
‘లైవ్’గా పెంచుదాం
సార్థక్ ఫ్రెండ్స్‌తో డిన్నర్‌కు వెళ్లాలి. వాళ్లు ఏదో కేఫ్ పేరు చెప్పారు. సాయంత్రం 7కు కలవాలి. వచ్చేసరికి తొమ్మిదిన్నర కావచ్చు. ఆ మాటే ఇంట్లో చెప్పాడు. ఇంటర్ పూర్తిచేసి బి.టెక్. జాయిన్ కాబోతున్నాడు సార్థక్.
‘అయితే లైవ్ లొకేషన్ పెట్టు’ అన్నాడు తండ్రి. వాట్సప్‌లో లైవ్ లొకేషన్ పెడితే సార్థక్ ఎక్కడ ఉన్నాడో తెలుస్తూ ఉంటుంది. అలా పెట్టడానికి సార్థక్‌కు అభ్యంతరం ఏమీ లేదు. కాని అది పెట్టినప్పటి నుంచి ప్రతి పది నిమిషాలకు దానివైపే చూస్తూ వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు ట్రాక్ చేస్తూ, చెప్పిన చోట నుంచి లొకేషన్ కాస్త కదిలినా ఆందోళన పడుతూ పదేపదే తండ్రి ఫోన్లు చేస్తాడు. అదే విసుగు సార్థక్‌కు.
‘నాన్నా... నేను చిన్నపిల్లాణ్ణా?’ అంటాడు. తండ్రి భయం తండ్రిది. నగరాల్లో తిరిగేటప్పుడు సేఫ్టీ ముఖ్యం. వాళ్లను ఒక కంట కనిపెడుతూ ఉండాలనే తప్ప సార్థక్ తప్పు పనులు చేస్తాడని కాదు. తండ్రి మనసు కొడుక్కు అర్థం కాదు. కొడుకు కోరుకుంటున్నది తండ్రికి అర్థమైనా నిస్సహాయుడు. ఇలాంటి వ్యవహార శైలే ఆడపిల్లలతో తల్లులది ఉంటుంది. వారు బయటకు వెళుతుంటే లొకేషన్ పెట్టమనడమే కాదు క్యాబ్‌లు, ఆటోలు తమ ఫోన్ నుంచి బుక్ చేసి ట్రాక్ చేస్తూ ఉంటారు కూడా.
ఇంటర్ వయసు పూర్తయ్యిందంటే పిల్లలు పూర్తిగా తమ జాగ్రత్తలు తాము తీసుకోదగ్గ వయసుకు వచ్చినట్టే. బాధ్యత లేకుండా అతి నిర్లక్ష్యంగా ఉండే పిల్లలు తప్ప మిగిలిన అందరు పిల్లలూ జాగ్రత్తగా బయటకు వెళ్లి వద్దామనే అనుకుంటారు. ఏదైనా అవసరం వస్తే తప్పక తల్లిదండ్రుల సాయం అడుగుతారు. కాని ప్రతిసారి ప్రతి ఔటింగ్‌కు తల్లిదండ్రులు వెంటపడటం వారికి ఇబ్బంది కలిగించవచ్చు. లేదా సొంతగా తామే సందర్భాలను ఎదుర్కొని ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవడంలో ఆలస్యం కావచ్చు. అందుకే టీనేజ్ పిల్లలను సంయమనంతో అర్థం చేసుకోవాలి.
భద్రతా? లేదా స్వేచ్ఛ?
భద్రత ముఖ్యం అని తల్లిదండ్రులు అనుకుంటారు. స్వేచ్ఛ ఉండాలని పిల్లలు అనుకుంటారు. రెండూ ఉంటే బాగుండని ఇరుపక్షాలు అనుకుని ఏం చేయాలో ఆలోచించడం అన్ని విధాలా మేలు. ఇవాళ రేపు నగరాల్లోనే కాదు టౌన్లలో పల్లెల్లో కూడా టీనేజ్ అబ్బాయిలతో, అమ్మాయిలతో అపరిచితులు గాని, అసాంఘిక శక్తులు గాని ఎలా వ్యవహరిస్తున్నారో మనకు తెలుసు. అందుకే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని పిల్లలకు చె΄్పాలి. అదే సమయంలో భద్రత కోసమని తల్లిదండ్రులు చేసే హంగామా పిల్లలకు ఏమాత్రం మంచిది కాదని ఇటీవల యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ చేసిన ఒక అధ్యయనంలో తేలింది. తల్లిదండ్రుల ఆందోళన చూసి పిల్లలు కూడా ఆందోళన పడతారని, కోపం, డిప్రెషన్ వంటి సమస్యలు వారిలో తలెత్తుతాయని ఆ అధ్యయనం హెచ్చరించింది.
రిస్క్ లేనిది ఎక్కడ?
