పశువుల్లో యాంటీబయాటిక్స్‌ లేని పాల ఉత్పత్తికి కొత్త పద్ధతులు..

New Methods For Milk Production In Cattle Without Antibiotics - Sakshi

సంప్రదాయ పశు వైద్యంతోనే యాంటీబయాటిక్స్‌కు చెక్‌

పాడి రైతులకు ఈ విజ్ఞానాన్ని అందిస్తున్న ఎన్‌.డి.డి.బి. 

యాంటీబయాటిక్‌ ఔషధాలను మనుషులకు చికిత్సలో, పశు వ్యాధుల చికిత్సలో నిర్దేశిత మోతాదుల కన్నా అధికంగా, విచక్షణా రహితంగా వినియోగిస్తున్నందు వల్ల కొన్ని సూక్ష్మక్రిములు ఈ మందులకు అలవాటు పడిపోయి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. మొండికేసిన క్రిములు (సూపర్‌ బగ్స్‌) తయారవుతున్నాయి. ఇవి శక్తివంతమైన యాంటీబయాటిక్స్‌కూ లొంగటం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 7 లక్షల మంది ప్రాణాలను బలిగొంటున్న ఈ సమస్యను యాంటీమైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ (ఎ.ఎం.ఆర్‌.)గా వ్యవహరిస్తున్నాం. 

చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారిని అరికట్టడానికి తక్షణం స్పందించకపోతే 2050 నాటికి ఏటా కోటి మంది (ఇందులో 20 లక్షల మంది భారతీయులే) ఎ.ఎం.ఆర్‌. సమస్యతో చనిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎ.ఎం.ఆర్‌. సమస్య వల్ల యాంటీబయాటిక్‌ మందులు అసమర్థంగా మారడంతో శరీరం నుంచి ఇన్ఫెక్షన్లను తొలగించడం కష్టతరంగా మారుతోంది. ఉపయోగించిన యాంటీబయాటిక్స్‌ పరిమాణంలో 90% విసర్జితాల ద్వారా పర్యావరణంలోకి చేరి నీరు, నేల కలుషితమవుతుంది. ఎ.ఎం.ఆర్‌. సమస్యను పరిష్కరించాలంటే.. మనుషులతోపాటు పాలు, గుడ్లు, మాంసం కోసం పెంచే పశుపక్ష్యాదుల కోసం యాంటీబయాటిక్స్‌ వినియోగాన్ని తగ్గించుకోవాలి. 

పాడి పశువులకు వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు పాటించడం, జబ్బులు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్‌కు బదులు సంప్రదాయ మూలికలతో కూడిన పశు ఆయుర్వేద పద్ధతులు అనుసరించడం ద్వారా ఎ.ఎం.ఆర్‌. సమస్య నుంచి సమర్థవంతంగా బయటపడవచ్చని శాస్త్రీయంగా రుజువు కావటం సంతోషదాయకం. బెంగళూరులోని యూనివర్సిటీ ఆఫ్‌ ట్రాన్స్‌–డిసిప్లినరీ (యు.టి.డి.) హెల్త్‌ అండ్‌ టెక్నాలజీ, తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ నిపుణులు గత పదేళ్లుగా ఈ దిశగా చేస్తున్న విశేష కృషి సత్ఫలితాలనిచ్చింది. 10 రాష్ట్రాల్లో సంప్రదాయ పశువైద్య పద్ధతులను అధ్యయనం చేసి 441 మూలికా వైద్య మిశ్రమాలను గుర్తించారు. వీటిని పరీక్షించి 353 మందులు సురక్షితమైనవని, ప్రభావవంతమైనవని నిర్థారించారు.

