ఆ ఒక్క ఫోన్‌ కాల్‌తో జీవితం మారిపోయింది! | Martin Cooper made the first cellphone call history | Sakshi
Sakshi News home page

ఆ ఒక్క కాల్‌తో జీవితం మారిపోయింది!

Apr 1 2026 1:50 PM | Updated on Apr 1 2026 2:08 PM

Martin Cooper made the first cellphone call history

టైమ్‌ మిషన్‌

1973 ఏప్రిల్‌ 3. న్యూయార్క్‌ నగరంలోని మన్‌హటన్‌ వీధులు ఎప్పటిలాగే రద్దీగా ఉన్నాయి. సిక్స్త్‌ ఎవెన్యూలో అటు ఇటు నడుస్తున్న జనం మధ్య ఒక వింత దృశ్యం ఆవిష్కృతమైంది. మోటరోలా కంపెనీలో పనిచేసే మార్టిన్‌ కూపర్‌ (martin cooper) అనే ఇంజినీర్‌ ఒక కిలో బరువు, తొమ్మిది అంగుళాల పొడవున్న ఒక ఇటుక లాంటి వస్తువును చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నాడు. చుట్టుపక్కల వారు ఆశ్చర్యంగా చూస్తున్నారు.

అప్పటి వరకు ఫోన్‌ అంటే ఒక వైరుతో గోడకు అతుక్కుని ఉండాలి, లేదా కారులో భారీ బ్యాటరీల సాయంతో నడవాలి. కానీ కూపర్‌ చేతిలో ఉన్నది ఒక ‘పోర్టబుల్‌’ సెల్యులార్‌ ఫోన్‌. పేరు డైనాటాక్‌. దాని నుంచి వెళ్ళిన మొదటి కాల్‌ ఎవరికో తెలుసా? అతని ప్రత్యర్థికి! అవును, బెల్‌ లాబొరేటరీస్‌లో తనలాగే మొబైల్‌ టెక్నాలజీపై పనిచేస్తున్న జోయెల్‌ ఏంగెల్‌కు కూపర్‌ కాల్‌ చేశాడు. ‘జోయెల్, నేను ఒక నిజమైన పోర్టబుల్‌ సెల్యులార్‌ ఫోన్‌ నుంచి మాట్లాడుతున్నాను’ అని గర్వంగా ప్రకటించాడు. ఈ మాటలు విన్న ప్రత్యర్థి నుంచి చాలాసేపటివరకూ నిశ్శబ్దమే సమాధానం అయ్యింది. అది కేవలం ఒక ఫోన్‌ కాల్‌ మాత్రమే కాదు, ఒక ఆధిపత్య పోరాటంలో విజయ ప్రకటన!

అప్పట్లో అమెరికన్‌ టెలిఫోన్‌ అండ్‌ టెలిగ్రాఫ్‌ (ఏటీ అండ్‌ టీ) సంస్థకు టెలిఫోన్‌ రంగంలో గుత్తాధిపత్యం ఉండేది. కారులో బ్యాటరీ సాయంతో పనిచేసే మొబైల్‌ రేడియో ఫోన్లను ఆ కంపెనీ తయారు చేసేది. కూపర్‌ ‘మనిషికి విముక్తి కావాలి, కారుకు ఫోన్‌ కట్టేయడం ఏమిటి?’ అని ప్రశ్నించేవాడు. 1947లోనే బెల్‌ లాబ్స్‌ శాస్త్రవేత్తలు ఒక పెద్ద ప్రాంతాన్ని చిన్న చిన్న ‘సెల్స్‌’గా విభజించి సమాచారాన్ని చేరవేయవచ్చని సిద్ధాంతీకరించారు. ఆచరణలో అది సాధ్యం కావడానికి దశాబ్దాలు పట్టింది.

చ‌ద‌వండి: గుర్రం లాగిన రైలుబండి

1950ల నాటి మొబైల్‌ ఫోన్లు సుమారు 18 నుంచి 36 కిలోల బరువుండేవి. కూపర్‌ సృష్టించిన డైనాటాక్‌ వచ్చే వరకు అవి మనిషి చేతిలోకి రాలేదు. అది సామాన్యులకు అందుబాటులోకి రావడానికి మరో పదేళ్లు పట్టింది. 1983లో మోటరోలా డైనాటాక్‌ గీ మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని ధర 3,995 డాలర్లు. ధనవంతులకు, వ్యాపార వేత్తలకు మాత్రమే అది పరిమితమైంది.

అదృశ్య బంధనాల్లో మనిషి
ఈ మొబైల్‌ విప్లవం మనిషి జీవన శైలిని పూర్తిగా మార్చేసింది.  ఇంటికి వెళ్తే ఆఫీసు పనితో సంబంధం ఉండేది కాదు. కానీ ఇప్పుడో? 24 గంటలూ ఎవరో ఒకరికి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి! సామాజికంగా చూస్తే, మనుషుల మధ్య దూరం పెరుగు తోంది. పక్కనే కూర్చున్న వ్యక్తితో మాట్లాడటం మానేసి, వేల మైళ్ల దూరంలో ఉన్న వ్యక్తితో ఫోన్‌లో గడపడం మనకు అలవాటైంది. ఉద్యోగ ఒత్తిడి మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకప్పుడు ‘ఇటుక’లా ఉన్న ఫోన్, ఇప్పుడు మన మెదడును నియంత్రించే ఒక  మహాశక్తిగా మారింది.

చ‌ద‌వండి: జేఈఈ మెయిన్స్ ఆఫ్‌లైన్‌లో పెట్ట‌లేరా?

సాంకేతికత రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. అది ఇచ్చే సౌకర్యాలను అనుభవిస్తూనే, అది మన సామాజిక విలువ లను, వ్యక్తిగత ప్రశాంతతను దెబ్బతీయకుండా చూసుకోవడం మన బాధ్యత. కూపర్‌ ఆ రోజు వేసిన అడుగు ప్రపంచాన్ని దగ్గర చేసింది, కానీ మనల్ని మనకు దూరం చేయకుండా చూసు కోవాల్సిన బాధ్యత మన పైనే ఉంది. మొబైల్‌ కాల్‌ కేవలం ఒక ఇంజినీరింగ్‌ విజయం మాత్రమే కాదు, అది మానవ పరిణామ క్రమంలో ఒక కొత్త అధ్యాయం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement