Inti Panta: జానెడు జాగా ఖాళీగా ఉంచరు.. అక్కడ కూరగాయలన్నీ ఉచితమే!

Inti Panta: East Godavari Venkatapuram Women Inspiring Story - Sakshi

సమష్టి ఇంటిపంటల గ్రామం!

గృహిణుల సామూహిక సేంద్రియ ఇంటిపంటల సాగుతో ఆరోగ్యం, ఆనందం 

కూరగాయలు, పండ్లు కొనే పని లేదు.. ఇచ్చి పుచ్చుకోవటమే! 

సేంద్రియ పెరటి తోటల విప్లవానికి వెంకట్రాయపురం గ్రామ గృహిణులు శ్రీకారం చుట్టారు. తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలంలో ఓ మారుమూల గ్రామం ఇది. 364 కుటుంబాలు.. 1,566 మంది జనాభా. గతంలో కిలోమీటర్ల దూరం వెళ్ళి కూరగాయలు కొని తెచ్చుకునేవారు. గృహిణులంతా చైతన్యవంతులై 5 ఏళ్ళ క్రితం సెర్ప్‌ తోడ్పాటుతో సేంద్రియ పెరటి తోటల సాగును నేర్చుకొని ఆచరిస్తున్నారు.  

రోడ్ల పక్కన, ఇంటి చుట్టూ, ఖాళీ స్థలాల్లో, గ్రామంలో ఖాళీగా ఉన్న పోరంబోకు స్థలాల్లోనూ కూరగాయ పంటలు, పండ్ల మొక్కలు నాటి, చక్కని ఫలసాయం పొందుతున్నారు. జానెడు జాగా ఉందంటే అందులో ఏదో ఒక కూరగాయ మొక్క ఉండవలసిందే. డాబా ఇళ్ళపై, ఇళ్ల చుట్టూ పంట మొక్కలతో ఆ గ్రామం కళకళలాడుతూ కనిపిస్తున్నది. 

ప్రతీ ఇంటి వద్ద వంగ, బెండ, టమాటా, బీర, పొట్ల, ఆనప, గుమ్మడి, బూడిద గుమ్మడి, మునక్కాడలు, తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర, గోంగూరతో పాటు కంద కూడా ఇళ్ల వద్దే సాగు చేసుకుంటున్నారు. జామ, బొప్పాయి, నారింజ, పంపర పనస, సపోటా, దానిమ్మ వంటి పండ్ల మొక్కలు నాటారు. అవి ఇప్పుడు ఫలసాయం అందిస్తున్నాయి. రెండేళ్ళ క్రితం గ్రామంలో ఒక ద్రాక్ష పాదును నాటారు.

ఇప్పుడు గ్రామంలో 50 శాతం ఇళ్లలో ద్రాక్ష పాదులు పండ్లను అందిస్తున్నాయి. మహిళల్లో వచ్చిన చైతన్యం ఫలితంగా ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా అనేక రకాల కూరగాయలు కనిపిస్తున్నాయి. ఎవరికి వీలైన పంటలు వారు తమ పెరట్లో పండిస్తున్నారు. 

తాము ఇంటిపట్టున పండించిన కూరగాయలు, పండ్లను డబ్బు ప్రమేయం లేకుండా ఇరుగు పొరుగు వారికి ఇచ్చిపుచ్చుకుంటూ ఆదర్శంగా జీవిస్తున్నారు. తాము సేంద్రియంగా పండించిన కూరగాయాలు, ఆకుకూరలు, పండ్లు తినటం వల్ల అందరం ఆరోగ్యంగా ఉన్నామని మహిళలు సంబరంగా చెబుతున్నారు. కుల మతాలకు అతీతంగా కలిసి మెలసి పనులు చేసుకుంటారు. ఒకటే మాట, ఒకటే బాట అన్నట్లు జీవిస్తుండటం విశేషం.  – పంతం వెంకటేశ్వర రావు, సాక్షి, పెరవలి, తూ.గో. జిల్లా

