పంచతంత్రం: కథన బలం.. కదన నీతి!!

Panchatantra Kathanabalam Kathana Neethi Telugu Short Story In Funday Magazine - Sakshi

కథ అంటే నీతి.. కథ ఒక రీతి.. కథ అంటే నిజాయితీ! బాల్యంలో కథలే పిల్లలను వేలు పట్టి నడిపిస్తాయి. పంచతంత్రాలను బోధిస్తూ, ప్రపంచంలో ఎవరితో ఎలా నడచుకోవాలో బోధిస్తాయి. చిన్నప్పుడు విన్న కథన బలమే... ఆ కాల్పనిక శక్తే పెద్దయ్యేంతవరకూ...ఆ మాటకొస్తే పెద్దయ్యాక కూడా తెలివితేటలను పెంపొందిస్తాయి. ఊహలతోనే వ్యూహాలను నెరుపుతాయి. ఈ కథల ద్వారానే కదా ఆ నాడు విష్ణుశర్మ.. మూర్ఖులు, ఎందుకూ పనికిరాని వారిగా పేరు పొందిన రాజకుమారులను ప్రయోజకులను చేసింది. వారికి ఆయన బోధించిన మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం, అపరిక్షిత కారకం... అంటే ఏమీ పరీక్ష చేయకుండానే పనిలోకి దిగడం, ఇతరుల చెడు కోరడం.  

ఈ కథలు వింటూనే పిల్లలు ఊహా ప్రపంచంలోకి వెళ్లిపోతారు. కథలోని పాత్రల్లో తమను తాము ఊహించుకుంటారు. కథతోబాటు ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అలా ఎందుకు? ఇలా ఎందుకు? అని అడుగుతారు. దీంతో వారి ఆలోచనా పరిధి పెరుగుతుంది. ప్రశ్నించే తత్త్వంతోబాటు సమస్యలను పరిష్కరించే సామర్థ్యం అలవడుతుంది. అన్నిటికీ మించి వివిధ పదాలను పరిచయం చేస్తూ భాషా సంపత్తిని పెంచడానికి కథలు దోహదం చేస్తాయి. 
మిత్రలాభం, మిత్రభేదానికి చెందిన ఒక కథ చెప్పుకుందాం ఇప్పుడు..

కలసి ఉంటే కలదు సుఖం
మగధ దేశంలో మందారవతి అనే వనం. ఆ వనంలో ఒక లేడిపిల్ల, ఒక కాకి ఎంతో స్నేహంగా కాలం గడుపుతున్నాయి. ఒకసారి ఆ వనంలోకి నక్క ఒకటి వస్తుంది. ఆ వనంలో అటూ, ఇటూ పరుగులు తీస్తున్న నక్కకు లేడిపిల్ల కనిపించింది.
బాగా కండపట్టి బలంగా ఉన్న ఆ లేడిపిల్లను చూడగానే ఎలాగైనా సరే దాని మాంసం తినాలనుకుంది నక్క. వెంటనే లేడి దగ్గరకు వెళ్ళి దానితో మాటలు కలిపింది. తనకు ఎవరూ తోడులేరని, తాను ఒంటరినని దొంగేడుపులు ఏడ్చింది నక్క.

నిన్ను చూడగానే తనకు తనవారంతా గుర్తుకు వచ్చారని, చాలా సంతోషంగా ఉందని లేడిపిల్లతో నమ్మబలికింది నక్క. నక్క మాటలను నమ్మిన లేడిపిల్ల, దానితో స్నేహం చేసేందుకు ఇష్టపడి, తన నివాస స్థలానికి తీసుకెళ్లింది.
వనంలోని మందారం చెట్టుపైన కూర్చున్న లేడిపిల్ల స్నేహితురాలైన కాకి ఇది గమనించింది. నక్కను గురించి వివరాలడిగింది. లేడిపిల్ల ఈ నక్క దిక్కులేనిదని, తనతో స్నేహంకోరి వచ్చిందని కాకితో చెప్పింది.  

అంతా విన్న కాకి, మంచీ చెడూ విచక్షణ లేకుండా, ఎవరుబడితే వారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తూ... తనకు తెలిసిన గద్ద, పిల్లి కథను చెబుతుంది. కాకి అలా చెబుతుండటంతో పక్కనే ఉన్న నక్కకు పట్టరాని కోపం వచ్చింది. అయినా సరే, తమాయించుకుంటూ... అదేంటి మిత్రమా, అలాగంటావు? నువ్వు మాత్రం లేడిపిల్లను కలుసుకునేటప్పటికి కొత్తదానివే కదా, మరి ఆ తరువాత మంచి స్నేహితులు కాలేదా...? అంటూ కోపాన్ని నిగ్రహించుకుని నిష్ఠూరమాడింది నక్క. కాకి, నక్క అలా వాదులాడుకుంటుండగా... లేడిపిల్ల కలుగజేసుకుని మనలో మనకు తగాదాలెందుకు, వ్యక్తిగత ప్రవర్తనను బట్టే, మిత్రుడైనా, శత్రువైనా ఏర్పడుతుంటారని సర్దిజెప్పింది.

