సహజీవనంలో కూడా ఆ చట్టం వర్తిస్తుందా? | Legal Advice: Live-in Relationship Under DV Act | Sakshi
Sakshi News home page

సహజీవనంలో కూడా ఆ చట్టం వర్తిస్తుందా?

May 13 2026 3:50 PM | Updated on May 13 2026 3:58 PM

Legal Advice: Live-in Relationship Under DV Act

గత నాలుగు సంవత్సరాలుగా ఒకవ్యక్తితో సహజీవనం చేస్తున్నాను. ఒకే ఇంట్లో ఉంటున్నాము. అంతా బాగానే ఉంది కదా పెళ్లి చేసుకుందాము అనుకున్నాను. పోయిన ఏడాది అతన్ని వాళ్ళ ఇంట్లో చెప్పమని అన్నాను. కానీ మా కులాలు వేరు కావడంతో వాళ్ళ ఇంట్లో మాత్రం వద్దు అన్నారు. అప్పటినుంచి తన వ్యవహార శైలి మారిపోయింది. ప్రతి చిన్నదానికి గొడవ పడుతున్నాడు. తన బలవంతంపై ఒకసారి అబార్షన్‌ కూడా చేయించుకున్నాను. ప్రతి వారం నాకు చెప్పకుండా ఎటో వెళ్తున్నాడు. తన వాటా అద్దెకానీ, ఇంటి సరుకులకు కానీ డబ్బు కూడా ఇవ్వడం లేదు. అడిగితే అప్పులు ఉన్నాయని అంటున్నాడు. అప్పుడప్పుడు చెయ్యి చేసుకుంటూ... ఇష్టం లేకుంటే వెళ్ళిపో అంటున్నాడు. పెళ్ళి చేసుకుంటా అని మోసం చేశాడు అని కేసు పెట్టమని ఒకరు సలహా ఇచ్చారు. నాకు మాత్రం గృహహింస చట్టం కింద కేసు వేయాలి అని ఉంది. ఏం చేయమంటారు?
– ఒక సోదరి, విశాఖపట్నం

పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్న వారికి కూడా గృహహింస నిరోధక చట్టం వర్తిస్తుంది. కానీ ప్రతి సహజీవనం కేసులో గృహహింస నిరోధక చట్టం వర్తింప చేయలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ చట్టంలోని సెక్షన్‌ 2(ఎఫ్‌) ప్రకారం ‘వివాహ స్వరూపంలో ఉన్న సంబంధం’ ఏ పరిస్థితుల్లో ఉంటుందో నిర్ధారించడానికి కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు. ఇవి సంపూర్ణమైనవి కాక΄ోయినా, అలాంటి సంబంధాల స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయుక్తంగా ఉంటాయి అని కోర్టు చెప్పింది. అందులో ముఖ్యమైనవి...

సంబంధం కొనసాగిన కాలవ్యవధి
డీవీ చట్టంలోని సెక్షన్‌ 2(జ) మేరకు వారి సంబంధం ఒక సముచిత కాలం పాటు కొనసాగి ఉండాలి. ఆ కాలవ్యవధి ప్రతి కేసులోని వాస్తవ పరిస్థితుల ఆధారంగా మారవచ్చు.

సహవాస గృహం (షేర్డ్‌ హౌస్‌ హోల్డ్‌) ఏదో ఒక సమయంలో కలిసి ఒకే ఇంట్లో నివసించారు అనే ఆధారం.

ఆర్థిక వనరుల భాగస్వామ్యం 
ఒకరికి ఒకరు ఆర్థికంగా సహకరించడం, జాయింట్‌ బ్యాంకు ఖాతాలు నిర్వహించడం, స్థిరాస్తులను ఇద్దరిపేర్లపై లేదా మహిళ పేరుపై కొనుగోలు చేయడం, వ్యాపారాల్లో లేదా షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వంటి అంశాలు.

గృహ వ్యవహారాల నిర్వహణ 
ముఖ్యంగా మహిళకు ఇంటి నిర్వహణ బాధ్యతలు అప్పగించడం, ఉదాహరణకు వంట చేయడం, శుభ్రపరచడం, ఇంటిని నిర్వహించడం వంటి పనులు చేయడం.

