మిత్రమా... ప్రతి మీమ్‌కు  ఒక లెక్క ఉంది!

Now a days Memes are more than a trend - Sakshi

కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో ఊపందుకున్న ‘మీమ్స్‌’ ట్రెండ్‌ ఇప్పుడు ‘మోర్‌ దేన్‌ ఏ ట్రెండ్‌’గా మారింది.పాకెట్‌ మనీ సంపాదించుకోవడానికి యూత్‌కు మార్గం అయింది...

పాప్‌ కల్చర్‌ మూమెంట్‌ అనగానే యూత్‌కి సంబంధించి ఒక సినిమా రిలీజ్, క్రికెట్‌ ఆట, మ్యూజిక్‌ప్రోగ్రామ్‌... ఇలా ఏవేవో గుర్తుకు వస్తాయి. అయితే మిలీనియల్స్‌కు మాత్రం మీమ్స్, వైరల్‌ వీడియోలే పాప్‌కల్చర్‌ మూమెంట్‌. కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో మీమ్స్‌ ట్రెండ్‌ ఊపందుకుంది. టైమ్‌పాస్‌ కోసం చేసినా తమలోని ఒత్తిడి, అకారణ భయం, బోర్‌డమ్‌ దూరం కావడానికి మీమ్స్‌ ఉపకరించాయి.

మొన్నటివరకు ట్రెండ్‌గా ఉన్న మీమ్స్‌ ఇప్పుడు మోర్‌ దేన్‌ ఏ ట్రెండ్‌గా మారాయి. దీనికి కారణం సోషల్‌ మీడియా బ్రాండ్‌ మార్కెటింగ్‌లో ‘మీమ్స్‌’ భాగం కావడమే కాదు కీలకం కావడం.‘ఒక విషయాన్ని సీరియస్‌గా, బోధన చేస్తున్నట్లుగా కాకుండా సరదాగా చెబితే కస్టమర్‌లకు వేగంగా చేరువ అవుతుంది’ అనే పబ్లిసిటీ సూత్రానికి మీమ్‌ అనేది నిలువెత్తు దర్పణంగా మారింది. బ్రాండ్‌ను ప్రమోట్‌ చేయడానికి మార్కెటింగ్‌ స్ట్రాటజీలో భాగం అయింది.‘హైంజ్‌’ అనే అమెరికన్‌ ఫుడ్‌ ్రపాసెసింగ్‌ కంపెనీ యూత్‌ క్రియేటివిటీని ఉపయోగించి మీమ్స్‌ను బాగా వాడుకుంటోంది.

మీమ్స్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే బ్రాండ్‌కు సంబంధించి వోవర్‌ ప్రమోషన్‌ కనిపించదు. సహజంగా, సరదాగా ఉంటూనే బ్రాండ్‌ గురించి ఎలాంటి ఆడంబరం లేకుండా నిశ్శబ్దంగా ప్రచారం చేస్తాయి. ఎక్కువ సమయం తీసుకోకపోవడం మరో ప్రత్యేకత. ‘మీమ్స్‌ అనేవి ఫ్యూచర్‌ ఆఫ్‌ సోషల్‌ మార్కెటింగ్‌. వీటిలో యూత్‌ కీలక పాత్ర పోషించనుంది. కాలం మారింది. చిన్న బ్రాండ్, పెద్ద బ్రాండ్‌ అనే తేడా లేకుండా ఇప్పుడు అన్ని బ్రాండ్లకు సోషల్‌ మార్కెటింగ్‌లో మీమ్స్‌ అనేవి తప్పనిసరి అవసరం’ అంటున్నాడు మీమ్స్‌.కామ్‌ కో–ఫౌండర్‌ రజ్వన్‌.

మీమ్స్‌ అనేవి కేవలం సరదా కోసం మాత్రమే కాదని పాకెట్‌మనీ సంపాదించుకోవచ్చనే సత్యం బోధపడడం తో యూత్‌ ఇప్పుడు వాటిపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. ‘మీమ్‌ హిట్‌ కావడానికి గోల్డెన్‌ రూల్స్‌ ఏమిటి?’ అంటూ వెదకడం ్రపారంభించింది. గోల్డెన్‌ రూల్స్‌లో ఒకటి...‘అందరికీ నచ్చేలా ఉండాలి అని చేసే మీమ్స్‌ కంటే టార్గెట్‌ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని చేసేవే బాగా క్లిక్‌ అవుతాయి’ అనేది.బెంగళూరుకు చెందిన ఎన్‌ఆర్‌.హారికకు మీమ్స్‌ అంటే ఇష్టం. తాను కూడా వాటిని చేయాలనుకుంటోంది.

