చేనేత మహిళ.. కలల నేతకు అద్దిన కళ

Narayanpet Handloom womens wearing her handloom Sarees - Sakshi

‘‘ఎన్నో చీరలు మగ్గం మీద నేస్తుంటాం. కానీ, ఒక్క చీర కూడా మేం కట్టుకోలేం. బయట దొరికే వందా, రెండు వందల రూపాయల సిల్క్‌ చీరలు కొనుక్కుంటాం. మా చేతుల్లో రూపుదిద్దుకున్న చీరల డిజైన్లు ఎంత అందంగా ఉన్నాయో కదా, అని ఒకటికి పదిసార్లు చూసుకుంటాం. కానీ, మేం కట్టుకునే చీరల అందం గురించి ఎన్నడూ పట్టించుకోం. అలాంటిది సిరి మేడమ్‌ మా చీర మాకే కొనిచ్చారు, మేం కట్టుకునేదాకా ఊరుకోలేదు’’ అంటూ విప్పారిన ముఖాలతో తెలిపారు నారాయణపేట్‌ చేనేత మహిళలు.

‘‘నెల రోజుల క్రితం తెలంగాణలోని నారాయణ్‌పేట్‌ చేనేత మహిళలను కలిసి, వారి చీరలు వారే కట్టుకున్నప్పుడు ఆ ఆనందాన్ని ఫొటోలుగా తీయాలనిపించింది. అలా తీసుకున్నాను కూడా. వీరికే ఇంకాస్త కట్టూ బొట్టూ మార్చితే మోడల్స్‌కి ఏ మాత్రం తీసిపోరు అనిపించింది. దాంతో ఈ ఆలోచనను సినిమాటోగ్రాఫర్‌ రఘు మందాటిని కలిసి, ఈ షూట్‌ ప్లాన్‌ చేశాను’’ అని వివరించారు ఫ్యాషన్‌ డిజైనర్‌ హేమంత్‌ సిరి. హ్యాండ్లూమ్‌ డే సందర్భంగా నిన్న హైదరాబాద్‌ స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో ‘తాశ్రిక’ పేరుతో చేనేత మహిళల ఫొటో ప్రదర్శన, డాక్యుమెంటరీ ప్రదర్శించారు. ఈ సందర్భంగా చేనేతల పట్ల తనకున్న మక్కువను ‘సాక్షి’తో పంచుకున్నారు.

‘పుట్టి పెరిగింది అనంతపూర్‌ జిల్లాలోని హిందూపూర్‌లో. కళల లేపాక్షి మాకు దగ్గరే. హైదరాబాద్‌ నిఫ్ట్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేశాను. పదహారు ఏళ్లుగా హ్యాండ్లూమ్స్‌తో డిజైన్స్‌ చేస్తున్నాను. చేనేతలతో యువతరం మెచ్చేలా మోడ్రన్‌ డ్రెస్సులను రూపొందించి, షోస్‌ కూడా ఏర్పాటు చేశాను. ఎప్పుడూ చేనేతలతో మమేకమై ఉంటాను కాబట్టి, వారి జీవితాలు నాకు బాగా పరిచయమే.

ఆనందమే ముఖ్యం
రోజుల తరబడి దారం పోగులను పేర్చుతూ ఒక్కో చీరను మగ్గం మీద నేస్తారు. ఒక్కో చీర 1200 రూపాయల నుంచి ధర ఉంటుంది. కానీ, అవి అంత సులువుగా అమ్ముడుపోవు. కుటుంబ పోషణ, పిల్లల చదువులకు వారి చేతి వృత్తే ఆధారం. చీర ఖరీదైనదని, వారెన్నడూ వాటిని కలలో కూడా కట్టుకోవాలనుకోరు. సాధారణ రోజుల్లోనే వారి కుటుంబ పరిస్థితులు ఎంత గడ్డుగా ఉంటాయో కళ్లారా చూశాను. అలాంటిది కరోనా సమయంలో చేనేత కుటుంబాల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఉపాధి లేక వారంతా ఎలా ఉన్నారో, వారి నేత చీరలన్నీ అలాగే మిగిలిపోయి ఉంటాయనుకొని ఒకసారి కలిసి వద్దామని వెళ్లాను.

