
మాకు పెళ్లై 5 సంవత్సరాలు అవుతోంది. ఇటీవలే నా భర్త మరొకరితో వివాహేతర సంబంధం (extra marital affair) కలిగి ఉన్నాడని తెలిసింది. తన ఫోన్లో ఆధారాలు కూడా చూశాను. నా భర్త చాలా మంచివాడు. అయితే ఆ మహిళ తనను మోసం చేసింది అని చెప్పాడు. నేను ఆ మహిళపై కేసు పెట్టి జైలుకి పంపలేనా? – ఒక సోదరి, విశాఖపట్నం
సాధారణంగా స్త్రీలు తమ భర్త/కొడుకు మంచివాడే కానీ పక్క వాళ్ళు చెడగొడుతున్నారు అని భావిస్తూ ఉంటారు. అది సరికాకపోవచ్చు. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఎటువంటి బలవంతం లేకుండా ఒక బంధం ఏర్పడింది అంటే, అది వివాహేతరమైనప్పటికీ, వారు ఇష్టపూర్వకంగానే చేశారు అని భావించాలి. పూర్వం ఐ.పీ.సీ సెక్షన్ 497 అమలులో ఉన్నప్పుడు పరాయి స్త్రీ/మరొకరి భార్యతో లైంగిక సంబంధ కలిగి ఉంటే అది నేరంగా పరిగణించబడేది. కానీ సుప్రీం కోర్టు ఈ సెక్షన్‌ను రాజ్యాంగ వ్యతిరేకమని పరిగణించి రద్దుచేసింది. దీని అర్థం వైవాహిక సంబంధాన్ని దాటి మరొకరితో లైంగిక సంబంధం కలిగి ఉండవచ్చు అని కాదు. లైంగిక స్వేచ్ఛ పూర్తిగా వ్యక్తిగతమైనప్పటికీ భర్త లేదా భార్య మరొకరితో సంబంధం కలిగి ఉండటాన్ని విడాకులకు ప్రాతిపదికగా, గృహ హింసగానూ అనేక సందర్భాలలో పలు హైకోర్టులు సుప్రీంకోర్టు కూడా పేర్కొన్నాయి. అంటే క్రిమినల్ చట్టాలలో శిక్ష ఉండదు కానీ విడాకులు తీసుకోవడానికి, భారీ భరణం పొందడానికి, గృహ హింస చట్టం కింద పరిహారం పొందడానికి బలమైన కారణం కావచ్చు. అంతేకాక, ఒక మహిళ తన భర్తతో లైంగిక సంబంధం కలిగిన ఒక మహిళపై సివిల్ సూట్ /దావా వేస్తూ నాలుగు కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలి అంటూ కోర్టును ఆశ్రయించగా ఇలాంటి దావా చెల్లదు అని ఈ సమస్య ఢిల్లీ హైకోర్టుకు చేరింది.
ఢిల్లీ హైకోర్టు తన తీర్పును వెల్లడిస్తూ ఈ దావా సమంజసమే అని పేర్కొంది. అయితే దావా వేసిన మహిళ తన వైవాహిక జీవితంలో ఉద్దేశపూర్వకంగా మరొక మహిళ జోక్యం చేసుకుని తనకు భర్త నుండి/వైవాహిక జీవితం నుండి దక్కవలసిన ప్రేమ – ఆప్యాయతలకు భంగం కలిగించింది అని రుజువు చేయవలసి ఉంటుందని కూడా ఢిల్లీ హైకోర్టు చెప్పింది.
చదవండి: Janhvi Kapoor అమ్మ చీర చుట్టేసి..ఫ్యాన్స్‌ను కట్టిపడేసి : అమేజింగ్ లుక్
దీని అర్థం: ఒకవేళ ఆ మూడవ వ్యక్తి ఉద్దేశపూర్వక ప్రమేయం లేదు, సదరు మహిళ భర్తయే స్వచ్ఛందంగా/ఇష్టపూర్వకంగా మరొకరితో సంబంధాన్ని ఏర్పరచుకున్నారు అని రుజువు చేస్తే, ఆ మూడవ వ్యక్తిపై ఎలాంటి సివిల్ కేసు బాధ్యత కూడా ఉండదు. ఎందుకంటే మానవ సంబంధాలు (అవి వివాహేతర సంబంధాలు అయినా) పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశాలు. మూడవ వ్యక్తి పనికట్టుకుని మరొకరి వైవాహిక జీవనానికి భంగం కలిగించారు అని, అందులో భర్త/భార్య పాత్ర లేదు అని రుజువు చేయటం అంత సులభం కాదు. వివాహేతర సంబంధం కలిగి ఉన్నారు అనే కారణం చూపుతూ విడాకుల కేసు వేసిన సందర్భాలలో, అలాంటి సంబంధం కలిగిన మూడో వ్యక్తిని కూడా కేసులో చేర్చాలి అని పలు కోర్టులు అభిప్రాయపడ్డాయి. ఇలాంటి కేసులో కూడా పరిహారం కోరే ఆస్కారం లేకపోలేదు!
ఇదీ చదవండి: గోంగూర పువ్వులతో వంటలు, అద్భుత ప్రయోజనాలు
ఇక మీ విషయానికి వస్తే, మీ భర్త స్వచ్ఛందంగా మీకు చెప్పలేదు కాబట్టి, మూడో వ్యక్తి తనని మోసం చేసిందంటే మీరు ఎలా నమ్ముతున్నారు? మీరు ఆ మహిళపై క్రిమినల్ కేసు పెట్టే వీలు లేదు. పెట్టాలి అనుకోవటం కూడా సమంజసం కాదు. పైన చెప్పిన విధంగా సివిల్ కేసు వేస్తే వేయవచ్చు. అప్పుడు మీ భర్తపై తన ప్రియురాలు మాత్రం క్రిమినల్ కేసు వేసే ఆస్కారం ఉంది మరి!
శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
మీకున్న న్యాయపరమైన సమస్యలు,
సందేహాల కోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు.