Pudami Sakshiga: పుడమితో చెలిమి.. సాక్షి యాజమాన్యాన్ని అభినందిస్తున్నా

Pudami Sakshiga: Governor BiswaBhusan Harichandan Appreciates Sakshi Media

సమస్త జీవులకు ఆధారమైన పుడమి, సంక్షోభంలోకి జారుతోంది. పర్యావరణ సమస్యలతో ప్రకృతి తల్లడిల్లిపోతోంది. దీనంతటికీ కారణమైన మనిషి, మేల్కొని ఈ దురవస్థను చక్కదిద్దుకోవాల్సిన అత్యయిక పరిస్థితి ముంచుకొచ్చింది. అందుకే, బాధ్యత కలిగిన సాక్షి మీడియా గ్రూప్‌ ఏటా నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమం పుడమి సాక్షిగా! 

‘వాతావరణ మార్పు’ ప్రమాద పరిస్థితులు, ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవశ్యకత, పర్యావరణ సమతుల్యత సాధనలో ప్రభుత్వాల, కార్పోరేట్ల, పౌర సమాజాల, గ్రామాల, కుటుంబాల, వ్యక్తుల బాధ్యతలేమిటో అవగాహన కల్పించేలా‘పుడమి సాక్షిగా’ రెండో ఎడిషన్‌ (2022) నిర్వహించాం. ఈ కార్యక్రమం లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ప్రముఖులు, పరిశోధకులు, పర్యావరణవేత్తలు, విధాన నిర్ణేతలు, సినీ నటులు, కవి–గాయకులు తదితరులు పాల్గొన్నారు. సాక్షి టీవీ, పత్రిక, వెబ్‌సైట్‌ వేదికలుగా... గత కొద్ది రోజులుగా మెగా క్యాంపెయిన్‌ రూపంలో సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 8 గంటల ‘మెగా టాకాథన్‌’ జరిగింది.

నాలుగు ప్రధాన అంశాలు గాలి, నీరు, నేల, శక్తిపై లోతైన చర్చలు ప్రత్యేక ఆకర్షణ! పుడమి సమస్యలు, తీవ్రత, ప్రతికూల ప్రభావాలు, పరిష్కారాలు... ఈ కృషిలో ఆదర్శంగా నిలుస్తోన్న వ్యక్తులు, వ్యవస్థలను ఇందులో ప్రస్తావించారు. అంతులేని కాలుష్యాలు, పాలనా వైఫల్యాలు, పౌర సమాజ నిర్లక్ష్యం వంటి లోపాలను ఎత్తి చూపారు, ప్రకృతిని కాపాడే ఆదర్శ విధానాలు, పద్ధతులను ఎలుగెత్తి చాటారు. అన్ని స్థాయుల్లో ఎవరు... ఏం చేస్తే... పుడమిని కాపాడుకోవచ్చో... విలువైన సమాచారం, ప్రేరణ, స్ఫూర్తి...‘పుడమి సాక్షిగా’ మీ కోసం.

ప్రకృతికి అనుకూలంగా మీ జీవితం గడపండి..
పుడమి సాక్షిగా పేరుతో సాక్షి మీడియా గ్రూప్‌ చేపడుతున్న పర్యావరణ కార్యక్రమం హర్షించదగింది. సామాజిక బాధ్యతలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని చేపట్టినందుకు సాక్షి యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. ప్రకృతిని మనం ఇప్పుడు కాపాడకపోతే.. భవిష్యత్తు తరాలకు దాన్ని స్వచ్ఛంగా అందించలేం. బాధ్యతాయుతమైన పౌరులుగా భూమాతను కాపాడుకునే ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. మనందరం ప్రతి సందర్భంలో మొక్కలు నాటితే.. అవి మనకు స్వచ్ఛమైన గాలిని, ఆహారాన్ని ఇస్తాయి. ప్రకృతికి అనుకూలంగా మీ జీవితం గడపండి.
– బిశ్వభూషణ్‌ హరిచందన్,  గవర్నర్, ఏపీ.

పుడమిని కాపాడేందుకు సాక్షి మీడియా గ్రూప్‌ చక్కటి ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో మన వంతుగా పాల్గొందాం. మూడు సులభమైన మార్గాలను ఎంచుకుందాం. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్‌. ప్రకృతి వనరులను ఇబ్బంది పెట్టకుండా జీవించడం నేర్చుకోవాలి. నీటి వృథాను నివారించడంతోపాటు వర్షపు నీటిని కాపాడుకోవాలి. అలాగే విద్యుత్తును కూడా. చెట్లు మనకెంతో మేలు చేస్తాయి. వాటిని కాపాడుకోవాలి. మరిన్ని చెట్లను పెంచాలి.
– పద్మభూషణ్‌ పి.వి.సింధు, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య పర్యావరణ పరిరక్షణ. దీన్ని గ్లోబల్‌ అల్టిమేటంగా చూడాల్సిందే. రాష్ట్రానికి పరిశ్రమలు అవసరమే కానీ దానికోసం భవిష్యత్తు తరాలను తాకట్టు పెట్టొద్దని మా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. మా రాష్ట్రంలో ఏ విధానపరమైన నిర్ణయం తీసుకున్నా.. అది ప్రకృతికి అనుకూలంగా ఉండేలా జాగ్రత్త పడతామని తెలియజేస్తున్నాను. పెరిగిపోతున్న జనాభా, తరిగి పోతున్న వనరులు, మనిషిలో నిర్లక్ష్యం.. ఇవన్నీ పర్యావరణం పట్ల అవగాహన లేకపోవడం వల్లే. అందుకే పర్యావరణాన్ని పాఠశాల విద్యలో భాగం చేస్తున్నాం.
– మేకపాటి గౌతమ్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి , ఏపీ

అందరూ ఈ ఉద్యమంలో కలిసి వస్తే అద్భుతమైన మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ను వద్దని చెబితే.. ఎంతో మేలు జరుగుతుంది. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. – శేఖర్‌ కమ్ముల, సినీ దర్శకుడు

పర్యావరణ కాలుష్యం పై ప్రజలకు అవగాహన పెంచడానికి ‘పుడమి సాక్షిగా’ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు సాక్షి యాజమాన్యానికి అభినందనలు. ప్రకృతిలో జీవిద్దాం. స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం. ఏసీ వినియోగాన్ని తగ్గిద్దాం.  చెట్లు నాటితే అవి వాతావరణాన్ని చల్లగా ఉంచుతాయి.  ఫలాలను ఇవ్వడంతోపాటు ఆక్సిజన్‌నూ అందిస్తాయి. పర్యావరణ పరిరక్షణకు పుడమి సాక్షిగా ముందుకు కదులుదాం.
– శ్రీకాంత్‌ కిడాంబి, బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు 

ఒకవైపు అభివృద్ధి, మరో వైపు పర్యావరణం.. ఈ రెండింటి మధ్య సమతుల్యత తీసుకు రావాలన్న సీఎం ఆశయంలో భాగంగా గ్రీన్‌ ఇండస్ట్రీస్‌కు ప్రాముఖ్యత ఇస్తున్నాం. సామాజిక స్పృహకలిగించేలా కార్యక్రమాలు చేపడుతున్నాం. 50 మైక్రాన్స్‌ కంటే తక్కువ ఉండే ప్లాస్టిక్‌ బ్యాగులు వాడొద్దని చెబుతున్నాం. ప్రజలలో అవగాహన కల్పించేందుకు సాక్షి మీడియా ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. -విజయ్‌కుమార్, మెంబర్‌ సెక్రటరీ, కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top