ఈ విషయమై భారతీయ సైకియాట్రిస్ట్ డాక్టర్ శుక్లా ఏమంటారంటే ‘పిల్లలు బయటకు వెళ్లి మంచి చెడు వారికై వారే తెలుసుకోనివ్వండి. రిస్క్ కొద్దిగా తీసుకుంటే మంచిదే. రిస్క్ లేనిది ఎక్కడ? ఎక్కడైనా రిస్క్ ఉంటుంది. రిస్క్‌ను ధైర్యంగా ఎదుర్కోవడం ఎలాగో వారికి నేర్పడం తల్లిదండ్రుల విధి’ అంటారాయన. అందుకే తల్లిదండ్రులు ఓవర్ ప్రొటెక్టివ్‌గా ఉండటం కంటే పిల్లల్లో చైతన్యం నింపడం, వారికి బయటి పరిస్థితులు విశదపరచడం, ధైర్యంగా వ్యవహరించడం నేర్పాలి.
∙పిల్లలకు సామాజిక స్థితిగతులు అర్థం చేయించాలి. వారిచేత న్యూస్ పేపర్లు చదివించడం, వార్తలు చూపించడం చేయాలి. తద్వారా తమ చుట్టూ ఏం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వారికి అర్థం చేయించాలి.
పిల్లలు ఎక్కడికైనా వెళ్తామన్నప్పుడు మొండిగా వద్దనకూడదు. ముందుగా వివరాలన్నీ కనుక్కొని, అక్కడికి వారు ఎందుకు వెళ్తున్నారో, పనేమిటి, ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవాలి. అన్నీ విని, వెళ్లడం మంచిదే అనిపిస్తే పంపించాలి. కాదనిపిస్తే అది వారికి అర్థమయ్యేలా చెప్పాలి.
పిల్లలు ఏది చెప్పినా కొట్టిపారేయడం, వారి మీద అరవడం, చేయి చేసుకోవడం చేయ కూడదు. దానివల్ల భయం ఏర్పడి, తల్లిదండ్రులతో అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తారు. వారు చెప్పేది పూర్తిగా విని, వారితో స్నేహంగా మెలుగుతూ మంచీచెడూ చెప్పాలి.
చదవండి: కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు!
పిల్లలకు సామాజిక బాధ్యత నేర్పే చిత్రాలు చూపించాలి. విజేతల ఆత్మకథలు, సమాజాన్ని అర్థం చేయించే పుస్తకాలు చదివించాలి. అందులోని అంశాలను వారితో చర్చించాలి. పిల్లలు బయటకు వెళ్తే ఏదో ప్రమాదం జరిగి΄ోతుందన్న ఊహ చేయకుండా, వెళ్లేచోట ఎలా మెలగాలో వారికి శిక్షణ అందించాలి. ఆడ, మగ తేడా లేకుండా అందరికీ స్వీయరక్షణ పద్ధతులు నేర్పించాలి.
పిల్లల అనుమతి లేకుండా వాళ్ల ఫోన్లు చెక్ చేయడం, వారి వస్తువులు సోదా చేయడం చేయకూడదు. ఏదైనా అనుమానం ఉంటే వారిని అడిగి, వారి ముందే అలాంటివి చేయాలి తప్ప వారిని బయటివారిగా భావించి నిలదీయడం మొదలుపెడితే, వారు మరింత జాగ్త్రత్త పడి చెడుదారులు తొక్కుతారు.
పిల్లల స్నేహితులెవరో, వారి తల్లిదండ్రులెవరో తెలుసుకుంటూ ఉండాలి. వారు మీ పిల్లలకు ఎలాంటి విషయాలు నేర్పిస్తున్నారో అంచనా వేస్తూ ఉండాలి. బయటెక్కడో కాకుండా మీ ఇంట్లోనే వారు ఎక్కువగా కలిసే ఏర్పాటు చేయాలి. దీనివల్ల పిల్లలకు మీ మీద నమ్మకం ఏర్పడుతుంది.
పిల్లల్ని అందరిముందూ అవమానించడం, అనుమానించడం, ఎందుకూ పనికి రావంటూ తిట్టడం చేయకూడదు. ఇతరులతో పోలిక తెచ్చి వారిని తక్కువ చేయకూడదు. వారికి ఏ రంగంలో ఆసక్తి ఉందో ఆ రంగంలో ఎదగనివ్వాలి.
చదవండి: కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ మరణంపై తల్లి సంచలన ఆరోపణలు
వయసురీత్యా పిల్లల్లో వచ్చే మార్పులను గమనించి, వారితో ఆ విషయాలు నిర్భయంగా చర్చించాలి. తామూ ఆ దశ దాటి వచ్చామని చెప్తూ తమ అనుభవాలు వివరించాలి. దీనివల్ల వారిలో ఉండే అయోమయాలు దూరమవుతాయి.