జాతీయ పాడి అభివృద్ధి బోర్డు (ఎన్‌.డి.డి.బి.) ఈ పశు ఆయుర్వేద పద్ధతులను ఐదేళ్లుగా సహకార సంఘాల ద్వారా పాడి రైతులకు పరిచయం చేసి అద్భుత ఫలితాలను రాబడుతున్నది.  24 రకాల పశు వ్యాధులను నివారించడంలో, నిరోధించడంలోనూ సంప్రదాయ మూలికా మిశ్రమాలు అత్యంత సమర్థవంతంగా పని చేస్తున్నాయని ఎన్‌.డి.డి.బి. నిర్థారణకు వచ్చింది. ఈ పద్ధతులను పాడి సంఘాల ద్వారా దేశవ్యాప్తంగా రైతులకు పరిచయం చేస్తోంది. ఏటా యాంటీబయాటిక్‌ మందుల కొనుగోలుకు రూ. 1.86 కోట్లు ఖర్చు పెట్టే ఎన్‌.డి.డి.బి. ఈ ఖర్చును సంప్రదాయ మూలికా వైద్యం అనుసరించడం ద్వారా రూ. 50 లక్షలకు తగ్గించుకోగలిగింది. 1,500 గ్రామాల్లో పాడి రైతులకు ఈ మూలికా చికిత్సను ఇప్పటికే నేర్పించింది. తమ పరిసరాల్లోని ఔషధ మొక్కలు, దినుసులతోనే పశు వ్యాధుల నివారణకు, చికిత్సకు ఉపయోగించుకుంటూ శాస్త్రీయంగా యాంటీబయోటిక్‌ మందుల వాడకాన్ని 80% తగ్గించామని ఎన్‌.డి.డి.బి. చైర్మన్‌ మీనెష్‌ షా ప్రకటించారు. పొదుగువాపు వ్యాధి, గాలికుంటు వ్యాధులను రసాయనిక యాంటిబయాటిక్స్‌ వాడకుండా నూటికి నూరు శాతం పూర్తిగా తగ్గించగలిగామని ఆయన తెలిపారు. 

పాలలో యాంటీబయాటిక్స్‌ను 88% తగ్గించగలిగాం: ప్రొ. నాయర్‌
యూనివర్సిటీ ఆఫ్‌ ట్రాన్స్‌–డిసిప్లినరీ (యు.టి.డి.)లోని మూలికా పశువైద్య పరిశోధనా విభాగం అధిపతి ప్రొ. ఎం.ఎన్‌. బాలకృష్ణన్‌ నాయర్, తన సహచరులు డా. ఎన్‌. పుణ్యమూర్తి, ఎస్‌.కె. కుమార్‌తో కలిసి పశు ఆయుర్వేద పద్ధతులపై పరిశోధనలు చేస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో 140 మంది పాడి రైతులతో కలసి మూడేళ్లు ప్రయోగాత్మకంగా మూలికా వైద్యంపై అధ్యయనం చేశారు. పాలలో యాంటీబయాటిక్స్‌ అవశేషాలను 88% తగ్గించగలిగామని ప్రొ. నాయర్‌ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ఎన్‌.డి.డి.బి.తో కలసి ఏపీ, తెలంగాణ సహా 14 రాష్ట్రాల్లోని 30 పాల సంఘాలలో 1750 మంది పశువైద్యులకు, 30 వేల మంది పాడి రైతులకు, 560 మంది గ్రామ రిసోర్స్‌ పర్సన్లకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. 

తమ యూనివర్సిటీలో రైతుల కోసం 4 రోజుల సర్టిఫికెట్‌ కోర్సు, పశువైద్యుల కోసం 7 రోజుల సర్టిఫికెట్‌ కోర్సులు ప్రవేశపెట్టామన్నారు. ఎమ్మెస్సీ, పిహెచ్‌డి కూడా పెట్టామన్నారు. సిక్కిం, హర్యానా, పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకొని రసాయనిక యాంటీబయాటిక్స్‌ అవసరంలేని పశుపోషణపై శిక్షణ ఇస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాలు ముందుకొస్తే స్వల్ప ఫీజుతోనే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకందారులకు పశు ఆయుర్వేద పద్ధతులపై శిక్షణ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.
వివరాలకు.. ప్రొ. ఎం.ఎన్‌. బాలకృష్ణన్‌ నాయర్‌ – 63602 04672. nair.mnb@tdu.edu.in 

చదవండి: World's Largest Cemetery: ఇది నగరంలోని శ్మశానం కాదు.. శ్మశానమే ఓ మహానగరంగా! ఎక్కడుందో తెలుసా?

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top