
ముందే మేల్కొనాలి!
ఎవరైతే జీవిత ప్రాముఖ్యాన్నీ, దాని ప్రయోజనాన్నీ తెలుసు కోవడానికి ప్రయత్నించరో... అటువంటివారు తమ జీవితాన్ని వృథా చేసుకొంటారు. చాలామంది తాము ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు, వృత్తులపైనా; బంధువులు, స్నేహితులు, విలాసాల పైనా మనసును నిమగ్నం చేసి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అటువంటివారు దురదృష్టవంతులు. ఎందుకంటే... వారు పైపై ప్రాపంచిక విషయాల వల్ల సంతోషాన్ని పొందుతూ, విషయవాంఛల్లో మునిగిపోతూ ఉంటారు. జీవితంలో ఏ సంఘటన కూడా అటువంటి వారి హృదయాన్ని చలింపజేయదు. ఆ విధంగా ఎంత కాలం మోటుగా జీవితం సాగించగలరు?
పరాత్పరుడే వారిని ఏదో ఒకరోజు తన వైపు మళ్ళించుకుంటాడు. ముందుగా ప్రతికూ లత, నిరాశ, నిస్పృహలు వారిని చుట్టు ముడ తాయి. అందువలన వారికి అతీతమైన ఏదో ఒక శక్తి వారి ఊహలను తారుమారు చేస్తూ ఉన్నట్లు తెలుసుకుంటారు. అప్పుడు వారు నెమ్మదిగా దేవాలయాలకు, గురువు దగ్గరికి వెళ్ళడం, సంప్రదాయంగా పూజించడం ప్రారంభిస్తారు. చివరగా వారు జీవితం ఎందుకు వచ్చింది, దానికి గల ప్రయోజనం ఏమిటి అని ఆలోచిస్తారు.
చదవండి: ఆటలు లేని బాల్యం : ఊబకాయం, ఫ్యాటీ లివర్
దుఃఖం, నిరాశ కలిగే వరకూ వేచివుండి, దేవుని శరణు జొచ్చుట తెలివిగలవారు చేసే పనేనా? మరణం సంభవించే వరకూ నిరీక్షిస్తూ, మందబుద్ధితో ఉండటమా? దీని గురించి సుదీర్ఘంగా ఆలోచించాలి. నీకు జీవితం ఎందుకు వచ్చిందంటూ విచారిస్తూ (ఆలోచిస్తూ) కాలం వృథా చేయకూడదు. అంటే ఈ విషయాన్ని త్వరగా తెలుసుకొని, జీవితాన్ని సఫలం చేసుకోవాలి. ఉపన్యాసాల కన్నా, రాతల కన్నా శక్తిమంతమైనది ధ్యానశక్తి. ఉపన్యాసాలు, పుస్తకాలు స్వల్ప ప్రయోజనం కలిగిస్తాయి. ప్రారంభ దశలో ఉన్నవారికి అవి మార్గాన్ని చూపించడానికి ఉపయోగ పడతాయి. ఆధ్యాత్మిక విషయాలలో అవి మీ ఆసక్తిని పెంపొందించినా పెంపొందించవచ్చు. మెదడుకు మేత పెట్టవచ్చు. బుద్ధికి ప్రోత్సాహాన్ని కలిగించవచ్చు. కాని అవి ‘ఆత్మజ్యోతి’ని చూపించలేవు. ఇటువంటి దర్శనానికై మనస్సు ఆత్మను అంటిపెట్టుకొనిఉండాలి. ఈ విషయంలో సద్గురువు నిర్దేశంలో ధ్యానం చేయడమే మార్గం. నీవు దేనిని గూర్చి అన్వేషిస్తున్నావో, అది నీ లోపలే ఉంది. పుస్తకాలన్నీ బాహ్య ప్రపంచంలో ఉన్నాయి. ధ్యానంలోనే నిజమైన కార్యం జరిగిపోతుంది. ‘ఆత్మపై లక్ష్యమును ఉంచి ధ్యానం చెయ్యి’ అని భగవద్గీత కూడా ప్రబోధిస్తోంది
శ్రీగణపతి సచ్చిదానందస్వామి
Comments
Please login to add a commentAdd a comment