పేరెంట్‌ మార్క్‌ స్కాలర్‌షిప్స్‌ | parents turn over guardianship of their teenager childrens | Sakshi
Sakshi News home page

పేరెంట్‌ మార్క్‌ స్కాలర్‌షిప్స్‌

May 17 2026 6:37 AM | Updated on May 17 2026 6:37 AM

parents turn over guardianship of their teenager childrens

వేసవి కానుక 

సంస్థలు ఇచ్చేది మార్కులకు స్కాలర్‌షిప్‌. కాని తల్లిదండ్రులు ఇవ్వాల్సింది బతుకుకు స్కాలర్‌షిప్‌.  ఈ సెలవుల్లో పిల్లలకు నేర్పాల్సిన ఆరు లక్షణాలు: 1. కుతూహలం 2. ఓర్పు 3. సహానుభూతి 4. శ్రమ 5. ఓటమి ఒప్పుకోలు 6. కృతజ్ఞత... రోజుకో గంట. సెలవులు మరో 30 రోజులు. ఎలా నేర్పాలో చదవండి. చివరి రోజు ‘స్కాలర్‌షిప్‌ సర్టిఫికెట్‌’ ఇచ్చి వాళ్లు కోరిన సబబైన కానుక ఇవ్వండి. అదే అసలైన వేసవి ఫలితం. 

వేసవి సెలవులు ఇంకో 30 రోజులున్నాయి. ఆటలూ పాటలూ సరే. వాటితోపాటు కొన్ని వ్యకిత్వ గుణాల్లో కూడా తర్ఫీదు ఇవ్వాలి. మార్కుల కోసం హితవు చెప్పినట్టే ఈ లక్షణాల పెంపు కోసం కూడా హితవు చెప్పాలి. అందుకు స్కాలర్‌షిప్‌లు ప్రకటించండి. పిల్లల్లో ఆరు ఉత్తమ లక్షణాలను నాటి, పెంచి, సెలవులు అయిపోయే రోజు ‘స్కాలర్‌షిప్‌’ పేరుతో వాళ్లు అడిగిన సబబైన కానుక ఇవ్వండి. ఆ కానుక అందుకునే సమయానికి పిల్లలు ‘మనిషి’గా తయారై ఉంటారు.  అదీ సంతోషం. ఇంతకీ ఆ ఆరు లక్షణాలు ఏంటి?  

1. కుతూహలం: ప్రశ్నించే గుణం లేకపోతే నేర్చుకునేది ఏదీ ఉండదు. ‘ఎందుకు? ఏమిటి? ఎలా? అని అడిగే ధైర్యం నీలో ఉండాలి’ అని చెప్పాలి. 
ఇలా నేర్పాలి: రోజూ ‘ఈ రోజు నువ్వు అడిగే మూడు ప్రశ్నలు’ అని ఒక పేపర్‌ ఇవ్వండి. అందులో ప్రశ్నలు మీరే రాయండి. సూర్యుడు ఎందుకు ఎర్రగా ఉంటాడు? ఫ్యాన్‌ ఎందుకు తిరుగుతుంది? ఇలా. జవాబు తెలుసుకోమనండి. ‘జవాబు నాక్కూడా తెలీదు, కలిసి వెతుకుదాం పద’ అనండి. నెట్‌లో  కాదు. లైబ్రరీకి తీసుకెళ్లండి. ప్రశ్న లేకపోతే జీవితమే ప్రశ్నార్థకవుతుందని తెలియచేయండి.

2. ఓర్పు: రీల్స్, షార్ట్స్‌ యుగంలో పిల్లలకు పది సెకన్ల కన్నా ఎక్కువ వేచి చూసే ఓపిక ఉండటం లేదు. ఓర్పు లేని వాడు చదువులో, ఉద్యోగంలో, జీవితంలో సమస్యలు ఎదుర్కొంటాడు. అన్నీ క్షణాల్లో జరిగిపోవాలి అనే భావన సరికాదని తెలియచేయండి.
ఇలా నేర్పాలి: ఒక మొక్క నాటించండి. రోజూ నీళ్లు పోయమనండి. ‘రేపటికి రేపు పండ్లు రావు. దానికి కొంత సమయం పడుతుంది’ అని చెప్పండి. ఓపిగ్గా చేయాల్సిన పజిల్స్, చెస్‌లో ఉంచండి. వంట చేయడం నేర్పండి. ‘సేమ్యా పాయసం ఉడకడానికి 20 నిమిషాలు ఆగాలి’ అని రుచి చూపించండి. ఈలోపు అతడు ఏడ్చినా, గొడవ చేసినా వెంటనే ఫోన్‌ ఇవ్వకండి. ‘ఐదు నిమిషాలు ఆగితే ఇస్తా’ అనండి. ఓర్పుకు రివార్డ్‌ ఇవ్వండి.  

3. సహానుభూతి: ‘సాటివాడికి నొప్పి అయితే నాకూ నొప్పే’ అనే భావన కలిగించాలి. క్లాస్‌లో 95 శాతం మార్కులు తెచ్చుకుని అన్ని మార్కులు రాని వారితో కలవకపోతే, వారిని సహానుభూతితో చూడకపోతే ఒంటరిగా మిగలక తప్పదని చెప్పండి. రేపు ఉద్యోగమైనా అంతే అని చెప్పండి. ప్రపంచాన్ని నడిపేది ఐక్యూ కాదని; ఈ.క్యూ (ఎమోషనల్‌ కోషియెంట్‌) అని చెప్పండి.
ఇలా నేర్పాలి: పనిమనిషి, పాలవాడు, చెత్త ఎత్తే అన్నతో మాట్లాడించండి. ‘వాళ్ల పిల్లలు ఏం చదువుతున్నారు?’ అని అడగమనండి. వీధికుక్కకు, పక్షులకు నీళ్లు పెట్టమనండి. ‘దానికి దాహం అవుతుంది’ అని చెప్పండి. టీవీలో యుద్ధం వార్త వస్తే ‘అక్కడ పిల్లలు స్కూల్‌కి వెళ్లలేరు కదా’ అని చర్చ పెట్టండి.