ఎలీన్‌ బ్రౌన్‌ అనే జర్నలిస్ట్‌ రాసిన ‘ది మ్యాథ్స్‌ బిహైండ్‌ ది మీమ్స్‌’ అనే వ్యాసాన్ని మిత్రులకు షేర్‌ చేయడం అంటే తనకు ఇష్టం. మీమ్స్‌ తయారీలో పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇష్టమైన వ్యాసాల్లో ఒకటి అంజలి వేణుగోపాలన్‌ రాసిన ‘ది సైన్స్‌ బిహైండ్‌ మీమ్‌ మార్కెట్‌’‘ఒకరు ఒక మీమ్‌ను క్రియేట్‌ చేయడానికి కారణం ఏమిటి? అనే ప్రశ్నకు జవాబు మోటివేషనల్‌ అండ్‌ ఎమోషనల్‌ రెస్పాన్స్‌’ అంటుంది ఎలీన్‌ బ్రౌన్‌. అయితే ఇప్పటి విషయానికి వస్తే మీమ్‌ను రూపొందించడంలో మోటివేషనల్, ఎమోషనల్‌ కంటే వినోదం, వ్యంగ్యం పాలే ఎక్కువ. దీన్ని దృష్టిలో పెట్టుకొనే కావచ్చు...‘మీమ్‌ నిర్వచనం కాలంతోపాటు మారుతూ వస్తుంది’ అంటుంటారు.

‘మీమ్స్‌ అనేవి మన నిత్యజీవితంలో భాగం అయ్యాయి. పాత సినిమాల నుంచి కొత్త సినిమాల వరకు కొత్త న్యూస్‌ క్లిప్‌ల నుంచి పాత న్యూస్‌ క్లిప్‌ల వరకు ఏదైనా మీమ్‌ చేయవచ్చు. అయితే దాన్ని ఎలా హిట్‌ చేస్తాం అనేదే ముఖ్యం. యువతరం ఈ విద్యలో ఆరితేరింది’ అంటున్నారు మీమ్‌ మార్కెటింగ్‌ ఏజెన్సీ‘యంగ్‌గన్‌’ ఫౌండర్‌ సాక్ష్యమ్‌ జాదవ్‌.‘మీమ్‌’ల రూపకల్పనలో ఎన్నో వెబ్‌సైట్లు యూత్‌కు ఉపయోగపడుతున్నాయి. అందులో ఒకటి... సూపర్‌మీమ్‌. మీమ్‌కు అవసరమైన కంటెంట్‌ ఇస్తే ఈ ఏఐ ఆధారిత వెబ్‌సైట్‌ మనకు అవసరమైన మీమ్‌ తయారు చేసి ఇస్తుంది. టెక్ట్స్‌ను మీమ్‌గా కన్వర్ట్‌ చేయడమే కాదు మీమ్‌ సెర్చ్‌ ఇంజిన్‌గా కూడా ఉపయోగపడుతుంది.
 

పాకెట్‌మనీ కంటే కాస్త ఎక్కువే!
‘మీమ్స్‌’కు డిమాండ్‌ ఏర్పడడానికి కారణం సంప్రదాయ అడ్వర్‌టైజింగ్‌లతో పోల్చితే తక్కువ ఖర్చు కావడం.  క్రియేటర్‌లలో వైట్‌–కాలర్‌ ఎంప్లా యీస్‌ కంటే హైస్కూల్, కాలేజీ స్టూడెంట్స్‌ ఎక్కువమంది ఉండడం! తమ క్రియేటివ్‌ టాలెంట్‌తో తల్లిదండ్రులపై ఆధారపడకుండా పాకెట్‌ మనీ, కొన్ని సందర్భాలలో అంతకంటే ఎక్కువ సంపాదించుకోగలుగుతున్నారు. మీమ్‌ క్రియేటింగ్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘మీమ్‌చాట్‌’ 1,50,000 క్రియేటర్స్‌కు ఒక్కో మీమ్‌కు 20 నుంచి 30 రూపాయల వరకు చెల్లిస్తుంది. అయితే ప్లాట్‌ఫామ్‌ను బట్టి ఈ రెమ్యునరేషన్‌ మారుతూ ఉండవచ్చు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top