Srikrishna Janmashtami: శ్రీకృష్ణ చెలిమి.. శ్రీనివాస కలిమి | Intresting Facts Sri Venkateshwara Goshala In Tirupati Krishna Astami | Sakshi
Sakshi News home page

Srikrishna Janmashtami 2022: శ్రీకృష్ణ చెలిమి.. శ్రీనివాస కలిమి

Published Fri, Aug 19 2022 8:12 AM | Last Updated on Fri, Aug 19 2022 9:01 AM

Intresting Facts Sri Venkateshwara Goshala In Tirupati Krishna Astamiశ్రీ - Sakshi

భారతీయ పురాణాలు, ఇతిహాసాల్లో శ్రీకృష్ణ భగవానుడికి, ఆవులకు మధ్య విడదీయలేని దైవిక బంధం ఉంది. కలియుగంలో పుట్టలోని శ్రీనివాసుడికి ప్రతి రోజూ గోమాత పాలు ఇచ్చి సంరక్షించడం తెలిసిందే. అందుకే గోవుకు హిందూ ధర్మంలో ఎనలేని ప్రాముఖ్యత. అలాంటి గోమాత సంరక్షణకు టీటీడీ పెద్దపీట వేస్తోంది. తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఉన్న గోవుల ద్వారా వచ్చే పాలను తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో నిత్య పూజలు, అభిషేకాలకు, నైవేద్యాలకు వినియోగిస్తున్నారు. టీటీడీ పరిధిలోని విద్యాసంస్థల్లో విద్యార్థులకు పాలు, పెరుగు, మజ్జిగ రూపంలో అందిస్తుండడం విశేషం. నేడు గోకులాష్టమి సందర్భంగా ఎస్వీ గోశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 

తిరుపతి రూరల్‌: దేశం నలుమూలల నుంచి వచ్చే గోమాతలకు ఆయా పరిస్థితులకు అనుగుణమైన వాతావరణం.. అత్యాధునిక సౌకర్యాలు.. ఆరోగ్య పరిరక్షణకు నిత్యం అందుబాటులో ఉండే పశువైద్యాధికారులు.. అపరిశుభ్రతకు తావు లేకుండా పరిరక్షించే కాపర్లు.. ఆరోగ్యానికి బలవర్థకమైన దాణాతో కూడిన మేత.. టీటీడీ ఆధ్వర్యంలో 2002లో ప్రారంభమైన శ్రీవెంకటేశ్వరస్వామి గోసంరక్షణశాల సకల దేవతలకు నిలయంగా విరాజిల్లుతోంది. ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌ తిరుమల, తిరుపతి, తిరుచానూరుతో పాటు పలమనేరులోనూ అతిపెద్ద గోసంరక్షణశాలలను నిర్వహిస్తోంది. దాదాపు 4,279 పైగా పశువులను ఇక్కడ సంరక్షిస్తుండడం విశేషం. 


శుభ్రమైన వాతావరణంలో దేశీయ గోవుల సంరక్షణ

రోజూ 628 లీటర్ల పాల ఉత్పత్తి 
తిరుమలలోని ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో నిత్య పూజలు, సేవలు, అభిషేకాలు, నైవేద్యాలతో పాటు విద్యాసంస్థల అవసరాల కోసం ప్రతి రోజూ 3వేల లీటర్ల పాలు అవసరం. ఇందుకు దాదాపు 500 గోవులు అవసరం కాగా.. భక్తుల నుంచి దానంగా సేకరించేందుకు టీటీడీ పిలుపునిచ్చింది. ఆ మేరకు గత మూడు నెలల్లో 130 గోవులు దానంగా లభించాయి. వీటి ద్వారా రోజూ 428 లీటర్లు, గోశాలలోని మిగిలిన గోవుల నుంచి 200 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నారు. శ్రీవారి నిత్య కైంకర్యాలకు అవసరమైన దేశవాళీ ఆవు నెయ్యి కోసం గోశాలలో అత్యాధునిక ఆవు నెయ్యి తయారీ కేంద్రం, ఎస్వీ పశువైద్య వర్సిటీ సహకారంతో పశుదాణా తయారీ కర్మాగారం నిర్మిస్తోంది. ఎస్వీ వెటర్నరీ వర్సిటీతో ఒప్పందం చేసుకుని పిండ మార్పిడి విధానం ద్వారా గోశాలలోని ప్రత్యుత్పత్తి సామర్థ్యం కలిగిన గోవులలో మేలురకపు గో జాతిని ఉత్పత్తి చేస్తున్నారు.  

టీటీడీ గోదానం 
అధిక పాల దిగుబడి కోసం భక్తుల నుంచి గోవులను సేకరిస్తున్న టీటీడీ మరోవైపు గుడికో గోమాత కార్యక్రమం ద్వారా ప్రతి అలయానికి గోవు, దూడను వితరణ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 193 ఆలయాలకు ఆవు, దూడలను హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ద్వారా ఉచితంగా అందించింది. అంతేకాకుండా గోశాలలో పరిమితికి మించి ఉన్న, రైతులకు ఉపయోగపడే గోవులను, ఆంబోతులను  అందించి గో ఆధారిత ప్రకృతి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగానే రైతు సాధికార సంస్థ ద్వారా రైతులకు 2,018 ఆవులను, ఆంబోతులను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రతి రోజూ స్వయంగా భక్తులే గోదర్శనం, గోపూజ చేసుకుని, గోవులకు మేత అందించేందుకు అలిపిరి, తిరుపతి గోశాలలో గో ప్రదక్షిణ మందిరాలను నిర్మించారు. వీటికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 


తిరుపతి ఎస్వీ గోశాలలో గోకులాష్టమి ఏర్పాట్లు 

గోశాలలో నేడు గోకులాష్టమి వేడుకలు 
శ్రీకృష్ణుని పుట్టినరోజును పురస్కరించుకుని టీటీడీ పరిధిలోని ఎస్వీ గోశాలల్లో గోకులాష్టమి వేడుకలను శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి, పాలకమండలి సభ్యులు, అధికారులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటారు. గోవుకు విశేష పూజలు చేయనున్నారు. అనంతరం గోవులను అందంగా అలంకరిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి.

అనుగుణమైన వసతులు 
ఎస్వీ గోశాలలో గోసంరక్షణకు టీటీడీ అత్యాధునిక వసతులను కల్పిస్తోంది. గోసంరక్షణ ట్రస్ట్‌కు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి గోవులను భక్తులు దానం చేస్తుంటారు. ఆయా రాష్ట్రాల్లో ఉండే ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఏర్పాట్లను తీర్చిదిద్దుతున్నారు. 

►ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే గోవులకు అనుగుణంగా ఇసుక తిన్నెలను పరుస్తున్నారు.  
►గాలి, వెలుతురు పుష్కలంగా వచ్చేలా షెడ్ల నిర్మాణం. 
►పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ  సిమెంట్‌ ఫ్లోరింగ్‌
►పశువులకు మధ్యాహ్నం పూట కూడా నీడనిచ్చేందుకు చెట్ల పెంపకం
►గిట్టల వాపు రాకుండా మెత్తటి ఇసుక బెడ్‌ల ఏర్పాటు 
►గోవుల జాతికి అనుగుణంగా సౌకర్యాల కల్పన

ఎస్వీ గోశాల విస్తీర్ణం(తిరుపతి): 69 ఎకరాలు
మొత్తం పశువులు:1,868 
గుడికో గోమాత పథకం కింద ఆవు, దూడలను పొందిన ఆలయాలు: 193 
గో ఆధారిత ప్రకృతి సేద్యానికి ఉచితంగా అందించిన గోవులు, ఆంబోతులు:2,018
రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన నోడల్‌ గోశాలలు: 26  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement