
నైసార్ ఉపగ్రహానికి శాటిలైట్ డైరెక్టర్‌గా వ్యవహరించిన మహిళా శాస్త్రవేత్త చైత్రరావు
మిషన్ కంట్రోల్ సెంటర్‌లో ఆకట్టుకున్న మహిళా శాస్త్రవేత్త
నైసార్ ప్రయోగంలో శాటిలైట్ డైరెక్టర్‌గా కీలక పాత్ర
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్నో ప్రయోగాల్లో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తోంది. బుధవారం సాయంత్రం 5.40 గంటలకు జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్16 రాకెట్ ద్వారా ప్రయోగించిన నాసా–ఇస్రో సింథటిక్ ఆపార్చర్ రాడార్ (నైసార్) ఉప గ్రహానికి చైత్ర రావు (Chaitra Rao) అనే మహిళా శాస్త్రవేత్త శాటిలైట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
ప్రయోగం విజయవంతమయ్యాక మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి నమస్కారం.. అంటూ ప్రసంగం ప్రారంభించిన ఆమె.. చివరలో వందేమాతరం.. అని చెప్పడంతో ఆందరూ ఆమెను తెలుగు మహిళా శాస్త్రవేత్త అనుకున్నారు. అయితే ఆమె మూలాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రమే (Telugu State) అయినప్పటికీ ప్రస్తుతం కర్ణాటకలో ఉంటున్నారు.
చిన్నపాటి ఇంజినీర్‌గా చేరిన ఆమె అంచెలంచెలుగా ఎదిగి బెంగళూరులో ప్రొఫెసర్ యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో ఉపగ్రహాలను రూపొందించడం, సమగ్ర పరచడం, పరీక్షించడం వంటి విభాగాల్లో ఆమె సైంటిస్టుగా పని చేస్తున్నారు. గతంలో మార్స్ ఆర్బిట్ మిషన్‌కు స్పేస్ క్రాఫ్ట్ ఆపరేషన్ మేనేజర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత ఖగోళ పరిశోధనకు తయారు చేసిన ఆస్ట్రోశాట్‌లో పేలోడ్స్‌ను అందజేయడంలో కీలక భూమిక పోషించారు.
చదవండి: చిన్నోడి డాన్స్‌కు ఫిదాకు అవుతున్నారు!
ప్రస్తుతం నైసార్ ఉపగ్రహానికి శాటిలైట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. అమెరికాలోని కాలిఫోర్నియా ఆఫ్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి జెట్ ప్రొపల్షన్ లేబోరేటరీ (జేపీఎల్)కి చెందిన ప్రతినిధులతో కలిసి ఆమె ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఇందులో ఎల్– బ్యాండ్ సింథటిక్ ఆపార్చర్ రాడార్‌ను జేపీఎల్ ప్రతినిధులు, ఎస్–బ్యాండ్ సింథటిక్ ఆపార్చర్ రాడార్‌ను ఇస్రో రూపొందించింది. చైత్రరావు శాటిలైట్ డైరెక్టర్‌గా కీలకమైన పాత్ర పోషించారు. పురుషులకంటే మహిళలు ఎందులోనూ తక్కువ కారని నిరూపించారు.