అక్కడి వారి పరిస్థితులన్నీ స్వయంగా చూశాక, ఆ మహిళల ముఖాల్లో కొంచెమైనా ఆనందం చూడాలనిపించింది. అలాగే, నాదైన కంటితో వారిని ఇంకాస్త కళగా చూపాలనుకున్నాను. నా స్నేహితుల్లో ఉన్న మేకప్, హెయిర్‌ స్టైలిస్ట్‌లతో మాట్లాడాను. ఈ క్రమంలో వారానికి ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్లడం, అక్కడి మహిళలతో మాట్లాడటం, వాళ్ల కుటుంబ సభ్యుల్లో నేనూ ఒకదాన్నయిపోయాను. ఫొటో షూట్‌కి అనువైన ప్లేస్‌ కోసం ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించాం. ఒక ప్రాచీన దేవాలయం కనిపించింది. అక్కడే ఫొటో షూట్‌కి ప్లాన్‌ చేసుకున్నాం. పదిమంది చేనేత మహిళలను తీసుకొని ఉదయం 5 గంటలకే ఆ దేవాలయానికి చేరుకున్నాం. ముందే అనుకున్నట్టు డిజైనర్‌ బ్లౌజులు, ఆభరణాలు, మేకప్‌ సామగ్రి అంతా సిద్ధం చేసుకున్నాం.

రెండు కళ్లూ సరిపోలేదు
ముస్తాబు పూర్తయ్యాక ఆ చేనేత మహిళల ‘కళ’ చూస్తుంటే నాకే రెండు కళ్లు సరిపోలేదు. వారు చూపించిన ఎక్స్‌ప్రెషన్స్‌ అద్భుతం అనిపించింది. జాతీయస్థాయి మోడల్స్‌కి వీరేమాత్రం తీసిపోరు అనిపించారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫొటో, వీడియో షూట్‌ చేశాం. వారి అనుభవాలతో కలిపి డాక్యుమెంటరీ రూపొందించాం. ఈ గ్యాలరీలో ప్రదర్శించిన ఈ మహిళల ఫొటోలతో ఉన్న ఫ్రేమ్‌లు వారి వారి ఇళ్లలో ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఈ ఫొటోషూట్, డాక్యుమెంటరీ అంతా స్వచ్ఛందంగా పూర్తిచేశాం. నా స్నేహితులు కూడా ఈ పనిలో ఆనందంగా పాలుపంచుకున్నారు. ఈ రంగంలో ఉన్నందుకు చేనేతకు నా వంతుగా ఏదైనా సాయం చేయాలనిపించింది. ఈ మహిళల ముఖాల్లో కనిపించిన కళ వీరి జీవితాల్లోనూ కనిపించాలి. చేనేతలను ఈ తరం మరింతగా తమ జీవనంలో భాగం చేసుకోవాలన్నదే నా ప్రయ త్నం’’ అని వివరించారు డిజైనర్‌ హేమంత్‌ సిరి.

గ్యాలరీకి వచ్చినవారంతా అబ్బురంగా చేనేత మహిళల ఫొటోలు, డాక్యుమెంటరీని తిలకించడం, అక్కడే ఉన్న చేనేత మహిళలను ఆప్యాయంగా పలకరించడం, కొందరు చీరలు కొనుక్కోవడం, మరికొందరు మీ నుంచి మేమూ చీరల ఆర్డర్స్‌ తీసుకుంటాం అంటూ ఫోన్‌ నెంబర్లు అడిగి తీసుకొని వెళ్లడం.. అక్కడ ఉన్నంతసేపూ కళ్లకు కట్టింది.
 

లేపాక్షి దేవాలయ కళను నారాయణ్‌పేట్‌ కాటన్‌ చీరల మీద డిజిటల్‌ ప్రింట్‌ చేయించి, డిజైన్‌ చేసిన ప్రత్యేకమైన చీరలు ఇవి. వీటితోనే డాక్యుమెంటరీ, ఫొటో షూట్‌ చేశాం. ఇందులో 30 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలు పాల్గొన్నారు. వచ్చిన ఆలోచనలను వెంటనే అమల్లో పెట్టడం, అందుకు తగినట్టుగా నారాయణ్‌పేట్‌ మహిళలు ఆనందంగా సహకరించిన విధానం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top