జేఈఈ మెయిన్స్‌ ఆఫ్‌లైన్‌లో పెట్ట‌లేరా? | JEE Mains exam conducting process should be changed | Sakshi
Sakshi News home page

జేఈఈ మెయిన్స్‌ పరీక్ష నిర్వహణ మారాలి!

Mar 31 2026 2:11 PM | Updated on Mar 31 2026 2:13 PM

JEE Mains exam conducting process should be changed

భారతదేశంలో అత్యున్నత ఇంజినీరింగ్‌ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ పరీక్ష కేవలం ఒక ప్రవేశ పరీక్ష మాత్రమే కాదు, లక్షలాది మంది విద్యార్థుల కెరీర్‌ను నిర్దేశించే కీలక ఘట్టం. ప్రస్తుతం ఈ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆన్‌లైన్‌ విధానంలో, పలు షిఫ్టులలో నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో అనుసరిస్తున్న ‘పర్సెంటైల్‌’ విధానం, షిఫ్టులలో పరీక్ష నిర్వహణ వంటివాటిపై తీవ్రమైన చర్చ నడుస్తోంది.

ప్రస్తుత ఆన్‌లైన్‌ విధానం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రతి బంధకంగా మారింది. దశాబ్దాలుగా మన విద్యా వ్యవస్థలో విద్యా ర్థులు పెన్ను, పేపర్‌తో పరీక్షలు రాయడానికే అలవాటు పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన కంప్యూటర్‌ పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల, అద్భుతమైన సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ ఉన్న విద్యార్థులు కూడా స్క్రీన్‌ చూస్తూ సమాధానాలు గుర్తించడంలో తడబడుతున్నారు. పట్టణ ప్రాంత విద్యార్థులు మాక్‌ టెస్టుల ద్వారా పొందే ప్రావీణ్యం, గ్రామీణ విద్యార్థులకు అందుబాటులో లేక పోవడం వల్ల ‘సమానత్వం’ దెబ్బతింటోంది.

చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు లేవనెత్తే ప్రధాన ప్రశ్న, ‘నీట్‌ పరీక్షను 23 లక్షల మంది రాసినా ఒకే రోజు, ఒకే పేపర్‌తో ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తున్నప్పుడు... అందులో సగం సంఖ్యలో ఉండే జేఈఈని ఎందుకు ఆఫ్‌లైన్‌లో నిర్వహించలేక పోతున్నారని! ఆఫ్‌లైన్‌లో షిఫ్టుల సమస్య ఉండదు. అందరికీ ఒకే ప్రశ్నాపత్రం ఉంటుంది. గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక అడ్డంకులు తొలగిపోతాయి.

అంతర్జాతీయంగా నార్మలైజేషన్, పర్సెంటైల్‌ విధానం అనేక దేశాల్లో అమలులో ఉంది. ఉదాహరణకు, అమెరికాలో ఎస్‌ఏటీ (శాట్‌), జీఆర్‌ఈ పరీక్షలు ఐఆర్టీ (ఐటెమ్‌ రెస్పాన్స్‌ థియరీ) ఆధారిత ‘ఈక్వేటింగ్‌’ పద్ధతిని పాటిస్తాయి. ఈ విధానంలో విద్యార్థికి కఠినమైన ప్రశ్నలు వచ్చినప్పుడు, వాటిని సరిగ్గా రాస్తే ఎక్కువ స్కోర్‌ వస్తుంది; దీనివల్ల ఏ రోజు పరీక్ష రాసినా స్కోరులో వ్యత్యాసం ఉండదు. ఆస్ట్రేలియాలో ఏటీఆర్‌ విధానం ద్వారా వేర్వేరు సబ్జెక్టుల కఠినతాన్ని బట్టి స్కేలింగ్‌ చేస్తారు.

అయితే, భారతదేశంలో వాడుతున్న పద్ధతి ‘పోస్ట్‌–హాక్‌  నార్మలైజేషన్‌’. అనగా పరీక్ష ముగిసిన తర్వాత విద్యార్థుల మార్కుల సగటును బట్టి పేపర్‌ కఠినత్వాన్ని నిర్ణయిస్తారు. ఇది తరచుగా ‘లక్‌ ఫ్యాక్టర్‌’కు దారితీస్తోంది. ఒకే మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులలో, షిఫ్ట్‌ తేడా వల్ల ఒకరికి ఎన్‌ఐటీలో సీటు రావడం, మరొకరు కనీసం క్వాలిఫై కూడా కాకపోవడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సులభమైన షిఫ్ట్‌ వచ్చిన విద్యార్థి ఒక చిన్న తప్పు చేసినా వేల ర్యాంకులు వెనక్కి వెళ్తున్నారు. ఇది విద్యార్థులలో మానసిక ఒత్తిడిని పెంచుతోంది.

ఇక షిఫ్టులు, పర్సెంటైల్‌ సమస్యలే కాకుండా... జేఈఈ మెయిన్స్‌ ప్రశ్నాపత్రంలో మరొక ముఖ్యమైన లోపం కనిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా, 2026తో సహా పలు సెషన్లలో ప్రశ్నలు తప్పుగా ఉండటం, లేదా బహుళైచ్ఛిక సమాధానాల్లో సరైన ఆప్షన్‌ లేకపోవడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి.

చ‌ద‌వండి: పంతం తీరినా ఆగ‌ని ప‌రుగు!
 
ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, ఎన్టీఏ కీలక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. నీట్‌ తరహాలో ఒకే రోజు, ఒకే పేపర్‌తో పెన్ను–పేపర్‌ విధానంలో పరీక్ష నిర్వహించడం ఆమోద యోగ్యమైన పరిష్కారం. ఒకవేళ ఆన్‌లైన్‌ కొనసాగించాల్సి వస్తే, అమెరికాలోని శాట్‌ తరహాలో ఐటమ్‌ రెస్పాన్స్‌ థియరీని ప్రవేశ పెట్టాలి.

– ఏటూరి సోమశేఖర్‌ శర్మ
రిటైర్డ్‌ జిల్లా విద్యాశాఖాధికారి, ఖమ్మం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement