సేవ్‌ వాటర్‌

Lalithamba Vishwanathiah: Bengaluru Woman Helps Save Over 18 Lakh Litres of Water - Sakshi

చేతులు కడగడానికి ట్యాప్‌ తిప్పుతాం. చేతిలో పట్టేటంతటి ధారతో సంతృప్తి చెందం. పూర్తిగా ఓపెన్‌ చేస్తాం. ఒక్కసారిగా నీరు ధారాపాతంగా వచ్చి దోసిట్లోకి పడిపోవాలన్నంత ఆత్రం. చేతులు కడుక్కోవడం పూర్తయ్యే సరికి కనీసంగా ఇరవై సెకన్ల సేపు ట్యాప్‌ రన్నింగ్‌లో ఉంటుంది. అంత సమయంలో సింక్‌లోకి జారిపోయే నీరెంత ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? నాలుగు లీటర్లకు తక్కువ ఉండదు. ఆశ్చర్యంగా ఉన్నా సరే ఇది నిజం. ‘ట్యాప్‌ పూర్తిగా తిప్పవద్దు. ఎంత కావాలో అంతవరకే ఓపెన్‌ చేయండి’ అని ఇంట్లో వాళ్లకు చెప్పి చెప్పి విసిగిపోయింది లలితాంబ విశ్వనాథయ్య. అందుకే ఓ చిన్న సాధనంతో నీరు తగినంత మాత్రమే వచ్చేటట్లు ట్యాప్‌కు ఉచ్చు బిగించింది.

బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్‌ లే అవుట్‌ నివాసి లలితాంబ. నీటివృథాను అరికట్టడానికి ఆమె వాటర్‌ ఏరియేటర్, వాటర్‌ రిస్ట్రిక్టర్‌లకు రూపకల్పన చేసింది. వీటిని అమర్చడం ద్వారా నీటి వాడకం మూడవ వంతుకు తగ్గిపోతుంది. సాధారణంగా ఓ కొత్త ఆవిష్కరణ మనిషి జీవనశైలిని ఆధునీకరించడం కోసమే ఉంటుంది. వాటికి మార్కెట్‌లో మంచి ఆదరణ కూడా లభిస్తుంది. లలితాంబ రూపొందించిన సాధనాలు సామాజిక ప్రయోజనార్థం పని చేస్తాయి. ప్రకృతి పరిరక్షణ, వనరుల సంరక్షణలో కీలకమైన పాత్ర వహిస్తాయి.  
 
వాటర్‌ బాటిల్‌ లేదు!
‘నీరు అనేది చాలా విస్తృతమైన సబ్జెక్ట్‌. నదుల సంరక్షణ, పరిశుభ్రతనే ప్రధానంగా చూస్తాం, కానీ పర్యావరణ పరిరక్షణ నుంచి దైనందిన జీవనం వరకు అడుగడుగునా అది కీలకమైన అంశమే’ అంటారు ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్‌ పురుషోత్తమ్‌ రెడ్డి. ‘‘నాకు ఎనభై ఏళ్లు. నా బాల్యంలో స్కూలుకెళ్లేటప్పుడు నీటిసీసా తీసుకెళ్లడం మాకు తెలియదు. దారిలో రోడ్డు పక్కన కనిపించిన నల్లా తిప్పి చేయి పట్టి దాహం తీరే వరకు తాగేవాళ్లం. ఎంతో ఆరోగ్యంగా పెరిగాం. నీటి కాలుష్యం అనే పదమే తెలియదప్పట్లో. మా ఇంట్లో బావి ఉండేది. వర్షాకాలంలో అయితే  బకెట్‌కు తాడు కట్టి మూడు– నాలుగు అడుగుల లోతులో ఉన్న నీటిని ముంచుకోవడమే.

ఎండాకాలంలో అదే బావిలో నీరు ఇరవై అడుగుల లోతుకి వెళ్లేది. భూగర్భ జలాల కనీస స్థాయులంటే ఇరవై అడుగులే. హైదరాబాద్‌ చుట్టూ వందల చెరువులు, కుంటలు ఉండేవి. క్రమంగా ఒక్కొక్కటీ మాయమవుతున్నాయి. నీటిచుక్క పాతాళానికి పోయింది. నీటి జాడ కోసం నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ లోతుకు బోర్లు వేస్తున్నారు. నీటిని అవసరానికి మించి వాడడం అంటే సహజ వనరులను వృథా చేయడమే. ఈ మధ్య ప్రభుత్వం జారీ చేసిన 111 జీవో మీద కూడా మేము అభ్యంతరం తెలియచేశాం. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ మంచి నీటి రిజర్వాయర్‌లు కూడా ఈ జీవో ఫలితంగా హుస్సేన్‌సాగర్‌ లాగానే మారిపోతాయని హెచ్చరించాం.

