
ఎండలతో ఎర్రగా మారిన ఎడారి నేల ఇప్పుడు పచ్చని పంటలతో మెరిసిపోతోంది. కేవలం చిన్న చిన్న రాళ్ల గుట్టలు, మట్టీ మాయల సహాయంతోనే పరిశోధకులు ఎడారిని పచ్చని పరుపులా మార్చడం పెద్ద పనేం కాదని అంటున్నారు. ఆనకట్టలు కావు.. ఆదుకునే మంత్రాలు!
ఎర్రబడిన ఎడారుల్లో కొత్త ఆశ మొలకెత్తింది. ఆ ఆశ పేరే లారా నార్మన్. అమెరికాకు చెందిన ఈ శాస్త్రవేత్త, ఇరవై ఏళ్లుగా ఎడారిలో నీటి జాడల కోసం వెతికేస్తూ చివరకు ఒక రహస్యాన్ని కనుగొన్నారు. ఆ రహస్యం పెద్ద యంత్రం కాదు, క్లిష్టమైన శాస్త్రం కాదు. ప్రకృతి ఇచ్చిన సులభ మంత్రం. పెద్ద పెద్ద రాళ్లు, చెట్లు, కట్టెలు వంటివన్నీ కలిసి నిడ్స్ అనే సహజ అడ్డాలుగా మారతాయి.
ఈ అడ్డాలు నీటి ప్రవాహాన్ని పూర్తిగా ఆపకుండా, నెమ్మదిగా మార్చి, నేలను తడిగా ఉంచుతాయని లారా గుర్తించింది. ఈ పద్ధతిని అనుసరించి ఆమె అరిజోనా, న్యూ మెక్సికో ప్రాంతాల్లో చిన్న చెక్ డ్యామ్‌లు, రాళ్ల గుట్టలు ఏర్పాటు చేసింది. మొదట ఇది కేవలం మట్టిని ఆపినట్టే అనిపించింది. కాని, కొద్ది రోజుల్లోనే ఎండిన నేల తడిగా మారింది. తడిబీడులు పుట్టాయి. పచ్చని చెట్లు మొలిచాయి. పక్షులు తిరిగి వచ్చి కూశాయి. ఇలా ఎడారి గుండెకు మళ్లీ జీవం చేరింది.
మాయా మట్టీ!
ఎడారి ఇసుకల్లో ఒక్కసారిగా పచ్చని పంటలు పండాయి. ఆశ్చర్యంగా అనిపిస్తుందా? కాని, ఇది నిజమే! యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నలభై రోజుల్లోనే ఇసుకమయమైన భూమి కాస్త పచ్చటి తోటగా మారిపోయింది. అంతేగాక, అక్కడి ఎండల్లో తియ్యటి పుచ్చకాయల పంట కూడా పండింది. ఈ అద్భుతానికి కారణం ‘నానోక్లే’. మట్టి, నీరు, స్థానిక ఇసుకల మిశ్రమంతో తయారైన ఈ ద్రవం ఎడారికి ప్రాణం పోసే రహస్య మంత్రంలా పనిచేస్తుంది.
ఇసుకపై దీన్ని పిచికారీ చేస్తే, ప్రతి ఇసుక రేణువుకు మట్టి కవచం ఏర్పడుతుంది. ఆ కవచం నీటిని పట్టి ఉంచుతుంది. ఫలితంగా ఎండిన నేల తడిగా మారి, వేర్ల దగ్గర పచ్చని జీవం మొలుస్తుంది. ఇలా కొద్ది గంటల్లోనే ఎడారి పచ్చదనంతో మెరిసిపోతుంది. అంతేకాదు, నీటి వినియోగం సగానికి తగ్గిపోవడం, పంటలు వేగంగా పెరగడంలో కూడా ఇది సహాయపడుతుంది.
ఈ మధ్యనే అబూధాబీలో చేసిన ప్రయోగాల్లో పుచ్చకాయలతో పాటు జుక్కినీ, మిల్లెట్ కూడా పండించగలిగారు. కరోనా సమయంలో వచ్చిన ఆ పంటలు స్థానిక కుటుంబాల కడుపులు నింపాయి. ఇప్పటికీ ఈ ప్రక్రియకు ఖర్చు కొంత ఎక్కువే కాని, భవిష్యత్తులో ఈ సాంకేతికత చౌకగా మారితే ఎడారులన్నీ పచ్చటి పొలాలుగా మారిపోతాయి!
(చదవండి: పిట్ట మైల్డ్.. వేట వైల్డ్)