కూరగాయలన్నీ ఉచితమే 
ఈ గ్రామానికి కొత్త కోడలిని. కూరగాయల దుకాణాలు ఏమీ లేవు. ఏం వండుకోవాలో తెలిసేది కాదు. ప్రతీ ఇంటి వద్ద కూరగాయలు పండించడంతో ఇప్పుడు కూరగాయల కొరత బాధ లేదు. ఏ కూరగాయలు కావాలన్నా ఇక్కడే ఉచితంగా దొరుకుతున్నాయి. – బోళ్ళ నాగమణి, గృహిణి, వెంకట్రాయపురం

ప్రతి ఇంటి పరిసరాల్లోనూ... 
గ్రామస్థులు కూరగాయల కోసం పడుతున్న ఇబ్బందుల గురించి ఉన్నతాధికారుల వివరించాను. సుస్థిర వ్యవసాయం ద్వారా కూరగాయల సమస్యను తీర్చవచ్చని అందుకు ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. ఆ మేరకు మహిళలందరినీ చైతన్యపరిచి సామూహిక కూరగాయల సాగు చేయించాను.

ఇప్పుడు ఏ ఇల్లు చూసినా కూరగాయ  పంటలతో కళకళలాడుతూ కనిపిస్తున్నది. ప్రభుత్వం 90 శాతం సబ్సీడీపై విత్తనాలు సరఫరా చేసింది. రోడ్ల పక్కన, పోరంబోకు స్థలాల్లో కూడా కూరగాయ పంటలు పండిస్తున్నారు. – పాటి అనంతలక్ష్మి(93909 72585), విఏఏ, వెంకట్రాయపురం

సమష్టి నిర్ణయాలు తీసుకుంటాం 
గ్రామం చిన్నది. పంచాయతీ ఆదాయం ఏడాదికి రూ.70 వేలు మాత్రమే. ఉన్నదాంట్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. గ్రామస్తులందరం కలసి నిర్ణయాలు తీసుకుంటాం. ప్రతి ఇంటి వద్దా కూరగాయలు సాగు చేస్తున్నారు.

ఎవరికి ఏ కూరగాయలు కావాలంటే అవి ఉన్న ఇంటి దగ్గరకు వెళ్ళి తెచ్చుకుంటారు. కుల మత భేదాలకు తావు లేదు. అనారోగ్యాల్లేకుండా ఆరోగ్యంగా జీవిస్తున్నాం. – పోలిశెట్టి బాలాజీ (93164 44777), సర్పంచ్, వెంకట్రాయపురం

23న విత్తనోత్సవం
తూర్పు కనుమలలో వెల్లివిరిసిన దేశీ వంగడాల వార్షిక జీవవైవిధ్య విత్తనోత్సవం ఈ నెల 23న అల్లూరి సీతారామరాజు జిల్లా దుంబ్రిగూడ మండలం దేముడువలస గ్రామంలో జరుగుతుందని నిర్వాహకులు, సంజీవని సంస్థ అధిపతి దేవుళ్లు తెలిపారు. వందలాది రకాల దేశీ విత్తనాలను ప్రదర్శిస్తారు. వివరాలకు.. దేవుళ్లు – 94401 19789.

25న అనంతపురం జిల్లాలో డా. ఖాదర్‌ సభలు
ఈనెల 25(సోమవారం) ఉ.10.30 గం.కు ధర్మవరంలోని వివేకానంద డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగే సభలో ఆహార, ఆరోగ్య నిపుణులు డాక్టర్‌ ఖాదర్‌ వలి ప్రసంగిస్తారు. అదేరోజు మధ్యాహ్నం 3.30 గం.కు రాప్తాడు మండలం హంపాపురంలోని ఆదరణ పాడి పంట ఎకో విలేజ్‌లో ఉపన్యసిస్తారు. సా. 5.30 గం.కు బత్తలపల్లిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జరిగే సభలో ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం‘ అనే అంశంపై డా. ఖాదర్‌ ప్రసంగిస్తారు.  

చదవండి: భళా.. బాపట్ల బ్లాక్‌ రైస్‌!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top