లైంగిక సంబంధం 
వివాహ స్వరూపంలోని సంబంధం అనేది కేవలం శారీరక సుఖం కోసం మాత్రమే ఉండే లైంగిక సంబంధం కాదు. అది భావోద్వేగ, ఆత్మీయ బంధం, సంతానం పొందాలనే ఉద్దేశం, స్నేహభావం, పరస్పర ప్రేమాభిమానాలు, శ్రద్ధ వంటి లక్షణాలను కలిగి ఉండాలి.

పిల్లలు/సంతానం 
పిల్లలు ఉండటం అనేది వివాహ స్వరూపంలోని సంబంధానికి బలమైన సూచన. ఎందుకంటే అది దీర్ఘకాలిక సంబంధాన్ని కొనసాగించాలనే ఉద్దేశాన్ని చూపిస్తుంది. పిల్లలను పెంచడం, వారి బాధ్యతలను పంచుకోవడం కూడా అలాంటి సంబంధానికి బలమైన సూచన.

సామాజికంగా భార్యాభర్తలుగా ప్రవర్తించడం
స్నేహితులు, బంధువులు, సమాజంలోని ఇతరుల ముందర భార్యాభర్తలుగా ప్రవర్తించడం, అలాగే తమను అదేవిధంగా పరిచయం చేసుకోవడం, ఆ సంబంధం వివాహ స్వరూపంలో ఉందని నిర్ధారించడానికి బలమైన ఆధారంగా పరిగణించబడుతుంది.

ఇరుపక్షాల ఉద్దేశం, ప్రవర్తన
తమ సంబంధం ఎలా ఉండాలి, దాని స్వభావం ఏమిటి, ఇద్దరి పాత్రలు, బాధ్యతలు ఏమిటి అనే విషయాలపై ఇరుపక్షాల ఉద్దేశం ఆ సంబంధ స్వభావాన్ని ప్రధానంగా నిర్ణయిస్తుంది. ఆ ఉద్దేశం స్పష్టంగా వ్యక్తపరచబడవచ్చు లేదా ప్రవర్తన ద్వారా పరోక్షంగా అర్థమవవచ్చు. వివాహానికి సాధారణంగా ఉండే లక్షణాల విషయంలో వారి ఉద్దేశమే ముఖ్యమైనది.

పైన సూచించిన విధంగా మీ బంధం/సహజీవనం కొనసాగి ఉంటే మీకు గృహహింస చట్టం వర్తిస్తుంది. సహజీవనం చేస్తున్న వారు చాలామంది ఎటువంటి ఆధారాలను ఉంచుకోవడం లేదు. ఒక ఇల్లు అద్దెకు తీసుకుంటే అందులో కేవలం ఒకరి పేరు మాత్రమే ఉంటుంది. ఇద్దరి పేర్లు ఉంటే మంచిది. వారి బంధాన్ని ఎవరికీ చెప్పుకోకుండా గోప్యంగా ఉంచుకోవడం కూడా మంచిది కాదు. పైన సూచించిన అంశాలను గుర్తుపెట్టుకుని సహజీవనం చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటే మంచిది.

అదలా ఉంటే మీకు మీ సన్నిహితులు ఇచ్చిన సలహా మేరకు పెళ్లి చేసుకుంటాను అని మోసపూరితంగా శారీరకంగా కలిశారు అంటూ బీ.ఎన్‌.ఎస్‌. లోని సెక్షన్‌ 69 ప్రకారం కూడా క్రిమినల్‌ కేసు నమోదు చేసే ఆస్కారం ఉంది. కానీ అది నిజమైతే మాత్రమే క్రిమినల్‌ కేసు పెట్టండి. 

సెక్షన్‌ 69 ప్రకారం పురుషునికి మొదటి నుండి మోసపూరిత ఉద్దేశం ఉంది అని రుజువు చేయాల్సి ఉంటుంది. మీ హక్కులు మీకు ఉన్నప్పటికీ, మీ వ్యక్తిగత జీవితం చాలా ముఖ్యమైనది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ, వ్యక్తిగత జీవనం భంగపడకుండా చూసుకోండి. ప్రస్తుత బంధాన్ని ముగించవలసి వస్తే, ఆ పని చేసి కేసులను నడిపించవచ్చు.
శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది
( మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com మెయిల్‌ చేయవచ్చు.  )

(చదవండి: కేన్సర్‌పై ఎలా పోరాడాలంటే..! నటి రాజశ్రీ దేశ్‌పాండే హెల్త్‌ టిప్స్‌)

Advertisement
 
Advertisement
Advertisement