ఇక అప్పటి నుంచి లేడి, కాకి, నక్క ఎంతో స్నేహంగా కాలం గడుపసాగాయి. కానీ నక్కకు మాత్రం లేడిపిల్ల మాంసం తినాలన్న కోరిక మాత్రం చావలేదు. దీనికి తగిన సమయం కోసం వేచి చూడసాగింది. ఇలా కొంతకాలం గడిచాక నక్క ఒకసారి లేడి దగ్గరకు వచ్చి తాను ఒకచోట పైరు దట్టంగా పెరిగి ఉన్న పొలాన్ని చూసివచ్చానని, తనతో వస్తే దాన్ని చూపిస్తానని చెప్పింది.

నక్క మాటలను నమ్మిన లేడిపిల్ల దానితోపాటు వెళ్లి బాగా ఏపుగా పెరిగిన పైరును చూసి ఎంతో సంతోషించింది. రోజూ ఆ ప్రాంతానికి వెళ్లి పైరును కడుపునిండా మేసి వచ్చేది. అయితే అది ఎంతో కాలం సాగలేదు. ఆ పైరు యజమాని లేడిపిల్ల ఇలా రోజూ వచ్చి పైరును తినేసి వెళ్లటం గమనించాడు.

దాన్ని ఎలాగైనా సరే పట్టుకోవాలని చాటుగా వలపన్నాడు. విషయం తెలియని లేడిపిల్ల మామూలుగానే పొలం మేసేందుకు వచ్చి, వలలో చిక్కుకుపోయింది. ఎంత ప్రయత్నించినా, అది వల నుంచి బయటపడలేక పోయింది. కాసేపటికి అక్కడికి వచ్చిన నక్కను చూసి, తనను ఎలాగైనా తప్పించమని నక్కను వేడుకుంటుంది లేడిపిల్ల. అయితే, ఆ వల మొత్తం నరాలతో అల్లి ఉందని, తాను నరాలను నోటితో కొరకలేనని చెప్పి, పక్కనే ఉన్న పొదచాటుకు వెళ్లి నక్కి కూర్చుంటుంది. నక్క ఇలా మోసం చేసినందుకు లేడిపిల్ల చాలా బాధపడుతుంది.

మేతకు వెళ్లిన తన మిత్రుడు ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కాకి వెతుక్కుంటూ రాగా, వలలో చిక్కుకుపోయిన లేడిపిల్ల కనిపిస్తుంది. ఇదంతా ఎలా జరిగిందని కాకి ప్రశ్నించగా, నక్క మాటలను నమ్మినందుకు తనకు ఈ రకంగా కీడు జరిగిందని కన్నీళ్ళు పెట్టుకుంటుంది లేడిపిల్ల.

ఇవి రెండూ ఇలా మాట్లాడుకుంటున్న సమయంలోనే పొలం యజమాని చేతిలో దుడ్డుకర్రతో అటుగా రావడం గమనించాయి. జరగబోయే అపాయాన్ని గ్రహించిన కాకి, లేడితో వలలో చచ్చినట్లు నటిస్తూ పడుకోమని, తాను చచ్చిన నీ కళ్లను పొడుస్తున్నట్లుగా నటిస్తానని, తాను సమయం చూసి అరవగానే లేచి పరుగుతీయమని, అప్పటికి అంతకుమించిన ఉపాయం మరోటి లేదని లేడికి అభయం ఇచ్చింది కాకి. పొలం యజమాని లేడి చచ్చిపోయిందనుకొని మెల్లగా వలను విడదీశాడు. దీన్ని గమనించిన కాకి పెద్దగా కేక పెట్టడంతో, ఒక్క ఉదటున లేచి పరుగెత్తింది లేడిపిల్ల.

లేడి తనను మోసం చేసి పారిపోవడం భరించలేని పొలం యజమాని తన చేతిలోని బడితను లేడి మీదకు విసిరాడు. అయితే, అది గురితప్పి పక్కనే పొదలో దాగివున్న నక్కకు తగిలి చచ్చింది. లేడిపిల్లను కాపాడుకుని దాన్నే అనుసరిస్తూ... వనంలోకి వెళ్లిపోయింది కాకి.

ఈ కథ సారాంశం ఏమిటంటే... కొత్తగా వచ్చినవారిని త్వరపడి నమ్మితే ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో చెబుతుంది. అలాగే, ఎవరికైనా అపకారం చేయాలనుకుంటే, అలా అనుకున్న వారికే అపకారం ఎదురౌతుందనే విషయాన్ని కూడా చెప్పకనే చెబుతుంది.  

పునఃకథనం: డి.వి.ఆర్‌. 

చదవండి: గబగబా చదివి పారేస్తే ఘబుక్కుని పెద్దాళయిపోతాంగా!!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top