నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ప్రపంచ పాప్ సంగీత సామ్రాజ్య అగ్రగామి, కే-పాప్ సంచలనం బీటీఎస్ మళ్లీ స్టేజ్ పైకి వచ్చేసింది. శనివారం దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని గ్వాంగ్‌హ్వామున్ స్క్వేర్‌లో జరిగిన బీటీఎస్ కంబ్యాక్ కన్సర్ట్ ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్ ఎక్స్‌క్లూజివ్‌గా ప్రసారమైన ఈ మెగా ఈవెంట్‌కు వేలాది మంది పోలీసులు రక్షణగా నిలవగా, లక్షలాది మంది అభిమానులు (ARMY) తమ అభిమాన హీరోలను చూసి పరవశించిపోయారు. ‘అన్యోంగ్‌హాసెయో!’.. మేము మళ్లీ వచ్చేశాం" అంటూ బ్యాండ్ లీడర్ ఆర్‌ఎం పలికిన మాటలు సీయోల్ వీధుల్లో ఉవ్వెత్తున మారుమోగాయి.
సరికొత్త రికార్డుల వేటలో..
దక్షిణ కొరియాలో తప్పనిసరి అయిన సైనిక సేవను గ్రూప్‌లోని ఏడుగురు సభ్యులు (ఆర్‌ఎం, జిన్, సుగా, జె-హోప్, జిమిన్, వి, జంగ్ కుక్) విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత జరిగిన మొదటి పూర్తిస్థాయి కన్సర్ట్ ఇది. శుక్రవారం విడుదలైన వీరి ఐదవ ఆల్బమ్ ‘అరిరంగ్’ మొదటి రోజే ఏకంగా 40 లక్షల కాపీలు అమ్ముడై రికార్డు సృష్టించింది. తన కాలికి గాయం అయినా దానిని లెక్కచేయకుండా ఆర్‌ఎం చేసిన పర్ఫార్మెన్స్ అభిమానులను భావోద్వేగానికి గురిచేసి, కన్నీరు పెట్టించింది.
గ్వాంగ్‌హ్వామున్ వేదికగా సంగీత సంగమం
చారిత్రక గ్వాంగ్‌హ్వామున్ స్క్వేర్, గ్యోంగ్‌బోక్ ప్యాలెస్ నేపథ్యంగా పర్పుల్, ఎరుపు, నీలం రంగుల వెలుగుల్లో ఈ వేడుక అద్భుతంగా సాగింది. కొరియా జానపద గీతం ‘అరిరంగ్’ పేరుతో రూపొందించిన ఈ ఆల్బమ్, విడిపోవడం, తిరిగి కలవడంలో ఉండే ఆవేదన, ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది. ‘మేము ఎవరమో, మళ్లీ ఎలా కలిసి వచ్చామో ప్రపంచానికి చూపించాలనుకున్నాం’ అని ఆర్‌ఎం ఈ సందర్భంగా ఉద్వేగంగా పేర్కొన్నారు.
పోలీసు వలయంలో సీయోల్!
2022 హాలోవీన్ విషాదం తర్వాత ప్రభుత్వం భద్రత విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించింది. కన్సర్ట్ కోసం సమీపంలోని సబ్‌వేలు, బస్సు సర్వీసులను నిలిపివేసి, చుట్టుపక్కల భవనాలను కూడా సీల్ చేశారు. 22,000 మంది ‘అదృష్టవంతులు’ గ్యాలరీల్లో కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించగా, బయట వేలాది మంది భారీ స్క్రీన్ల ముందు ఆనందంగా ఊగిపోయారు.
పాత జ్ఞాపకాలు.. కొత్త ఊపిరి
గంట పాటు సాగిన ఈ ప్రదర్శనలో "‘బేబీ టు బాడీ’, "స్విమ్" లాంటి కొత్త పాటలతో పాటు, గ్లోబల్ హిట్స్ అయిన ‘డైనమేట్’, ‘బట్టర్’ పాటలకు అభిమానులు స్టెప్పులేశారు. ‘కొన్నేళ్ల క్రితం బూసాన్ కన్సర్ట్‌లో మా కోసం వేచి ఉండమని అడిగాం.. ఆ మాట నిలబెట్టుకుని ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ జిన్ భావోద్వేగానికి లోనయ్యారు. చలిని కూడా లెక్కచేయకుండా వచ్చిన అభిమానులను చూసి సభ్యులు స్టేజ్ పైనే కన్నీటి పర్యంతమయ్యారు.
ముందుంది గ్లోబల్ టూర్
ఈ కన్సర్ట్ కేవలం ప్రారంభం మాత్రమే! ప్రపంచవ్యాప్తంగా అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో సుమారు 82 ప్రదర్శనలతో కూడిన భారీ గ్లోబల్ టూర్ కు బీటీఎస్ సిద్ధమైంది. కే-పాప్ చరిత్రలో ఇదొక ‘రెండవ స్వర్ణయుగం’ అని సాంస్కృతిక విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కే-పాప్ క్రేజ్‌ను ఈ కంబ్యాక్ మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయమని అంటున్నారు.
ఇది కూడా చదవండి: ఐదు వేల ఏళ్ల ఫ్యాషన్.. అప్పటికీ, ఇప్పటికీ..