4. శ్రమ: ‘నా పని నేను చేసుకుంటా’ అనే దర్జా కలిగి ఉండటమే జీవితం అని నేర్పండి. ఫోన్‌లో మీటలు నొక్కుతూ ఏ.సి. రూమ్‌లో కూర్చుని ఆర్డర్‌ వేస్తే అన్నీ ముంగిటకొస్తాయనుకునే తరం తయారవుతోంది. ఇలాంటి వారు డేటా అయిపోయినా, కరెంట్‌ లేకపోయినా, స్విగ్గీబాయ్‌ రాకపోయినా మిడిగుడ్లేస్తారు. 
ఇలా నేర్పాలి: వాళ్ల పక్క వాళ్లతోనే సర్దించండి. ప్లేట్‌ కడిగించండి. వారానికి ఒకరోజు ‘నో స్విగ్గీ డే’. కలిసి అన్నం వండండి, చపాతీలు చేయించండి. తల్లి, తండ్రి ఎంత శ్రమ చేస్తారో ఆఫీస్, షాప్,  పొలం చూపించండి. ‘ఇంట్లో ఫ్యాన్‌ తిరగడానికి బయట నాన్న ఎంత చెమటోడుస్తున్నాడో’ చూపించండి.

5. ఒప్పుకునే గుణం ‘ఓడిపోయా. తప్పు నాదే. నెక్ట్స్‌ ట్రై చేస్తా’ అనిపించే తత్త్వం పిల్లల్లో ముఖ్యం. 99 మార్కులు వచ్చి ఒక మార్కుతో ఫస్ట్‌ ర్యాంక్‌ పోతే కుంగిపోయే పిల్లలున్నారు. ఆటల్లో ఓడిపోతే బ్యాట్‌ విరగ్గొడుతున్నారు. జీవితం ర్యాంకుల గేమ్‌ కాదు పడి లేచే గేమ్‌ అని వారికి తర్ఫీదు ఇవ్వండి.
ఇలా నేర్పాలి: వాళ్లతో కలిసి క్యారమ్స్, చెస్‌ ఆడండి. కావాలని ఓడించండి. ‘ఓటమి కొత్త గేమ్‌కి టికెట్‌’ అని చెప్పండి. మీరు కూడా చేసిన తప్పులు, పొరపాట్ల వల్ల ఓడిపోయిన ఉదంతాలు చెప్పండి. ‘నాన్న కూడా ఒకసారి ఫెయిల్‌ అయ్యాడు’ అనండి. ‘ట్రై’ అనే మాటకు చాలా బలం ఉందని చెప్పండి. ఓడినా గెలిచినవారి కథలు వినిపించండి.

6. కృతజ్ఞత: ‘ఇది నాకు ఊరికే రాలేదు’ అని గుర్తించే పిల్లలూ, గుర్తుంచుకునే పిల్లలే ముందుకు వెళతారు. అన్నీ ఉన్నా ‘ఇంకా ఏం లేదు’ అని ఏడ్చే పిల్లలు ఉంటున్నారు. ఉన్నదానితో సంతృప్తి పడటం లేదు. కృతజ్ఞత లేని వాడు ఎప్పటికీ సంతోషంగా ఉండడని చెప్పాలి.
ఇలా నేర్పాలి: రాత్రి పడుకునే ముందు ‘ఈ రోజు నీకు నచ్చిన మూడు మంచి విషయాలు’ చెప్పమనండి. అన్నం తిన్నాను, సినిమాకు వెళ్లాను, ఫ్రెండ్‌ బ్యాట్‌తో ఆడుకున్నాను – ఇలా ఏదైనా. అన్నం వండిన అమ్మకు, సినిమా కు డబ్బు ఇచ్చిన నాన్నకు, బ్యాట్‌ ఇచ్చిన ఫ్రెండ్‌కు మనసులో థ్యాంక్స్‌ చెప్పుకోమనండి.   ‘థ్యాంక్యూ కార్డ్‌’ చేయించండి. ‘గ్లాస్‌ నీళ్లు ఇచ్చినందుకు థ్యాంక్స్‌రా’ అనండి. పిల్లలూ నేర్చుకుంటారు.  

ముగింపు – స్కాలర్‌షిప్‌ డే
సెలవులు అయిపోయే రోజు ఇంట్లో చిన్న ఫంక్షన్‌. ‘నెల రోజుల స్కాలర్‌షిప్‌ ప్రోగ్రాం కంప్లీటెడ్‌’ అని సర్టిఫికెట్‌ మీ చేత్తో రాసి ఇవ్వండి. ‘నువ్వు స్కాలర్‌షిప్‌ గెలిచావ్‌. నీకు ఈ టెలిస్కోప్‌’ అని ఇవ్వండి. ఆ కానుక విలువ 500 కావచ్చు, 5000 కావచ్చు. ఎన్ని లక్షణాల్లో బాగా తర్ఫీదు అయ్యారో ఆ ప్రతి లక్షణానికి ఒక సర్టిఫికెట్, బహుమతి ఇవ్వండి. 

ఇవి జీవితాంతం గుర్తుంటాయి. ఆ లక్షణాలను కాపాడుకునేలా చేసి జీవితాంతం నడిపిస్తాయి.                                        

Advertisement
 
Advertisement
Advertisement