Jhangora Ki Kheer: వలు, ఊదలతో నోరూరించే రుచులు.. కొంచెం కారం, కొంచెం తీపి!

Recipes In Telugu: How To Jhangora Ki Kheer And Ulavala Fanu - Sakshi

హిమాలయాల్లో పర్యాటకుల మనసులు దోచుకునే రాష్ట్రాలలో ఉత్తరాఖండ్‌ ఒకటి. అక్కడి ప్రకృతి అందాలు, దేవాలయాలు ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో సంప్రదాయ వంటలు అంతేస్థాయిలో నోరూరిస్తాయి. ఊరించే ఉత్తరాఖండ్‌ రుచుల్లో కొన్నింటిని ఎలా వండుతారో తెలుసుకుందాం...

ఉలవల ఫాను తయారీ ఇలా!
కావలసినవి:
►ఉలవలు – కప్పు
►ఆవనూనె – అరకప్పు
►వెల్లుల్లి రెబ్బలు – ఐదు, అల్లం – అరంగుళం ముక్క
►జీలకర్ర – టీస్పూను, ఇంగువ – పావుటీస్పూను
►ధనియాల పొడి – అరటీస్పూను, పసుపు – పావు టీస్పూను
►పచ్చిమిర్చి – నాలుగు, ఉప్పు – రుచికి సరిపడా
►నెయ్యి– టీస్పూన్, కొత్తిమీర – గార్నిష్‌కు సరిపడా. 

తయారీ...
►∙ఉలవలను శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి.
►ఉదయం ఉలవలను తొక్కపోయేంత వరకు కడగాలి. దీనిలో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
►స్టవ్‌ మీద పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేయాలి. నూనె కాగిన తరువాత రుబ్బుకున్న సగం పిండిని చిన్నచిన్న కట్‌లెట్‌లా చేసి రెండువైపులా చక్కగా కాల్చి పక్కనపెట్టుకోవాలి.
►మిగతా పిండిలో మూడుకప్పుల నీళ్లుపోసి కలపాలి
►ఇప్పుడు స్టవ్‌ మీద మరో బాణలి పెట్టి మిగిలిన నూనె మొత్తం వేసి కాగనివ్వాలి. కాగిన నూనెలో తరువాత జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి.
►ఇవి వేగాక నీళ్లు కలిపిన పిండి రుబ్బు, పసుపు, ధనియాలపొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి
►∙మూత పెట్టి సన్నని మంట మీద పదినిమిషాలు మగ్గనివ్వాలి. 
►తరువాత వేయించి పెట్టుకున్న కట్‌లెట్లు వేసి మరో పదినిమిషాలు ఉడికించాలి.
►పప్పు మిశ్రమం దగ్గర పడిన తరువాత కొత్తిమీర తరుగు, నెయ్యితో గార్నిష్‌ చేసి దించేయాలి. అన్నంలోకి ఇది చాలా బావుంటుంది.

ఝంగోరా కీ ఖీర్‌
కావలసినవి
►ఊదలు – మూడు కప్పులు, పంచదార – ఐదు కప్పులు
►జీడిపప్పుపలుకులు – టేబుల్‌ స్పూను, కిస్‌మిస్‌ – అరటేబుల్‌ స్పూను
►పాలు – మూడున్నర లీటర్లు
►క్వేరా ఎసెన్స్‌ – మూడు టేబుల్‌ స్పూన్లు
►బాదం పలుకులు – అరకప్పు.

తయారీ...
►మందపాటి పాత్రలో పాలు పోసి కాచాలి.
►కాగిన పాలలో ఊదలు వేసి ఉండలు లేకుండా కలపాలి.
►ఊదలు ఉడికిన తరువాత పంచదార వేసి కరిగేంత వరకు తిప్పుతూ ఉడికించాలి.
►పంచదార కడిగిన తరువాత క్వెరా ఎసెన్స్‌ వేసి దించేయాలి.
►ఈ మిశ్రమం చల్లారాక గిన్నెలో వేసి రిఫ్రిజిరేటర్‌లో రెండు గంటలపాటు ఉంచాలి.
►రెండు గంటల తరువాత చల్లటి ఖీర్‌లో బాదం, జీడిపలుకులతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.  

ఇవి కూడా ట్రై చేయండి: Makki Roti: వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో సులువుగా మక్కి రోటీ తయారీ!
Chana Madra Recipe: హిమాచల్‌ వంటకం.. చనా మద్రా ఎప్పుడైనా తిన్నారా!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top