హైదరాబాద్‌కు సమీపంలో జైన మందిరాలు

Kolanupaka Jain Temple in Yadadri Bhuvanagiri District - Sakshi

జైన మందిరాలు శాంతికి చిహ్నాలుగా కనిపిస్తాయి. నిర్మాణంలో సునిశితత్వంతోపాటు ప్రశాంతమైన వాతావరణం వీటి ప్రత్యేకత. కొలనుపాకలో ఉన్న జైన మందిరం లేత గులాబీరంగు అద్దిన మైనపు బొమ్మలాగ ఉంటుంది. రెండు వేల ఏళ్ల నాటి నిర్మాణం ఇది. రాష్ట్రకూటుల కాలంలో ఇక్కడ జైనం విలసిల్లింది. ప్రపంచ కాలమానం క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకంలోకి ప్రయాణించిన సంధికాలంలో ఇక్కడ జైనం వికసించింది. ఆ వికసిత జైనానకి ప్రతీకలుగా జైన మందిరాల్లో పై కప్పులకు రెక్కలు విచ్చిన పద్మం ఉంటుంది. కొలనుపాక జైన మందిరం శ్వేతాంబర జైనసాధకుల ఆలయం. 

కొలనుపాకలో జైన మందిరాన్ని ఒక ఎకరా విస్తీర్ణంలో నిర్మించారు. చుట్టూ ఉన్న ధర్మశాలలు ఇతర కట్టడాలన్నీ కలిపి ఈ మందిరం ఇరవై ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ మందిరాన్ని భరతుడు కట్టించాడని స్థానిక కథనం ఒకటి వ్యవహారంలో ఉంది. శకుంతల– దుష్యంతుల కుమారుడు భరతుడు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. ‘భరతుడు కట్టించాడనే అనుకోవడానికి... మరి భారతదేశం రెండు వేల ఏళ్లకంటే ముందే ఉండేది కదా. ఈ మందిరం ఆవరణలో ఉన్న దాదాపు ఇరవై శాసనాలను బట్టి చూస్తే రాష్ట్రకూటుల చారిత్రక కాలానికి వర్తిస్తోంది. పురాతన మందిరాన్ని రాష్ట్రకూటులు అభివృద్ధి చేసినట్లు చెబుతారు. ఇక్కడ బౌద్ధం కూడా బాగానే విస్తరించింది. కానీ పర్యాటక ప్రదేశంగా జైనమందిరమే ప్రాచుర్యంలోకి వచ్చింది.

వర్ధమానుడి విగ్రహం
జైన తీర్థంకరులు రిషభనాధుడు, నేమినాథుడు, మహావీరుల విగ్రహాలతోపాటు ఆదినాధుడు, వర్ధమాన మహావీరుడి శిష్యుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ మందిరంలో తెల్లటి పాలరాతి విగ్రహాలతోపాటు ఆకుపచ్చ పాలరాతి విగ్రహాన్ని కూడా చూడవచ్చు. గడచిన శతాబ్దంలో ఈ మందిరానికి మరమ్మత్తులు చేశారు. గుజరాత్, రాజస్థాన్‌ రాష్ట్రాల నుంచి పాలరాతి నిర్మాణాల్లో నిపుణులు వచ్చి మెరుగులుదిద్దారు. 

మహావీర సూత్రాలు
ఈ మందిరంలో గోడల మీద మహావీరుడు బోధించిన నీతిసూత్రాలు కూడా ఉంటాయి. వాటిలో సమాజంలో మనుషులంతా సమానమే అని ఉంటుంది. కానీ పర్యాటకులను ప్రధాన ఆలయంలోకి అనుమతించరు. అందులోకి ప్రవేశం శ్వేతాంబర జైనులకు మాత్రమే. ఈ జైనమందిరం హైదరాబాద్‌కి ఎనభై కిలోమీటర్ల దూరాన యాదాద్రి జిల్లాలో ఉంది. రైల్లే వెళ్లాలంటే ఆలేరు రైల్వేస్టేషన్‌లో దిగాలి. ఆలేరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరాన ఉంటుంది. వారాంతపు సెలవుకు ఇది మంచి ప్రదేశం. రోజంతా ఆహ్లాదంగా గడపవచ్చు. 

చదవండి:
మానా గ్రామం.. ఇది మన ఊరే!

రంగులు మార్చే సూర్యుడు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top