Nidhi Achha: ఈ టట్టింగ్‌ బహుత్‌ అచ్చా హై

Nidhi Achha Wins International Tutting Dance Battle - Sakshi

సరదాగా చేసే కొన్ని పనులు గుర్తింపుతోపాటు మంచి పేరుని తెస్తాయి. నిధి అచ్చా కూడా ఇలానే సరదాగా చేసిన డ్యాన్స్‌ అంతర్జాతీయ స్థాయిలో పాపులర్‌ అయ్యేలా చేసింది. డ్యాన్స్‌ని కెరియర్‌గా ఎంచుకోవాలని అనుకోలేదు కానీ అంతర్జాతీయ డ్యాన్స్‌ పోటీలో విజేతగా నిలిచింది.

ముంబైలోని కుర్లాకు చెందిన 23 ఏళ్ల డ్యాన్సర్‌ నిధి అచ్చా. ఐదేళ్ల వయసు నుంచి నిధికి డ్యాన్స్‌ అంటే ఇష్టం. దీంతో ఎక్కడ డ్యాన్స్‌ చూసినా వెంటనే ఆ స్టెప్పులు నేర్చుకునేది. ఇలా నేర్చుకున్న స్టెప్పులకు మరింత సాధన చేసి.. ఇటీవల అంతర్జాతీయ టట్టింగ్‌–2 కాంపిటీషన్‌లో విజేతగా నిలిచింది. అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, దక్షిణాసియా దేశాలు పాల్గొన్న ఈ పోటీలో ఇండియా నుంచి పాల్గొన్న ఒకే ఒక డ్యాన్సర్‌ నిధి. 

అబ్బాయిలు ఎక్కువగా ఉండే..
టట్టింగ్‌ డ్యాన్స్‌ పోటీల్లో ఎక్కువగా అబ్బాయిలే కనిపిస్తుంటారు. నిధికి డ్యాన్స్‌ మీద ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు వెన్ను తట్టి ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహంతోనే డ్యాన్స్‌ తరగతులకు హాజరయ్యి మరింత సాధన చేసింది. మూడు వారాలపాటు కఠోర సాధనతో తన ప్రతిభకు మరిన్ని మెరుగులు దిద్దుకుని తండ్రి సాయంతో ఆ డ్యాన్స్‌ వీడియోలను రికార్డు చేసుకునేది. ఈ సాధనతో అంతర్జాతీయ టట్టింగ్‌ విన్నర్‌గా నిలిచింది.

నిధి టట్టింగ్‌తోపాటు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వీడియోలు పోస్టు చేస్తుంది. అంతేగాక ఎన్జీవోలో వలంటీర్‌గా పనిచేస్తూ.. వృద్ధాశ్రమం, అనాథాశ్రమాలకు వెళ్లి సేవా కార్యక్రమాలు చేపడుతోంది. 

టట్టింగ్‌..
టట్టింగ్‌ అనేది వీధిలో చేసే ఒక రకమైన డ్యాన్స్‌. 1960–70లలో క్యాలిఫోర్నియాలో బాగా వాడుకలో ఉన్న డ్యాన్స్‌ ఇది. జామెట్రికల్‌ ఆకారంలో... 90 డిగ్రీల కోణంలో చేతులు, వేళ్లను కదిలించడం ఈ డ్యాన్స్‌లో ఉన్న ప్రత్యేకత. ఈజిప్ట్‌ కళలోని కొన్ని రకాల భంగిమలు టట్టింగ్‌ను పోలి ఉంటాయి. కేవలం చేతులతో చేసే ఈ డ్యాన్స్‌ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. (క్లిక్‌: ఫోన్‌ను ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకుంటున్నారా?)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top