భావి తరాలకు అందాల్సిన సహజ వనరులను విచక్షణ రహితంగా వాడేసే హక్కు ఎవరికీ ఉండదు. మనదేశంలో జలకాలుష్యనిరోధానికి ‘వాటర్‌ యాక్ట్‌ ఆఫ్‌ 1974’ అనే చట్టం ఉంది. దానిని అమలు చేయడానికి పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు కూడా ఏర్పాటైంది. ఎన్ని చట్టాలున్నా సరే... మన దగ్గర నీటి సంరక్షణ విషయంలో సమన్వయలోపంతోనే పనులు జరుగుతున్నాయి. ఫ్యాషన్‌ ఉత్పత్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. మార్కెట్‌లోకి రాగానే కొనేస్తారు. కాని, ఇలాంటి సమాజహితమైన, పర్యావరణ పరిరక్షణ సహితమైన వాటర్‌ రిస్ట్రిక్టర్‌లను వాడమని ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తోంది’’ అని ఆవేదనగా అన్నారాయన.  
 
ప్రతిజ్ఞ చేద్దాం!

నీటి వనరులను పరిరక్షించుకోవడం అనగానే భూగర్భ జలాలు పెరిగి ఎండిపోయిన బావుల్లోకి నీరు చేరడం, రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్, సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ వంటి పెద్ద విషయాల మీదనే చర్చ జరుగుతుంటుంది. కానీ... ఇంట్లో మనం వాడే ప్రతి నీటి చుక్కనూ గౌరవించుకోవాలి. ‘ఆహారాన్ని వృథా చేయము’ అని ప్రతిన పూనుతున్నాం. అలాగే నీటిని వృథా చేయను అని కూడా ఎవరికి వాళ్లు మనసులోనే ప్రతిజ్ఞ చేసుకోవాలి. అప్పుడు లీకవుతున్న ట్యాప్‌ను చూసినప్పుడు దానిని కట్టేసేవరకు మనసు ఊరుకోదు. ట్యాప్‌ లీకవుతుంటే ఒక్కో చుక్కే కదా అని తేలిగ్గా తీసుకోవడం జరగదు. గమనించిన తక్షణమే ట్యాప్‌ మారుస్తాం. ఒక్కో చుక్క నీరు కారుతున్న ట్యాప్‌ నుంచి ఇరవై నాలుగ్గంటల్లో ఎనభై లీటర్ల నీరు వృథా అవుతుంది తెలుసా!

ఇది నిజం... నమ్మండి!
వాటర్‌ రిస్ట్రిక్టర్‌ ధర వంద రూపాయలకు మించదు. దీని ద్వారా నీటి వృథాను అరికట్టగలుగుతాం. నిమిషానికి నాలుగు లీటర్ల చొప్పున ఆదా చేయగలుగుతాం. కాలేజ్‌లు, కల్యాణమండపాల వంటి చోట నెలకు సరాసరిన పదిహేను వేల లీటర్ల నీరు ఆదా అవుతుంది.
– లలితాంబ, వాటర్‌ రిస్ట్రిక్టర్‌ రూపకర్త 

మహిళలే సంరక్షకులు
మహిళలు స్వచ్ఛందంగా స్పందిస్తేనే నీటి సమస్య అదుపులో ఉంటుంది. మన కిచెన్‌లో ట్యాప్‌ తిప్పగానే నీరు ధారగా ప్రవహిస్తోందంటే... దాని వెనుక కనిపించని శ్రమ ఎంతో ఉంటుంది. నదుల జన్మస్థానాలైన కొండల మీద నుంచి మన ఇంటికి వస్తున్నాయనే విషయాన్ని మర్చిపోకూడదు. కొండ శిఖరం నుంచి మన ఇంటి ట్యాప్‌కు చేరడానికి మధ్య ఎంత మెకానిజం పని చేస్తోందో గమనించాలి. మీ పిల్లల కోసం ఎన్నెన్నో ఆస్తులను కూడబెడుతుంటారు, అంతకంటే విలువైన ఆస్తి నీరు. ఆ నీటిని వృథా చేయకండి. ఎండిన భూమిని కాదు, చల్లని భూమిని భావితరాలకు వారసత్వంగా ఇవ్వండి.
– ప్రొ‘‘ కె. పురుషోత్తమ్‌రెడ్డి, పర్యావరణవేత్త

– వాకా మంజులారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top