శలను ఎందుకు పట్టించుకుంటున్నారు? వాటికి ఎందుకు అంత టైమ్‌ కేటాయిస్తున్నారు? నేను సోషల్‌ మీడియాని నాకు కావాల్సిన సమాచారాన్ని తీసుకోవడం వరకే ఉపయోగిస్తాను. ఏదైనా తెలుసుకోవడానికో, నేర్చుకోవడానికో, నాకు తెలిసింది పంచుకోవడానకో... అంతే. విమర్శలకు ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఆటోమేటిక్‌గా అవే తగ్గిపోతాయి. అది నా నమ్మకం. ఇప్పుడు మనం అపార్ట్‌మెంట్‌లో ఉన్నాం అనుకుందాం. మన పని మనం చేసుకుంటే హాయిగా ఉంటుంది. ఎదురింట్లో వాళ్లకి ఫ్రిజ్‌ ఉందా? పక్కింట్లో వాళ్లకు ఎలాంటి చీర ఉంది? అనేవి పట్టించుకొని ప్రతీది ఆలోచిస్తేనే ప్రాబ్లమ్‌. మన గురించి మనం చూసుకుని, మన చుట్టూ ఉండేవాళ్ల విషయాలను విమర్శించకుండా ఉంటే ఏ గొడవా ఉండదు. 

– డి.జి. భవాని

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top